రఘురాం తేలిగ్గా తీసి పారేస్తూ, "వాడి మొహం, వాడొక్కడే మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఈ లోకంలో అన్నట్లు చెప్పడం మరిచిపోయాను. నా ఫ్రెండ్ ఒకడు నీ ప్రైవేటు రికార్డు రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడు" అన్నాడు.
నాకు ఆ మాటలెంతో మనోనిబ్బరాన్నిచ్చాయి. "నిజంగానా...?" అన్నాను.
"అవును! నీ విలువ ఇంకా నీకు తెలిసినట్లులేదు" అన్నాడు.
"దాసుగారికీ, ఆవిడకీ జరిగిన విషయాలేం చెప్పకు! భయపడతారు. నాన్నకి తెలిస్తే వెంటనే ఇంటికొచ్చెయ్యమంటారు" అన్నాను.
"చెప్పను" అన్నాడు.
ఇద్దరం ఇల్లు చేరాం.
ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్లుగానే నాకు తన తరువాత చిత్రాల్లో ఛాన్స్ ఇవ్వలేదు.
కళారంగంలో ప్రతిభ వుంటే ఎవరూ నియంత్రించలేరు అన్నట్లుగా నాకు కొత్త సినిమాల్లో పాటలిచ్చారు.
చాలా ప్రైవేట్ కేసెట్లు కూడా రిలీజ్ అయ్యాయి.
చాలామంది నాకు "ఉదయమే నీ గొంతులోంచి వచ్చే భక్తిగీతాల తోటే నాకు తెల్లవార్తోందమ్మా" అంటూ ఉత్తరాలు వ్రాసేవారు. నేను ఎక్కడికెళ్ళినా జనం ఆటోగ్రాఫ్ ల కోసం వెంటపడడం, ఇంటర్వ్యూలూ..... జీవితం చాలా గబగబా జరిగిపోతున్నట్లుగా మారింది.
మేం ఇల్లు మారాం. టీ నగర్ వచ్చేసాం. నాన్నగారి ఇల్లు విడిపించాను. జీవితంలో అంత ఆనందం ఇంకెన్నడూ పొంది వుండను! నేను కారు కొన్నప్పుడు కూడా! నాకు దాసమ్మగారితో తప్ప దాసుగారితో కూడా మాట్లాడే టైం దొరకడం లేదు.
ఒకనాడు బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర దాసుగారు "రఘురాం నిన్న వచ్చి నీకోసం చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళాడమ్మా ఏదో ఇబ్బందుల్లో వున్నట్లున్నాడు" అన్నారు.
"అలాగా....అయ్యో...ఫోన్ చేస్తాను ఆఫీసుకి" అన్నాను.
నేను తింటున్న టిఫిన్ వదిలేసి బయటకొచ్చి కారు తియ్యమన్నాను. ఇంకో అరగంటలో రఘురాం దగ్గర వున్నాను.
"చాలా నిరాధారంగా వున్నాను. తమ్ముడికి ఈ నెల ఫీజ్ కూడా పంపలేదు" అన్నాడు తలలోకి వేళ్ళు జొలిపి చెరుపుకుంటూ అతను.
"ఏవిటీ? ఇంతోటి ఉద్యోగానికే? అసలెలా పోయిందీ?" అన్నాను.
"నేను పనిచేసే చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ చచ్చిపోయాడు. అతడి కొడుక్కి ఆ వ్యాపారం ఇష్టంలేదు. కంపెనీ మూసేశాడు" అన్నాడు.
"నీకు కష్టమర్స్ అందరూ తెలుసుకదా! వ్యాపారం మెలుకువలు కూడా తెలుసుకదా... నువ్వే కంటిన్యూ చెయ్యి" అన్నాను.
రఘు మొహంలో విస్మయం కనపడింది. "నేనా? స్వంతంగానా?" అన్నాడు.
"అవును! ఆఫీసూ, టేబుళ్ళూ, కుర్చీలూ, ఓకూజా, గ్లాసూ, కాసింత తెలివితేటలూ వుంటే చాలదూ? చివరిది నీ దగ్గరుంటే మొదటివి నేను సమకూరుస్తాను" అంటూ బ్యాగ్ లోంచి చెక్ బుక్ తీసాను.
"నీకు ఎలా క్రుతజ్ఞతలు చెప్పుకోవాలో తెలీడం లేదు అహల్య" అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు.
"నాకు అవసరం వచ్చినప్పుడు నీ సహాయం అడుగుతాలే! అన్నాను.
రఘు ఫైనాన్స్ కంపెనీ బాగానే స్థిరపడింది. దాసుగారు మధ్య మధ్యలో "రఘుని కలిశాను. నీకు ఇరవై మూడు వేలు ఇవ్వాలట. త్వరలో తీర్చేస్తానన్నాడు" అని చెపుతుంటారు. నేను నవ్వుకునేదాన్ని.
నా పుట్టినరోజు నాడు ఉదయమే లేచి తలంటుపోసుకుని పూజ పూర్తిచేసి ఇవతలికి రాగానే రఘు హాల్లో మాట్లాడుతూ కనిపించాడు. కాస్త లావయ్యాడు. మొహంలో ఆత్మస్థయిర్యం తొణికిసలాడుతోంది.
"హల్లో..." అనగానే.
"హేపీబర్త్ డే!" అంటూ ఏవో కాయితాలు ఇచ్చాడు.
"ఏవిటివీ?" అన్నాను.
"నీ పేరిట స్థలం పేపర్లు. ఒకసారి వస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తాను" అన్నాడు.
"స్థలమా? మెడ్రాసులోనా?" నేను నమ్మలేకపోయాను.
"అడ్వాన్స్ గా ఇరవై వేలు కట్టేశాను. ఇంకెంత ఎనభై వేలు....మూడుసార్లుగా ఇవ్వవచ్చు. ఇంకా ఇరవైప్లాట్లున్నాయి. నెలాఖరులోగా అమ్మి పెట్టాలి" అన్నాడు.
"ఇది కూడా కమీషన్ వ్యాపారమేనా?" ఆశ్చర్యంగా అడిగాను.
"నీ దగ్గర తీసుకోనులే!" అన్నాడు.
"అబ్బాయి చెపుతున్నది మంచి విషయం తల్లీ!" అన్నాడు దాసుగారు.
స్థలం రిజిస్ట్రేషన్ అవగానే ఇల్లుకట్టడానికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశాడు.
నాకూ బ్యాంక్ బేలన్స్ బాగానే పెరిగింది. ప్రతి నెలా నాన్నగారికి ఐదువేలు పంపుతున్నాను.
"అసలు ఈ కమీషన్ వ్యాపారం కాకుండా మనమే చకచకా వచ్చినప్పుడు ప్లాట్లు కొని అపార్ట్ మెంట్స్ కట్టిస్తే చాలా లాభాలకి అమ్ముకోవచ్చు" అన్నాడొక రోజున రఘు.
"గుడ్ ఐడియా!" అన్నాను.
"ఐడియా మంచిదే కానీ...ఇంపాజిబుల్!" అన్నాడు.
"ఎంత కావాల్సొస్తుందీ?" అడిగాను.
"సుమారు ఇరవై లక్షలదాకా వుంటే బావుంటుంది" అన్నాడు.
"సరే....ఏర్పాటు చేద్దాం!" అన్నాను.
"అహల్యా.... ఇప్పటికే నీకు చాలా ఋణపడి వున్నాను" అన్నాడు.
"ఇంకాపడు" నవ్వాను.
నా చెయ్యి గట్టిగా పట్టుకుని-
"నాకేం అవుతావని ఇలా సహాయాలు చేస్తున్నావూ?" అన్నాడు.
నాకేం చెప్పాలో తోచలేదు. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకోలేదు. అదలా అతని చేతిలో వుంటే ఎంతో సేఫ్ గా సెక్యూర్డ్ గా అనిపించింది.
"నిన్ను జీవితంలో చాలా గొప్పగా చూడాలనుకుంటున్నాను" అన్నాను.
"ఎప్పుడైనా వదిలిపెట్టి వెళ్ళిపోతావా?" చిన్నపిల్లాడిలా అడిగాడు.
నేను నవ్వేసి లేస్తుంటే "అహల్యా....కాసేపు వుండు... ప్లీజ్!" అన్నాడు.
"నాకు రికార్డింగ్ వుంది" అన్నాను.
"నాకు తెలుసు నీ సమయం చాలా విలువైనదని. కానీ ఇంత ఫూలిష్ గా అడగాలనే అనిపిస్తోంది. ఏం చెయ్యనూ?" నా చేతిని గుప్పెట్లో బిగిస్తూ అన్నాడు.
"రఘూ! వదులు" అన్నాను.
అతను వదిలాడు.
నేను కదలబోయే టైంలో వెనక నుండి వచ్చి చటుక్కున చుట్టుకుని "అహల్యా....యూ ఆర్ మై ప్రిన్సెస్! నీకు దూరంగా వున్న ప్రతి నిముషం ఈ గుండె ఎంత కొట్టుకుపోతోందో నీకు తెలీదు!" అన్నాడు.
"ఏమిటది?" అన్నాను.
"ఐ లవ్ యూ!" నా పాపిటలో ముద్దు పెడుతూ అన్నాడు.
