Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 4


    ఇప్పుడే ఫీల్డులో అడుగుపెట్టేను. ఇంకా నేనెవరో ఎవరికీ తెలియదు. గుంపులో గోవిందా!
    నా ఆలోచనలూ, భయంతో సగం దూరం వచ్చేశాం.
    'భయందేనికి? మద్రాసులో బతకడానికి వచ్చాం. చలపతన్నయ్య తప్పిస్తే మరెవ్వరూ తెలీదు. పెద్దవాళ్ళు నలుగురు కనిపిస్తే అడుగుతాం. ఛాన్స్ వస్తే వచ్చింది. లేదా లేదు. నష్టం ఏం వుంది?" ఎలాగో తెగించి ధైర్యం చేశాను.
    "నమస్కారం సార్!" అన్నాను. సమాధానం లేదు.
    "మిమల్నే సార్!"
    "ఉహూమ్" దమ్ము సౌండ్ మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది.
    "ఎవర్నమ్మాయీ, పిలుస్తున్నావ్?" - అని మాధవపెద్ది అడిగారు.
    "వార్నేనండీ - శ్రీశ్రీ గార్ని"
    "పేరు పెట్టి గట్టిగా పిలువమ్మాయి - ఫరవాలేదు"
    "వారికి చెవుడా అండీ"
    "లేదు - నువ్వు సణుక్కుంటే ఎలా?" - అన్నారు.
    "శ్రీశ్రీగారూ! మిమ్మల్నేసార్! నమస్కారమండీ"
    వెనక్కి తిరిగి "ఆఁ....ఎవరు?" అన్నారు.
    "నేనేనండీ. నా పేరు సరోజ, పాటలు పాడతాను. ఈ మధ్యనే, నాలుగు నెలలైంది ఫీల్డుకివచ్చి, మా చెల్లికూడా పాడుతుంది. డాన్స్ చేస్తుంది"
    సిగరెట్టు దమ్ము శబ్దం తప్ప మరేమీ లేదు.
    నోరు విప్పితే ముత్యాలు రాలిపోతాయా అనుకున్నాను.
    "మాది విజయనగరం - బ్రాహ్మలం. మా నాన్నగారు బి.ఏ., బి.ఇడి. హెడ్మాష్టరండి. మీరు మాకీ ఫీల్డులో - ఏమయినా అవకాశం వుంటే - ఛాన్స్ ఇప్పించండి. నేను బాగా రాస్తానండి. నా చేతి దస్తూరీ బాగుంటుంది. కష్టపడి పనిచేస్తాను. జ్ఞాపకం వుంచుకోండి సార్! తప్పకుండా చూడండి" - అంటూ గుక్కతిప్పకుండా గబగబా అనేశాను.
    అంతవరకూ కుయ్-కుయ్ మనని శ్రీశ్రీగారు "నన్ను పట్టుకుంటే ఏం లాభం అమ్మాయ్! ఏ డైరెక్టర్నో, ప్రొడ్యూసర్నో పట్టుకుంటే లాభం వుంటుంద"న్నారు.
    ఆ మాట వినగానే నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంతసేపూ - వారితో మాట్లాడాలని పడిన ఆవేదన, వారిమీదున్న గౌరవ భక్తులూ - ఒక్కసారి కోపంగా మారిపోయాయి. 'ఇంత చులకనగా మాట్లాడతారేఁవి టీయన' అనుకుంటూ ఉక్రోషంతో. "చూడండి సార్! మిమ్మల్ని అడిగాను, మీకు అవకాశం వుంటే సహాయం చేస్తాననండి. లేకుంటే మానెయ్యండి. అంతేకానీ వీళ్ళనిపట్టుకో, వాళ్ళనిపట్టుకో అంటారేమిటి? మేం పరువుగల వాళ్ళమండి గౌరవమర్యాదలతో బతకాలనుకుంటున్నాం బతుకుతున్నాం కూడా అన్నాను.
    "అయితే - ఈ ఫీల్డుకెందుకొచ్చావు?"
    "బుద్దిలేక మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి సలహాలిస్తారని తెలీక" - అని గట్టిగా అనేసి నోరు మూసేసుకున్నాను.
    ముందుగా మాధవపెద్ది - తర్వాత పిఠాపురం, రాణి, శ్రీశ్రీగారి ప్రక్కన కూర్చున్న మరొక ఆయనా - అంతా దిగిపోయారు.
    డ్రైవరూ, శ్రీశ్రీగారూ, నేనూ, అమ్మా మాత్రం మిగిలిపోయాం.
    మందపల్లిలో - అరుణగిరి మొదలిస్ట్రీట్ లో వున్న 11వ నెంబరింట్లో శ్రీశ్రీ గారు దిగిపోయారు. నేనేమీ మాట్లాడలేదు. అంత ఎబ్బెట్టుగా, ఆడపిల్లనైనా ఆలోచించకుండా నిర్మొహమాటంగా ఆ జవాబేమిటి?
    సరేలే - మళ్ళా ఆయన్ని కలుస్తామా - చూస్తామా? ఎంతయినా వాళ్ళంతా పెద్దవాళ్ళు నక్కపుట్టి నాలుగాదివారాలైనా కాలేదన్నట్టు - మనం సినీ ఫీల్డుకొచ్చి నాలుగు మాసాలైనా కాలేదు.
    కానీలే - ఇదీ ఒకందుకు మంచికే! బహుశా ఫీల్డు అంతా ఇలాగే వుంటుందేమో? మనకేం తెలుసు? ఇదొక పాఠం!.... అని ఆలోచిస్తూ వుంటే.
    "సరోజా? ఇల్లొచ్చేసింది?" అంది మా అమ్మ.
    ఇంట్లో అడుగు పెడుతుండగానే - "ఏవమ్మా? పాట అయిపోయిందా? రికార్డింగ్ ఎలా జరిగింది?" అని నాన్నగారడిగారు.
    జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాను.
    "శ్రీశ్రీ ఎవరనుకున్నావమ్మా! మహాకవి. చాలా గొప్పాయన. అందరితో పోట్లాడ్డమే నీ పని అన్నమాట. అంత కోపం అయితే ఎలా?"
    "కోపంకాకుంటే మరేవిటండీ! డైరెక్టర్నో, ప్రొడ్యూసర్నో పట్టుకొమ్మన్నారు - అది చిన్న మాటేమిటి?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను.
    మా నాన్నగారు ఓదార్చి మందలించారు. మా అమ్మగారికి ఏమీ తెలీదులెండి! ఆవిడ చాలా అమాయకురాలు. 'నువ్వు తెలివైన దానివైవుంటే - నా పిల్లలు ఇంకా బాగుండేవారేమో' అని మా నాన్నగారు అమ్మని హేళన చేసేవారు.
    రాత్రంతా నిద్రపట్టలేదు. శ్రీశ్రీగారు - రికార్డింగ్ - ఆయన అన్నమాటలు......ఇవే నా కళ్ళముందు రీలులా తిరుగుతున్నాయి.
    ఈ సినీఫీల్డు మన తత్వానికీ, టెంపర్ మెంట్ కీ కుదిరేటట్లు కనబడలేదు.  వేరే ఆల్టర్ నేటివ్ ఏమిటి? - అని ఆలోచించడం ప్రారంభించాను. ఆత్మాభిమానం దుడుకుతనం - ఉన్నమాట ఎదురుగుండానే అనెయ్యడం.... ఈ తత్త్వం గల నాలాంటివాళ్ళు ఈ ఫీల్డుకి పనికిరారు. కాబట్టి సినిమా సంగతి మరచిపోదాం అని చివరికి నిశ్చయించుకున్నాను.
    రెండు రోజుల తర్వాత మళ్ళీ చలపతిరావుగారు కబురు చేశారు. వెళ్ళాం. 'ఆఁరా రా ఏమిటి మొన్న కారులో శ్రీశ్రీగారితో పోట్లాడావుట" అని అడిగారు.
    "శ్రీశ్రీగారితో నేను పోట్లాడటమా? ఎవరు చెప్పారు? ఆయనే నన్ను చిన్నబుచ్చారు" అన్నాను.
    "ఏమన్నారేమిటి?"
    జరిగిందంతా చెప్పేశాను. "ఈ ఫీల్డు నాకొద్దన్నయ్యా" అన్నాను. ఆయన చాలా నచ్చజెప్పారు.
    "శ్రీశ్రీగారు అన్నారంటే యదార్ధం లేకపోలేదు. కానీ అందరూ అలాగే వుంటారని అర్ధమా? పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్రపాడుచేసుకోకు. అదీకాకుండా శ్రీశ్రీగారు ఒక అయోమయలోకం తనధ్యాస, తనపని ఏదో తనదేకానీ అధిక ప్రసంగికాదు. నీ మొహం! శ్రీశ్రీగారి గురించి నీకేం తెలుసుగానీ - నీ జాగ్రత్తలో నువ్వంటే ఎవరేమన్నానీకేం" అని ఫీల్డు గురించి చాలా విషయాలు చెప్పి,


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS