వాళ్ళు సంస్కృతీ లో మనకంటే బాగా ముందంజ వేసిన వాళ్ళని నీకూ తెలుసు! వాళ్ళ ఆడవాళ్ళ ని సిగ్గు శృంఖలాలలో బంధించలేదు ఏనాడు. స్వతంత్రత అన్నింటికీ ఉంది. వాళ్ళ రాజ్యంగ చట్టంలో ఆడవారికి వేరే హక్కులను నిర్ణయించ లేదు వాళ్ళు. అందుకని చాలా సంస్కార వంతులు కాబట్టే , ఏవేవో ఎంగేజి మెంట్స్ తో సతమతమవుతూ, వాటన్నిటి కి టైము సర్దుకోవడానికి గాను, ప్రతి రోజు హాయిగా గడుపు కోవడానికి గాను టైము హద్దు నిర్ణయించు కోవడాని కని మొట్టమొదట డైరీలు మొదలు పెట్టారు.
ఉదాహరణ కి నీ విషయమే తీసుకో.
రేపు నీ స్నేహితురాలు కుసుమ వస్తానందనుకో , "ఓ ,దానికేం? రేపు మధ్యాహ్నం రా!" అంటావు.
రాజు వచ్చి 'అక్కా! నా చొక్కా కి బొత్తాములు లేవే' అంటాడనుకో!
'రేపు సెలవేగా! రేపు మధ్యాహ్నం కుట్టి పెడతానమ్మా!' అని బతిమాలు కుంటావు!
అంతట్లో శాంత అక్కయ్య చిట్టి వచ్చి "పిన్నీ! నాకో బొమ్మ చేసి పెట్టవూ? సుజాతా, నేనూ బొమ్మలాట లాడుకోవాలి. మేమేమో అడ పెళ్లి వారం. బోల్డు నగలూ అవీ కావాలి!' అంటుందనుకో.
"ఇప్పుడెక్కడి తీరికా! రేపు చేసి పెడతాను గా! మా చిట్టి మంచిదమ్మా!' అంటూ బెలిపించి బెల్లం ముక్క చేతిలో పెట్టి పంపెస్తావు!
ఇంక అమ్మ వచ్చి "నీ బద్ధకం మండి పోనూ! తలంటుకుందువు గాని రావే!' అంటే, 'లేదమ్మా! రేపు సెలవేగా! రేపు చేస్తాలే! ఇప్పుడు నన్ను వదిలేయమ్మా!' అని బతిమాలు కుంటావు!
ఇక మన ఉదాహరణ! నీరజ ఫోను చేస్తే మాట్నీ కి వెళ్ళడానికి నిర్ణయించుకుని, మరునాడు సీట్లు రిజర్వు చేయించుకోవడం కోసం కంగారు పడిపోతావు!
దీనికంతకూ కారణం నీ ప్రోగ్రామ్సు , నువ్వు వరస క్రమం లో ఎర్పరచుకోలేక పోవడమే అన్న మాట! ఇప్పుడు తెలిసిందా డైరీ ఉపయోగం?
అసలు డైరీ లు, స్వీయ చరిత్రలు వ్రాయడం లో ఓ గమ్మత్తు ఉందిలే!
ఇందులో అన్నీ ఉన్నవి ఉన్నట్లు వ్రాసుకునే వారు బహు తక్కువ మంది. ఎక్కడో గాంధీ మహాత్ముడంతవాడికే చెల్లింది యధాతధంగా చిత్రించు కోవడం.
ఎవ్వరికీ విప్పి చెప్పుకోలేని సమస్యలున్నా , నా బాధ ఇది అని చెప్పుకోవడం ఇష్టం లేనివి డైరీ లలో వ్రాసుకుని , కాస్తంత మనశ్శాంతి పొందిన వాళ్ళెంత మందో ఉన్నారు.
డైరీల నేవీ మనిషి మనస్సు కు నిలువు నీడలు! ఆలోచనా విధానానికి ప్రతిబింబాలు!
ఎన్ని కోణాల నుండో అద్దం ;లో చూసుకోగా కనిపించేది బాహ్య సౌందర్యం!
ఒకే మాటలో, అర్ధ క్షణం లో చూపించేది అద్దం లాంటి డైరీ! దేన్నో తెలుసునా? అంతః కరణ సౌందర్యాన్ని!
అందుకనే డైరీ లనేవి భద్రంగా దాచు కోవలసిన వస్తువులు మనస్సు లాగే!
డైరీ పారవేసుకుంటే రహస్యాన్ని పార వేసుకున్నట్లు!
నష్టమనేది పది మందిలోనూ పలచన!
మనస్సు పారవేసుకుంటే జీవితాన్నే విష వలయం లోకి నెట్టిన ఆ నష్టం జీవితాంతం పూడనిది! ఎన్ని సుఖాలున్నా , సకల ఐశ్వర్యాల మధ్య తీరని వెలితి! భర్తీ చేయలేని లోటు!
అందుకనే డైరీ వ్రాసుకోవడం ఒక ఎత్తు , దాచుకోవడం ఇంకొక ఎత్తు!
ఇక ఉంటా.
నీ అక్క సుమిత్ర."
అయితే విశాలి డైరీ వ్రాస్తున్నట్లు సుమిత్ర కి తెలుసునన్న మాట! తల పంకించుకుని చతికిల బడింది నిద్రాదేవత! ఆఖరి పేజీ దాకా తిప్పింది , ఇంతకూ ముందు విశాలి మనస్సు లోని భావాలు తెలుస్తాయని!
"నన్నిక్కడికి తీసుకువచ్చి చదివిస్తూన్నంత మాత్రాన అక్కయ్య నని గొప్ప చాటుకుంటున్న దాని మాటలన్నీ పడవలసిన అగత్యం నాకు లేదు!
అందుకే ఎదిరించడం మొదలు పెట్టాను. ఏం చేస్తుంది? నోరు మూసుకుంది! ఈ వేళ గోపాలం , నేను కలిసి వెళ్ళిన సినిమా ఎంత బావుందని!
పక్కనే గోపాలం ఉండడం వల్ల కాబోలు చాలామంది అక్కయ్య స్నేహితులు , వాళ్ళు వింతగా చూశారు. పెద్ద ఇందులో వింత ఏమున్నట్లో? ఎన్నాళ్ళు వింతగా చూస్తారులే!కొత్త, వింత కొన్నాళ్ళ వరకే కాబట్టి ఇది అంతే! సాయంత్రం బీచ్ కి పోయి అక్కడి నుండి హాయిగా హోటల్లో భోజనం చేసి రెండో అట సినిమాకు వెళ్ళాము. అ సమయంలో చాలామంది చూసి ఉండవచ్చు! తెలిసే అంతవరకు ప్రతిది వింతే! తెలిశాక అలుసు సహజం! ఒక్కొక్కసారి గోపాలాన్ని చూస్తుంటే కోపం వస్తుంది! సమయం మించి పోతుందన్నట్లు ప్రతి డానికి తొందరే! తగులుతూ తిరగడానికి చాలా తాపత్రయ పడతాడు!' ఇక చదవలేక 'ఛీ' అని పుస్తకాన్ని విసురుగా టేబిల్ మీదికి విసిరివేసి వేగంగా వెళ్ళిపోయింది నిద్రా దేవత, చాలా సమయాన్ని అక్కడ అనవసరంగా ఖర్చి చేసేసి నందుకు బాధపడుతూ.
* * * *
మామగారికి మంచినీళ్ళు అందిస్తూన్న శాంత సుమిత్ర బండి దిగుతుంటే చూసి నిర్ఘాంత పడిపోయి నిలువు గుడ్లు వేసేసింది!
పలకరింపుగా చిరునవ్వు నవ్వి అక్కగారి కోసం తెచ్చిన సరుకులు జాగ్రత్తగా లోపల పెట్టించి డబ్బులిచ్చి పంపేసింది బందివాడిని.
మర్యాద మాటలు, కుశల ప్రశ్నలు అయిన తరవాత, అయన, ఆ ఇంటి ప్రస్తుతపు పెద్ద పొలాలలో పని ఉందని వెళ్లి పోయారు.
కాళ్ళను చుట్టవేసుకున్న అక్క శాంత మూడో కొడుకు ను వెంట బెట్టుకుని లోపలికి వెడుతూనే "బావ ఏరీ/ ఎక్కడి కైనా వెళ్లారా, అక్కా?' కనిపించని బావగారి కోసం వెతుకుతున్న కళ్ళకి ఓ అరక్షణం విశ్రాంతి ఇస్తూ అడిగింది అక్కగారిని.
"ఏదో పనుందని.....నసిగింది శాంత.
ఆమె ఆడబిడ్డ వచ్చి మూతి ముప్పై వంకర్లు తిప్పుకుని వెళ్ళిపోయింది.
అక్క చిన్న తోడుకోడలు వచ్చి ముక్కు, మూతి రెండు తిప్పుకుంటూనే నిష్ర్క మించింది! వాళ్ళ మనస్సుల ముద్రలన్నీ చూస్తూ నవ్వుకుని అక్క వైపు తిరిగిన సుమిత్ర శాంత కన్నీరు ఒత్తుకుంటుంటే చూసి, దీర్ఘంగా నిట్టూర్చింది. కారణం అడగవలసింది ఏమీ ఉండదు! ఎదురుగా తెలుస్తూనే ఉంటుంది అదే ఆమె జీవితంలోని తమాషా!
కోరుకున్నది ఏ ఒక్కటీ లభించలేదు!
ఆనాడు నాన్న చుట్టూ తిరిగి మీ అమ్మాయిని నా కివ్వవలిసిందే అని ఎంతో బతిమిలాడి చేసుకుంటుంటే అక్క జీవితం అంతా నందనవనమే అని అందరు మురిసి పోయారు!
కాని, నందన వనం లా సాగవలసిన ఆమె జీవితాన్ని ముళ్ళ కంచే ల్లో ఇరికించాడు ఏరికోరి మహానుభావుడు!
"నీవు లావెక్కి నట్లుందే?' చిలిపిగా చూస్తూ శాంతని ప్రశ్నించింది సుమిత్ర!
నవ్వేసింది శాంత. నిజంగా చూస్తె శాంత చిక్కిపోయింది! డానికి నీవు లావేక్కినట్లుందే అనేసరికి నవ్వేసింది. అంతకి మించి మరేమీ చెయ్యలేక!
పనివేళల్లో పెద్ద కోడలు ఆ విధంగా తీరికగా కూర్చుంటే సహించ వీలులేదు! అందుకే ఆ విషయాన్ని అనేక విధాలుగా హెచ్చరించి వెళ్ళిపోయారు ఆ ఇంట్లో మనిషి ఆకారాలతో అమానుష చర్యలు చేసే ఆ పెద్ద మనుష్యులు!
దీర్ఘంగా నిట్టూర్చి పనిలో మునిగి పోయింది శాంత.
ఆ ఇంట్లో ఒక్కొక్కరి వింత మనస్తత్వం పరిశీలించసాగింది సుమిత్ర.
అబ్బ....మనుష్యులు చాలా విచిత్రమైన వాళ్ళు! నటన కి, నిజానికి వ్యత్యాసం తెలియనివ్వనంత నటనా సమర్ధులు!
ప్రతి మనిషి బురఖాల్లో ఉండే కనిపిస్తారు! దాని వెనక ఉన్న నిజం మనం చచ్చినా ఊహించు కోలేనిది! ఆప్యాయత, ఆదరణల మధ్య అపురూపం గా పెరిగిన శాంత కి నాటకులతో నిత్య జీవితాన్ని గడప వలసి వచ్చింది! ఎవరు ఆప్యాయంగా చూస్తున్నారో, ఎవరికి కోపంగా ఉందొ తన మీద తెలియదామెకు! అంతవరకు కొన్నాళ్ళు అనుభవం ద్వారా నేర్చుకున్న గుణ పాఠం ఏమంటే, అందరికీ దూరంగా మెలగ గలగడం! అది సాధ్యం కానిదే అయినా, ఎన్నో అసాధ్యాలను నిర్వహించుకు నెగ్గు కోస్తున్నట్లే అది నిర్వర్తించుకు పోతుంది.
తన దీసిన్ ను గూర్చి, తన ఉద్యోగాన్ని గురించి ప్రశ్నిస్తుంది చిన్నావిడ.
