Previous Page Next Page 
వేప పువ్వులు పేజి 3


    మంచో, చెడో ఓసారి నిర్ణయించుకోవడం జరిగిపోయింది! ఒకసారి మనస్సును ఒకళ్ళ కి ఇచ్చి వేసి మళ్లీ తిరిగి తెచ్చుకోవడం పవిత్రత అనిపించుకోదు! సత్యవంతుడి తో నా పెళ్లి జరగని నాడు నాకు అసలు పెళ్ళే వద్దు అనీ , మనస్సు ఒకరి మీద లగ్న మయిన తరువాత వేరొకరికి అర్పించే అర్గత కోల్పోయిందనీ , తండ్రి తెప్పించిన పటాల్లోని రాజులకి తాను తగననీ నివేదించింది.
    మానసికంగా తనకు జరగవలసిన పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది , జరపవలసిన తంతు మాత్రమె మిగిలి పోయింది! అది నీ కిష్టం లేదంటే ఈ విధంగానే ఉండి పోతాను! అని అంటుంది.
    కూతురి నోటంట తనకు తెలియని వాక్యాలు వింటూ తెల్లబోతాడు సావిత్రి తండ్రి! మానసికంగా వేరొకరి మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలని తిరగ తోడుకోవడం తప్పు కదా! అందుకని ఒకసారి ప్రేమించిన తరవాత మళ్ళీ మళ్ళీ అభిప్రాయాలు మార్చుకోవడానికి శ్రీరామ నవమి నాడు ఏటేటా జరిపే బొమ్మల పెళ్లి కాదుగా! అందుకే సావిత్రి అల్పాయుష్కుడైన , ఆ విషయం తెలుసుకున్న తరవాత కూడా సత్యవంతుడ్ని పెళ్ళాడాలని నిర్ణయించు కుంది , తెలిసిందా? ఏదీ నువ్వు వ్రాయి, నేను దిద్దుతానులే." తల వంచుకుని చెప్పేసి, తమ్ముడిని చూస్తూ ముగించింది సుమిత్ర!
    ఆమె నిర్ణయం అర్ధమయి తలలూపు కున్నారు తల్లి తండ్రులు.
    తరవాత భాగం గబగబా శీతాకాలం గడియారం లో కాలం వేగంగా దొర్లిపోయి నట్లు ముగిసి పోయింది!
    తన నిర్ణయాన్ని చెప్పేశాక, తల్లి తండ్రుల్ని నవ్వించ గలిగే ఓర్పు, నేర్పు సుమిత్ర లో లేక, లోలోపలే నిట్టుర్చుకుని వారి బాధ ఆలోచిస్తూ లేచిపోయింది త్వరగా ముగించేసి.
    భోజనాల ప్రకరణం అయిపొయింది.
    మానసికంగా అలసిపోయారు తల్లి, తండ్రి . వారిని చూసి తన నిస్సహాయతకి తనను తానె నిందించు కుని మంచం మీద మెనూ వాల్చేసింది సుమిత్ర.
    పట్టని నిద్ర కోసం మంచాల నంటి పెట్టుకుని ఎదురు చూస్తున్నారు పాపం!
    గోడ గడియారం టిక్కు టిక్కు శబ్దాలలో మృదుత్వం లేదు బెదిరింపు తప్ప!
    ప్రశాంతత రాజ్యం ఏలుతుంది!
    యామినీ దేవి మరునాటి కాళరాత్రి నాడు తను చెయ్యనున్న భారత నాట్యానికి రావలసిందిగా పేరంటం పిలవడానికని దిక్కుదిక్కులకి వెళ్ళిపోయింది.
    వెలుగులోనే పనులు చక్కబెట్టుకోవాలి! రేపు నేను రావడం లేదు! పునర్దర్శనం రెండు మూడు రోజుల తరవాత నే!' అంటూ నిశిరాత్రి వేళ ఉదయిస్తున్న చందమామ మూడు వంతుల పైగా మబ్బు పరదాల్లో దాక్కుని, కొద్ది కొద్దిగా తొంగి చూస్తూ నవ్వుతున్నాడు, విరహతాపం లో, ప్రణయ కోపంలో ఉక్కిరిబిక్కిరయ్యే కలవలని చూసి!
    దూరంగా ఏదో కీచురాళ్ళ ధ్వని నిశ్శబ్దాన్ని గీపెట్టి అరుస్తున్నట్లుంది!
    నిద్రాదేవి తన చేతనున్న మంత్ర దండాన్ని ఒక్కొక్కరికే తాకించి, అందర్నీ మృత్యువు కి , జీవితానికి మధ్యే మార్గం నిద్రలోకి ఈడ్చి పడవేస్తుంది.
    రామారావు గారి ఇంట్లో సుమిత్ర ను అట్టే పెట్టి , అందర్నీ బజ్జో పెట్టి మరో వీధిలో పరీక్షా విద్యార్ధులు అవలించడం చూసి, అటు వైపు విహారానికి పోయింది!
    నిద్రలోకి ఒరిగిపోయిన తల్లి తండ్రులని, తమ్ములని చూసి నిట్టూర్చి టేబిల్ లైటు జాగ్రత్తగా అమర్చుకుని, డైరీ తెరిచింది ఆనాటి విషయాలని తన మనస్సులోని బాధలని భద్ర పరిచేందుకు!
    "విశాలీ! నీకోసమని ఎంత ప్రయత్నించినా, వీళ్ళని సంతోషంగా ఒప్పించలేక పోతున్నానే తల్లీ! అక్కకి నిర్ణయించిన వరుణ్ణి చెల్లెలి కిమ్మనమని అక్క చెబుతుంది! తలుచుకుంటే నవ్వు తెరలు తోసుకు వస్తున్నాయి!
    ఇందులో నీ తప్పే ముందమ్మా! అనవలసింది ఏడైనా ఉంటె గోపాలాన్ని అనాలి గాని. అతని తప్పు మాత్రం ఏముంది? అతనికి భాగవత్ర్పసాదితమైన మనస్స్ అంత! అది భ్రమరం లాంటిది!
    అందమైన పువ్వు కనిపిస్తే వాలుతుంది!
    ఆకర్షణ కి తట్టుకో లేదది!
    అతనా కోవకి చెందిన వాడు!
    మానసికంగా నీకంటే పై ఎత్తు లోనే ఉండవచ్చును. అమ్మా, మనస్సు అనేది బజార్లో షోకేసుల్లో పెట్టి ప్రదర్శించే వస్తువు కాదమ్మా!
    కొన్ని దొంతర్ల మధ్య భద్రంగా దాచుకోవలసినది!
    అది పది మందికి అందుబాటులో ఉండనియ్య కూడదు!
    దానిని స్వేచ్చగా తిరగనివ్వ నూ కూడదు!
    ప్రత్యేకంగా దానిని అదుపులోకి తెచ్చుకోవడం కోసమే మునులు, ఋషులు ప్రపంచానికి దూరంగా పారిపోయారు!
    నందన వనం లో ముక్కు మూసుకుని తపస్సు చెయ్యడం ఎంత కష్టం!
    సువాసనలు మెను మరిపించి, మత్తెక్కిస్తుంటే ఏకాగ్రత, నిశ్చల సమాధి తమ దారి తాము చూసుకుంటాయి కాని తమ దారిలోకి వ్యక్తులని నడిపింపజేయ్యలేవు!
    అలాగని మనస్సు ను నిలుపుగోవడం కోసమని ఊళ్లు దాటిపోవడం లో గొప్ప లేదు! అందుబాటు లో ఉన్న వస్తువును అంది పుచ్చు కోకుండా నిలబడ గలగడమే గొప్ప కాని, అంది పుచ్చుకోలేనంత దూరంలో నిలబడితే అంద మేముంది?
    జనకుడు చూడు! సంసార భారాన్ని, భూభారాన్ని నిర్వహించు కుంటున్నా ఏకాగ్రత తో ఎంత పేరు సంపాదించాడో! ఆ కధ నీకు తెలుసునా? సరే, ఈ డైరీ నీకు నేను అందనివ్వను, ఇందులో కధ చెబితే గొప్పేముంది? ఎప్పుడో నీకు తెలియ జెప్పుతాలే.
    ఈనాడు నాకు జరిగినదే నీకు జరిగితే?....
    గోపాలం చేతి గడియారం లో గంటల ముల్లు కున్న విలవ కంటే, నిమిషాల ముల్లుకు క్షణాల ముల్లుకు విలవ ఎక్కువ!
    అసలే సుకుమారంగా పెరిగావు! తట్టుకోలేనేమో అని నా బాధ!
    సముద్రపు ఒడ్డు విరిగి పడే అలల తాకిడి కి ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది.
    కష్టాలన్నీ ధైర్యంగా ఎదుర్కోగలగాలి! అందుకని వెనకంజ వెయ్యకు!
    పాటు, పోటు ఉన్నట్లే జీవితంలో సుఖ దుఃఖాలు కూడా ఉంటాయి.
    ఇంత వేదాంతం ఎప్పుడు నేర్చానో నీకు తెలియదూ? తెలుసు!
    ఒకానొకప్పుడు నేను ఎంత స్వార్ధంలో పడిపోయానని?
    వ్రుద్దులై పోతూన్న తల్లి తండ్రులు తాము స్వయంగా గడలు పాతి, చిన్నగా మొలకలేట్టుతున్న పాదుల అభివృద్ధి కి ఎంత తాపత్రయ పడతారని తెలుసుకున్నా, ముందు చదువులలో ఎంత ములిగి పోయాను?
    ఫలానా డాక్టరు గారి భార్య డాక్టరేటు సంపాదించాలని ఎంత కొట్టు మిట్టాడి పోయాను?
    ఆ సమయంలో కనీసం వాళ్లకి సహాయం చేద్దామనైనా ఆలోచించాను!
    అధిక స్వార్ధం అధః పాతాళానికి దారి తీస్తుంది!
    అనుభవం మానవులను అజ్ఞానం నుండి అతీతులను చేస్తుంది!
    ఈనాడు నేననుకొన్నది అందలేదు కాబట్టి అనుభవం చెప్పే పాఠాలు ఎంత శ్రద్దగా వింటున్నానని!
    చదువు చదవగానే సరి కాదు. చదివినది చేటు రూపం దాల్చకుండా ఉంటె చాలు!
    గోపాలం చదివిన డాక్టరీ మనుషుల్ని మార్చి మార్చి చూస్తుంది! అతను చూస్తూన్న బైనాక్యూలర్స్ లోంచి నీ బొమ్మ తిప్పి వెయ్యకుండా చూసుకో. అతని కంటి ముందు నీ రూపు చిరస్థాయి గా నిలిచి పోవాలి. అదే నీ గొప్ప! భ్రమరం లాంటి గోపాలాన్ని నీ వదన కమలాన్ని వదిలి పోనీయకు!

                                
    అవును, భ్రమరమే గోపాలం! నీవు కూడా భ్రమరానివి అంటే తుమ్మెద తనను తాను చీత్కారించు కుంటుంది! ఒక్కొక్క మాట ఒక్కొక్కళ్ళు పలకడం లో విలవ మారుతుంది! వేరోకళ్ళ మీద ప్రయోగించడం లో అర్ధమే మారిపోతుంది!
    పెద్ద అందకత్తె ని కాకపోయినా నా చెంత కి కూడా పరిగెత్తు కుని వచ్చి వేసింది నీ మనస్సు!
    గులాబీ పువ్వు మీద అప్పుడే వాలినా గడ్డి పువ్వు కనిపిస్తే తుమ్మెద ఆగుతుంది? అలాగే నా చెంతకీ చేరి ఉంటావు.
    నీకు చాలా త్వరగా అందగలనని, నీవు అనుకున్నవన్ని భద్రంగా దాచుకుని, మనస్సు ని ఒక్కదాన్నే నీ చేత పెట్టాను! అది తప్ప మిగితావి కావాలి నీకు! అదే మరి డాక్టరు వృత్తి అంటే!
    ఆస్పత్రి లోనే కాక నిత్య జీవితంలో కూడా అదే నీ అనమాయితీ!
    ఆ విషయం తెలియక, నేను అతి సుతారంగా అందిచ్చిన మనస్సు రెండు మూడు ఘడియల వరకు చేత పట్టుకుని, నీ వనుకున్న వాటి కోసం ఎదురు చూసి అందక పోయేసరికి నలిపి విశాలి చేతికిచ్చావు! అదే నీలోని తమాషా! విశాలి లోని చమత్కారం!
    నీవు అందిస్తూన్నది నలిపెసిన నా మనస్సు నే అని తెలిసి ఉండి కూడా తన మనస్సు ను అదే క్షణం లో నీ చేత పెట్టగలిగింది!
    ఆ నలిగినా మనస్సు ను సరిజేసి తిరిగి అనునయిస్తూ నీ చేత పెట్టకుండా అది కూడా ఎక్కడో విసిరేసిందని నేను దానిని తిడుతున్నా ననుకునేవు!"
    అక్కడ వరకు వ్రాసి ఆలోచనలు కట్టి బెట్టి పుస్తకం మూసి వేయబోయే అరక్షణం లో ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ తెరిచి, "మీరిద్దరూ సుఖం గా పార్వతీ పరమేశ్వరుల్లా ఉండాలనీ.........' అని ముగించి మూసి వేసింది!
    పక్కనే డొక్క మీద చేతులు ఆన్చి ఒయ్యారంగా నిలబడి అంతవరకు చదివిన నిద్రాదేవత చేతిలోని మంత్ర దండాన్ని సుమిత్రకి కూడా తగిలించింది!
    డైరీ దాచి వేస్తూ, ముంచుకు వచ్చిన నిద్రతో పడక చేరుకుంటున్న సుమిత్ర మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్న విశాలి ఏం చేస్తుందో అనుకుని నిద్రపోయింది! విశాలి మాట సుమిత్ర అనుకుంటుంటే విని నిద్రాదేవత దూర దృష్టి తో చూసింది! ఆమె కూడా ఏదో వ్రాస్తూన్నట్లుందే?
    అలికిడి కాకుండా విశాలిని సమీపించింది నిద్రాదేవత!
    లేత నీలం రంగు నైలాను మీద పువ్వు పువ్వుల చీర!
    ఒంటికి అతుక్కొని పైట కొంగు!
    రెండు జడలలో నలిగి పోయిన మల్లెలు! తీర్చి దిద్దిన కనుబొమలు!
    కుర్చీలో అలవోకగా కూర్చుని త్వరత్వరగా వ్రాసేసు కుంటుంది!
    కొంచెం సేపు  వ్రాసి తలెత్తిన విశాలి అదాటుగా చేతి వాచీ చూపెడుతున్న టైము చూసి ఉలికులికి పడింది! కళ్ళలో నించి అలసట తొంగి చూస్తుంది!
    ఇంతవరకు పక్కనే ఒంటి కాలి మీద అనుకుని నిలుచున్న నిద్రాదేవత ఆమెను పడుకో బెట్టి వెయ్యాలి అనుకుని చేతనున్న మంత్ర దండాన్ని మెల్లిగా తాకించడానికి బదులుగా, కంగారు లో గట్టిగానే తగలనిచ్చింది!
    దెబ్బకి కంగారు పడి, ముంచుకుని వస్తూన్న నిద్రను నిలదొక్కు కోలేక 'నిద్రమత్తు గా ఉంది, మిగిలింది రేపే' అని అక్షరాలూ వాలిపోయేలా వ్రాసి బట్టలయినా మార్చుకో కుండా మంచం మీద వాలిపోయింది విశాలి.
    నరసారావు పేట కాంప్ కాట్ కొంచెం సేపు ఊగిసలాడి , విశాలి మత్తుగా నిద్రపోయే సరికి ఊరుకుంది! అడుగు బయటికి కదుపుతూన్న సమయంలో విశాలి ఇంతవరకు ఏం వ్రాసిందో చూడాలని పించి, వెనుదిరిగిన నిద్రాదేవత పేజీలు  తిరగావేసింది!
    చదవవలసిన విషయాలు చాలా కనిపించాయి.
    చదివే ఓపిక మాట ఎలా ఉన్నా తీరిక లేదామెకు! పేజీలు  గబగబా తిరగ వెయ్యబోయే సమయంలో ముందు పేజీ లోని సుమిత్ర దస్తూరీ చూసి ఇదేమిటని ఆశ్చర్యపడి , పనిమాట మరిచిపోయి గబగబా చదవ సాగింది.
    "శనివారం, తలనొప్పి, జ్వరం వస్తే సెలవు తీసుకొమన్నాడు డాక్టరు. సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నా డైరీలు చదవడ మంత చండాలం మరొకటి లేదు నా దృష్టి లో! చిరంజీవి ని విశాలి డైరీ వ్రాస్తున్నదని నాకు మొదట తెలియదు. ఆ తరవాత అది వ్రాస్తున్నానని చెబితే చంటి పిల్ల, చిన్నది, ఏం వ్రాస్తుంది అనుకున్నాను! నేనిల్లా అనుకుంటుండగానే , ఓరోజున కాలేజీ లో ఏదో సంఘటన జరిగిందని నేను మాటి మాటికి తిట్టిన సందర్భంలో కూర్చుని వ్రాసుకోవడం మొదలు పెట్టింది! అది కొంత వ్రాసేసరికి డానికి ఎంతో నమ్మక మున్న శ్రీమన్నారాయణుడు కరెంట్ ఆఫ్ చేశాడు! దీనిని బట్టి బహుశః చిన్న చిన్న తగువులు డైరీ లో ఎక్కించు కుంటుందేమో అనుకున్నాను. అప్పటి నుండి నాకు తెలిసిన విషయాలు ఇందులో వ్రాయాలని అనుకుంటుండగా అదే శ్రీమన్నారాయణుడు నాకీ జ్వరం తెప్పించి ఉంటాడా!
    వ్రాయాలని అనిపించిందల్లా వ్రాస్తున్నా.
    నా చెల్లెలు, నా బాహః ప్రాణానికి నేను తెలియజెప్పాలి అని అనిపించిందల్లా పొందు పరుస్తున్నా ఇందులో!
    అమ్మా! చిరంజీవి నీ! సౌభాగ్యవతీ!
    డైరీ అనేవి మొట్టమొదట ఇంగ్లీషు వాళ్లు ఎందుకు మొదలు పెట్ట్టారంటే వాళ్ళ కున్న పనులన్నీ ఓ ఆకారంలో ఓ వరస క్రమం లో ఏర్పరుచు కుందామని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS