'మీరు మాధవిని పంపితీరాలి - మీరు పంపకపోయినా నేను తీసుకెళ్ళ గలను- పార్వతి ఉత్తరం నా దగ్గిరుంది-పార్వతి తన పుట్టబోయే శిశువును కాపాడమని నాకు రాసింది-'
'పార్వతి స్వర్గలోకం లోంచి రాసిందా?'
'ఈ లోకంలోంచే రాసింది-ఆ లోకం లోంచి రాయగలిగితే మాధవిని కూడా తన తోనే తీసుకు పోయేదేమో?'
'ఎప్పుడో పార్వతి రాసిన ఉత్తరం పార్వతి పోయిన ఎనిమిదేళ్ళకు కనిపించిందన్నమాట మీకు-'
పరమేశ్వరి సమాధానం చెప్పలేదు-
'మాట్లాడరేం? ఎందుకొచ్చిన అబద్ధాలు?'
'అబద్ధాలు కాదు-ఆ ఉత్తరం నాతో తెచ్చాను-ఇన్నాళ్ళూ ఆ ఉత్తరం నాకు కనబడడంలేదు-'
'ఏం విడ్డూరం?'
'ఈ లోకమే ఒక విడ్డూరాల పుట్ట - ఈ ఉత్తరమూ ఇంకా చాలా ఉత్తరాలూ మా వారి కోర్టు కాగితాల డెస్క్ లో మూలపడి దాక్కున్నాయి ఇన్నాళ్ళూ - ఆ లోకంలో ఉన్న పార్వతి ఆత్మ ఎంత క్షోభిస్తోందో, మొన్న నేను ఎన్నడూ అలవాటులేని విధంగా ఆయన డెస్కంతా సర్ధటానికి కూర్చున్నాను-అప్పుడు తెలిశాయి అన్ని సంగతులూ - వెంటనే బయలుదేరి వచ్చాను-'
'ఉత్తరాలే తొక్కిపట్టిన మీ శ్రీవారు అమ్మాయినే వెంటపెట్టుకు వస్తే ఊరుకుంటారూ?'
ఒక్క క్షణం పరమేశ్వరి ముఖం నల్ల బడి అంతలో గంభీరమయి పోయింది-
'ఏమో! ఏం జరుగుతుందో? కానీ, ఇంకమీద మాధవి నాతోనే ఉంటుంది-ఏం మాధవీ వస్తావా?'
ఆప్యాయంగా మాధవి శిరస్సు నిమిరింది -
ఆప్యాయతకు అర్ధం తెలియని మాధవి బెదిరిపోతూ ఒక్కడుగు వెనక్కు వేసింది -రెండు చేతులూ జాపి మాధవిని దగ్గిరగా గుండెల కదుముకుంది పరమేశ్వరి-ఎందుకో తెలియకుండా వెక్కి వెక్కి ఏడ్చేసింది మాధవి-
'నాతో వస్తావమ్మా!' లాలనగా అడిగింది పరమేశ్వరి.
'వస్తాను - ఇక్కడి నుండి ఎక్కడి కైనా వస్తాను-'
గబ గబ అనేసింది మాధవి-
'రా!' అని కట్టుబట్టలతో బయటున్న రిక్షాలో తన ప్రక్కన కూర్చో బెట్టుకుంది పరమేశ్వరి - రిక్షా కదిలింది - వెనుక నుండి 'విశ్వాస ఘాతకు రాలు-కృతఘ్నురాలు రాక్షసి-'ఇత్యాది రుక్మిణి దీవెనలు రిక్షా చక్రాలు రేపిన దుమ్ములో కొట్టుకు పోయాయి-
* * *
నిప్పులు -కురుస్తోన్నా శివశాస్త్రీ చూపులను జీవితంలో మొదటిసారిగా ఎదుర్కొని నిల్చుంది పరమేశ్వరి-
'వీల్లేదు-ఎంతమాత్రం వీల్లేదు-నా పిల్లలను పోషించుకోలేక నేను అవస్థ పడుతోంటే, ఇంకో ఆడపిల్లా! దాన్ని వాళ్ళింటి దగ్గిర దించెయ్యి-'
'దీనికొక ఇల్లంటూ లేదు-అందుకే నేను తీసుకొచ్చాను - మీరు దీనికేం పెట్టక్కర్లేదు - ఇవాళ నుంచీ నేను సగమే తింటాను -మిగిలింది దానికి పెడతాను-'
'వెధవ వాగుడు వాగకు-అది ఇంట్లో ఉండటానికి వీల్లేదు-'
కచ్చితంగా అన్నాడు శాస్త్రి-
'సరే - అయితే! నేనూ వెడుతున్నాను-ఎక్కడైనా కూలి చేసుకుని ఈ పసికందుని పోషించు కుంటాను- శ్యామలా రాధల్ని గుణించి నాకు దిగులు లేదు.....మీరున్నారు-'
గిర్రున వెనక్కు తిరిగింది పరమేశ్వరి-
ఏనాడూ తనమాట కెదురుచెప్పని పరమేశ్వరి అలా ఇల్లు వదిలి పోబోతుంటే దిగ్భ్రంతితో చూస్తూ నిలబడిపోయాడు శాస్త్రి - పరమేశ్వరి గడప దాట బోతోంది- గబుక్కున వచ్చి అడ్డుగా నిలుచున్నాడు శాస్త్రి-
'ఏవిటిది పరమేశ్వరీ!'
పరమేశ్వరి శాస్త్రి ముఖంలోకి సూటిగా చూసింది-
'మన పెళ్ళయి పన్నెండేళ్ళు నిండుతున్నాయి. ఇంతవరకూ నేను నోరు విప్పి మిమ్మల్ని ఫలానాది కావాలని కోరలేదు-ఈ పసికందును మాత్రం నేనా రాక్షసుల మధ్య వదలలెను - ఈ ఒక్క కోరిక మన్నించండి-లేకపోతే నేను నిజంగానే...'
'సరే! సరే! లోపలికి పద! ఎవరైనా వింటే నవ్విపోతారు-' వోటమిని కూడా గెలుపులాగే మార్చుకుంటూ గదమాయించాడు శాస్త్రి-
మాధవి చుట్టూ చెయ్యేసి దగ్గిరగా అదుముకుంటూ తలవంచుకుని లోపలకు నడిచింది పరమేశ్వరి-శ్యామలా, రాదా తమ కొత్త సోదరిని వింతగా చూశారు-శ్యామల మాధవికంటే పెద్ధది-రాధ చిన్నది-మాధవితో కలిసి తల్లి లోపలికొచ్చేసరికి ఇద్దరూ తల్లిని చుట్టేశారు-
'నిన్న ననగా వెళ్ళావు - ఎక్కడి కెళ్ళావమ్మా! నాన్న ఊరెళ్ళావని చెప్పాడు-మమ్మల్నెందుకు తీసికెళ్ళలేదూ?'
బిక్క ముఖాలతో తనను చుట్టిన కూతుళ్ళను ప్రేమగా చూస్తూ 'ఇదిగో! ఇంకో చెల్లాయి నీకు శ్యామూ! రాధా! ఇంకో అక్కయ్య నీకు-' అంది పరమేశ్వరి-అప్పటికి శ్యామలా రాధా ఇద్దరూ బత్తాయి వలచుకుని తింటున్నారు-రాధ తన చేతిలో తొనలు గబగబ నోట్లో కుక్కుకుంది-శ్యామల తన తొనల్లో సగం తీసి మాధవి చేతిలో పెట్టబోయింది.
ఇలాంటి ఆదరణ కలవాటు పాడనీ మాధవి భయంతో వెనక్కుతగ్గి 'నా కొద్దు' అంది.
'ఫరవాలేదు-తీసుకో! నువ్వు తినక పోతే, నేను తినను' బలవంతాన తొనలు మాధవి చేతిలో పెట్టింది శ్యామల-పరమేశ్వరి సంతృప్తిగా నిట్టూర్చి ఆదరంగా చూసింది శ్యామల వైపు.
శ్యామలా-రాదా బళ్ళకు వెళ్ళటానికి తయారయ్యారు. చీపురు పట్టుకొని ఇల్లు తుడుస్తున్న మాధవిని ఆశ్చర్యంగా చూస్తూ శ్యామల 'మాధవీ! నువ్వు బడికి రావా!' అంది-'నేను బడికా?' అంది మాధవి అంతకంతా ఆశ్చర్యపోతూ-
'భలేదానివి - బడి ఎగేసి ఇంట్లో కూర్చుందామనుకున్నావా? ముందు బయలు దేరు-'
పెద్దరికపు హోదా ఉపయోగించి ప్రేమగా కసిరింది శ్యామల.
బిత్తరపోయి నించున్న మాధవిని చూసి పకపక నవ్వింది రాధ- 'ఈ మొద్ధుకి చదువేమిటీ?' అంది.
ఇదంతా గమనిస్తోన్న పరమేశ్వరి వంటింట్లోంచి ఇవతలికొచ్చి మాధవి చేతిలో చీపురు తను అందుకొంది. 'పెద్ద దాన్నయినా చిన్నపిల్లకున్న పాటి జ్ఞానం నాకు లేకపోయింది - త్వరగా తెమిలి నువ్వు కూడా బడికెళ్ళు - ఇంకా బెంబే లుగా చూస్తోన్న మాధవికి శ్యామలే తల దువ్వి జడవేసింది-తఃన బట్టల్లోంచి ఒక గౌను తీసి తొడిగింది-ఒక పలక చేతిలో పెట్టి చెయ్యిపుచ్చుకొని బడికి తీసి కెళ్ళింది-
కాలచక్రం దొర్లిపోతోంది-శివ శాస్త్రి కసురుకొంటున్నా, రాధ వెక్కి రిస్తున్నా, పరమేశ్వరి ఆదరణతో, శ్యామల స్నేహంతో రోజులు హాయిగానే గడుస్తున్నాయి మాధవికి-శ్యామల మనస్సులో ఎంత మంచితనముందో మెదడులో అంత మాంద్యముంది - మధ్య మధ్యలో శ్యామల ఫెయిలవుతూ ఉండటం వల్ల శ్యామలా, మాధవీ ఒకేసారి ఎన్.ఎస్.ఎల్.సి. కొచ్చారు. ఆ సంవత్సరం మాధవి పాసయింది-శ్యామల ఫెయిలయింది-తన పిల్లల్లో ఒకరయినా ప్యాసయ్యారని తృప్తి పడింది పరమేశ్వరి.
శివశాస్త్రి ఈర్ష్య తో భగ్గు మన్నాడు.
'నువ్వు పాసయినందుకు ఇదిగో నీకు మిఠాయి-' స్వచ్చమైన చిరునవ్వుతో తన నోటికి మిఠాయి అందించే శ్యామలను ఆప్యాయంగా కౌగలించుకుంది మాధవి-
* * *
మాధవికి ఎలాగైనా పైకి చదవాలని కోరిక కలిగింది-భయపడుతూ ఎంతో బిడియంగా ఆ విషయం పరమేశ్వరికి చెప్పింది-పరమేశ్వరి ఒక నిట్టూర్పు విడిచి 'మీ పెద్దనాన్న గారికి చెప్పి చూస్తాను-' అంది-
మాధవి కాలేజీ చదువు ప్రస్తావన వింటూనే భగ్గుమన్నాడు శివశాస్త్రి-
'మీరందరూ ఏమను కుంటున్నారే! గుమస్తాని - మామూలు గుమాస్తాని-ఇప్పటికే 'నా రక్త మాంసాలు పిండి మీ కప్పగిస్తున్నాను -నావల్ల కాదు-కన్నకూతుళ్ళకి దిక్కెలాగొ అని నేనఘోరిస్తుంటే ఎవతినో తీసుకొచ్చి కాలేజీలో జేర్చించమంటావా?'
పరమేశ్వరి తలవంచుకు నిలబడింది అవును-భర్త మాటలలో మాత్రం అసత్యం ఏముందీ? ఇప్పటికే ఆయన మోయలేని బరువు మోస్తున్నారు-
'మాధవికి పెళ్ళిచేసి పంపేద్దాం!' పరమేశ్వరి వంక చూడకుండా అన్నాడు శివశాస్త్రి-
ఉలికిపడింది పరమేశ్వరి-
'మాధవికి పెళ్ళా? పెద్దది శ్యామలకి కాకుండా! - అయినా సంబంధం కుదిరిందా?'
'మాధవికి పెళ్ళి చేస్తేనే శ్యామలకి చెయ్యడానికి వీలవుతుంది-మాధవికి రాజా లాంటి సంబంధం చూశాను'-
చెవులప్పగించి తెల్లబోయి నిలబడింది పరమేశ్వరి-
'బోలెడంత అస్థిరపరుడు - దబ్బ పండులాంటి ఛాయ-మంచి గౌరవ కుటుంబం...'
తను వింటున్నది నిజమో వేళా కోళమో తెలీలేదు పరమేశ్వరికి-
'అతనంతట అతను చేసుకుంటా నన్నాడు మన అందరి అదృష్టమూ-'
'ఎవరతను?'
'జగన్నాధం-నా ప్రాణ స్నేహితుడు...కెవ్వున కేక పెట్టింది పరమేశ్వరి -
'భగవంతుడా! అరవై నిండిన ఆ వృద్దుడా?'
'ఆ! మొగవాళ్ళకి ముసలి తన మేవిఁటే? ఆయుర్దాయం ఉంటే నిండా నూరేళ్ళూ బ్రతుకుతారు-లేకపోతే పాతికేళ్ళకే చస్తారు - కాస్త వయసెక్కువయితే మించిపోయిందేముందీ?'
'మీ తర్క పాండిత్యం ప్రకటించుకోవటానికి మీ మాటలు చాలా బాగున్నాయి-కానీ, అనుభవించటానికి కాదు - పట్టుమని పదహారునిండని పిల్లను అరవైఏళ్ళ వాడి చేతిలో పెట్టి లేనిపోని సిద్దాంతాలతో దాని గొంతు కొయ్యకండి-'
'ఎవరి గొంతూ నేను కొయ్యను-మీ రంతా కలిసి నా గొంతు కొయ్యండి - మాధవిని తనకిస్తే జగన్నాధం నాకు అయిదువేలు ఇస్తానన్నాడు-అది కట్నంగా ఇచ్చి శ్యామల పెళ్ళి చేద్దాం అనుకున్నాను -ఇంక రాధ మిగులుతుంది...'
'అబ్బబ్బా! ఆపండి - నేను వినలేకుండా ఉన్నాను-నాకు మాధవీ, శ్యామలా రాధా ముగ్గురూ కూతుళ్ళే! ఒక బిడ్డ జీవిత సమాధి పైన మరొక బిడ్డ జీవిత సౌధాన్ని నిర్మించనా? అంతటి కసాయి తనమా?'
'అవును-ఇది కసాయితనం-మీరంతా చేరి నా రక్త మాంసాలు కొరుక్కుతినటం మాత్రం గోసాయితనం-నావల్ల కాదు- ఇంక ఇంతమందిని పోషించలేను-కాలేజి చదువులు అసలు వీల్లేదు - పెళ్ళి చేసుకుంటే జగన్నాధాన్ని చేసుకోమని - లేక పోతే వెంటనే ఇంట్లోంచి పొమ్మను - జాగ్రత్త! అది పోకపోతే నేనే పోతాను-ఆ తరువాత మీరంతా తిందురుగాని - గడ్డి!-'
విసురుగా వెళ్ళిపోయాడు-
పరమేశ్వరి కుప్ప కూలిపోయింది-
మాధవి, పరమేశ్వరి దగ్గిరగా వచ్చి కళ్ళు తుడిచింది-
'బాధపడకు పెద్దమ్మా పట్టుదల ఉండాలే కాని ఎలాగో ఒకలా సాధించలేక పోను - హెచ్ . ఎస్ సి. పాసయ్యాను కదా! ఏదైనా నర్సరీ స్కూల్లో టీచర్ గా చేరి, నైట్ కాలేజీలో జేరి బి. ఎస్ సి పాసవుతాను-'
సమాధానం చెప్పేందు కేంలేదు గనుక పరమేశ్వరి మాట్లాడలేదు - జగన్నాధాన్ని చేసుకోనందుకు మొదట్లో శివ శాస్త్రి చిందులు తొక్కినా, మాధవీ నర్సరీ స్కూల్లో టీచర్ గా చేరి నెలతిరిగే సరికల్లా తనచేతికి వందరూపాయ లిచ్చే సరికి కొంత శాంతించాడు-
అన్నట్లు గానే మాధవి నాలుగేళ్ళలో నైట్ కాలేజీలో చేరి బి.ఎస్ సి. డిగ్రీ సంపాదించుకుంది - శ్యామల చదువుకి స్వస్తి చెప్పేసి ఇంట్లో కూర్చుని అల్లికలూ, కుట్లూ వీటితో కాలం గడుపుతోంది - రాధ కాలేజి కెళ్ళివస్తోంది కాని ఆ అమ్మాయికి చదువుమీద కంటే కబుర్ల మీదే శ్రద్ధ ఎక్కువ. అప్పుడప్పుడు పత్రికలకు వ్యాసాలు రాసి పంపి రచయిత్రిగా పేరుకూడా సంపాదించుకుంది.
చాలారోజులుగా తాళంపెట్టి ఉన్న వీధివైపు గదిని ఇంటివారు కడిగిస్తుంటే ఎవరో అద్దెకి రాబుతున్నారని ఊహించు కుని, ఆ రాబోయేవాళ్ళ కోసం ఉత్సుకతతో ఎదురు చూడసాగారు శ్యామలా రాధా. మరో నాలుగురోజుల్లో మధు దిగాడు ఆ గదిలోకి సూట్ కేస్, హోల్దాలూ, చెరో చేత్తో పట్టుకుని-
తనతో స్నేహం చేసుకునే ఆడవాళ్ళే వరూ లేకపోయేసరికి శ్యామల ఉత్సాహం చచ్చిపోయింది-ఆడా మొగా భేదంలేకుండా వినేవాళ్ళుంటే చాలు, పసిపిట్టలా వాగే రాధ రెండు రోజుల్లోనే మధుతో మాటలు కలిపేసింది. పరమేశ్వరి కి కూడా మధుపట్ల ఏదో వాత్సల్యభావమే కలిగింది-రోజూ న్యూస్ పేపర్ అరువివ్వటం ద్వారా శివశాస్త్రి తో కూడా స్నేహం చేసుకోగలిగాడు మధు.
