Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 41


    ఒకనాడు మద్రాసు కథకి వెళుతూ దాసుగారు నన్ను రమ్మన్నారు, 'రుక్మిణీ కళ్యాణం' ఒకనాడు చెప్పారు. రెండవరోజు 'భక్తప్రహ్లాద'.
    
    హోటల్లోనే ప్రొద్దుట ఆయాసంగా వుందన్నారు.
    
    "పోనీ....ఈ రోజుకి కథ ఆపెయ్యమనండి" అన్నాను.
    
    దాసుగారు తల అడ్డంగా వూపారు. "డబ్బు కూడా ముందుగా తీసుకున్నాను. మాట తప్పకూడదు" అన్నారు.
    
    కథ మధ్యలో ఆయాసం, రొప్పూ మొదలయ్యాయి. ఆయన పాలు తీసుకోవటానికి ఆగినప్పుడు నేను హార్మోనియం పెట్టుకుని ప్రక్కలా నిలబడీ....."నగుమోము కనలేవీ' కృతులు పాడాను. ఇంకా పాడమని కొందరు చీటీలు వ్రాసి పంపించారు. మొత్తానికి కథ అయిందనిపించి బసకి వచ్చేసాం.
    
    సాయంత్రం ఎవరో నలుగురు పెద్ద మనుషులొచ్చి దాసుగారితో మాట్లాడటం చూసాను. అక్కడ కూర్చోడం ఎందుకని బయటికొచ్చేసాను. కాసేపయ్యాక దాసుగారు "అహల్యా....తల్లీ!" అని పిలిచారు.
    
    నేను లోపలికి వెళ్ళగానే వాళ్ళని పరిచయం చేసారు.
    
    "ఈయన జగపతిగారని ప్రముఖ నిర్మాతలు! నిన్న నీ పాట విని నీకో అవకాశం ఇవ్వడానికి వచ్చారుట. వారి చిత్రంలో పాడ్తావా తల్లీ?" అన్నారు.
    
    "పాడతాను" తడుముకోకుండా చెప్పాను.
    
    "నాన్నగారిని అడిగి..." అంటున్న దాసుగారిని ఆపి "నేను పాడతానండీ" అన్నాను.
    
    అలా మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకున్నాను. పాటకి వెయ్యి రూపాయిలిచ్చారు. నాకు చాలా గొప్పగా అనిపించింది. మొత్తం ఐదువేలిచ్చారు. ఇంటికి రెండువేలు పంపించాను.
    
    తర్వాత ఇంకో చిత్రం రావడంతో దాసుగారు నుంగంబాకంలో అద్దె ఇల్లు తీసుకున్నారు. దాసమ్మగారు కూడా మద్రాసు వచ్చేసారు.
    
    బస్సులో రికార్డింగ్ థియేటర్లకీ, రిహార్సల్స్ కీ తిరుగుతుండేదాన్ని. మా పక్కపోర్షన్ లో ఇద్దరు అబ్బాయిలు వుండేవారని దాసుగారు చెప్పేవారు. అందులో ఒకబ్బాయికి బాగా తమిళం వచ్చనీ, ఫ్లూట్ వాయిస్తాడనీ, రెండో అబ్బాయి అతని తమ్ముడనీ చెప్పేవారు. దాసమ్మగారు అప్పుడప్పుడూ వాళ్ళకి ఫలహారాలు పంపించేది.
    
    ఒకరోజు బాగా వర్షం వస్తోంది.
    
    చేతిలో గొడుగన్నా లేని నేను బాగా తడుస్తూ వస్తున్నాను. హఠాత్తుగా ఎవరో వెనకనుండి "అహల్యగారూ!" అని నాపేరు పెట్టి పిలవడం వినిపించింది. ఆశ్చర్యంగా ఆగి చూశాను.
    
    ఒక పొడవాటి అబ్బాయి గొడుగుతో వచ్చి "గొడుగులోకి రండి" అన్నాడు.
    
    నేను ఇంకా అనుమానంగానే చూడటంతో "నేను మీ పక్కపోర్షన్ లో వుంటాను. నాపేరు రఘురాం.....తడిస్తే మీకు జలుబు చేస్తుంది. జలుబు చేస్తే నాకేం ఫరవాలేదు. మీ గొంతు పోతే మాత్రం ప్రమాదం!" అన్నాడు.
    
    నేను ఇంక ఆలస్యం చేయకుండా గొడుగు తీసుకున్నాను. సరిగ్గా రెండు అడుగులు వేసాకా నా స్వార్ధానికీ నాకే సిగ్గేసింది. వెనక్కి తిరిగి అతడు తడుస్తూ నడవడం చూసి "మీరు కూడా గొడుగులోకి రండి...." అన్నాను.
    
    అతను గొడుగులోకొచ్చాకా బాగా దగ్గరగా తాకుతూ నడవసాగాడు. కొత్తగా అనిపించింది. అతను మాత్రం ఇదే పట్టించుకోనట్లు వర్షం గురించీ మద్రాసు గురించీ మాట్లాడుతున్నాడు.
    
    ఎలాగో ఇల్లు చేరాం. ఆ రాత్రి రిహార్సల్స్ లో రెండుసార్లు తాళం తప్పానని దాసుగారు చెప్పారు.
    
                                                           * * *

    నాన్నగారి దగ్గర్నుండి ఉత్తరం వచ్చింది. పెద్దన్నయ్య ఎవరో కులంకాని అమ్మాయిని చెప్పకుండా పెళ్ళాడాడుట. చిన్నన్నయ్య అమ్మకి బాగాలేదన్నా చూడటానికి రాలేదుట! 'నువ్వే నయం తల్లీ ఆడపిల్లవైనా ఇంత అన్నం పెడుతున్నావు' అని వ్రాసారు. నాకు రాత్రింబగళ్ళు ఇల్లు ఎలా విడిపించాలనేదే ఆలోచనై కూర్చుంది.
    
    మొదటి సినిమా రిలీజై విజయవంతం అయింది. మా ఇంటిముందు నిర్మాతల కార్లొచ్చి ఆగడం మొదలుపెట్టాయి.
    
    నెలకి పది పదిహేనువేలు సంపాదించటం మొదలుపెట్టాను. క్రమం తప్పకుండా నాన్నగారికి రెండువేలు నెలకి పంపేదాన్ని.
    
    రఘురాం ఫ్లూట్ వినిపించగానే నేను పాత మొదలుపెట్టేదాన్ని. అది ఆటగా పరిణమించింది. అతనితో చనువు పెరిగాకా ఒకనాడు అతనేం చేస్తాడో అడిగాను. ఇంటింటికీ వెళ్ళి చీటీ డబ్బులు వసూలు చేసి యిస్తే కమీషన్ వస్తుందని చెప్పాడు. ఆ డబ్బులతోనే తమ్ముడ్ని చదివిస్తున్నాననీ ఇంజనీరింగ్ చేస్తున్నాడని చెప్పాడు.
    
    నేను బాగా బిజీ అయిపోయాను.
    
    ఆ రోజు పాట అవగానే సంగీత దర్శకుడు కాసేపు వుండమన్నాడని అసిస్టెంట్లు చెప్పారు.
    
    చాలాసేపు వెయిట్ చేశాక ఆయన వచ్చి "రండి...." అంటూ తన కారువైపు నడిచాడు.
    
    ఎక్కడికో తెలియకపోయినా నేను అనుసరించాను.
    
    కారు చాలా పెద్ద హోటల్ ముందు ఆగింది.
    
    సరాసరి తన రూమ్ లోకి వెళ్ళాడు.
    
    ఏ.సీ. చల్లదనంలో కూడా నాకు ముచ్చెమటలు పోసాయి.
    
    ఆయన చాలా మామూలుగా డ్రింక్ చేస్తూ "అహల్యా....నీకు మంచి ఫ్యూచర్ వుంది. నువ్వు 'ఒప్పుకుంటే నిన్ను కోటీశ్వరురాలిని చేస్తాను. నీకు తెలుసుగా నా పేరు! నే తలుచుకుంటే నువ్వు తప్ప ఎవరూ పాడకుండా చెయ్యగలను!" అంటూ నా భుజం మీద చేయ్యేశాడు.
    
    "ఛీ!" అంటూ విదిలించి కొట్టాను.
    
    ఆయన కళ్ళలో అవమానభారం కనిపించింది.
    
    "మీకు నా వయసు పిల్లలు లేరూ!" ఈసడిస్తూ అన్నాను.
    
    ఆయన గ్లాసులోని ద్రవం గటగటా తాగేస్తూ "నీ కూతురైనా నాకు ఫరవాలేదు! రా..." అన్నాడు.
    
    "ప్రతినిత్యం ఆ భారతీదేవిని ఆశ్రయించి ఆమె చరణాల దగ్గర బ్రతికే కళాకారులం మనం..... ఈ వృత్తికి ఇంత కళంకం తేవడానికి మీకు బాధగా లేదా?" అన్నాను.
    
    నేను లేచి తలుపువైపు వెళుతుంటే "నా తర్వాత సినిమాలో కొత్త అమ్మాయి చేత పాడిస్తాను. నీకు అవకాశాలే రాకుండా చేస్తాను" అన్నాడు.
    
    నేను తలుపు దగ్గర ఆగి వెనక్కి చూస్తూ అన్నాను "ఒళ్ళు అమ్ముకోవడమో.....లేక స్వరం అమ్ముకోవడమో ఏదో ఒకటే చేస్తాను. చేసేది పవిత్రంగా మనసా వాచా కర్మణా నమ్మి చేస్తాను. నాకు నా గొంతుమీద చాలా నమ్మకం!"
    
                                                              * * *
    
    "పార్క్ లో సగం గడ్డి పీకేశావు. ఇంక ఆపు" అన్నాడు రఘురాం.
    
    "నా పరిస్థితి ఏవిటో నాకే అర్ధం కావడంలేదు. ఈ ఫీల్డ్ గురించి చాలా చాలా విని వున్నాను" అన్నాను.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS