నింపాదిగా కోపం చెయ్యి
రౌద్ర రసం
నీకు తెలియదా నాయనా అసలు కోపం అనేదే మహాచెడ్డ
దుర్గుణం ఔను నువ్వడుగుతావని నాకు తెలుసు చెడ్డ
దుర్గుణం ఒకటీ మంచిదుర్గుణం ఒకటీ ఉంటుందా అని!
చెప్పిందేదో చివరంటా వినవయ్యా తప్పులు ఆనక
చూపించవచ్చు నువ్విలాగ తొలినుంచీ ప్రశ్నలతోను
సందేహాలతోను బాధిస్తే నాకు మహాచెడ్డ కోపం వస్తుంది
జాగ్రత్త! ఉన్నకోపం అంతా ఒక్కసారి ఒలక బోసేస్తే
తలంటి స్నానం చేసినంత హాయిగా ఉంటుంది
కొంతమందికి! నేను మాత్రం వాళ్ళకోవకి చెందిన వాణ్ని
కాను.
ఆ! ఏమని అడిగావు? చెడ్డ దుర్గుణం ఒకటీ మంచి దుర్గుణం ఒకటీ ఉంటుందా అని కదూ! ఉంటాయి నాయనా ఉంటాయి. కోపం చెయ్యడం చెడ్డ దుర్గుణం నింపాదిగా కోపం చెయ్యడం మంచి దుర్గుణం. నీకెవరి మీదైనా కోపం వచ్చిందనుకో వెంటనే వాణ్ని చెడామడా తిట్టేస్తేనే నీకోపం చల్లారిపోతుందనుకుంటావు. అదే పొరపాటు పట్టరాని కోపం వచ్చినప్పుడు మెదడులోనూ, గుండెల్లోనూ, ఆమాటకొస్తే శరీరం అంతటా రక్తం ప్రకోపిస్తుందన్న సంగతి సైన్సు చదువుకున్న వాడివి నీకు వేరే చెప్పనక్కరలేదు అప్పుడే నిదానం అవసరం అప్పుడు నువ్వేం చెయ్యాలి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒకటీ, రెండూ మూడూ నాలుగూ అంటూ కనీసం ఇరవైదాకా లెక్కపెట్టాలి. అవి లెక్కపెట్టడంలో కూడా తొందరపాటు కూడదు. పరుగెత్తి పాలు తాగడం సామెత మీకు తెలుసుగా - అయితే నిలబడి నీళ్ళు తాగమని మాత్రం నేను సిఫారసు చెయ్యం తప్పకుండా పాలే తాగు. ఆ తాగేదేదో నిలబడి నిదానంగా తాగమనే నేననేది నింపాదిగా కోపం చెయ్యటం కూడా ఇంటువంటిదే!
ఏమన్నావ్? ఆహ! ఏది మళ్ళీ అను! బాగా చెప్పేవోయ్! అవును! నువ్వన్నట్టు మనం అందరమూ కోపమనేదే లేకుండా చేసుకొంటే ఈలోకం ఎంత రమణీయంగా ఉండేది! కాని నువ్వు ఉత్త ఆదర్శాలు మాట్లాడుచున్నావు!
ఇవాళ కాకుంటే రేపయినా ఆచరణ సాధ్యంకాని ఆదర్శానికి విలువలేదు నాయనా లోకమాన్య బాలగంగాధర తిలక్ "స్వరాజ్యం నా జన్మహక్కు! దీన్ని సాధించి తీరుతాను అన్నాడు. అప్పటికది అందుకోవడానికి సాధ్యంకాని ఆదర్శమే! అప్పటికి నువ్వేకాదు. మా నాన్నకూడా పుట్టలేదనుకుంటాను. అయినా చరిత్ర గ్రంథాలలో నువ్వు చదువుకున్నావు లోకమాన్యుని ఆదర్శం గురించి! ఆ రోజుల్లో అసాధ్యంగా కనిపించిన ఆదర్శం ఈనాడు యధార్ధమయింది. కోపమనేది ఎక్కడా ఎప్పుడూ కనిపించకుండా చెయ్యాలనే నీ ఆదర్శం ఎప్పటికీ అందుకోరాని ఆదర్శంగానే మిగిలిపోతుంది. ప్రపంచంలో కనీసం ఈ భారతదేశంలో ఎవ్వరూ తాగకుండా ఉంటే భూలోకమంతా కనీసం మనదేశమంతా ఒక స్వర్గధామంగా మారిపోతుందని భ్రమపడేవాళ్ళు చాలా మంది వున్నారు. మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా! నీకే నియంతృత్వాధికారం వచ్చి కోపాన్ని నిషేధించాలని ఒక చట్టం జారీ చేశాననుకో, అందుకు తగిన వందలాది బందోబస్తులు చెయ్యగల శక్తినీకుందనుకో! అంత మాత్రం చేత కోపం తుడిచిపెట్టుకు పోతుందా? అందుకే చెబుతున్నాను నింపాదిగా కోపం చెయ్యి అని? మితం ఉండాలి బాబూ! మద్యపానానికైనా, కోపానికైనా, కుటుంబ నియంత్రణకైనా!
జనాభా పెరుగుదల సమస్య ఉంది చూడూ! దీనికి శాశ్వత బ్రహ్మచర్యం పరిష్కార మార్గం అంటావా? ఇందునిమిత్తం శాశ్వత బ్రహ్మచర్య చట్టాన్ని ప్రవేశపెడతావా? అహ నువ్వంటే నువ్వని కాదు. అలాంటి అనాలోచితమైన పని నువ్వు చెయ్యవులే! కానీ, కోపాన్ని సంపూర్ణంగా తుడిచిపెట్టాలని ఇందాకా నువ్వన్నావే. అది నిజంగా జరిగేపనేనా? ఆ మాటన్నందుకు నీమీద నాకు చాలా కోపం వచ్చింది. మనవాళ్ళు బోధించే నీతులన్నీ నూటికి నూరుపాళ్ళు నేతిబీరకాయలే! నేలవిడిచిసాములే! "సత్యంవధ" అన్నారు. మన వాళ్ళేకాదు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్ళంతా ఆమాటే అన్నారు. కాని నిజం పక్కనే నీడలాగా అబద్దం వెంటాడుతూనే ఉంది కదా! మళ్ళీ నిజం చెప్పమని ఏనోటితో అన్నారో. ఆవాళ్ళే ఆనోటితోనే "వెయ్యి అబద్దాలు చెప్పి అయినా ఒక ఇల్లు నిలబెట్టా"లన్నారు. కాబట్టి తప్పకుండా కోపం చెయ్యి! కోపం తెచ్చుకోవడానికి ఈ లోకంలో ఎన్నో కారణాలున్నాయి. ఔను చాలా బాగా చెప్పావు. చుట్టూ వున్న ఈ సమాజ వ్యవస్థను చూస్తూ ఉంటే కోపం కాకమక్కువ పుట్టుకొస్తుందా? కొంత కొంత మంది మనుష్యులు నిర్లజ్జగా మన కళ్ళ యెదుటనే చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఒళ్ళు మండుతుందా మండదా? నిజమేనోయ్! అటువంటి వాళ్ళనే ఈ సంఘం అత్యధికంగా గౌరవిస్తోంది. తెలిసో తెలియకో అందరం ఆ సన్మాన సభల్లో పాల్గొంటున్నాం. పండుగలు చేసుకుంటున్నాం. మన పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ సభలకు ప్రాముఖ్యం ఇస్తున్నాయి. అవి చదివి ఆనందించాలంటావా? ఆగ్రహించాలంటావా తప్పకుండా ఆగ్రహించ వలసిందేకాని నిదానంగా! నింపాదిగా!
ఒళ్ళు తెలియని ఆగ్రహావేశాన్ని నిగ్రహించుకోవటం కష్టమే మరి! అక్కడే ఉందంటాను మనిషికీ పశువుకీ తేడా! అనేక విషయాలలో మనకీ. తదితర జంతుజాలానికే భేదం ఏమీలేదు, సాధుజంతువులకి కూడా కోపం వచ్చేసిందంటే అది పూర్తిగా తగ్గేదాకా ఎవరు చేసేది ఏమీలేదు. మనుషుల్లో కూడా అత్యధిక సంఖ్యాకులు రెండు కాళ్ళమీద నడుస్తున్నా, ఏదో ఒక భాష మాటాడుతున్నా ఆవేశాలు వచ్చినపుడు పశువుల్లాగే ప్రవర్తిస్తారు. అందులోనూ కొందరికి ముక్కుమీదనే ఉంటుంది కోపం. అందుకే చెపుతున్నాను. నింపాదిగా కోపం చెయ్యండర్రా అని! అయినా వాళ్ళు అడుగడుగునా తమ జంతు ప్రవృత్తినే జ్ఞాపకం చేస్తూ ఉంటారు.
కోపం అనే చెడ్డ దుర్గుణానికి లింగభేదమూ లేదు. వయోభేదమూ లేదు. అంటే ఆడవాళ్ళకీ కోపం వస్తుంది. మగవాళ్ళకీ కోపం వస్తుంది. చిన్నవాళ్ళకీ వస్తూంది. పెద్దవాళ్ళకీ వస్తూంది ఆ! బాగానే అన్నావోయ్. గొప్పవాళ్ళకీ కోపం వస్తూంది. పేదవాళ్ళకీ వస్తూంది. ఆర్దిక తారతమ్యాలు కూడా ఆగ్రహావేశానికి ఆటంకాలు కావన్నమాట నిజమేకానీ సామెత ఉంది విన్నావ్? పేదలకోపం పెదవికి చేటని! అయితే పేదవాళ్ళు మాత్రం నిదానంగా కోపం చేస్తారా? ఒక బీదవాడి పెళ్ళాం ఉందనుకో! ఆవిడకు మొగుడిమీద కోపం వస్తే చెళ్ళు చెళ్ళుమని చేతి బిడ్డడిని బాదేస్తుంది. అక్కడే నిధనం చూపించడు అవసరం అంటాను. అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తే ఏమవుతుంది. అందుకే అలాంటి సమయాలకు ఇరవైదాకా లెక్కపెట్టాలనే సూత్రాన్ని ప్రతిపాదించాను. ఇరవయ్యే అనేమిటి వందదాకా కూడా లెక్కపెడుతూ పోకూడదా అని అడుగుతున్నావా? ఇక్కడ సహమిత్ర తప్పిపోయావోయ్ కుర్రనాయనా! ఔను మరి ఏం చెయ్యడం? నీ వయస్సు అలాంటిది పడుచురక్తం పరుగులు తీస్తోంది. వందేమిటి లక్షదాకా లెక్కపెట్టమంటావు. అది జరిగేది కాదు నాయినా ఇరవైతో సరిపెట్టుకో అని ఒక సులభమార్గం చెబ్తున్నాను. బహుశ పదిలెక్కపెట్టేసరికే కోపం దిగజారిపోవచ్చును. అయినా ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారనేది సందేహాస్పదమే!
ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల ప్రణాళిక మంచిది కాదని ఎవరనగలరు? నా మట్టుకు నేను దీన్ని మన జాతీయ రుగ్మతకు అమోఘమైన ఔషధంగా భావిస్తున్నాను కాని చిత్తశుద్ధితో దీన్ని అంతమంది సేవిస్తే ఈ దేశమంతా ఆరోగ్యంవంతంగా ఉంటుంది నింపాదిగా కోపం చెయ్యి అని నేనెంత మొత్తుకున్నా ఎవరూ నామాట వినడం లేదు. అందుచేత నాకెంత ఆగ్రహం కలిగినా ముందు నా సలహాను నేను పాటించవలసి ఉంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి ఇటీవల నేను చేసిన ప్రయత్నాలు కొన్ని ఉదాహరిస్తారు.
ఈ సమాజం మీద నాకెంత కోపం ఉందో నీకు తెలుసుగా! ఇదివరకు ఈ వ్యవస్థను ఎంత భయంకరంగా తిడుతూఉండే వాన్నో అదికూడా నీకు తెలుసుగా ఆ ఉపన్యాసాలన్నీ ఇప్పుడు బాగా తగ్గించేశాను. నామీద కిట్టనివాళ్ళు ఇందుకు ఎమర్జెన్సీ కారణం అంటారు. అలాంటి వాళ్ళతో నేను వాగ్వివాదానికి దిగదలచుకోలేదు. ఏ ఎమర్జెన్సీ కూడా గట్టిగా అరవకుండా నన్ను ఆటంకపరచలేదు. అయినా ఇటీవల నేనెందుకు అరవడం మానేశాను? ఇతరులకు చెప్పేముందు నేనే చెప్పింది చేసి చూపించాలను సదుద్దేశంతోనే! నీతులకేం అందరూ బోధిస్తారు. తమదాకా వచ్చేసరికి ఆ నీతులన్నీ గాలికెగిరి పోతాయి.
ఇంకోమారు ఇలాగే ఏమయిందంటే, పబ్లికులైబ్రరీలో ఒక డిటెక్టివు నవల చదువుకుంటున్నాను. చుట్టూ అంతా రణగొణ ధ్వనిగా ఉంది. లైబ్రరీలో నిశ్శబ్దంగా ఉండాలన్న ప్రాథమిక నియమాన్ని పనికట్టుకుని ఉల్లంఘించడమే తమ వ్యక్తి స్వాతంత్ర్యంగా భావించే వాళ్ళే మనదేశంలో కోకొల్లలు. కథలో నిమగ్నున్నయి ఉండడంవల్ల కొంతసేపుదాకా నా సహ పాఠకుల స్వాతంత్ర్యం ప్రియత్వం అంతగా నాకు ఇబ్బంది కలిగించలేదు. సైలెన్సు అని గోడలమీద ఎన్నో చోట్ల కనబడుతున్నా "సత్సంవధ, ధర్మంచర" లాంటి వాళ్ళలాగే దానికీ ఆచరణయోగ్యత లేకపోయింది. బస్సులో "నో స్మోకింగ్" అని యెదురుగుండా ఉన్నా చుట్టకాలుస్తున్న ఒకాయిన సుభాషితం ఇక్కడ నాకు జ్ఞాపకం వస్తోంది.
"పొగతాగకూడదని అక్కడ స్పష్టంగా రాసి ఉంటే మీరెందుకు చుట్టకాలుస్తున్నారని ఆయన్ని అడిగేను. "ఆ ఏముంది, పోనిద్దురూ ఎవరికి తోచింది వాళ్ళు రాసుకుంటారు 'నేడే చూడండి మా సినిమాను' అని ఎన్నిచోట్ల మనం చదవడంలేదు. అలాగని మన ప్రకారం మనం చేస్తున్నామా? అలాగే ఇది కూడా." అని ఘాటుగా ఒక పీల్పు పీల్చి నామొహంమీదనే పొగ అంతా వదిలేడు.
మళ్ళీ లైబ్రరీలోకి వద్దాం. రణగొణధ్వని అనేది మన గ్రంథాలయాలన్నిటిలోనూ ఒక సర్వసాధారణ పరిస్థితి. అయితే నా డిటెక్టివ్ కథ మంచి రసకందాయపు పుట్టలోనికి ప్రవేశించే సరికి హాలులో అసాధారణ పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఎలా వర్ణిస్తే బోధపడ్తుంది నీకు? ఆ! నువ్వు చాలా క్రైంపిక్చర్లు చూశావు కదూ! అయిదేసి వందల అడుగులకి ఒక క్లయిమాక్సూ దానికనుగుణంగా నేపథ్య సంగీతమూ వినే వుంటావు. సంగీతం కాదులే సంక్షోభం. Thanks సరి అయిన మాట అందించినందుకు కృతజ్ఞుడ్ని అచ్చం అలాంటి సంక్షోభమే అక్కడ ఏర్పడింది. నాలో అగ్నిపర్వతాలు బ్రద్దలయినట్లు ఆగ్రహం చెలరేగింది. కథానాయకుడి చేతిలో ఉన్నట్లు ఆసమయంలో నాచేతిలో కూడా ఒక రివాల్వరు ఉంటే ఔను లేకపోవడం మంచి పనే అయింది. ఉంటేనా? ఎంత జనాభాను తగ్గించేవాన్నో కాని నాకా అదృష్టం లేకపోయింది.
అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నింపాదిగా కోపం చెయ్యి అనే నీతిబోధ నాలోని అగ్నిపర్వతాలను అదుపులోనికి తెచ్చుకున్నాను. మనస్సులోనే ఒకటి, రెండు, మూడు అంటూ ఒక మహామంత్రం జపించాను. వెంటనే బాత్రూంలోనికి వెళ్ళవలసిన అవసరం కలిగింది. బాత్రూంలో ఒక సిగరెట్టు వెలిగించాను. అయినా అసాధారణ పరిస్థితి నన్ను వెంటాడుతూనే వుంది. నాకోపాన్ని ఆ పరిస్థితిమీద నుంచి సిగరెట్టు మీదకు మళ్ళించాను. ఆ విధంగా నాకు కొంత మనశ్శాంతి కలిగింది. మళ్ళీ లైబ్రరీలోనికి వెళ్ళాను. నా నవలగాని చుట్టూ వున్న వాతావరణంలోని అసాధారణ పరిస్థితిగాని అంతమయ్యేటట్టు కనిపించలేదు. నా కోపం మాత్రం చల్లారింది. చూశావా! నింపాదిగా కోపం చెయ్యడంలో ఎంత సదుపాయం ఉందో!
ఈసూక్ష్మరహస్యం తెలియక ఎందుకందరూ చీటికీ మాటికీ చిర్రూబుర్రూ మంటారో? ఈ విషయంలో మనం పశువులం కామనీ, మనుష్యులమనీ తెలుసుకోవడానికి ఎంత కాలం పడుతుందో! అందుకే మన అలంకారికులు రౌద్రాన్ని ఒక రసంగా పరిగణించారను కుంటాను. వేణీ సంహార నాటకంలో భీముడు ఈ రసాన్నే పోషిస్తాడు. ఆ పోషించడంలో కూడా ఎంత ఔచిత్యం ఉంది! తనలో ఎన్ని టన్నుల రౌద్రావేశం వున్నా ఎంత నిగ్రహం చూపిస్తాడు. ఉత్తమ సాహిత్యంలో ఎక్కడా, ఎప్పుడూ ఏ రసమూ మోతాదును మించిపోదు. వాస్తవం అనే భ్రాంతిని కలిగించేదే కళ.
ఇంత చేసినా క్రోధాన్ని మనవాళ్ళు అరిషడ్వర్గాలలో ఒకటిగా చేసి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల జాబితాలో దీనికి రెండోస్థానం ఇచ్చారు. మానవుని ఆరుగురు అంతశ్శత్రువులలో కోపానికొక ప్రముఖ స్థానమే ఉంది. బహిరంగ శత్రువులతో పోరాడే పద్దతి వేరు. అక్కడ నింపాదిగా పోరాడడమనే ప్రశ్నలేదు. అంతరంగ శత్రువుతో, అందులోనూ క్రోధంలాంటి భయంకర శత్రువుతో పోరాడవలసి వచ్చినపుడు నింపాదిగా కోపం చెయ్యి అనే సూత్రం పాటిస్తే నిశ్చయంగా నీకు విజయం చేకూరుతుంది.
---౦౦౦---
