Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 37


    
    విశ్వంలో అలా ఇవి చిన్న బంతుల్లాగ వేలాడుతుంటాయి. ఇవన్నీ ఊహిస్తే మనిషి ఎంత అల్పజీవో తెలుస్తుంది. కానీ మనకెన్ని ఆశలు? ఇవన్నీ తలుచుకుంటే ఎంత నవ్వొస్తుందో?"
    
    ఆమె మౌనంగా వింటోంది.    

    "అప్పుడప్పుడూ తెల్లవారుజామున మూడు గంటలకి ఇక్కడికి వస్తుంటాను. ఆకాశంలో దేదీప్యమానంగా శుక్రుడు వెలిగిపోతుంటాడు. మీ భార్యా భర్తలిద్దరు- ఎప్పుడైనా మూడుగంటలప్పుడు శుక్రుడ్ని చూశారా? పడకతిన్తి అనుభవం తరువాత అలిసిపోయి అలా డాబా మీదకు వస్తే తూర్పు ఆకాశంలో కర్పూరపు హారతిలా శుక్రుడు కనిపిస్తాడు.
    
    తను అన్న చిలిపి మాటవల్లో, శుక్రుడి కాంతి ప్రతిఫలించడంవల్లో తన భార్య బుగ్గ అంత ఎరుపు తిరిగిందో తెలియక భర్త గింజుకుపోవడం, తన భర్త కళ్ళలో వచ్చిన మెరుపు అంతకు ముందు అనుభవంవల్లో, శుక్రుడు ప్రతిబింబించడం వల్లో అర్ధంగాక భార్య తన్మయత్వంతో చూడడం గొప్పగా వుంటుంది. ఏమంటారు?" అన్నాడు వసంత్.
    
    తామిద్దరూ ఎప్పుడూ అలా శుక్రుడ్ని చూడలేదు. తొమ్మిది గంటల పైన జగదీష్ మేల్కొనడం అరుదు.
    
    బెడ్ రూమ్ లో ఆ అనుభవం తరువాత అతను నిద్రపోతాడు. దేనికీ ముందూ వెనకా వుండవు అతనికి. ఏ అనుభవాన్నైనా ఎక్కడికక్కడ తెగగొట్టేసుకుంటాడు. సెక్స్ లో అయినా అంతే. ఆ అయిదు నిముషాల తరువాత ఠక్కున అటు తిరిగి పడుకుండిపోతాడు.
    
    ఆమె అలా కాదు ఆ తరువాత సమయం అంతా కూడా వుట్టిగా వున్నా దాని కొనసాగింపులా ఫీల్ అవ్వాలని వుంది. ఆ అనుభవం తాలూకు మైమరుపు తన శరీరం నుంచి వదిలిపోనట్లు అలా వుండిపోతుంది.
    
    ఒంటరిగా వంటగదిలోకి వెళ్ళి కాఫీ కాచుకుని వరండాలో వచ్చి కూర్చుంటుంది. కాఫీ కొద్ది కొద్దిగా తాగుతూ ఆ అనుభవంలోని మాధుర్యాన్నంత మనసులో తనకు తఃనే అడ్డుకుంటున్నట్లు ఆలోచిస్తుంది. ఏవేవో చిలిపిగా ఊహించుకుంటుంది. తాత్వికతను కూడా కాస్తంత అద్దడానికి ప్రయత్నిస్తుంది.
    
    రేపు రాత్రికి ఎలాగైనా సరే శుక్రున్ని చూడాలని బలంగా నిర్ణయించుకుంది.
    
    బొరుగులు అయిపోయాయి ఏదో ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరికినట్లు "మరి నేవస్తాను. వెళ్ళి భోజనం చేయి. లాభంలో మొదట నాకు ఖర్చు పెట్టేశారు కదా. ఇక వెళ్ళి ఏదైనా తిను" అని చెప్పి వచ్చేసింది.
    
    "ప్రపంచశాంతి" అతను అనడం విన్పిస్తోంది. కారులో కూర్చుని స్టార్ట్ చేసింది.
    
    తమనే వెంబడిస్తున్న వ్యక్తి కోసం చూసిందిగానీ కనిపించలేదు. అదంతా తన భ్రమే అనుకుని సర్ది చెప్పుకుంది గానీ ఎక్కడో మనసులో ఓ మూల భయం మాత్రం బుట్టలోని పాములా కదిలింది.
    
    అలా గడిచింది ఆ సాయంకాలం.
    
                                               11
    
    ఇక ఎప్పుడూ అతన్నికలుసుకోకూడదని నిర్ణయించుకోవడం వల్ల ఇప్పుడు అతను వీధిలో పుస్తకాలు అమ్ముతున్నా చూడాలన్న కోర్కెను బలవంతంగా అణిచిపెడుతోంది.
    
    వసంత్ మాటలు గుర్తొచ్చాయి. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. ప్రపంచమంతా తనదే అయినట్లు, ప్రతి అనుభవమూ తనని కుదిపేసినట్లు ఎంత గాఢంగా మాట్లాడతాడు. మనం అనుకునే విలువల్ని చెండాడి వాటి వెనకనున్న స్వార్ధాన్ని, కుళ్ళు మోతుతనాన్ని ఎంత తమాషాగా బయటపెడతాడు.
    
    మనం గుర్తించలేని చిన్ని చిన్ని విషయాలని కూడా అవి ఎంత థ్రిల్లింగ్ గా వుంటాయో ఎంత ఉద్వేగంతో చెబుతాడు. కవిత్వం, ఫిలాసఫీని అంతగా రంగరించి అనుభూతిని మాటల్లోకి అనువదించడం ఎంత కష్టం? మనుషుల మీద ఎంతో ప్రేమ, జీవితంపట్ల ఎంతో మమకారం వుంటే తప్ప అలా ఫీలవడం అసాధ్యం.
    
    కానీ తను అతనితో తిరుగుతూ మాట్లాడగలదా? ప్రేమిస్తున్నానంటూ తిరుగుతున్న అతనితో తనకు మాట్లేమిటి? అందుకే వెళ్ళకూడదు.
    
    ఆమె పుస్తకంలో లీనమవడానికి ప్రయత్నిస్తోంది.
    
    అంతలో ద్వారం దగ్గర అలికిడైతే వసంతేమోనని కలవరపాటుతో అటు చూసింది. కానీ వచ్చింది వసంత్ కాడు. ఆమె దూరపు బంధువు ప్రియబాంధవి.
    
    "ప్రపంచశాంతి" అని "రారా" అంటూ ప్రియని లోపలికి ఆహ్వానించింది.
    
    "ప్రపంచశాంతి ఏమిటి సూర్యా!" ప్రియబాంధవికి అర్ధం కాలేదు.
    
    "ఈమధ్య ఓ ఫ్రెండ్ నేర్పించాడు. హలో- నమస్కారం లాంటి వాటి బదులు ప్రపంచశాంతి అంటుంటాడు. అది వినీ వినీ అలవాటు పడిపోయి అలా విష్ చేశాను- అంతే - ఇంకేమిటి విశేషాలు? ఇప్పుడేనా రావడం?" అడిగింది సూర్య.
    
    "ఆఁ మా ఊర్లో ఉదయాన్నే బస్సెక్కాను. ఆర్డినరీ బస్సు అది ప్రతి స్టేజీ దగ్గర ఆగుతూ ఇప్పటికి వచ్చింది" చెప్పింది ప్రియ.

    మర్యాద కోసం ఆమె చేతనున్న సూట్కేసును తీసుకుని గెస్ట్ రూమ్ వైపు నడిచింది.
    
    ఆమెను డ్రస్ మార్చుకోమని చెప్పి, కాఫీ తీసుకురమ్మని పనిమనిషికి చెప్పింది.
    
    ప్రియబాంధవిది మల్లాం దగ్గరున్న పల్లెటూరు. ఆమెకి సూర్యాదేవికి వయసుంటుంది. తెల్లగా దంతపు బొమ్మలా వుంటుంది. ఆమె ముఖంలో ముక్కూ మిగిలిన బాడీలో బ్రెస్టు డామినేట్ చేస్తుంటాయి. పైభాగంలో బొడ్డూ అందంగా వుంటాయి. ఆమెను చూస్తూనే పెదవులు అలా కిందకు దిగితే నడుం వంపులు రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తాయి.
    
    ఆమె ఎద ఎంత సత్యంలా తోస్తుందో, ఆమె నడుం అంత అసత్యంలా అనిపిస్తుంది.    

    మొత్తం మీద ఆమె అందంగా, రెచ్చగొడుతున్నట్లుంటుంది.
    
    అందువల్లే ఆమెను చూస్తూనే కాస్తంత సెన్సిటివ్ బాయ్ అయితే ఆమెతో అలా ఊటీలోనో, డార్జిలింగ్ లోనో సాయం సంధ్యలో ఆమె భుజం మీద చేయివేసి నడవాలనుకుంటారు. కాస్తంత కొంటెవాడికైతే ఏ మామిడి తోపులోనో గున్నమామిడి చెట్టుకిందో ఆక్రమించుకోవాలని ఆరాటపడతాడు.
    
    ఆమె సూర్యాదేవికి దూరపుబంధువు. ఎప్పుడో పెళ్ళిళ్ళలోనో, నిశ్చితార్ధం రోజుల్లోనే కలుసుకునేవారు. ఇంటికి రావడం ఇది రెండోసారే.
    
    ప్రియబాంధవి స్నానం చేసి చీర మార్చుకొచ్చింది.
    
    సూర్యాదేవి కాఫీ కలిపింది.
    
    చెరో కప్పు అందుకున్నారు.
    
    "మీ రాజాగారు కనపడడం లేదు ఎక్కడికెళ్ళారు?
    
    "ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్ కదా ఒక్కక్షణం ఇంటిపట్టున వుండరు" చెప్పింది సూర్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS