Previous Page
జాగృతి పేజి 4

 

    శ్రీను ఒక్క క్షణం ఆలోచిస్తూ "నీవెందో నాయనమ్మలాగ అగుపడుతున్నావు. అందుకే నీకాడ సెప్తున్నా - మల్లా ఎక్కడా అనమాకు . అన్నంటే మా ప్రభాకర్ .....ఎమ్మెల్యే , మల్లేశు ఆడి తాలూకు రైట్ హాండ్. మల్లేశు హైస్కూలు కాడా నాదొస్తూ. ఆడికి చదువబ్బ లేదు. స్కూల్లో కూడా రౌడిలా తిరిగేవాడు. నేను ఉద్యోగం లేక బేకార్ గా తిరుగుతుంటే అన్నకి పరిచయం చేశాడు. అన్న ఏం చెపితే మేం అది చెయ్యాలి. అన్న మీద ఈగ వాలితే మేం ఊర్కొం. మా అందరికి మస్తుగా డబ్బిస్తాడు. ఇక్కడ ఇల్లు తీసుకుని మమ్మల్ని పెట్టాడు. మల్లేశు మా లీడరు. ఎలక్షన్ అపుడు, ఊర్లో ఏపార్టీ తగాదాలు వచ్చినా మేం అన్నకి దన్నుగా ఉంటాం. మమ్మల్ని పోలీసోళ్ళు పట్టి కేడితే అన్న జామీనిచ్చి విడిపిస్తాడు. అన్నాకే మేం దన్ను మాకు అన్న దన్ను." "మీకు మామూలు సంపాదన కంటికి అనదు.... మీ ఆలోచన ధోరణి చూస్తుంటే ఈ దేశం భవిష్యత్తు ఏమిటన్న బెంగ కలుగుతుంది..... సరే బాబూ ఒక మాట చెప్పు. మీ దగ్గిర డబ్బు ఉంది. ఊర్లో అందరూ భయపడి , దండాలు పెడ్తారు. కాని మీకు మనశ్శాంతి ఉందా. కుటుంబంలోని అభిమానాలు, ఆప్యాయతలూ ఉన్నాయా? నీవాళ్ళే నిన్ను వదిలేసుకున్నా రంటే నీవు చేస్తున్న ఈ పనులు వాళ్ళకి చిన్నతనం, దుఃఖం కలిగిస్తున్నాయనేగా . నీలాంటి వాడికి ఏ తండ్రి రేపు పిల్లనిస్తాడు బాబూ. ఈ ఉడుకు రక్త వేడిలో ఇదంతా ఈ రోజు నీకు బాగుండచ్చు. రేపు నీకు భార్యా బిడ్డలు సంసారం కావలనిపిస్తాయి. దినదినగండంగా బతికే ,మీకు, ఏరోజు ఏ పోలీసులు పట్టి కేడతారో, ఏ ముఠా తగాదాల్లో కత్తి పొట్ల బారిన పడతారో తెలియని స్థితిలో వారిని ఏం చూస్తావు. ఈ హింస విడిచిపెట్టి సమాజంలో గౌరవంగా బతకండి నాయనా -- నా మనవడి వయసువాడివి. నేను చెప్పింది ఆలోచించు...."
    శ్రీను మోహంలో రంగులు మారాయి. ఆవిడ వంక చూడలేనట్టు చూపు మరల్చుకున్నాడు.
    "చూడు నాయనా, మనిషిని జయించడానికి , ఒక పని సానుకూలపడడానికి హింస కంటే శాంతి, అహింసా సిద్దంతాలే బాగా పనిచేస్తాయని గాంధీగారు నిరూపించారు. ఆయనే కనక హింసాయుతసమరానికి దిగితే, దౌర్జన్యయుత  పద్దతులు అవలంభిస్తే, మనకు స్వాతంత్యం వచ్చేదా? నాలుగు తన్ని జైల్లో పారేసి, కాల్చి చంపేవారు. అయన శాంతి యుత సమరం, అహింసాత్మక సమరానికి ఏమీ చేయలేక తలవంచి, రెండొందలేళ్ళు పాలించినవారు మనదేశం విడిచి వెళ్ళారు. అంతదాకా ఎందుకు నీవు నాతో ఇలా కూర్చుని ఎందుకు మాట్లాడుతున్నావు. నేను ప్రతిఘటించలేదు కాబట్టి. నీ మీద తిరగబడితే నన్ను పొడిచినా పోదిచేవాడివి. అరిస్తే పీకనోక్కేవాడివి. పోలీసులకి చెప్పి ఉంటే మీ వాళ్ళ చేత నాపని పట్టించేవాడివి. నీవు చెప్పినట్టు శాంతంగా ఉన్నాను. ఆకలితో ఉన్న నీకు తిండి పెట్టి అందరించానన్న విశ్వాసంతో నన్ను నీ నాయనమ్మలా అనుకున్నావు. అంటే శాంతి సామరస్యాలకి , అహింసకి మనిషిని లొంగదీసుకునే గుణం ఉందని మనం ఒప్పుకోవాలి. మంచిగా విషం తాగించవచ్చని మనవాళ్ళు ఊరికే అనలేదు. భగవద్గీత చెప్పినా, ఖురాను, బైబిలు, బాబాలు , రామకృష్ణమఠంలో చెప్పినా, అరవిందాశ్రమంలో చెప్పినా "అహింస పరమో ధర్మ" అనే చెబుతారు. ఈ హింసా ధోరణి నిన్ను ఎప్పటికీ గమ్యం చేర్చదు. నున్ను ప్రశాంతంగా బ్రతకనీయదు. తలెత్తుకు తిరగనీయదు.
    శ్రీను ఆవిడ మాటలు కాదనలేనివాడిలా తలదించుకున్నాడు. అతనిలో సంఘర్షణ ఆమెకి అర్ధమయింది.
    "ఈ ఊబిలోంచి త్వరగా బయటపడు, పూర్తిగా కూరుకుపోకముందే ...."
    "బయటపడి నేనెలా బతకాలో..... ఏం చేసి పొట్టపోసుకోవాలో, అదీ మీరే చెప్పండి, నావాళ్ళని ఎలా ఆదుకొను..." విరక్తిగా అన్నాడు.
    "చూడు శీనూ .... నీకు మనస్పూర్తిగా బయటపడాలంటే నీకు నేను సాయం చేస్తాను. నా దగ్గిర అవసరాన్ని మించిన డబ్బుంది. నా పిల్లలు అమెరికాలో లక్షలు సంపాదించు కుంటున్నారు. నేను నీకు డబ్బు మదుపు పెడతాను. ఏదన్నా వ్యాపారం చేసుకో. పాతికవేలు, యాభై వేలు నీకు అవసరమైనంత నేను ఇస్తాను ."
    "మీరిస్తారా ....... అంత డబ్బు మీరిస్తారా ....." ఆశ్చర్యంగా చూసాడు.
    "అవును బాబు . నా డబ్బు ఒక్క మనిషినన్నా సన్మార్గం వైపు మళ్ళించిందన్న సంతృప్తి చాలు నాకు. ఒక్క మంచిపనికి నా డబ్బు ఉపయోగపడిందన్న సంతోషం ఒక జీవితాన్ని బాగు చేశానన్న తృప్తి -- నాకు దక్కనీ ....."
    "ఏ వ్యాపారం చేయను " బేలగా చూశాడు.
    "ఏదన్నాసరే , నీకు ఏది నచ్చితే అది. అలోచించి చెప్పు, ఏం చేసినా నామోషి అనుకునే రోజులు పోయాయి. ఈ రోజుల్లో ప్రభుత్వం కూడా నిరుద్యోగులకి ఎన్నో పధకాలు ప్రవేశపెట్టింది. నీకు తోడుగా ఇద్ద్దరు ముగ్గురిని కూడ కట్టుకుని ఏదో ఒకటి చేయచ్చు. ముందు ఏదో చెయ్యాలన్న నిర్ణయానికి రా....."
    "అన్న ఏం అంటాడో ...... నన్ను వదులుతాడో లేదో .... బయటికి వదిలితే ఆళ్ళ గుట్టు రట్టులు తెలిసిపోతాయని వదలకపోతే ........" శీను మొహంలో కలవరం.
    "మంచిగా చెప్పి బయటపడు. నీ తల్లిదండ్రులు ఈ డబ్బు ముట్టడం లేదని, బీదరికంలో మగ్గుతున్నారని , వాళ్ళని కొడుకుగా ఆడుకునే భాద్యత కోసం వదలమని మంచిగా చెప్పు."
    "నేను మంచిగా బతకాలన్నా ఈ పోలీసులు బతకనీస్తారా? ఊర్లో ఏం గొడవలు జరిగినా మాలాంటి వాళ్ళని తన్ని, లాక్కుపోయి జైల్లో పడేస్తారు. ఇప్పుడు మంచిగా బతుకుతానంటే నమ్ముతారా?" బేలగా చూశాడు.
    "చోశావా? నీవు ముందాలోచన లేకుండా  చేసిన పనికి ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నావో, చూశావా? నీతినియమాలతో బతుకుతూంటే ఒకటిరెండుసార్లు నమ్మకపోయినా, తరువాతయినా నమ్ముతారులే. నీకు హామీగా నేనుంటాను. పోలీస్ కమీషనర్ మా కుటుంబ స్నేహితులు. నేను ఆయనతో నీ విషయం మాట్లాడతాను. ముందు నీవు మీ అన్నతో మాట్లాడి, ఆ ఊబిలోంచి బయటపడు. తరువాత నేను చూసుకుంటాను " నమ్మకంగా భరోసా ఇచ్చింది.
    శ్రీను మొహంలో మబ్బులు వీడి క్రమేపి చంద్రుడుదయించినట్టు - మొహం తేటపడింది. అతని కళ్ళు తడి అయ్యాయి. చటుక్కున లేచి లలితమ్మ కాళ్ళ దగ్గర కూలబడి ' అమ్మా నన్నీ ఊబి లోంచి పైకి లాగండమ్మా. నాకింక ఈజీవితం వద్దు, నాకు అందరిలా స్వేచ్చగా బతకాలని ఉంది." భోరుమంటూ కాళ్ళ మీద తలపెట్టి ఏడవటం ఆరంభించాడు. లలితమ్మ అతని తలనిమిరి , కొంగుతో కళ్ళ నీళ్ళు తుడిచింది. కన్నీటితో పాప ప్రక్షాళన అయినట్టు అతని మొహం తేటపడింది. అభయం ఇస్తున్నట్టు తల నిమిరింది లలితమ్మ.
    గడియారం టంగున పన్నెండు కొట్టింది ప్రపంచానికి ఇంకో కొత్త రోజు అందించడానికి కొత్త వెలుగు ప్రాదించడనికి సూచనగా .........

    
                                         ------***--------


 Previous Page

  • WRITERS
    PUBLICATIONS