కానీ, ఇటు సంగమేశ్వరరావు నన్ను బ్రతకనిచ్చేలా లేడు. బొత్తిగా నన్ను తినేస్తున్నాడు. తరచూ మా యింటికొచ్చి అతనుద్యోగ విషయమెంతవరకు వచ్చిందో కనుక్కు వెళుతున్నాడు. మధ్య మధ్య పశుపతిగారి ప్రయాణాలూ, వారితీరుబడి వైనాలూ, యివన్నీ హెచ్చరించడం గూడా చేస్తున్నాడు.
ఒకనాడు పార్కులో వెంకట్రావే కనిపించేడు. కనిపించినవాడు క్షేమసమాచారాలు మాని 'నిందలు' వేయడం ప్ర్రారంభించేడు.
"అవున్లేవోయ్, మేం నీకిప్పుడు ఏం కనిపిస్తాం? పెద్ద వాడివి. అదికాదు గురూ! నీ అదృష్టం పండి, నువ్వు పెద్దవాడి వయ్యావంటే మేమంతా సంతోషిస్తున్నాం. బాగుంది. కాని అంతమాత్రం చేత మన స్నేహితాన్ని మరిచిపోతే ఏం బాగుంటుంది చెప్పు?" అన్నాడు వెంకట్రావు.
అపరాధిలా తలెత్తకుండానే అన్నాను.
"నన్నేం చేయమంటావో చెప్పు వెంకట్రావూ?"
"కుర్రముండా వాడు కాలికి బలపం కట్టుకుని రోజూ మీ యింటికి వొస్తూ పోవడం తప్పించి నువొక్కనాడైనా ఆ పశుపతిగార్ని కలుసుకున్నావా? ఉద్యోగం యివ్వడం, మానడం తర్వాత విషయం. ఇప్పటికొచ్చి నువ్వాయన్ని కలుసుకోలేదంటే నా తల కొట్టేసినంత పనవుతోంది. మావాడేమో నామీదా, మన స్నేహం మీదా కొండంత ఆశపెట్టుకున్నాడాయిరి. అబ్బే ఇదేం బాగోలేదు గురూ! నువ్వేమైనా అనుకో అంతే!" అన్నాడు బాధగా.
నేనెందుచేత ఆ పశుపతిగార్ని కలుసుకోలేకపోతున్నానో కారణం వెంకట్రావుకి, చెబ్దామనిపించింది. అది చెప్పి అతన్ని వొప్పించే దానికంటే, అభిమానం చంపుకుని, పశుపతిగార్నే కలుసుకుందామనే నిర్ణయానికొచ్చేను.
నాటినుంచి నాలుగురోజులు నిద్రమానుకుని రచనలో కూచున్నాను. అయిదో నాటి సాయంత్రం నాటకాన్ని తయారుచేసి స్క్రిప్ట్ చేతపట్టుకుని పశుపతిగారింటికి వెళ్ళేను.
పశుపతి గారి జ్యేష్టుడు బజారువేపు వెడుతున్నాడు కాబోలు. కారు తాళం చెవిని (ఇగ్నీషన్ కీ) సరదాగా వూపుకుంటూ యెదురయ్యేడు. అతను భారీ యెత్తు మనిషి రెవటలా గాలి కెగిరిపోయే అవతారం! నెత్తిమీద అరంగుళం మేర వెంట్రుకలు కత్తిరింపబడి వుంటాయి. ఎల్లప్పుడూ బాగా యిరుకైన పంట్లాములు ధరిస్తాడు. చొక్కా అనబడని యేదో వొస్తు విశేషాన్ని చొక్కాగా వేసుకుంటాడు. అంతెత్తు మనిషి గాల్లో యెగిరిపోతున్నట్టు నడుస్తూంటే నాక్కొంచెం కంటగింపుగా ఉంటుంది.
అప్పుడతని నెత్తిమీద ఒక పూలు టోపీ గూడా వున్నది. ఈ రకమైన టోపీలకీరోజుల్లో పరపతి పెరిగిపోతోంది. ఆ టోపీతో, ఆ నడకతో అతన్నాకు యెదురైనప్పుడు ఒక 'కొంగ' నేలమీద నడుస్తున్న భ్రాంతి కలిగింది.
ఆ కొంగ నన్ను విష్ చేసి చేయికలిపి యింగ్లీషులో నా క్షేమాన్నడిగింది. వాళ్ళ డాడీ కోసం వచ్చేనని ఇంగ్లీషు లోనే చాలా డాబుసరిగా చెప్పప్రయత్నించేను గానీ, కుదిరి చావలేదు. లోపలున్నారని చెప్పి కారు దగ్గరికి ఎగిరెళ్ళి పోయిందా కొంగ.
లోపలికి వెళ్ళేను. పశుపతి గారింకా నిద్రలేవని కారణంగా కాసేపా వరండాలోనే కూర్చోవలసి వచ్చింది. కూర్చుని నా రచనలోని సొగసుని అక్కడక్కడా గమనించడం ప్రారంభించేను. డాబా మీద గదుల్లో ముందేదో శబ్దమయింది. వెనువెంటనే 'ధా... ధిక్.... దైదిక్... ధక్ దక'లూ మగ గొంతునుంచి వినవచ్చేయి. ఆ పదాల కనుగుణంగా పాదతాకిడి వినిపించింది. ఈ తతంగం యావత్తూ నా నెత్తిమీదనే జరుగుతున్నది. కాసేపట్లోనే నాకు చిరాకు వేసింది.
నాట్యమనేది లలితకళల్లో ఒకటని నేనొప్పుకుంటాను. ఎందుచేతనోగాని నేనెంత ప్రయత్నం చేసినా శాస్త్రీయ నాట్యంలోని ఔన్నత్యాన్ని వెతుక్కోలేకపోతున్నాను. ఇది కేవలం నాతప్పన్నా నేనొప్పుకునేందుకు సిద్దమే.
నా నెత్తిమీద నాట్యంజోరుగా సాగుతూన్న వేళకి పశుపతిగార్రావడం జరిగింది. లేచి నించున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత నేనూ కూర్చున్నాను. ఆయనొక్కడే సిగరెట్టు ముట్టించిఅన్నాడు.
"మీర్నాకు కనిపించి రెండు నెలలు దాటిందనుకుంటాను."
"అవునండి, ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేక బయటకి రాలేకపోయేను"
"ఈ సంవత్సరం ధరల్లాగా ఎండలెంతమండిపోయేయో గమనించేరా?"
"అగ్ని ప్రమాదాలు అవీ గూడా ఈ సంవత్సరం ఎక్కువే."
"అవునండి. బాగా ఎక్కువే?"
"ఏమిటో కలికాలం యావత్తూ యిలా తగలబడి పోతోంది."
"అవునండి."
ఈ తడవ వంతపాడట మిష్టం లేకపోయింది. ఆయన వరస చూస్తూంటే నా నాటకం విషయం మరిచిపోయినట్టనిపిస్తోంది. లేకపోతే వారింత న్యాయంగా మాటాడేవారు కానే కాదు. అందుచేత నాకై నేనే నాటకోదంతాన్ని ప్ర్రారంభించేను.
"మీరు చెప్పినట్టు నాటకం రాసేను. కానైతే నెలరోజులు కాలాన్ని రెండునెలల వరకూ పొడిగించేను. క్షమించాలి. పోతే ఈ నాటకాన్ని బాగా రాయగలిగేనన్న ధైర్యముంది. ఓ మాటు మీరు గూడా చదువుతే."
"ఐతే, నాటకం పూర్తయిందన్నమాట. ఏమిటోనండి ఈ మధ్య తీరుబడి చిక్కక చాలా సరదాలు చంపేసుకుంటున్నాను. చూద్దాం. నాటకమిచ్చి వెళ్ళండి." అన్నాడాయన చప్పగా, చేదుగా.
పుస్తకమిచ్చి చేతులు దులుపుకున్నాను. మెల్లిగా అసలు విషయంలోకి సంభాషణ మార్చేను.
"నాకో ఫ్రెండున్నాడు. చాలా మంచివాడు."
"పేరేమిటన్నారు?"
"సంగమేశ్వర్రావని చెప్పి బి.ఏ. పాసైయ్యాడు"
"ఏం చేస్తున్నాడన్నారు?"
"ఆ విషయం మాటాడేందుకే వచ్చేను. అతను ప్రస్తుతం నిరుద్యోగి. మంచివాడూ, తెలివైన వాడూను.
"ఐసీ"
"మీ కంపెనీలో యేదైనా ఖాళీ వుంటే అతనికో ఛాన్స్ యిస్తారేమో యెప్పటికప్పుడు అడుగుదామనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చేను."
"చెప్పారు కాదే! బలేవారే మీరు మీకంత మొహమాటం పనికిరాదు సుమండీ"
