"య్యా...!!" జ్ఞాపికనలా డాడీ ఒడిలోకి వదిలేసి, ఎగిరి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాడు.
అందర్నీ దగ్గరకు అదుముకుని, "జ్ఞాపీ బ్రతికేవుందీ...!" పిచ్చిగా అరిచాడు.
ఫ్రెండ్సందరూ జ్ఞాపిక వైపు ఆశ్చర్యంగా, రేవంత్ వైపు పిచ్చిగా చూశారు.
డాడీ పల్స్ పట్టుకుని విస్తుపోయారు- "ఇదెలా సాధ్యం! నిజమా...?!" అని కూతుర్ని కదిపారు మెల్లగా!
"జ్ఞాపీ! ఇదుగో- స్ఫూర్తీ, ఇదుగో- కామినీ, రేవతీ, ఆనంద్, క్రాంత్, ఈష్. నేనూ, నువ్వూ, మనమంతా ఒకటి...చూడూ! లే...చూడూ! మనందరం కలిసి సాధించిన విజయం చూడు! మన ఓడిపోలేదు చూడూ!" డాడీ ఒళ్ళోంఛి జ్ఞాపికను లాక్కుని తట్టిలేపాడు.
రేవంత్ కు పిచ్చెక్కిందనుకున్నారు.
;అబ్ నార్మల్ బిహేవియర్...' అనుకున్నారు. 'ఇక అతనిని కూడా పోగొట్టుకొబోతున్నాం...' అని తెలిసిపోయి, రేవంత్ ను జ్ఞాపిక భౌతికకాయం నుండి విడదీయడానికి దగ్గరగా వచ్చి- రేవంత్ ను భుజాలు పట్టుకుని జ్ఞాపిక వైపు చూశారు!
అప్పుడు మెల్లగా విప్పింది జ్ఞాపిక....కళ్ళు!
నీరసంగా అందరివైపూ చూసింది!
ఆత్మబలంతో కళ్ళు మెరుస్తుండగా... చుట్టూ గుమిగూడి రేవంత్ గుండెలమీద ఉన్న తనకు, రేవంత్ కు అండగా నిలబడ్డ తన ఫ్రెండ్స్..., తన జనరేషన్, యంగ్ జనరేషన్ వైపు ఆశగా చూసింది.
అందరూ "యాహూఁ..!" అని అరిచారు.
తనూ మెత్తగా, అతిమెత్తగా.... "యాహూఁ..!" అంది బొటనవేలు ఎత్తి- నూతన జన్మ ఎత్తిన విజయంగా!
తన కూతురు చనిపోయిందనుకున్న శరత్ గారికి జ్ఞాపికలో ప్రాణపు కదలిక నమ్మాలనిపించలా! అబద్దం....! తను మోసపోతున్నారనుకున్నారు! చనిపోయేముందు తన కూతురు కళ్ళలో తను తుదివీడ్కోలు చూశారు! తన కూతురిగా హనీ ఆ వీడ్కోలుతోనే అంతమయింది! మరి, ఈ కదిలిక ఎవరిది? రేవంత్ బ్రతికించుకున్న ఆ జ్ఞాపిక కొత్తగా కనిపించసాగింది.
ఆ జ్ఞాపిక తన హనీ కాదు!
తన హనీ కళ్ళు తనను ముందుగా వెతికేవి!
తన హనీ తనకై చేతులు చాచేది!
తన గారాలపట్టి హనీ కాదు! కొత్త హనీ!
ఆ జ్ఞాపిక తను జన్మనిచ్చిన పాపాయి కాదు. ఆ పాపాయి చనిపోయింది!
ఈ అమ్మాయి రేవంత్ ప్రాణం పోసుకున్న కొత్త అమ్మాయి!
ఆ అమ్మాయి కళ్ళు అందుకే రేవంత్ కై వెతికాయి..., ఆ అమ్మాయి చేతులు రేవంత్ ను అలుముకున్నాయి!
ఆ అమ్మాయి తన సొంతం కాదు..., రేవంత్ సొంతం!
ఆమె ప్రాణం, జీవం.... రేవంత్ గుండెల్లోని ప్రేమనూ, ఆక్సిజన్ నూ నింపుకుని జన్మ పొందింది! ఆ అమ్మాయి రేవంత్ కు చెందినదే అయితీరాలి.... అనిపించసాగింది! తనకు 'పరాయి బిడ్డ' గా తోచింది. అందుకే ఆమెను రేవంత్ కు వదిలేసి నెమ్మదిగా వెళ్లి సుహాసిని పక్కన నిలుచున్నారు శరత్ గారు పరిపూర్ణమయి!
జ్ఞాపికను పట్టుకుని గుండెల కదుముకున్న రేవంత్ నూ, అతని హృదయానికి అతుక్కుపోయి ఊపిరిపోసుకున్న జ్ఞాపికనూ చూస్తుంటే...సుహాసిని కేదో కొత్తర్థం స్ఫురించింది. తనిన్నాళ్లూ చదివిన పుస్తకాలు సారమంతా ఆమెకేదో నూతన సిద్దాంతాన్ని మెదడులో ఆవిష్కరింపచేసింది. అప్పుడే సూర్యోదయాన్ని చూసినట్టు హృదయానికేదో కొత్తవెలుతురు సోకింది.
ఇన్నాళ్లూ తనెంత గుడ్డిగా, మానసిక మాంద్యంతో వ్యవహరించిందో తెలిసి సిగ్గేసింది! తన ఆలోచనలూ, తన జీవితం తవ్వి అర్థంచేసుకున్నా దాంట్లో వెయ్యోవంతు కూడా ఆ పిల్లల మనస్తత్వాన్నీ. వారి హృదయాంతరాళాల్లోని ఘర్షణనూ తాను అంచనా వేయలేక పోయానని తనమీద తనకే కోపం, కినుక, కొంచెం అసహ్యం కూడా కలిగాయి! రేవంత్.... తన గుండెల మీద ఆడుకున్న రేవంత్... తన హృదయం గురించీ, జీవితం గురించీ ఆరాటపడి తనకు వైవాహిక జీవితాన్నివ్వాలన్న తన చిన్నారి బిట్టూ- తనకోసం జీవితం వదులుకోవాలని తీసుకున్న నిర్ణయం స్ఫూరించి ఒళ్ళు గగుర్పొడిచింది. పసికన్నులతో "మమ్మా..." అంటూ తనచుట్టూ కూనలా తిరిగిన జ్ఞాపిక గుండెలో లావా మరిగించుకుందని తెలిసి, ఆ లావాలో నవ్వులు పూయించి మరణించిందని అంచనా వేసిన గుండె లావా మరిగించుకుందని తెలిసి, ఆ లావాలో నవ్వులు పూయించి మరణించిందని అంచనా వేసిన గుండె అదిరిపడింది. దరి చేరిన శరత్ చేతిని బలంగా పట్టుకుని-
"పిల్లలు మనకోసం మృత్యువును ఆహ్వానించుకున్నారు!" అంది కళ్ళనీళ్లు అతని భుజంపై జారుతుంటే.
"వాళ్ళు పిల్లలు కాదు! మన తల్లిదండ్రులు!" శరత్ గొంతు బొంగురుపోయింది.
"ఏం చేద్దాం...?!"
"నా హనీ చనిపోయింది! రేవంత్ జ్ఞాపీ గా బ్రతికించుకున్నాడు. ఏం చెయ్యాలన్నది అతనే నిర్ణయించుకోగలడు. ఆ నిర్ణయాధికారం నాకు లేదు. అది సమ్మతమా, అసమ్మతమా చెప్పే హక్కూ లేదు."
"నా బిట్టూ నన్ను మించి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఉన్నతుడయ్యాడు. అతని ముందు పసిపిల్లనైపోతున్నాను."
"అయితే...మనమిక్కడ ఉండడమిక వ్యర్థం! తరానికి తరం తోడుంది. ఆ తరమే ఆ తరానికి తీర్పు చెబుతుంది. మనం ఆ తీర్పును ఆమోదించి, ఆశీర్వదించగలిగే స్థాయికి ఎదిగితీరాలి! అప్పుడే మన స్థానానికి గౌరవం! ముందు తరం వాళ్ళం కనుక వెనుకకు మరలడం మంచిదేమో!" మెల్లగా ఇద్దరూ జంటగా కదిలి ఎయిర్ పోర్ట్ దాటి వెళ్లిపోయారు.
జ్ఞాపిక బ్రతికిందనే ఆనందంలో ఫ్రెండ్సేవ్వరూ వాళ్ళు వెళ్ళిపోయినా సంగతి గమనించలేదు. జ్ఞాపికను, రేవంత్ నూ చుట్టిముట్టి ఒకరిపైఒకరు చేతులు వేసి కళ్ళతోనే ఆనందతాండవం చెయ్యసాగారు.
ఇక్కడ మృత్యువును తిరగ్గొట్టింది డబ్బుకాదు! టెక్నాలజీ కాదు..., ప్రేమ! నూతన సిద్దాంతం! ఇదే మృత్యువును తరిమికొట్టి, శరీరాన్నీ, హృదాయన్నీ తట్టి ఊపిరిపోసింది. ఒకరికొకరు... అంతే! ఒకరికోసం ఒకరు... అంతే! అదే భావన బ్రతుకునిచ్చింది. అదే భావన బ్రతకనిస్తుంది!
జ్ఞాపికను మెల్లగా లేపి షోల్డర్స్ పట్టుకుని నిలబెట్టాడు రేవంత్.
తూలి పడబోయిన జ్ఞాపికను అడుగడుగూ వేయిస్తూ పదిలంగా నడిపించు కెళ్లసాగాడు... ఎత్తుకునేందుకు తనకూ శక్తి లేక!
ఒకరికొకరు ఊతగా...'ఏ సిద్దాంతాలూ వద్దు, ఏ ప్రవచనాలూ వద్దు, ఏ సంస్కృతులూ తవ్వద్దు, ఏ సమాజానికీ వెరవద్దు. ప్రకృతిలో సహజత్వంలా, సృష్టిలో ఆకర్షణగా, ఒకరికి ఒకరు బలంగా, శక్తిగా, ప్రాణంగా బ్రతికితే చాలు...' అనిపించేంత బలహీనంగా కనిపించారు.
వెనుకా ముందూ ఫ్రెండ్స్ జంటలుగా, తోడులుగా, నీడలుగా, బాటలుగా, బాసలుగా, భరోసాలుగా, భావితరాలుగా, అంతరాలుగా....నడుస్తూ నడుస్తూ గమ్యానికి అతిదగ్గరగా వారిని చేర్చి కోటగోడలై నిలిచారు.
* * *
ఎయిర్ పోర్ట్ లో రేవంత్, జ్ఞాపిక 'టాటా' చెబుతున్నారు.
ఫ్రెండ్స్, అమ్మా, నాన్న.... జాగ్రత్తలతో వీడ్కోలు పలుకుతున్నారు.
నాన్న - అమ్మ చుట్టూ చేతులతో కమ్ముకుని ఇద్దరూ కలిసి చేతులు ఊపుతున్నారు.
ప్రెండ్సందరూ కట్టగా నిలబడి 'టాటా' చెబుతున్నారు!
ప్లైట్ స్టార్ట్ అయ్యేవరకూ అలా చేతులు ఊపుతూనే ఉన్నారు...., అలా ఊపుతూనే ఉన్నారు.
ప్రేమ-మనిషిని కాక, మనిషి-ప్రేమను జయించిన జెండాల్లా ....వాళ్ళ అరచేతులు ధీటుగా అలా ఊగుతూనే ఉన్నాయిదిగ్విజయంగా, ఆనందంగా....ఎంతోసేపు!
* * *
'లిటిల్ ఫ్లవర్స్' అనే నేమ్ ప్లేట్ ఆగి చుట్టూ చూశారు నాలుగు జంటలు- ఎనిమిది మందిపిల్లలలతో!
"అమ్మా...ఇదేనా మీ ఫ్రెండ్స్ ప్రేమనిలయం?" పిల్లల్లోంచి బొద్దుగా ఉన్న పాప అడిగింది.
తలూపింది రేవతి.
ఆనంద్ కళ్ళద్దాలు సర్దుకుని ఈష్, క్రాంత్ ల వైపు చూశాడు.
గేటులోంచి విశాలమైన ఆవరణలో చిన్నపిల్లలు తెల్లని వస్త్రాల్లో గ్రూపులుగా విభజించబడి ఆటలు ఆడుకుంటున్నారు. వాళ్ళను గమనిస్తూ టీచర్స్ తిరుగుతున్నారు.
సడన్ విజిల్స్ వినబడడంతో పిల్లలందరూ ఎవరూ చెప్పకుండానే వచ్చి వరుసగా నిలబడి చేతులు కట్టుకుని అక్కడున్న వేదికవైపు నిశ్శబ్ధంగా చూస్తున్నారు.
అన్ని దేశాల పిల్లలూ ఉన్నారు. వాళ్ళ చర్మం నలుపు, తెలుపు, గోశుమ రంగుల్లో కాంతివంతంగా కనిపిస్తూ- అన్ని రంగుల మానవ కూనలను ఒకేచోట చూడడం వింతగా అనిపించింది.
"నాన్నగారూ.... ఇది చిన్ని భూగోళం లాగా ఉంది. అన్ని ప్రాంతాల పిల్లలూ ఉన్నారు" పదేళ్ల బాబు వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని అన్నాడు.
"అవును" అన్నాడు క్రాంత్. స్ఫూర్తి నవ్వింది.
"అమ్మా! ఇక్కడ బావుంది. మేం కూడా ఇక్కడే ఉంటాం!" ఐదేళ్ల పాప అమ్మ చెయ్యిలాగుతూ అంది.
"మేమూ ఇక్కడే!" అని నవ్వింది కామిని.
గేటులోంచి దూరంగా జరిగేది కనబడుతోంది-
తెల్లటి పైజమా, లాల్చీపై గులాబీ రంగు చుక్కలున్న తెల్లని చున్నీలో ముందుగా జ్ఞాపిక, వెనుక తెల్లని పైజమా, లాల్చీలో రేవంత్ డయాస్ మీదకు వచ్చారు. అందరూ రెండుచేతులూ జోడించారు. రేవంత్, జ్ఞాపిక కూడా రెండుచేతులూ జోడించారు.
