Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 34


                                అరవంలో కోడిగుడ్డు
                                               హాస్యరసం    
    
    మాతాతగాడు, అనగా నా దౌహిత్రుడు ఇంగ్లీషుమీడియం
    స్కూల్లో చదువుతున్నాడు. ఇంగ్లీషులో, లెక్కల్లో ఇంకా
    ఇతర సబ్జెక్టుల్లో ఎనభైలూ, తొంభయిలూ తెచ్చుకుంటాడు.
    ఒక్క అరవంలో మాత్రం కోడిగుడ్డు తెచ్చుకుంటాడు.
    
    "ఒరే, వాడపల్లి వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాసరావూ?" అని వాణ్ని పూర్తిపేరు పెట్టి పిలిచి "అరవంలో గుండు సున్నా ఎందుకు వచ్చిం"దని నే నడిగితే మిగిలిన వాటిలో ఎన్ని మార్కులు తెచ్చానో చూడమంటాడు, "అది సరే, అరవం నువ్వంత బాగా మాట్లాడుతావు కదా పాటలు కూడా జమాయించి పాడతావు కదా సున్నా ఎలా తెచ్చావురా' అని మళ్ళీ అడిగితే ఈసారి మంచి మార్కులు తెస్తానన్నాడు.
    కాని మళ్ళీ కోడిగుడ్డే! పోనీ అరవం మానేసి మరేదయినా మాటవరసకి తెలుగు తీసుకోరా అంటే వాడు ససేమిరా ఒప్పుకోలేదు. అరవం రాదు తెలుగు వద్దు! అదీ సంగతి.
    కొన్నాళ్ళ దాకా ఇందులో ఉన్న తిరుగుడేమిటో నాకు అంతుపట్టలేదు. తర్వాత నాకు చేతిలో ఒక పలకా, బలపం ఉంచి అరవం అక్షరాలు రాయమన్నాను. ఆ అల దగ్గరికి వాడు ఆగిపోయాడు. ఆ అక్షరాలలోని అల్లి బిల్లి మెలికలే వాడి తికమకలకి కారణం అని అప్పుడు తెలుసుకున్నాను.
    నాగర లిపీ, రోమన్ లిపీ మా తాతగాడికి కొట్టినపిండి. ఇంగ్లీషులోని నాలుగు బళ్ళూ అవలీలగా రాసేస్తాడు. అరవం దగ్గరకి వచ్చేసరికే వాడి ఇబ్బందులారంభమవుతాయి.
    తెలుగులో ఆఆ ఇఈ అని రాసిచ్చి దిద్దమన్నాను. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి ఆఆలు చెరిపేసి "ఓం నమశ్శివాయ" అని రాశాడు. "ఓహో గుంట ఓనమాలు దిద్దడం మన సంప్రదాయం కదా!" అని గ్రహించాను.
    అప్పుడిక పలకా బలపం దేనికి? ఇంత ఇసక తెప్పించి వేలితో "ఓం నమశ్శివాయ" అని రాసి తాతగాడి కుడిచేతి చూపుడువేలితో దిద్దించాను. ఆ విధంగా తెలుగులో అక్షరాభ్యాసం నేనే చేయించాను వాడికి!
    మళ్ళీ పలకమీద ఆ ఆ లు రాసి దిద్దమంటే తెల్లమొగం వేశాడు. పోనీ అరవ అక్షరాలు రాయమన్నాను. కొంతసేపు బలపంతో ఏవేవో మెలికలు తిప్పి కొంత నాసిరకపు నైరూప్యకళ సృష్టించాడు కాని అక్షరాల పోలిక మాత్రం అందులో ఎక్కడా కనిపించలేదు.
    Kaaki అని నేను రోమన్ లిపిలో రాసి చూపించాను. వెంటనే వాడు చేరడేసి కళ్ళు చేసుకుని కాకి అని చదివి, క్రో అని నాకు ఇంగ్లీషులో అర్ధం చెప్పాడు.
    అందుకే కాబోలు ముస్తఫా కెమాల్ పాషా టర్కీకి నియంత అయిన తక్షణమే కుడినుంచి ఎడమకు నడిచే కుదురైన తురక లిపిని రద్దుచేసి రోమన్ లిపినే అందరూ విధిగా వాడాలని శాసించాడు. మన దేశంలో కూడా అన్ని భాషలకీ రోమన్ లిపినే వాడితే ఈ వైజ్ఞానిక యుగంలో ఎంత సొమ్మూ, శ్రమా కలిసొస్తాయా అని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను.
    మా తాతగాడి స్కూలులో ప్రతినెలా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అన్నింట్లోను మంచి మంచి మార్కులు తెచ్చుకుంటూ ఒక్క అరవంలో మాత్రం కోడిగుడ్లు పెడుతూ ఉంటాడు ఇవి నిజమైన కోడిగుడ్లయితే ఎంత బాగుండును. నా ఆహార సమస్య కొంతవరకయినా తీరేది కదా అనుకుంటాను. అంతబాగా అరవం మాట్లాడగలిగేవాడికి అక్షరాల ఇబ్బంది వల్ల ఎప్పుడూ ఎర్రసిరాతో F (అనగా ఫెయిలయాడని) గుర్తు రావడం నాకు కొంత ఆందోళన కలిగించింది. ఈ వంతెన దాటలేని కారణంవల్ల ఇక వీడు పై క్లాసుకి వెళ్ళడం కష్టమే అనుకున్నాను.
    పోనీ, యేదో ఆపద్దర్మంగా ఆ హిందీ లిపినే ప్రవేశపెట్టేస్తే బాగుండు ననిపించింది నాకు. హిందీ ప్రపంచ భాష అని కీర్తించాడు మారిషస్ దీవుల ప్రధానమంత్రి. మన దేశంలో మహాత్ముని తర్వాత మహాత్ముడంతటివాడైన వినోభా భావేగారు ఆసియా ఖండం అంతటా నగర లిపిని అమలు చెయ్యాలనే కోరికను వెళ్ళబుచ్చారు. కాని ఇది గొంతెమ్మ కోరికగా మాత్రమే మిగిలిపోతుందేమో అని నా భయం! ఆసియా ఖండం మాటకేం గాని కనీసం మన దేశమంతటా భావేగారి కోరిక మేరకు కాకపోయినా, కుప్పతెప్పలుగా పుట్టకొక్కుల్లాగ బయలుదేరుతున్న బాబాగార్లో, అమ్మవార్లో తమ మంత్రాలవల్లనో తంత్రాల వల్లనో దేశమంతటా హిందీ లిపిని తీసుకువస్తే మా తాత కష్టం గట్టెక్కి ఉండేది.
    ఉండేదా? అది సందేహమే అరవంలోనే కొన్ని శబ్దాలను సూచించగలిగే అక్షరాలు హిందీలో లేవు. మన అచ్చతెలుగు ధ్వనులైన ఎ, ఒ, చ, జ, ఱ లకు హిందీ లిపి న్యాయం చేకూర్చలేదు. పంచ ద్రావిడ భాషల కుటుంబానికి ప్రత్యేక లక్షణాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ నాగర లిపి అనుకూలం కాదనే నా నిశ్చితాభిప్రాయం. అనవసరంగా మా తాతగాన్నీ, వాడిలాంటి అసంఖ్యాకులైన విద్యార్ధుల్నీ పెనంలోంచి నిప్పులోకి తోసే సంస్కరణలు సుతరామూ నాకిష్టం లేదు.
    ఇంత కాలంగా అరవదేశంలో ఉంటున్న నాకు పట్టుబడని అరవ భాషనీ మా తాతగాడు అవలీలగా పట్టేశాడు. "కుమ్మియడీ పెన్నె కుమ్మియడీ" అని వాడు పాడుతూ ఉంటే విని తీరాల్సిందే కాని నేను పాడమన్నప్పుడు మాత్రం వాడు పాడడు. నేనడిగినప్పుడు పాడాలంటే అందుకొక చాక్ లెట్ మూల్యంగా చెల్లించవలసిందే.
    ఇదో కోలాటం పాట అని నాకు తెలిసింది. ఇటీవల ఈ పల్లవిని ఉపయోగించి ఇరవై సూత్రాల ప్రణాళికను అనుకూలంగా ఎవరో కవి కొంత ప్రచారసాహిత్యం సృష్టించాడు. మొత్తం పాట మా తాతగాడికి కూడా రాదుగాని
    "అవసరకాలం వచ్చినపుడు
    అవసర చట్టం అవసరం"
    అన్న చరణం నాకు బాగా నచ్చింది. అయితే ఇందులో అరవ వారి అవసరం లేదు. తెలుగువాడి అవసరం లేదు.
    "అవసర చట్టం తేవైయడీ" అని అరవంలో ఉంది.
    నాగరలిపి కాని, రోమన్ లిపి కాని ఇంతట్లోకి అమల్లోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి యెలాగైనా అరవ లిపినే మాతతగాడు జయించేటట్లు చెయ్యాలనుకున్నాను.
    మహాభారతంలో నేను చదివానో లేక చిన్నప్పుడు మా నాన్నగారు చెబితే విన్నానో గాని అందులో అయిదుగురు సింహబలులున్నారు. భీముడు, జరాసంధుడు, బకాసురుడు కీచకుడు, దుశ్శాసనుడు వీరిలో ఏ ఒక్కడు ఇంకొక్కన్ని చంపినా, ఆ చంపినవాడి చేతిలో మిగతా వాళ్ళు చస్తారు. ఈ రహస్యం ఒక్క శ్రీకృష్ణపరమాత్మకే తెలుసు. అంచేత చిన్న మాయోపాయంతో శ్రీకృష్ణుడు భీమునిచేత జరాసంధున్ని చంపిస్తాడు. తర్వాత కథ తెరమీద చూడనక్కర లేదు.
    ఈ కథతో ఉత్తేజం పొందిన నేను పంచద్రావిడ భాషల్లో ఒకటైన తెలుగును తీసుకుని తెలుగు లిపితో మా తాతగాడి చేత కుస్తీ పట్టించాను. ఏ మాయోపాయాలు ఉపయోగించవలసిన అవసరం లేకుండానే మా తాతగాడికి తెలుగు లిపిమీద మాష్టర్ సిద్దించేటట్టు చూశాను.
    ఒక పిట్టకు రెండు దెబ్బలన్నట్టు, కాదు ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టు మాతాతగాడికిప్పుడు తెలుగు, అరవం అక్షరాలన్నీ కొట్టిన పిండి అయిపోయాయి.
    ఫలితం? ఈసారి టెస్టులో మాతత గాడికి అరవంలో కోడిగుడ్డుకు బదులు వెరీ గుడ్డు అని ప్రశంస వచ్చింది.
    
                                   ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS