Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 3


    రవి చప్పున సుజాత దగ్గిరకి వచ్చి "ఆంటీ, ఆంటీ, మమ్మీకి ఏం అయింది?" అని అడిగాడు. పదేళ్ళ రవికి సంగతి అర్ధం చేసికోగల వయసుంది. అందుకే ఆదుర్దాగా అడగడం మొదలుపెట్టాడు. పిల్ల లిద్దర్ని చప్పున దగ్గిరకి తీసుకుంది సుజాత. "ఏం లేదు. మమ్మీకి వంట్లో బాగా లేదు.....అంకుల్ ఇంజక్షన్ల నిచ్చారు. పడుకున్నారు.... పదండవతలికి వెడదాం" అంది.
    "సుజా, పిల్లల్ని క్రిందకి తీసికెళ్ళు..... నాయర్, మీరుకూడా క్రిందకి వెళ్ళండి" రామకృష్ణ అందరిని గదిలోంచి పంపించడం మొదలు పెట్టాడు.
    ఈ గొడవంతా, క్రింద గదిలో ముసలమ్మగారికి కూడా వినపడింది. ఆమెకి ఏదో గలాభా జరుగుతూందని అర్ధం అయింది కాని ఏమిటో, ఏం జరిగిందో అర్ధంకాక.... "ఏం జరిగిందర్రా.... ఏమయింది.... ఓ సుజా, ఏమయిందర్రా...... ఒక్కళ్ళూ మాట్లాడరేమర్రా...." అని ఆదుర్దాగా కేకలు పెట్టడం ఆరంభించింది ఆవిడ.
    సుజాత ప్రశ్నార్ధకంగా రామకృష్ణవంక చూసింది. "ఒక్కసారిగా చెబితే ఆవిడ తట్టుకోలేదు. నెమ్మదిగా చెప్పచ్చు.... వంట్లో బాగులేదని చెప్పు...."అన్నాడు.
    రవి ఆ మాటలు విని అనుమానంగా చూశాడు. "ఆంటీ, మమ్మీ కేమయింది?" మళ్ళీ అడిగాడు. ఎనిమిదేళ్ళ రేఖ కళ్ళు నులుముకుంటూ "మమ్మీ" అమాయకంగా అంటూ తల్లి దగ్గిరికి వెళ్ళబోయింది. ఇంక మమ్మీలేదని యీ పసిపిల్లలకి తెలియదుగదా అనుకునేసరికి సుజాతకి ఒక్కసరిగా పట్టరాని దుఃఖం వచ్చేసింది. ఇద్దరినీ కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది.
    "ఆంటీ, మమ్మీ చచ్చిపోయిందా?" రవి హఠాత్తుగా అడిగాడు.
    రామకృష్ణ, సుజాత తెల్లబోయి మొహాలు చూసుకున్నారు. రామకృష్ణ నెమ్మదిగా రవిని దగ్గిరకి తీసుకుని భుజంమీద చెయ్యివేసి "రవీ నీకు నేను తర్వాత అంతా చెబుతాను. ముందు మీరిద్దరూ క్రిందకి వెళ్ళి మొఖాలు కడుక్కుని పలు త్రాగండి..." అంటూ ఇద్దర్నీ క్రిందకు పంపించాడు.
    "సుజా, చెప్పు, ఏం చేద్దాం. పోలీసులకి రిపోర్టు యీయడం మంచిదిగాదూ.....రవీ నాన్నగారికి కూడా కబురు చెప్పాలి. పద క్రిందకి వెడదాం. ముందు ఫోను చేస్తాను" అన్నాడు రామకృష్ణ. అంగీకార సూచకంగా తల ఊపింది సుజాత.
    అప్పుడే సుజాత దృష్టికి తలగడ క్రింద కాగితాలు కనిపించాయి. "ఇక్కడేవో కాగితాలున్నాయి.... ఆంటీ ఏదన్నా ఉత్తరం పెట్టి వుంటారు" అంటూ తీయబోయింది.
    "వద్దు.... వద్దు, వుండనీ. పోలీసు లొచ్చాక తీయవచ్చు. మనం ఏం ముట్టుకోకపోవడం మంచిది."
    మెట్లు దిగి ఇద్దరూ క్రిందకి వచ్చారు. క్రింద గదికి వచ్చేసరికి, అప్పటికే మనవల ద్వారా సంగతి విన్న సరస్వతమ్మగారు "సుజాతా, కల్యాణికి ఏం అయింది ఏం జరిగిందర్రా...... కళ్యాణికి ఏ జబ్బు చేసిందర్రా..... మాట్లాడరేమర్రా ..... అయ్యో కదలలేనిదాన్ని..... నా బిడ్డకి ఏం అయిందో చెప్పండి...."అంటూ ఘోష పెట్టింది. ప్రక్కమీదనించి లేవలేని నిస్సహాయస్థితిలో జరిగిందేమిటో తెలియక ఆమె పడే ఆరాటం చూస్తూంటే సుజాత హృదయం ద్రవించింది.
    "ఆంటీకి వంట్లో బాగులేదు. ఆయన ఇంజక్షనిచ్చారు..... మత్తులో వున్నారు...." అంది గొణుగుతూ సుజాత.
    ఆవిడ ఆ మాటలు నమ్మలేదు..... "లేదు, లేదు..... నువ్వు అబద్దం చెప్తున్నావు.... సరిగా చెప్పు, వున్న పాటున ఏం జబ్బుచేసింది?..అబద్దం, నీవు ఏడుస్తున్నావని రవి చెప్పాడు. ఏం జరిగిందో చెప్పే తల్లీ" ఆవిడ ఏడవడం ఆరంభించింది. పిల్లలిద్దరూ బిక్క మొహాలు వేసుకునిలబడ్డారు.
    "మీరు ఆవేశపడకండి, అసలే మీ ఆరోగ్యం...." రామకృష్ణ అన్నాడు.
    "నా ఆరోగ్యాని కేమొచ్చింది..... ముసలిముండవి వుంటే ఎంత పోతే ఎంత.... నీవన్నా చెప్పు నాయనా కళ్యాణికి ఏం అయిందో? ఒక్క సారి నన్ను పైకి తీసికెళ్ళండర్రా చూస్తాను.... సాయంపట్టి తీసికెళ్ళండర్రా..." ఆవిడ దీనంగా అడిగింది.
    రామకృష్ణ జవాబు చెప్పకుండా వెళ్ళి పోలీసులకి ఫోను చేసి వచ్చాడు. నిజం ఎంతోసేపు దాచడం కష్టం అని ఇద్దరికీ తెలుసు. పోలీసులు వచ్చాకయినా నిజం తెలుస్తుంది. తెలీకుండా ఎంతసేపు దాచగలరు? ముసలావిడ ప్రశ్నలమీద ప్రశ్నలు కురిపిస్తుంటే ఇంక తప్పించుకునే మార్గంలేక రామకృష్ణ నెమ్మదిగా...... "మామ్మగారూ, మీరు ఆవేశపడడం మంచిదికాదు...." అవి మాటలు కూడదీసుకుంటూ "డాక్టరుగారు..... డాక్టరుగారు యింక లేరు. ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు...." అని చెప్పగలిగాడు.
    సరస్వతమ్మగారు ఓ పెద్ద కేక పెట్టింది. "అయ్యో దేముడోయి, అమ్మా కళ్యాణీ.... ఎందుకింత ఘోరం చేశావే తల్లీ! నేనేం చేయనే.....అయ్యో భగవంతుడా" అంటూ ఏడవడం ఆరంభించింది.
    రవి, రేఖ బెదురుగా చూడడం ఆరంభించారు. రామకృష్ణ రవిని దగ్గిరికి తీసుకున్నాడు. సుజాత రేఖని దగ్గిరకు లాక్కుంది. పిల్లలిద్దరూ ఏం చెయ్యాలో తోచనట్టు వెర్రి మొహాలతో నిల్చున్నారు.
    "ఎందుకు చేసింది ఇంతపని! అయ్యో దేముడా, నిలువునా నిండు ప్రాణం తీసుకున్నావా అమ్మా..... ఇది చూడడానికేనా నేను బతికున్నాను - అయ్యో కళ్యాణీ! నేనింకా ఎలా బ్రతకాలే అమ్మా నాకింత విషం ఇవ్వండర్రా, నా కళ్ళముందే నా కూతురు ఇంత అఘాయిత్యం చేస్తే నేనింకా ఎలా బ్రతకడం కళ్యాణీ!" నెత్తి కొట్టుకుంటూ హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆమెకి చెరోప్రక్కన ఇద్దరూ కూర్చుని ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించారు. "వూరుకోండి మామ్మగారూ" అతి కష్టంమీద అనగలిగింది సుజాత ఆమెకీ దుఃఖం ఆగడంలేదు.
    అమ్మమ్మ ఏడవడంచూసి పిల్లలిద్దరూ కళ్ళనీళ్ళు పెట్టుకుని దీనంగా చూస్తూ నిలబడ్డారు. "రవీ నాయనా, రేఖా, అయ్యయ్యో పసిపిల్లలనైనా చూడకుండా ఎంతకి తెగించావే." పిల్లలిద్దర్నీ దగ్గిరకు లాక్కుని మరింత ఏడవసాగింది ఆవిడ. "ఆఖరికి ఇలా ఏదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను నిన్నటినుంచి భయపడినంతా చేసేసింది. నన్ను తీసికెళ్ళండర్రా నా కళ్యాణి దగ్గిరికి, నన్ను చూడనీయండి.'


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS