Previous Page
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 38

    "ఓ ప్రాకృతిక  సత్యమా...
    ఓ జీవ పరిణామ పర్యవరణమా...
    ఓ మానవ నిర్మిత కణసముదాయమా.... నీకు మా జోహార్లు!
    మాకు జన్మ నిచ్చినందుకు ధన్యవాదాలు!
    అమ్మలేని మాకు, నాన్న తెలియని మాకు
    అమ్మనూ, నాన్ననూ చేకూర్చిన మీకు ప్రణామాలు!
    వాళ్ళతోపాటు నిరంతరం,
    మానవజీవినే కాక ప్రతి ప్రాణినీ,
    ప్రతి దృశ్యాన్నీ, అదృశ్య విశ్వాన్నీ
    ప్రేమించే గుణం సదా ఉంచమనీ,
    ధరణీ జన్ములమయి మేము ప్రేమరహితులమై
    దరిద్రులుగా మారకుండా ఉంచమని ప్రార్థన..!"
    -ఏక కంఠంతో చిన్నారులందరూ స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో ప్రార్థన ముగించి, వంగి నమస్కరించి వరుసగా రూమ్స్ లోకి సాగిపోయారు.
    గేటు తెరవబడింది. అందరూ లోపలికి నడుస్తున్నారు. దూరంగా ఎంతో ఎత్తున ఉన్న వేదికపై తమ స్నేహితులు- ఆకాశం నుండి అలవోకగా దిగిన రాజహంసల్లాగా, గాలికి కాలాన్ని జయించిన విజేతల్లా ఉన్నారు.
    అడుగులో అడుగుగా వాళ్ళవైపు నడుస్తున్నారు.
    అన్ని జంటలూ లవాయిపోయి, ఆకారాలు మారిపోయి ఉండటాన చూడగానే ఓ  క్షణం తటపటాయించి, ఆ తర్వాత ఆతృతగా దగ్గరికి వచ్చి-
    "హాయ్ఁ.... ఈష్, క్రాంత్, ఆనంద్!!" అంటూ రేవంత్,
    "స్ఫూర్తీ..., రేవూ..., కామీ..!" అంటూ జ్ఞాపిక-
    వడివడిగా చుట్ట చుట్టేసుకున్నారు. అందరి కళ్ళల్లోనూ ఉద్వేగంతో నీళ్లు తిరిగాయి. పిల్లలు దూరంగా నిలబడి వీళ్ళవైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంతో పెద్దవాళ్ళయిపోయారనుకున్న తమ తల్లిదండ్రులు ఎల్. కె.జి. పిల్లల్లాగా అలా ఎమోషనల్  అయిపోవడాన్ని చూడడం అదే మొదటిసారి!
    "నిజమా...! మీరేనా....మిమ్మల్ని మేము చూడగలుగుతున్నామా?" జ్ఞాపిక గొంతు పెగల్చుకుంది.
    "అవును జ్ఞాపీ...మేమే! మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేశాం!" రేవతి ఇంచుమించుగా ఆనందంతో ఏడ్చేస్తూ అంది.
    రేవంత్ కు  మాటలు రావడం లేదు. మగవాళ్ళంతా ఒకరి చేతులు ఒకరు బిగించి పట్టుకున్నారు.
    "హలోవ్ఁ.... మేము కూడా ఉన్నాం ఇక్కడ!" అంటూ పిల్లలందరూ కోరస్ గా అరవడంతో అందరూ వెనక్కి తిరిగారు.
    "వీళ్ళూ..." ఆగిపోయాడు రేవంత్.
    "మా పిల్లలు రేవంత్! మేమే కన్నాం! కదూ ఆనంద్...?!" రేవతి కళ్ళు తుడిచేసుకుని నవ్వుతూ చెప్పి, ఎవిడెన్స్ కోసం ఆనంద్ వైపు చూసింది. ఆనంద్ నిలువుగా తలూపాడు... ఖచ్చితంగా మేమే నన్నట్లు!
    ఎవరి పిల్లలు ఎవరో పరిచయం చేసుకున్నారు.
    "అమ్మెలా ఉంది?" రేవంత్.
    "బావుంది..! ఈష్.
    "డాడీ...?" జ్ఞాపిక.
    "బావున్నారు...!" అమ్మాయిల సమాధానం.
    "చాలా తరచుగా కలుస్తుంటాం! వాళ్ళు బావుండాలానే మీ అభీష్టం వాళ్ళకు తెలుసు!" క్రాంత్.
    రేవంత్, జ్ఞాపిక కళ్ళల్లో వెన్నెల లాంటి ఆనందం ప్రభవించింది.
    "పదండి లోపలికి!" రేవంత్ అందర్నీ ఆహ్వానిస్తూ ఇంట్లోకి నడిచాడు.
    ముందుగా పెద్దవాళ్ళు, వాళ్ళను అనుసరిస్తూ పిల్లలూ లోపలికి వెళ్లారు. పిల్లల్ని చనువు చేసుకున్నారు. అందరూ కలిసి భోజనాలు ఏర్పాటుచేసుకున్నారు.
    భోంచేసేటప్పుడు బోసిగా ఉన్న జ్ఞాపిక మెడను చూస్తూ-
    "మీరిద్దరూ... పెళ్ళి..." అంటూ ఆగిపోయింది రేవతి.
    "ఉహూఁ..." జ్ఞాపిక అడ్డంగా తలూపింది.
    "మరి- పిల్లలు ప్రార్థనలో మిమ్మల్ని అమ్మానాన్నలుగా సంబోధించారుగా?!" స్ఫూర్తి అడిగింది.
    "మీరు పెళ్ళి చేసుకుని, వైవాహిక జీవితం గడిపి తల్లిదండ్రుయ్యారు. మాకా కష్టాలు లేకుండా ఇంత మందికి అమ్మానాన్నలమయ్యాం!" అన్నాడు రేవంత్.
    ఆ మాటలు అంటున్నప్పుడు ముఖంలోకి పాకిన ఏదో మాటలకందని భావం వింత వెలుగును తెచ్చింది.
    "అదేంట్రా....మరి, మీ ప్రేమ?" ఈష్.
    "ఏం....ప్రేమించుకుంటే పెళ్ళి చేసుకుని, శారీరకంగా ఏకమయి పిల్లల్ని కనితీరాలా? విడివిడిగా ఉండలేం, పెళ్ళి చేసుకోలేం. కనుక కలిసి ఉన్నాం ఒకేచోట, ఒకే ఆశయంతో! ఇంతమంది పిల్లలకు అమ్మానాన్నలం అయ్యాం!" అంది జ్ఞాపిక.
    "ఇప్పటికీ విద్యార్థి దశలోని ఆవేశం పోలేదిద్దరికీ!" క్రాంత్ అన్నాడు.
    "ఎలా పోతుంది.... మేం ఆ దశలోనే జీవితాలను ఆపేసుకున్నాక?!" రేవంత్ అన్నాడు.
    "సంతోషంగా ఉన్నారా?" ఆనంద్ అడిగాడు.
    "ఎందుకు లేమూ? మీరెలా  జీవితమూ , పిల్లలూ, వారి భవిష్యత్తూ అని ఆలోచిస్తూ, వారికోసం పాటుపడుతూ ఆనందంగా ఉన్నారో...మేమూ అంతే! ఈ పిల్లల భవిష్యత్తే మా జీవితమూ.... సింపుల్!"రేవంత్ భుజాలెగరేశాడు ఈజీగా.
    "శారీరక వాంఛల్లేని సాధువులైపోయారా?' అన్నాడు ఈష్.
    "ప్రాణాలు పోయిన స్థితిని శరీరం అనుభవించాక తక్కిన వాంఛలన్నీ అల్పమయిపోయాయి. మేము ఒకరికోసం ఒకరం ప్రాణాలతో ఉండడమే మా లక్ష్యం. ఆ తర్వాతివన్నీ అంత ముఖ్యమైనవిగా అనిపించలేదు...!" రేవంత్ అన్నాడు.
    "మరి, మీ ప్రేమ...? దానికర్థం లేదా..? అడిగింది కామిని.
    "ఎందుకు లేదు? మా ఇద్దరి మధ్యే  ఉన్నదల్లా వీళ్ళందరి వరకూ వ్యాపించింది" చెప్పింది జ్ఞాపిక.
   "థియరీ బావుంది. కానీ...." స్ఫూర్తి.
    "ప్రాక్టికల్ గా కూడా బావుంది. ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఉన్నంతవరకూ అతి సంకుచితత్వంగా ఉంటుంది. అది విశ్వవ్యాప్తమయినప్పుడు ఎంతమందికైనా పంచి పెట్టగలిగే అక్షయపాత్ర అవుతుంది. ఈ పిల్లలందరూ మా హృదయపు పాత్రల్లో పుట్టిన ప్రేమ చిహ్నాలే! వీళ్ళున్నంత వరకూ.... అంటే- అనాధత్వం ఉన్నంతవరకూ మాలాంటి పెళ్ళికాని, చేసుకోలేని, చేసుకోవాల్సిన అవసరం రాని అమ్మానాన్నల అవసరం ప్రపంచానికి ఉంది. ప్రేమించుకుని పెళ్ళి చేసుకోలేని పరిస్థితులు ఎవరికి కలిగినా- వాళ్ళు అమ్మానాన్నలవడానికి అనాధత్వం ఓ వరం!" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
    ప్రేమకు వాళ్ళు చెబుతున్న నిర్వచనం ఇంతవరకూ ఎవరూ చెప్పనిది! ఎవరూ ఆచరించనిది...., అసలు ఎవరి ఊహకూ రానిది!!
    ఎవరంటారు- ప్రేమకు పెళ్ళి, శారీరకం బంధం గమ్యం అని! ప్రేమకు గమ్యం.... మానసిక పరిపక్వత! ప్రేమంటే కేవలం...
    'నన్ను-నీవు...నిన్ను-నేను' అనే భావంలోంచి
    'మనం ....అందర్నీ' అనే భావనగా మారడమే!
    ప్రేమ ఫలించడం అంటే హృదయంలోంచి దాన్ని విశ్వంలోకి వ్యాపింపజేయడం!
    హృదయంలో పుట్టే ఆ రెండక్షరాలు విశ్వవ్యాప్తం చెయ్యగలిగిన  నాడే... అది పరిపూర్ణం! పరిశుద్ధం! పరిపక్వం! పరమాత్మకం! పరమోదకం!
    ఓం....
    హృదయశ్శాంతిః
    మేధఃశ్శాంతిః
    దేహార్తి శ్శాంతిః
                                                                    (శుభం)   


 Previous Page

WRITERS
PUBLICATIONS