Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 5


    "ఎల్లుండి వాహినీలో రికార్డింగ్ వుంది. అమ్మని తీసుకొని మూడు గంటలకి వచ్చేయ్ కారువంపుతానని"ని చెప్పారు.
    సరేనని యింటి కొచ్చేశాను.
    ఇంటి పరిస్థితులు ఆలోచించి చలపతిరావుగారు చెప్పిన మాటలన్నీ బాగా ఒంట భట్టించుకొని - వెంటనే కనిపించే మరో మార్గం లేక నన్ను నేనే సమాధానపరచుకున్నా 'వెళదాంలే' అనుకున్నా.
    అమ్మని తీసుకొని వెళ్ళాను. తీరా వెళ్ళేసరికి - 'రికార్డింగ్ కాదని పిక్చర్ రీరికార్డింగ్ అనీ' తెలిసింది.
    "ఎందుకు అబద్దం ఆడార"ని చలపతిరావుగారి నడిగాను.
    "అలా చెప్పకుంటే నువ్వు రావుగా! అందుకనే, అబద్దం ఆడవలసివచ్చింది. తొందరపడకు, పనిలేక నిన్ను రప్పించలేదు. 'చేతినిండా పనికావాలీ కష్టపడతాను - డబ్బులు బాగా సంపాదించాలని, పనిచూడమని' నా ప్రాణం తీస్తున్నావుకదా! అందుకోసమే రప్పించాను. నాపని ప్రయత్నం వరకే! నీ అదృష్టం ఎలాగుందో చూద్దాం" అన్నారు.
    ఇంజనీరింగ్ రూములోకి తొంగి చూశాను. చాలామంది వున్నారు అందులో శ్రీశ్రీగారు కూడా కనిపించారు.
    నేను లోనికి వెళ్ళలేదు. హాల్లోనే అమ్మతో కూర్చుండిపోయాను. ఒక గంట తర్వాత శ్రీశ్రీ గారిని తీసుకొని చలపతిరావుగారు వచ్చారు.
    "నమస్కారమండి!" - అన్నాను.
    ఎడంచేతిలో సిగరెట్టు, కుడిచేతిలో సెల్యూట్ గాలిలో తేలిపోయాయి.
    చెయ్యెత్తి దించేసి - "ఎవరీ అమ్మాయి" అని అడిగారు.
    ఊపిరాడుతోందా లేదా అని నన్ను నేనే ఒకసారి పరీక్షించుకున్నాను. అయోమయంగా అనిపించింది. బిత్తరపోయాను.
    ఇంతలో చలపతిరావు "ఈమే సరోజ! మొన్న మీ పాటే పాడిందిగా! అవన్నీ మీకెక్కడ జ్ఞాపకం ఉంటాయిలే" అని శ్రీశ్రీగార్ని అక్కడే కూర్చోపెట్టి, నా చేతికి ఒక పేపరు, పెన్ను ఇచ్చి "నీకు తోచినవి రెండు మాటలు రాయి" అన్నారు.
    "దేనికన్నయ్యా!"
    "రాయమ్మా! చెప్పిన పని చెయ్యి" అన్నారు.
    'రుక్మిణీ కళ్యాణం' హరికథలోని వచనం పావుపేజీ రాసి ఇచ్చేశాను.
    అది శ్రీశ్రీగారికి చూపించారు. ఆ పేజీ రెండు మూడుసార్లు అటూ ఇటూ తిప్పి, ఒకసారలా చదివేసి, టక్కున అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయారు. నేనూ, అమ్మ కాఫీ టిఫిన్ చేశాం.
    "ఇంటికి వెళ్ళిపోతాం" అన్నాను.
    కార్లో పంపించేశారు. ఎందుకు వెళ్ళేమో తెలీదు. ఎలా గొచ్చమో తెలీదు. సినిమాలో ప్రయత్నం ఒక్క చలపతిరావుగారి దగ్గర తప్పిస్తే మరెక్కడా లేదు. ఎవరూ తెలీదు. అందుకని కాలం వృధా చెయ్యకూడదని, థియరీ స్పెషలైజ్ చేయటం, వీణ నేర్చుకోవడం ప్ర్రారంభించాను.
    డబ్బు సంపాదించే పని తక్కువ, విశ్రాంతి టైము ఎక్కువా అయిపోయింది. మధ్య మధ్యలో 15-20 రోజులు గ్యాప్ వస్తూ వుండేది.
    ఏది జరిగినా మన మంచికే - అన్న తత్త్వంగల మనిషిని లెండి. అందుకే నిలబడగలిగాను. అప్పుడప్పుడూ సుశీల తనతో రిహార్సల్ కీ, రికార్డింగ్ లకీ నన్ను తీసుకొని వెళుతూ ఉండేది.
    అప్ప్డుఅప్పుడేవిటి -తరచుగానే ఆవిడతో వెళుతూ వుండేదాన్ని, మేం ఇద్దరం చాలా సన్నిహితంగా వుండేవాళ్ళం. ఆవిధంగా సంగీత దర్శకులు విశ్వనాథంగారు, రాజేశ్వరరావుగారు, అశ్వత్దామగారు, పెండ్యాలగారు, వేణుగారు మొదలైన వారిని చూడడం జరిగింది. కానీ పరిచయం పెంచుకోలేదు.
    "పోనీ, వీళ్ళని పాటల్లో వెయ్యమని అడుగుదాం. వెళదాం రావే!" అని మా అమ్మ అనేది.
    "అలాగేలే అమ్మా" - అనే దాన్నే కానీ అడిగిన పాపానపోలేదు.
    రోజులు గడుస్తున్నాయి.
    ఒకరోజు "అమరదీపం" ఆఫీసునుండి కారు వచ్చింది. డ్రైవరొచ్చి చలపతిరావుగారు ఆఫీసులో ఉన్నారమ్మా! మిమ్మల్ని తీసుకొని రమ్మని ప్రొడక్షన్ మేనేజరే పంపించార"ని చెప్పాడు.
    "మొన్న మేం పాడేం. అదేనా?'
    "అవునమ్మా" అన్నాడు.
    "అయిపోయిందిగా" అన్నాను.
    "నాకు తెలీదమ్మా! త్వరగా రమ్మన్నారు. ఆలస్యం అయిపోతోందమ్మా కవిగారిని కూడా తీసుకెళ్ళాల"ని చెప్పాడు.
    "ఎవర్నీ! శ్రీశ్రీ గార్నా!"
    "అవునమ్మా"
    అంతే - ఒక్క పరుగులో తయారైపోయి అమ్మని తీసుకొని కారెక్కాను.
    
                              *    *    *
    
                                         శ్రీశ్రీ దగ్గర మొదటి పరీక్ష
    
    అరుణగారి మొదటి వీధిలో కారు ఆగింది. చాలా రోజుల తర్వాత శ్రీశ్రీగారి ఇల్లు చూడడం.
    ఆరోజు రాత్రి చూశాను. చీకటిలో సరిగ్గా గమనించలేదు. నెంబరు మాత్రం తారుసున్నా మధ్య తెల్ల పెయింటింగ్ తో కొట్టొచ్చినట్టు కనిపించింది. చాలా పాత యిల్లు గమనిస్తూనే వున్నాను. కానీ మనసు అలజడిగా వుంది. ఏవిటో చెప్పలేని గాభరా.
    డ్రైవరు వచ్చేశాడు. "మనం పోదాం పదండమ్మా"
    కవిగారు రావడానికింకా ఆలస్యం అవుతుందిట. "కారువద్దు నేనేవచ్చేస్తాలే" అని చెప్పేశారట.
    "అమ్మయ్యా" అనుకున్నా రిలీఫ్ గా!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS