Previous Page Next Page 
అపరాజిత పేజి 4

 

                                   3

    తను ఉదయం కంపెనీకి వెళ్ళబోయే ముందు చెత్తకుండీలా చిందరవందరగా తయారుచేసి సాయంత్రం వచ్చేసరికి శుభ్రంగా సర్ది ఉండటం మధుకి ఆశ్చర్యం కలుగుతోంది - సాయంత్రం తను వచ్చీ రాగానే, టీ అందిస్తున్న రాధే గదిని కూడా శుభ్రం చేస్తుండవచ్చని అనుకున్నాడు-
    ఆ రోజు రాధ టీ కప్పుతో రాగానే టీ అందుకుని 'థాంక్స్! మీరు నాకోసం చాలా శ్రమపడుతున్నారు' - అన్నాడు-
    'శ్రమేముందండి! మాధవి టీ తయారుచేస్తోంది-కప్పులో పోస్తుంది-నేను తెస్తున్నాను- అంతే!'
    'ఈ టీ మీ మాధవి తయారుచేస్తున్నారన్న మాట!'
    'కాకపోతే ఇంకెవరు తయారు చేస్తారు? మా అమ్మకెప్పుడూ ఏదోపని- మా అక్కయ్య తన కుట్లూ అల్లికలలో మునిగి తేలుతూ ఉంటుంది - నాకు వంటిల్లంటే చిరాకు-'
    'మీకు వంటిల్లంటే చిరాకా? మరి, ఆ వంటలమీద వ్యాసాలన్నీ ఎలా రాసారు?'
    పకపక నవ్వింది రాధ-
    'అవా? మా పక్కింటి బామ్మగారి నడిగి రాస్తాను - ఆవిడకి వంటలొచ్చు రాయటం రాదు - నాకు రాయటం వచ్చు వంటలు రావు-అందుకని ఆవిడ వంటలు చేస్తారు - నేను వంటలమీద వ్యాసాలు రాస్తాను-'
    'బాగుందండీ! మరి ఇంటి శుభ్రత మీద వ్యాసాలు ఎవరినడిగి రాస్తారూ?'
    'అవి ఎవరినీ అడగలేదండీ! అదంతా నా స్వంత ఆలోచనే!'
    'అయితే మీకు ఇల్లు శుభ్రంగా ఉంచటం చేతనవు నన్నమాట! ఏరోజు కారోజు నాగది శుభ్రం చేస్తున్నది మీరేనా?'
    'ఛ! నేనలాంటి వెధవ పనులు చేస్తానా? ఇల్లు సర్ధటం అంటే నాకు తలనొప్పి...'        'మరి, మీరే స్వయంగా ఇంటి శుభ్రత గురించి వ్యాసాలు రాస్తానన్నారుగా!'
    'అవును - కాగితం కలం చేతులో పట్టుకోగానే థాట్స్ అలానే వస్తాయి-మనసులోనికి అందంగా అలంకరించబడిన ఇల్లు వచ్చేస్తుంది - దాన్ని భావించు కుంటూ ఏదేది ఎలా ఉంటే అందంగా ఏ వస్తువు ఎక్కడవుండాలో సీరియస్ గా ఆలోచిస్తూ వ్యాసం రాసేస్తాను-వ్యాసం పూర్తయ్యాక అంతసేపు ఆలోచించి నీరసం వస్తుంది - ఒక కప్పు వేడివేడి కాఫీ తాగి పడుకోవా లనిపిస్తుంది- ఇక నా గది ఎంత చిందర వందరగా ఉన్నా లేవ బుద్దెయ్యదు- అంతగా మరీ చిరాగ్గా ఉంటే ఇంట్లోంచి పోయి ఏ పార్కులోనో కూర్చుంటాను కొత్త థాట్స్ కోసం-నాకు గది శుభ్రం చెయ్యటానికి ఓపికెలా ఉంటుంది చెప్పండి?'
    'బాగుందండీ!'
    ఏమిటి? నా వ్యాసమేనా? మీరు చదివారా?'
    'వ్యాసం కాదండి - మీ ఉపన్యాసం-పాపం, చాలా శ్రమపడ్డారు - డాన్స్ ప్రోగ్రాం కెళుతున్నాను - మీరూ వస్తారా?'
    'వో! యస్. తప్పకుండా!'
    నిముషాలలో తయారయి రాధ మధుతో బయలుదేరింది - రాధతో కలిసి డాన్స్ ప్రోగ్రాం చూస్తున్నా తన - గదినంత శ్రద్ధగా సర్దుతున్నది ఎవరా అనే ఆలోచన పోలేదు మధుకి-

                               


    ఆ రోజు తలనొప్పిగా, జ్వరంగా ఉండి రోజూ అయిదింటికి కాని రాని మధు మూడింటికే వచ్చి మంచం మీద పడుకున్నాడు-
    మాధవి చీపురు కట్టతో లోపలికొచ్చి గది తలుపులు వేసేస్తోంది-
    గబుక్కున లేచి కూర్చున్నాడు మధు-
    'క్షమించండి- మీ ద్దేశం నాకర్ధం కావటం లేదు -' అదిరిపడి వెనక్కు తిరగింది మాధవి - చేతిలోంచి చీపురు కట్ట జారి క్రిందపడింది -
    'మీరు....మీరు.....మీరు అయిదు కాకుండా ఇంట్లో ఎందుకున్నారు?'
    'ఈ దెబ్బలాట చాలా బాగుంది-ముందు కాస్త ఆ తలుపు తెరిస్తే సావకాశంగా వివరిస్తాను-'
    ఒక్క క్షణంలో తనున్న పరిస్థితి అర్ధమయింది మాధవికి - లజ్జతో క్రుంగిపోయి గబుక్కున తలుపుతీసి బయటకు వెళ్ళిపోబోయింది-
    చటుక్కున అడ్డునిలిచాడు మధు-
    'అయిదు కాకుండా వచ్చినందుకు సంజాయిషీ అడిగారుగా! విని వెళ్ళండి-ఇవాళ జ్వరంగా ఉండి, పర్మిషన్ తీసుకుని వచ్చేసాను - అందుకే అజ్ఞాతంగా నాకు సేవ చేస్తున్న అమృతమూర్తి దర్శనం లభించింది-'
    మాధవి ఒక్కక్షణం కనురెప్పలెత్తి అంతలో వాల్చుకుని 'వెళ్ళనివ్వండి-' అంది.
    'అయితే, నా పరోక్షంలో నా యింటిని పరిపాలిస్తున్నా రన్నమాట! నేనింత అదృష్టవంతుడినని నాకే తెలీదు-'
    'ఏవిటండీ ఈ మాటలు? లేవండి...'
    'లేకపోతే, అధీశ్వరిలాగ నన్నే 'ఎందుకొచ్చారని ప్రశ్నించగలరా?'
    తన కళ్ళలోకి చూస్తున్న అతని చూపులను ఎదుర్కోలేక ఉక్కిరి బిక్కిరయిపోతూంది మాధవి-    
    'మా ఇంట్లో అందరి గదులూ నేనే శుభ్రం చేస్తాను -అందుకనే ఇదీ శుభ్రం చేసాను-అంతే!'
    'పోనీయండి! నన్నూ మీలో ఒకడిగా చేర్చుకున్నా రన్న మాట! అంతకన్నా ఏం కావాలి?'
    తనిలా దొరికిపోతున్నందుకు మాధవి ముఖం సిగ్గుతో కందిపోయింది ఎలా తప్పించుకోవాలో తెలియక బిత్తర పోతుంటే, 'హలో! మధూ!' అంటూ ప్రవేశించింది రాధ - మాధవి తప్పించుకుని లోపలికి పారిపోయింది-'
    'ఇవాళ పెందలాడే వచ్చేసారేం?'
    'కాస్త జ్వరం తగిలినట్లనిపించింది-ముందుగా వచ్చేసాను-'
    'జ్వర మా! అదే! డాక్టర్ కి చూపించుకున్నారా?'
    'ఆ! ఏదో కొద్ది సలపరం - అదే తగ్గిపోతుంది-'
    'అయితే ఫరవాలేదు-మనం కులాసాగా కబుర్లు చెప్పుకోవచ్చు-'
    మధు ప్రాణం ఉసూరుమంది-అతనికి విశ్రాంతి తీసుకోవాలని ఉంది. రాధనెలా వదిలించుకోవాలి? తనంత తాను అర్ధం చేసుకోదు -కటువుగా చెప్తే కష్టపెట్టుకుంటుందేమో?
    'నేను కొంచెం సేపు పడకుండా మనుకుంటున్నాను-'    
    'పడుకోంది - నేనిలా కుర్చీలో కూర్చుని మాట్లాడతాను-'
    'నాకు మాట్లాడే ఓపిక లేదని పిస్తోంది-'
    'ఫరవాలేదండీ! ప్రశ్నలూ సమాధానాలూ అన్ని నేనే చెప్పేసుకుంటానుగా! మీరు 'ఊ' అనండి చాలు!' -
    'అయితే సరే! కూర్చోండి-'
    'ఇవాళ మేం ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి కాంతికిరణ గారిని కలుసు కున్నాం!'
    'ఊ!'
    'పేరుబట్టి ఆవిడ చాలా మోడరన్ అనుకుంటున్నారు కదూ? మేము అలాగే అనుకున్నాం- కానీ, ఎంత పూర్వోత్తరం మనిషనుకున్నారూ? ఆశ్చర్యంగా లేదూ?'
    'ఊ!'
    'ఉంటుంది లెండి-మాకందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది - మాంచి రివల్యూషనరీ స్పిరిట్ ఉంది ఆవిడ నవల్లో- ఆవిడ చిత్రించే స్త్రీ పాత్రలు ధైర్యంగా తమ ఆశయాల కోసం భర్త లతో దెబ్బలాడి ఇళ్ళు విడచి పోతుంటే, మేమూ అలాగే మా వ్యక్తిత్వంతో నిలబడాలని మనసు ఉద్వేగంతో కొట్టుకుపోతుంది - అంతగా అయితే సంసారమయినా వదులుకొని మా వ్యక్తిత్వాలు నిలబెట్టుకోవాలన్నంత పట్టుదల కలుగుతుంది-'
    'ఊ!'
    'ఇవాళ ఆవిడని అడిగేసాం! 'ఇంత చక్కని రచనలు ఎలా చెయ్యగలుగుతున్నారండీ?-' అని - ఆవిడ ఏం చెప్పిందో తెలుసా?'
    'ఊ!'
    'మా భర్తగారి సహకారంతో ఇంతటి రచయిత్రి ని కాగలిగాను - ఆయన ప్రోత్సాహం లేకపోతే నేనసలు రచయిత్రిని కాగలిగేదాన్ని కాదు-అని........'
    'ఊ!'
    'నవ్వరేమండీ! -ఇక్కడ నవ్వాలి...'
    మధు నవ్వాడు -
    'మీ రచనలు చదివి మా మనసులు వికసిస్తున్నాయి-ఈ మొగవారి దౌష్ట్యాన్ని మేమింక సహించం-మా భర్తలు, మా వ్యక్తిత్వాన్ని గుర్తించకపోతే, సంసారం వదిలేస్తాం, కాని బానిసల్లా పడి ఉండం' అని అన్నాం-ఆవిడేం చెప్పారో తెలుసా?'
    'ఊ!,
    'మీరు ఊహించలేరు లెండి-తొందర పడకండి - నా కధల్లోలా మీ భర్తలకీ తర్వాత పశ్చాత్తాపం కలిగితే పరవాలేదు - కాని లేకపోతే మీ గతి ఏంకావాలి, అంచేత జాగ్రత్తగా ఆలోచించి, మీ భర్తలు తర్వాత పశ్చాత్తాప పడగలరనుకుంటే, ఎదిరించి విడిపొండి-అప్పుడు మీ వ్యక్తిత్వం బాగా రాణిస్తుంది - మీ భర్త మొండిఘటం అనుకుంటే మాత్రం ఎలాగో సర్దుకుపోండి - ఎడారిలాంటి ఒంటరి బ్రతుకు ఆడది భరించలేదు-కష్టమో, సుఖమో సంసారంలో ఇమిడిపోవటమే స్త్రీకి సహజం' - అని చెప్పారు...'
    రాధ ఇంకా ఏదో మాట్లాడబోతుండగానే డాక్టర్ వచ్చాడు లోపలికి-
    'ఇక్కడ జ్వరం ఎవరికండీ?'
    మధు ఆశ్చర్యంగా 'నాకే!' మిమ్మల్నెవరు పంపారు?' అన్నాడు.
    రాధ అందుకుంది-
    'ఇంకెవరు? మాధవి పంపి ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరికాల్లో ముల్లుగుచ్చుకున్నా మాధవి ప్రాణాలు విలవిల్లాడ్తాయి- సరే! నే వెళ్తాను - నాకు కొంచెం పనుంది-లేకపోతే కూర్చునేదాన్నే! ఏమీ అనుకోరుగా! వెళ్ళనా? పోనీ, కూర్చోనా?'
    'ఏమీ అనుకోను-వెళ్ళిరండి-'
    డాక్టర్ మధుని పరీక్షచేసి ఏవో మాత్రలిచ్చి వెళ్ళిపోయాడు.
    'మా...ధ......వి!' మనసారా అనుకున్నాడు మధు-

                                 *    *    *

    'జ్వరం వస్తే డాక్టర్లను పంపే వాళ్ళున్నారు. కాని పత్యం వండిపెట్టే వాళ్ళులేరు. నాకా హోటల్ మెతుకులే గతి' నూతిదగ్గర నీళ్ళు తోడుతోన్న మాధవికి వినిపించేలా స్వగతం పలికాడు మధు- మాధవి ఆ మాటలు విందో లేదో తెలీదు కాని వంచిన తల పైకెత్త లేదు.
    తొమ్మిది గంటలకల్లా చిన్న టిఫిన్ కారియర్ లో బీరకాయ కూర, కారప్పొడి, చారు అన్నీ సర్ది అతని గదిలోకి తెచ్చింది మాధవి.
    చిరునవ్వుతో మాధవిని చూసి పలకరించబోయేటంతలో కారియర్ బల్ల మీదుంచి గిర్రున తిరిగి వెళ్ళిపోయిది. సాయంత్రం వచ్చాక మధు గదిలోకి వచ్చి ఆ కారియర్ తీసికెళ్ళి పోయింది మళ్ళీ నింపి తీసుకురావడానికి - తీరా విప్పి చూస్తే అన్నీ పెట్టినవి పెట్టినట్లే వున్నాయి-కొయ్యబారిపోయింది మాధవి. అంతకు ముందున్న చిరునవ్వు చెదిరి పోయి ఎందుకో తనకే తెలియకుండా బావురుమని ఏడ్చింది - కొంత సేపటికి తెప్పరిల్లి ఆ కారియర్ లోవన్నీ ఖాళీ చేసి మళ్ళీ నింపి తీసికెళ్ళింది మాధవి మధుపుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. మాధవి రాక గమనించికూడా వంచిన తల ఎత్తలేదు. కారియర్ బల్లమీద పెట్టి మౌనంగా వెనక్కు తిరగబోయిన మాధవి కొంచెం సేపు నిలబడింది. అప్పటికీ మధుతలెత్త లేదు.
    'కారియర్ తెచ్చాను' అంది వణుకుతోన్న గొంతుకతో.
    అప్పటికి తలెత్తి మాధవి వంక చూసి 'ఏమిటి?' అన్నాడు మధు.
    'మీరు ప్రొద్దున్న తినలేదు - యిప్పుడయినా తినండి-' అంది మాధవి కళ్ళలో నీల్లు తిరిగిపోతుండగా నిగ్రహించుకొంటూ ఆ కన్నీటి పొరలవంక ఆదరంతో చూస్తూ 'ఇప్పుడయినా చెప్పారుగా తింటారు-' అన్నాడు చిరునవ్వుతో ఆర్ద్రంగా.
    మాధవి తన కళ్ళని పెద్దవి చేసింది.
    'ప్రొద్దున్న నేను చెప్పలేదని తినలేదా?' ఆశ్చర్యంగా అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS