Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 4


    "తీసికెడతాను మామ్మగారూ.... పోలీసులు వస్తారు. వచ్చి చూశాక తీసికెడతాను. అంతవరకు మనం ఏం ముట్టుకోకూడదు."
    ఆవిడ చీరకొంగు నోట్లో దోపుకుని వెక్కి వెక్కి ఏడుస్తూంది. రవి అమ్మమ్మ వడిలో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. రేఖకి ఇంకా పూర్తిగా చావుకి అర్ధం తెలియని వయసు. అందరూ ఏడుస్తూంటే వింతగా బిక్కమొహం వేసుకు చూస్తూంది. పనివాళ్ళంతా సావిట్లో నిల్చుని గుసగుసగా మాట్లాడుకుంటున్నారు.
    అరగంటలో పోలీసు ఇన్ స్పెక్టరు వచ్చాడు. ఆయన నిన్నవచ్చిన అతనే! వతూనే "మైగాడ్ .... నిన్న హత్య, ఇవాళ ఆత్మహత్య యీ యింట్లో! డాక్టరుగారు ఇంతపని చేస్తారనుకోలేదు. ఇంకా ఇవాళ వచ్చి ఆవిడతో మాట్లాడాలనుకున్నాం. అసలు ఆమె నిన్న మా ప్రశ్నలకు జవాబీయకుండా యివాళ యిస్తానన్నారు...." అన్నాడు.
    "అసలు ఆవిడ ఆత్మహత్య చేసుకోడానికి అదే కారణం అనుకుంటాను. పోలీసులు, కేసు, కోర్టులు .... ఆవిడ పేరు నలుగురిలో పడటం ఇష్టంలేకనే ఇలాంటి పనికి తలబడ్డారనుకుంటాను." రామకృష్ణ అన్నారు.
    "ఎక్కడవుంది శవం? ఆత్మహత్యా చేసుకుంటున్నట్టు ఏమన్నా ఉత్తరం అదీ రాశారా ..... పదండి చూపించండి ఆమెని."
    "ఉత్తరం ఏదో ఉన్నట్టుంది. మీరు వచ్చాక తీయచ్చని ఇంకా మేం యేం ముట్టుకోలేదు" రామకృష్ణ జవాబిచ్చాడు.
    "గుడ్ పదండి...." మెట్లమీదకి దారితీశారు అందరూ.
    తరువాత జరగాల్సిన తతంగం జరిగింది. పోలీసు డాక్టరు స్లీపింగ్ పిల్స్ తిని ఆత్మహత్య చేసుకున్నట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు. కళ్యాణి పోలీసు కమీషనర్ పేర వ్యక్తిగతమయిన కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ఉత్తరం రాసిపెట్టింది. మరో కవరు సుజాత పేరున వుంది. రామకృష్ణ అది సుజాతకు అందించాడు.
    పోలీసులు పని ముగించి వెళ్ళాక, మామ్మగారిని చేతులమీద పైకి తీసుకు వచ్చారు. కూతురు శవంమీదపడి ఆమె ఏడ్చిన హృదయవిదారక మైన ఏడ్పుని చూసి అందరికి భరించడం కష్టమయింది. కబురు తెలిసి కళ్యాణి మిత్రులతో ఇల్లు నిండిపోసాగింది. అందరూ వస్తున్నారని ఆమె శవాన్ని క్రిందికి తీసుకొచ్చి హాల్లో ఉంచారు. వూరునిండా ఆమె పరిచితులు కొల్లలు. డాక్టరుగానేకాక ఆమె మంచితనానికి, స్నేహానికి ఆకర్షితులైన మిత్రులు చాలామంది ఉన్నారు. అందరూ వచ్చి ఆమె అకాలమృత్యువుకి ఎంతో వగిచారు. పిల్లలని దగ్గిరికి తీసుకుని కంట తడిబెట్టారు. మామ్మగార్ని ఓదార్చారు. సుజాతకి, రామకృష్ణకు సానుభూతి చెప్పారు.
    రామకృష్ణ స్వయంగా రవి నాన్నగారి దగ్గరకువెళ్ళి భార్య ఆత్మహత్య వార్త అందించాడు. కబురు విన్న రంగారావు మొహం ఒక్క సారిగా నల్లబడింది. తరువాత కాసేపు తీక్షణంగా ఆలోచిస్తూ నిల్చున్నాడు. భార్యని ఆఖరిసారిగా చూడటానికి పోలీసు పర్మిషన్ తీసుకొని పోలీసు కస్టడీతో ఆయన్ని ఇంటికి తీసికెళ్ళటానికి ఏర్పాటు చేశాడు రామకృష్ణ. కాని రంగారావు "అవసరంలేదు. చూడ్డానికి ఏముంది?" అని రావడానికి నిరాకరించాడు.
    రామకృష్ణ తెల్లబోయాడు. ఏమనాలో తెలియక కాసేపూరుకుని ఒక్కసారి చూసి వెళ్ళండి అంటూ మళ్ళీ రిక్వస్టు చేశాడు. రంగారావు తల అడ్డంగా తిప్పాడు.
    చేసేదేంలేక రామకృష్ణ వెళ్ళడానికి లేచాడు. రంగారావు కాస్త సందేహిస్తూ వెనక్కి పిలచి, "పిల్లలు......పిల్ల లెలా వున్నారు? "అన్నాడు గొణుగుతూ.
    కనీసం పిల్లల విషయమన్నా అడిగినందుకు సంతోషిస్తూ "పిల్ల లకేం భయంలేదు. మేమున్నాం.....జాగ్రత్తగా చూస్తున్నాం" అని భరోసా ఇచ్చాడు.
    రంగారావు ఓ నిట్టూర్పు విడిచి "ఇంక మీరే వాళ్ళకు దిక్కు. వాళ్ళని మీరే కనిపెట్టాలి, జాగ్రత్త .... కళ్యాణి ఇలా చేస్తుందనుకోలేదు" అంటూ గొణిగి ఎర్రబడ్డ మొఖాన్ని తిప్పుకుని వెళ్ళిపోయాడు.
    ఇంటికొచ్చి రామకృష్ణ సుజాతతో అంతా చెప్పాడు. భార్య చనిపోతే ఆఖరిసారన్నా చూడ నిరాకరించిన ఆయన కఠినత్వాన్ని ఏవగించుకుంది సుజాత. "అవును ఆవిడ ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఆయన ఉద్దేశంకాదు. ఆవిడని కోర్టు కీడ్పించి, నలుగురి ఎదుట ఆవిడని అవమానించటమే ఆయన ఉద్దేశం. అదింక నెరవేరదు. దేనికోసమైతే ఆయనీ పని చేశారో ఆ కోరిక తీరలేదు పాపం" కళ్యాణి ఇలా చేస్తుందనుకోలేదు అని అన్నారని రామకృష్ణ చెప్పినమాట విని సుజాత కసిగా అంది.
    పన్నెండు గంటలకల్లా కల్యాణి అంతిమ ఏర్పాటులు జరిగాయి. రవి చిన్న వాడని రామకృష్ణే దహన సంస్కారం చేయడం మంచిదని అందరూ సూచించారు.
    కల్యాణికి ఆఖరిసారిగా హృదయ విదారకంగా రోదిస్తూ అందరూ వీడ్కోలు యిచ్చారు. సరస్వతమ్మగారు ఏడ్చి ఏడ్చి శోషవచ్చినట్టుండి పోయింది. పిల్లలిద్దరూ ఏడుస్తూ అంతా చూస్తున్నారు. సుజాత ఓప్రక్క ఏడుస్తూనే అన్నీ చూసుకుంటూ, పిల్లల్ని, ముసలావిడ ఓదారుస్తూ తిరుగుతూంది.
    ఇంట్లోంచి కల్యాణి వెళ్ళిపోగానే ఇల్లులాగే అందరి హృదయాలలో శూన్యం ఆవరించుకుంది.
    ఉదయంనించి పచ్చి మంచినీళ్ళు తాగలేదు ఎవరూ. రెండుగంటల వేళ అందరినీ బలవంతంగా ఎంగిలిపడేట్టు చేసింది సుజాత. సరస్వతమ్మ గారికి ఇంజక్షనిచ్చి పడుకోబెట్టారు. పిల్లలిద్దరికీ అన్నంపెట్టి పడుకోబెట్టింది. రామకృష్ణా తనూ ఇంత తిన్నామనిపించుకుని గదిలో మంచంమీద వాలిపోయింది. రామకృష్ణ అలిసిపోయినట్లు కళ్ళుమూసుకు పడుకున్నాడు.
    భవిష్యత్తు ఆలోచిస్తుంటే సుజాతకి దిక్కు తోచనట్టు నడి సముద్రంలో తుఫానుమధ్య చిక్కుకున్నట్టయింది! ఇంక ఈ పిల్లలకి దిక్కెవరు? ఈ యిల్లు వాకిలి చూసుకునే వారెవరు? ఆలోచిస్తే అంతా అయోమయంగా అనిపించింది. చటుక్కున కల్యాణి రాసిన ఉత్తరం యింకా చదవలేదన్న సంగతి గుర్తువచ్చింది. ఆ హడావిడిలో, గలభామధ్య ఉత్తరం చదివే తీరికేలేక మరిచిపోయింది. ఉత్తరం తీసుకొచ్చి, ఆరాటంగా చదవడం మొదలుపెట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS