Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 35

   
    తిరుపతి నివ్వెరపోయాడు. ఒక రాజకీయమైన ఆదర్శంకోసం, దేశంకోసం ఇంతగా తను చెపితే, ఇదేదో మొహమాటం అబినయించే శేషయ్యని చూడగానే తిరపతి జన్మకంతటికీ సరిపోయేటంత నిస్పృహ కలిగింది. అందులోనూ శేషయ్య చెప్పిన మాధవుడు ధనవంతుడు. ఆ వూళ్ళో కల్లా ధనవంతుడు. తిరపతి లేచి, శేషయ్య మొహంమీద మొహం పెట్టి గట్టిగా కంఠనాళాలు ఉబ్బేటట్లుగా "రియేక్షనరీ -పెటీబూర్జువా" అని అరచి గబగబా వెళ్ళిపోయాడు. ఆ మాటలలోని అర్ధమూ నిందా ఏమిటో తెలియకపోయినా తిరుపతికి ఎందుకు కోపం వచ్చిందా అని ఆలోచించుకుంటూ ఇంకా తలగోక్కుంటూనే రోడ్డు పట్టాడు శేషయ్య.
 
    మాధవుడి తండ్రికి ఇన్ కమ్ టాంక్సువాళ్ళ లెక్కల ప్రకారం సాలుకి యాభైవేల రూపాయలు తక్కువకాకుండా ఆదాయం. ఇదికాక, పన్నులకీ, ప్రభుత్వపు కన్నులకీ దొరకని ఆదాయం ఎవరికి తోచిన రీతిని వాళ్ళు అంచనా వేస్తుంటారు. ఇంత శ్రీమంతుడైన మాధవుడూ, శేషయ్యా స్నేహితులవడానికి కారణం వీళ్ళిద్దరూ ఆ వూరి స్కూల్లో పేలౌతూ, ప్యాసవుతూ ఏడెన్మిదేళ్ళు కలసి చదువుకోవడమూ -కలసి వేరుశనక్కాయలూ, బటానీలు కొనుక్కు తినడమూ లాంటి సంఘటనలు. ఇప్పుడిద్దరికీ పాతిక సంవత్సరాల వయస్సు దాటినా, వారి మధ్య అంతరం బాల్యంలో కన్నా ఎక్కువైనా, ఎప్పుడోకాని రోడ్డుమీదతప్ప కలుసుకోకపోయినా, శేషయ్యకి మాధవుడంటే అభిమానమూ, నమ్మకమూ కూడా.

    కారు ఆపుచేసి, మాదవుడు పిలుస్తాడు. శేషయ్య ఓ నిముషం ఆకల్నీ బాధల్నీ మరచిపోయి, నవ్వుతూ దగ్గరగా వెళతాడు.

    "ఏరా శేషూ! బాగున్నావా" అంటాడు మాధవుడు.

    "ఆఁ రోడ్ల మీద యిలా చక్కర్లు కొట్టుతున్నాను"

    "నీ పనే బాగుందిరా"

    "అదేం?"

    "మానాన్న డబ్బివ్వడురా. కొట్లల్లో, కాఫీ హోటళ్ళలో, అప్పు రెండు వేలు. ఫ్రెండ్సుకీ  అయిదారువందలు ఇవ్వాలి. పెట్రోలు బంకుకి ఆర్నెల్లనుంచి కానీ ఇవ్వలేదు. ఛీ ఛీ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందిరా"

    శేషయ్య అటువంటి సమయంలో మిత్రుడిమీద నిజంగా జాలిపడేవవాడు. "మీ నాన్నకింత కరుకుతనం పనికిరాదు" అనేవాడు.

    "మా నాన్న! రాక్షసుడు, విలన్, రావణాసురుడు, హిరణ్యకశిపుడు" అని తిడుతూ కారు స్టార్టుచేసి వెళ్ళిపోయేవాడు మాధవుడు.

    .......నాలుగైదు నెలల అనంతరం శిధిల గృహావశేషమైన ఒక గదివంటిదాంట్లో నిదిరిస్తూన్న శేషయ్యకి తననెవరో పిలుస్తూన్నట్టనిపించి, కళ్ళు నులుముకుని బయటికి వచ్చాడు. మాధవుడు కార్లోంచి అమాంతం దుమికి శేషయ్యని కావలించుకుని -
   "శుభవార్తరా శేషూ" అన్నాడు.

    శేషయ్య అర్ధమైనట్లు నవ్వి, "ఎప్పుడురా లగ్నం?" అని అడిగాడు.

    "ఛఛ - పెళ్ళి గిళ్ళీ కాదు. నా డియర్ ఫాదర్ చచ్చిపోయాడు. ఈ వేసవికి ఊటీ వెళ్ళాంకదూ. అక్కడ సడన్ గా, హాయిగా కళ్ళుమూశాడు. ఒరేయ్ శేషూ, రాయిలా అలా నిలబడ్డావేంరా?- కంగ్రాచ్యులేషన్స్ జెప్పక" అన్నాడు మాధవుడు  శేషయ్య భుజాల్ని కుదుపుతూ.

    బెదురుగా "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు శేషయ్య.

    "ఇంక పెళ్ళి విషయం చూడుభాయ్....... నాలాంటివాడికి పెళ్ళి ఆటంకమే కాని, సుఖంలేదు. నలుగురమ్మాయిలకి ప్రామిస్ యిచ్చి, వేర్వేరుగా లొంగదీసుకున్నాను. పెళ్ళని తెలిస్తే నలుగురూ వచ్చి ఇంటిముందు సత్యాగ్రహం చేస్తారు. వాళ్ళనెలా వదిలించుకోవడమా అని బ్రహ్మాండమైన మానసిక పరిశ్రమ చేస్తున్నాను" అని ఓసారి ఆగి, మాధవుడు మళ్ళీ ఇలా అన్నాడు.

    "ఈ శుభ సమయంలో ఆ బాల్యమిత్రుడివైన నీకు ఎన్నడూ మరచిపోలేని ఒక బహూకృతి - ఒక అనుభవరూపంలో ఇవ్వ దలిచాను. రా నాతో కారు ఎక్కు."

    శేషయ్య తన మాసిన గడ్డాన్నీ, పైజామాల్నీ చూసుకుని, సందేహిస్తూ, "ఎందుకూ, ఎక్కడికీ?" అన్నాడు.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS