"సుబ్రహ్మణ్యం...."
"అలా బయటకు వెళ్ళారు. ఇప్పుడే వచ్చేస్తారు. కొంచెం తలుపు గడియ వేసిరండి -" అందిపుల్లాయమ్మ.
నా శరీరం వేడిగా ఉంది. బుర్ర పని చేయడం లేదు. వెళ్ళి తలుపులు గడియ వేసి వచ్చాను. ఈలోపుగా పుల్లాయమ్మ వంటికి చీర చుట్టపెట్టుకుని వరండా లోకి వచ్చి ఒకకుర్చీలో కూర్చుంది. నేనూ ఒక కుర్చీలో కూర్చున్నాను కానీ నా వళ్ళు వణుకుతోంది.
పుల్లాయమ్మ నవ్వుతూ - "చూడండి. అయన ఇంట్లో లేరు. మీరూ నేను ఉన్నాం. మీరు తలుపు గడియ వేసి వచ్చారు. నేనేమనుకోవాలి?" అంది.
"మీరే వేయమన్నారు గడియ?" అన్నాను తడబడుతూ.
'పోనీ , ఐతే మీరేమనుకోవాలి?" అంది పుల్లాయమ్మ.
నాకు జవాబు తోచింది. లేచి ఆమె దగ్గరకు వెళ్ళి "మీరు చాలా అందంగా ఉంటారు" అన్నాను.
ఆమె నవ్వి "మీ భార్య గురించి మావారూ అదేమాట అంటారు" అంది.
ఉలిక్కిపడ్డాను. ఒక్కసారిగా నాలోని ఆవేశం దిగజారి పోయింది. ముఖం అదోలా మారిపోయింది. వెంటనే వెనక్కు తిరిగాను.
"ఆగండి!" అంది పుల్లాయమ్మ. "నేను మగవాడి బలహీనత గురించి మాట్లాడుతున్నాను. తప్పితే మిమ్మల్ని వెళ్ళి పోమ్మనలేదు. మీ బలహీనతలు మీకు అర్ధం చేసుకోవడమే కానీ, మా బలహీనతలు అర్ధం చేసుకోరు. మావారి కంటే మీరే నాకు అందంగా కనబడతారు." అంటూ పుల్లాయమ్మా లేచి నా దగ్గరకు వచ్చి "చూడండి, ఇప్పుడు వారు వచ్చి తలుపు తడితే మీరు వెళ్ళి తలుపు తీస్తే ఆయన ఏమనుకుంటారు?" అంది. నేను జవాబు చెప్పేలోగా నన్నొక సారి గట్టిగా కౌగలించుకొని "ఇంతసేపు ఇలా ఉన్నామనుకుంటారు కదా?'అంది.
ఆమె అలా మాట్లాడకుండా ఉండి ఉంటె ఆ కౌగిలి నాకు చాలా బాగుండి వుండేది. ఆమె పుల్లాయమ్మ ఆ కౌగిలి నాకు కొంచెం కంపరంగా ఉన్నమాట నిజం. ఐనా వదిలించుకోవాలని మాత్రం అనిపించలేదు. అందులోనూ అప్పుడే రంగనాధం . మాలతి గుర్తు రాగా ఆవేశంగా నా చేతులు ఆమె నడుం చుట్టూ బిగించాను.
పుల్లాయమ్మ మళ్ళీ అంది. "ఇప్పుడు మావారు వచ్చి మనల్నీ దశలో చూస్తె మనల్ని తప్పుపట్టరు. కానీ తక్షణం మీ ఇంటికి వెడతారు.
లాభం లేదు. ఈ పుల్లాయమ్మ కౌగిలి నాకు నప్పదు. మరి ఏం చేయాలి? ఆమె ఉద్దేశ్యమేమిటో తెలియదు కానీ, చూస్తూచూస్తూ ఆ కౌగిలి వదులుకో బుద్ది కావడం లేదు. అంతలోనే ఎవరో నిజంగా తలుపు తట్టారు.
ఒక్కసారి ఆపాదమస్తకం వణికిపోయాను. "మావారే అయుంటారు" అంది పుల్లాయమ్మ. నెమ్మదిగా చెవిలో మళ్ళీ అంది. "దొడ్డిదారిన వెళ్ళిపొండి!" అని.
ఆమెను వదిలి బెడ్ రూమ్ లోంచి వంటింట్లోకి వెళ్ళాను. కానీ, హటాత్తుగా నాలో కొత్త ఆశ రేగింది. ఆ వచ్చినది సుబ్రహ్మణ్యం కాకపొతే --
సుబ్రహ్మణ్యం సినిమా టాకీసు దగ్గర క్యూలో ఉన్నాడు. టికెట్స్ దొరక్కపోతే బ్లాకులో ఐనా కొనుక్కు వెళ్ళి పోతాడు తప్పితే వేనక్కురాడు. మరి ఆ వచ్చినదే అడవాళ్ళో ఐతే!
అందుకే వంటింట్లో ఆగాను. ఎందుకంటె పుల్లాయమ్మ నాకు లొంగి పోతుందన్న ధైర్యం కలిగిందిప్పుడు. వీధి తలుపు గడియ వేసిన చప్పుడు ఎవరో బెడ్ రూమ్ లోకి వస్తున్న చప్పుడు అయింది. జాగ్రత్తగా వంటింట్లోంచి తొంగి చూశాను. పుల్లాయమ్మ తో పాటు ఎవరో పురుషుడు.
"చూడు మోహన్! నీకోసమని మా అయన రమ్మని ఎంత బలవంత పెట్టినా వినకుండా సినిమా మానేసి ఇంట్లో ఉండిపోయాను. తలుపులు దగ్గరగా చేరవేసి ఉంచాను. కానీ నువ్వు వచ్చే లోగానే మరో మగపురుగు ఇంట్లో దూరింది. నీకోసం తయారుగున్న ఈ శరీరాన్ని చూసి లొట్టలు వేసింది. ఊరించి ఊరించి బెదరగొట్టి పంపేశాను" అంటోంది పుల్లాయమ్మ. మోహన్ ఆమెను బలంగా ముద్దు పెట్టుకుంటున్నాడు.
నేను మౌనంగా వంటింట్లోంచి దొడ్లో అడుగుపెట్టి దొడ్డి గుమ్మం ద్వారా బయటపడ్డాను.
పుల్లాయమ్మ పతివ్రతా కాదు. మాలతికి రంగనాధంలా ఆమెకో మోహన్ ఉన్నాడు. నాకా అదృష్టం లేదు. ఆమె దృష్టిలో నేనొక మగ పరుగును.
ఏమైతేనేం పుల్లాయమ్మ తలుపులు వేయకుండా ఉండడానికి కారణం తెలిసింది నాకు.
ఇంటికి వెళ్లాను కానీ మనసెం బాగుండలేదు. నేను లోపలకు రాగానే తలుపులు వేసి నన్ను తనకు హత్తుకుంది శ్రీమతి. కానీ పిలవకపోయినా ఆమె నన్ను బావా అని పిలిచినట్లనిపించింది. అందుకే ఆమెను విదిలించుకున్నాను.
"మీకోసం రంగనాధం గారు వచ్చారు" అంది శ్రీమతి.
"ఎప్పుడు?" అన్నాను.
"మీరు అటు వెళ్ళగానే వచ్చారు. మీకోసం ఓ గంట సేపు ఎదురు చూశారు."
రంగానాధం మా ఇంటికి వచ్చేడంటే నాకు భయం వేసింది. వెధవ అసలే మాలతిని మరిగి ఉన్నాడు. వాడి కింక ఆడదాని మీద గౌరవమేం ఏడుస్తుంది? నా భార్య కేసి వాడేలా చూశాడో ఏమో అదీ కాక వాడికిప్పుడు ఆడవాళ్ళను వశపరచుకునే ట్రిక్కులు కూడా తెలిసి ఉంటాయి.
"అంతసేపూ ఏం చేశాడు?' అనుమానంగా అడిగాను.
"కబుర్లు చెప్పుకున్నాం. కాఫీ కలిపిస్తే తాగారు."
శ్రీమతి వాడికి కాఫీ ఇచ్చింది. అప్పుడు చేతికి వేళ్ళు తగిలే వుంటాయి. వెధవకి ఎటువంటి ఆలోచనలు కలిగాయో ఏమో! నేను కోమలి గురించి అలోచించినట్లుగా , నా భార్యను గురించి రంగనాధం అలోచించి ఉంటాడేమో నన్న అనుమానం కలిగే సరికి నా వొళ్ళంతా తేళ్ళూ జేర్రులూ పాకినట్లయింది.
"నేను ఎనిమిదిన్నరకే ఇల్లు వదిలేనని చేప్పేవా?"
'చెప్పాను."
నేను ఎనిమిదిన్నర ప్రాంతంలో ఇల్లు వదిలి సినిమాకి వెళ్ళేనని వాడూహించి ఉండాలి. సినిమాకు వెడితే రాత్రి ఒంటిగంట దాకా రానని తెలుసు. అయినా గంటసేపు వుండి వెళ్ళిపోయాడు.
అంటే వాడి ఉద్దేశ్యం? కొంపదీసి వాడేదురు చూసిన అవకాశం కానీ లభించలేదు కదా!
అనుమానంగా శ్రీమతి వంక చూశాను. ఆమె ముఖం నిర్మలంగా ఉంది.
శ్రీమతిని అనుమానించటం తప్పు. ఆమె చాలా మంచిది. నా మనసే తప్పుడు ఆలోచనలు చేస్తోంది. అందుకే అందరి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను.
భోజనాలయ్యాక మడత మంచం పట్టుకెళ్ళి వీధిలో వేసుకున్నాను. శ్రీమతి గురించి బాగా తెలుసు. ఒక్క రాత్రి వీధిలో పడుకుంటే రేపుదయానికి కాళ్ళ మీద పడుతుంది.
"మీ స్నేహితులేవరైనా వస్తున్నారా?" అనడిగింది శ్రీమతి.
"కాదు, నాకోసమే!' అన్నా నేను.
శ్రీమతి ముఖం అదోలా పోయింది. నేను కోరుకున్నదీ అదే.
"ప్లీజ్! ఈరాత్రికి ఇంట్లో పడుకుందాం. రండి" అంది.
"ఈ ఉక్కపోతలో ఇంట్లో పడుకుంటే చస్తాను" అన్నాను చిరాగ్గా.
"చస్తే స్వర్గానికే గదా వెళ్ళేది. నేను బ్రతికుండగానే మీకు చూపించగలను " అంది శ్రీమతి.
"నీ సంగతి నాకు తెలియదనుకోకు- ఎప్పుడో కనిపెట్టేశాను. అందుకే వీధిలో పక్క.!"
శ్రేమతి కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. మరేం మాట్లాడలేదామే.
ఆ రాత్రి చాలాసార్లు ప్రయత్నించింది శ్రీమతి. నేను లొంగలేదు. అయితే నిగ్రహం చూపించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది.
రాత్రి తెల్లవార్లూ నాకు సరిగా నిద్ర పట్టలేదు. మాలతి, రంగనాధంలతో పాటు, మోహన్, పుల్లాయమ్మ లు కూడా కళ్ళ ముందు మేదుల్తున్నారు. మనసు క్రమంగా పుల్లాయమ్మ మీదకు పోతోంది. సుబ్రహ్మణ్యం లేని సమయం చూసి మరోసారి పుల్లాయమ్మ దగ్గరకు వెళ్ళాలి. పుల్లాయమ్మ ఎటువంటిదో తెలిసింది గదా, ఆమె నాకు అందుబాటులో ఉన్న పరాయి ఆడది మరి!
ఎప్పుడో నిద్ర పట్టింది. వీధిలో పడుకోవడం వల్ల చచ్చినట్లు పెందరాళే లేవ్వలసి వచ్చింది. పనిమనిషి, పాలవాడు .....ఇంట్లో ఇంక హడావుడి ప్రారంభం.
మండుతున్న కళ్ళతో, రగులుతున్న హృదయంతో కాలకృత్యాలు తీర్చుకుని ప్రొద్దున్నే ఒక మిత్రుడు దగ్గరకు వెళ్ళి , అక్కడి నుండి ఆటే ఆఫీసు చేరాను. గవర్నమెంటాఫీసులో ఉద్యోగస్తుడిని కాబట్టి హాయిగా ఆఫీసులో నిద్ర పోగలిగాను. ఆఫీసులో మంచి విశ్రాంతి దొరికింది.
సాయంత్రం కల్లా ఇల్లు చేరుకున్నాను.
తలుపు తట్టగానే నవ్వుతూ తలుపు తీసింది శ్రీమతి. నేనూ ఆమెను చూసి నవ్వాను.
తలుపు వేసి నా దగ్గరగా వచ్చింది శ్రీమతి.
"మీకు నేనంటే ఎంత ప్రేమండీ" అంటూ శ్రీమతి నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను అల్లుకుపోయింది.
నేనాశ్చర్యపోయాను. కానీ శ్రీమతి ఇంకా మాట్లాడుతోంది.
"మీ మాటలు నిజమనుకొని కోపమొచ్చి పుట్టింటికి పోయాను. అసలు సంగతి ఎవరికీ చెప్పలేదు కానీ, మా చెల్లెలు రేవతికి చెప్పాను. అది నవ్వి "మగాళ్ళలా అంటారు కానీ చేతలు వచ్చేసరికి శూన్యం. నామీద నీకు నమ్మకముంటే పరాయి ఆడదానితో బావ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకు వస్తా" అంది. సరేనన్నాను.
"దాన్ని మీరు అతి సులువుగా గుర్తు పట్టి కూడా తెలియనట్టు నటించారుట. దాన్ని వదుల్చుకుందుకు మధ్యాహ్నం సినిమాకు పోయారుట. ఎంత బ్రతిమాలినా వినకుండా వీధిలో పడుకున్నారుట. మీరు వీధిలో పడుకున్న విషయం అమ్మలక్కలు ద్వారా రూడి అయింది. 'ఇంతటి ఏకపత్నీవ్రతుడ్ని పట్టుకుని పరాయి ఆడదాని కోసం ప్రాకులాడతాడంతావేంటి?" అంటూ తిట్టింది నన్ను. నేను మధ్యాహ్నం వచ్చేశాను. మీ ముఖం చూడ్డానికి సిగ్గేసి, ఎంత చెప్పినా వినకుండా నాలుగు గంటల బస్సులో వెళ్ళిపోయింది."
తెల్లబోయాను.
నిన్న ఇంట్లో గడిపిన వ్యక్తీ శ్రీమతి చెల్లెలు రేవతి అన్నమాట! అయినా శ్రీమతికి రేవతికి అనే ఒక కవల చేల్లెలున్నదన్న విషయం - 'బావా' అని ఆమె పిలుస్తుంటేనైనా నాకెందుకు స్పురించలేదు. ఉయ్యాలలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా వేదికినట్లు గొప్ప అవకాశం పోయింది నాకు.
నాలాంటి భర్తను పొందిన తన అదృష్టానికి మురిసిపోతోంది శ్రీమతి. నిన్నటిలాంటి అవకాశం పోగొట్టుకున్న దురదృష్టానికి కృంగి పోతున్నాను నేను.
అయితే- శ్రీమతి నన్ను దేవుణ్ణి చేసి పొగిడేస్తోంది. తన చెల్లెలు నన్నేవిధంగా పోగిడినదీ చెబుతోంది.
ఆ మాటలు నాలో వివేకాన్ని కలిగించేయి. పరాయి స్త్రీని అనుభవించడం ద్వారా తాత్కాలిక సుఖం లభించవచ్చు. కానీ కాదనడం ద్వారా మగవాడి ఔన్నత్యం ఎంత పెరుగుతుందో అనుభవపూర్వకంగా తెలిసింది నాకు.
ఉత్సాహంతో నా మనసు పరవళ్ళు తొక్కింది.
శ్రీమతిని గబాలున హృదయానికి హత్తుకుని ముద్దులు వర్షం కురిపించాను.
***
