Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 34

               
                                తీవ్రవాద నాయకుడు

    శేషయ్య మున్సిపాలిటీవాళ్ళ రోడ్లన్నీ తిరుగుతుంటాడని చెప్పడానికి అతని పైజామాలు నిదర్శనం.

    ఆ రోడ్లమీద దుమ్ము మాంచి ఒత్తుగా వుండి, అడుగు పెట్టగానే ఝామ్మని రేగిపోవడం మున్సిపాలిటీవారి బుద్దికుశలతకి నిదర్శనమైనట్టు.

    శేషయ్య ఇలా తిరగడంవల్లనే రోడ్లరిగిపోయి, దుమ్ము లేస్తోందని ఒక కౌన్సిలర్ విమర్శకులకి చెప్పిన జవాబు.

    పాపం శేషయ్యకి తిరగడమే పని. ఆకలేసినప్పుడల్లా శేషయ్య తిరుగుతుంటాడు. అదేమిటోకాని, రోజూ శేషయ్యకి ఆకలేస్తుంది.

    ఎప్పుడూ కడుపునిండా తినడానికి వీలుదొరకదు కాబట్టి ఎప్పుడూ ఆకలేస్తూనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ తిరుగుతుంటాడు.

    ఆ వూళ్ళో ఉపాధ్యాయులు భూ పరిభ్రమణాన్ని శేషయ్యతో పోల్చి చెప్పడంవలన విద్యార్ధులకి చటుక్కున అర్ధమైపోతుందని ప్రతీతి

    ఇటు శ్రామిక లోకానికీ, అటు ఉద్యోగానికీ, సంపాదనకీ నోచుకోని, స్థిరత్వంలేని, ఏమీ చెయ్యలేని, ఎందుకూ పనికిరాని శేషయ్యలాంటి నిరర్ధకపు శాల్తీ ఒకటి చిన్నరకం మధ్యతరగతి కుటుంబాలలో బయల్పడుతుంది.

    శేషయ్య స్కూలు ఫైనల్ వరకు చదువుకున్నవాడేనని వదంతి కూడా వుంది. మధ్య మధ్య ఇంగ్లీషు మాటల్నీ ఉద్యోగపర్వంలో తిక్కన పద్యాల్నీ గబగబా అనేసాడనీ, ఒక్కొక్కసారి నిశితంగా తెలివితేటల్ని ప్రదర్శిస్తాడనీ కొందరు చెప్పుకుంటూ వుంటారు.

    అయితే అతనెందుకు వృధాగా ఏ సంపాదనా, ఏ పనీ లేకుండా ఉండిపోయాడు? ఈ ప్రశ్నకి దేశంలోని నిరుద్యోగంమీదా మనస్తత్వాలమీదా కొందరు నిపుణుల్ని కమిటీకిందవేసి, పరిశీలన చేయిస్తే తప్ప సమాధానం దొరకదు.

    శేషయ్యకి ఓ విధవ అక్కగారూ, తల్లీ ఉండేవారు ఇతని సంపాదనా చాతుర్యానికి తట్టుకోలేక తల్లి పరలోకానికి చప్పుడు చెయ్యకుండా వెళ్ళిపోయింది అంతకన్నా గప్ చిప్ గా అక్కగారు ఒకనాటి రాత్రికి రాత్రి ఎవడితోనో లేచిపోయింది.

    ఆ రోజున శేషయ్య చాలా విచారంగా ఉన్నాడు. అక్కగారు చేసిన అప్రతిష్ఠ పనికికాదు..... తను కూడా ఆడదైవుంటే ఎవడేనా లేవదీసుకు పోనుకదా అని..........

    ఇప్పుడు శేషయ్య లోఫర్.

    ఇదివరకు ఎరిగున్న వాళ్ళు. పాత స్నేహితులూ దయాహృదయాలూ ఎప్పుడేనా ఏదేనా ఇస్తే తీసుకుంటాడు, తింటాడు, నిద్రపోతాడు. లేనిదే తిరుగుతుంటాడు. అర్ధం లేకుండా.
 
    అదేకాదు! అతను మంచివాడు కూడా. దొంగతనం చెయ్యడు, తన కివ్వలేదని ఒకణ్ణి నిందించడు, మోసం చెయ్యడు, దబాయించడు. ఆ రోడ్లమీద అలాగ తిరగనిస్తోన్నందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూన్నట్టు ఉంటాయి అతని కళ్ళు.

    ఇటువంటి పరమ దరిద్రుడియొక్క అవసరం ఎవరికీ ఉంటుందని మనం కలలో కూడా అనుకోం. అయితే తిరుపతికి మాత్రం ఇతనిలోని గర్బిత శక్తిని-  Potential కనిపెట్టే గౌరవం దక్కింది.

    ఆ వూళ్ళోవున్న తీవ్రవాద సంస్థ కార్యదర్శి తిరుపతి. సమ్మెలూ, నిరసన ప్రదర్శనలూ, ఎర్రజెండాలూ, నల్లజెండాలూ, కొట్లాటలూ, నినాదాలూ -ఇవన్నీ తిరపతి కార్యదీక్షా ఫలితాలు. అథడు అశాంతిని రేపుతాడు. మంచులోంచి మంట పుట్టించగలిగిన తీవ్రవాది.

    ఆకలితో ఉన్నవాడు, ఆస్తిపాస్తులు లేనివాడు, నిరాశ అంచుల మీద నడుస్తూన్నవాడు...... ఈవేళో రేపో కాస్త ట్రైయినింగులో బ్రహ్మాండమైన తీవ్రవాదిగా, సోషలిస్టో, కమ్యూనిస్టో, బోల్షివిస్టో - ఏదో ఒకటి అయిపోయే పాపకాశం వుందని తిరపతి దృఢాభిప్రాయం. అందుకే శేషయ్యతో స్నేహం చేశాడు. రోజూ అతనికి ఎన్నో చెప్పేవాడు. ప్రపంచంలో రెండో వర్గాలున్నాయన్నాడు. ఈ రెండింటికీ, పాముకీ, ముంగిసకీ ఉన్న ఆజన్మ వైరం ఉంది అన్నాడు.

    చారిత్రకంగా ఆధారాలు చూపించాడు. రష్యా - చైనా దేశాలలో ప్రజా విప్లవాన్ని చిత్రించాడు. చివరికి తన భావబీజాలు అతనిలో అంకురస్థితికి వచ్చాయన్న సమయాన,  "మా సంస్థలో  -పార్టీలో చేరు శేషయ్యా, నీ హక్కులకోసం, నీ వేలాది సోదరులకోసం నడుంకట్టి అగ్రగామివై, నడు, నడిపించు" అని ఆవేశంగా హెచ్చరించాడు.

    తిరపతి ఉపన్యాసం గంటన్నరసేపూ విన్నాక, శేషయ్య తల గోక్కుంటూ తాపీగా "సర్లెండి. మా మాధవుణ్ణి కలుసుకుని వాడు కూడా మంచిదే అంటే చేరుతాను లెండి. ఏదో మీరింతగా అడుగుతూంటే......" అంటూ నసిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS