వీరభద్రరావుగారు నాఁ డట్లు పశ్చాత్తాపము వెల్లడించిరే కాని కొన్నేళ్ళ తర్వాత మరల నాయెడ వికటము గానే వర్తిల్ల సాగిరి. శ్రీ నాధుని గూర్చి, ఇంకే వేవో విషయముల గూర్చి సత్యదూరము లయినవే కాక దూర్తములు నయిన రచనముల నాయెడ జరపిరి. వాని కెన్నఁ డు గాని వారికి నేను బదులు వ్రాయఁ దలఁ పలేదు. శ్రీవీరేశలింగముపంతులుగారు పరమపూజ్యులు, మహనీయులు నయ్యు నహమిక, మమకారము నధికముగాఁ గలవా రని తర్వాత తలఁపనయ్యెను.
నిరుపమాన మహామహిమోపేతులు పురుషోత్తములు గంధిగారు పెర్వెలసినపిదప మానవమర్యాదయే యసాదారణ యోగ్యత నందుకొనఁ గల్గెను. వారి శీలజ్యోతిముం దంతకు ముందు పెర్వెలసిన పెద్దల ప్రకాస్తు లెన్నో వెలవెల లాడ వలసిన వయ్యేను.
శ్రీ లక్ష్మణరావుగారు వీరేశలింగము పంతులుగారి నొక నాఁ డు ప్రాచ్యలిఖిత పుస్తక శాలకు గొనివచ్చి - వారప్పుడు కవుల చరిత్రను సంస్కరించి ప్రకటింపఁ బూనియున్నారు గాన- వారి కస్మదాదుల సహాయము లభింపఁ జేయుటకై జతనము సాగించుటలో న న్నెఱుక పఱచిరి. పావులూరి మల్లన చరిత్ర విషయములు వీరేశలింగము గారి దగ్గఱ, నా దగ్గఱ చర్చించి తత్త్వము నిర్ణయింప నభిలషించిరి. అన్ని వ్రాఁత ప్రతులను జూపినా వాద మెఱిఁగించితిని. వీరేశలింగము గారికి వేఱువిధముగా, పూర్వ ముతాము వ్రాసిన తీరుగా సమర్ధింపనయితిగాదయ్యెను. లక్ష్మణరావుగారు జాగ్రత్తగా నెల్ల విషయము మరల ననువదించి ' మి రిఁ క నిట్లు మార్చుకోవలసినదే. తొలుత వ్రాసినదియు సరికా దని స్పష్టపడినది' అనిరి. పంతులుగారు ' నా దగ్గఱ వ్రాఁ త ప్రతి యేదో ఉండు టఁ బట్టియే యట్లు వ్రాయటయ్యెను. రాజమహేంద్రము వెళ్ళి నా దగ్గఱి గ్రంధములఁ బట్టి మరల పర్యలోచించి నిర్ణయింతును' అనిరి. లక్ష్మణ రావుగారు' ఇన్ని పత్రులలో నున్న దానికి విరుద్ధముగా మి వ్రాఁ త ప్రతి యుండదు. ఉండినచో ససిగా సమర్ధముగా మి వాదము నిర్వహించు కోవలసి యుండును 'అనిరి.' పంతులు గారి పట్టుదల పరిభావించుచు వీరేశలింగము గారికి మన మందఱము సహాయము చేయుదము. వారిచేతనే కవుల చరిత్ర సంస్కరణము జరపింతము' అని లక్ష్మణరావుగారు చెప్పిరి.నా చేతనయినంత తోడ్పాటు జరపుదు నంటిని. వా రిర్వురు నింటికి వెళ్ళిరి.
అటనుండి వీరేశలింగము పంతులుగారు బెంగుళూరు కొలఁ ది దినములకే వెళ్ళిరి. కవుల చరిత్ర ప్రధమ భాగమున మాత్రము చేయవలసిన సంస్కరణములు నే నెఱిఁగినంత బెంగుళూరికి వ్రాసి పంపితిని. అది యొక పెద్దకట్ట పంతులు గారు వాని నుపయోగించుకొనిరి. కాని వాని నా యాపట్టులందు పెర్కొననే లేదు సరికదా! గ్రంధ పీఠికలో-' శాస్త్రి గారును . . . తమ గ్రంధాలయములో నున్న పుస్తకభాగములను పద్యములను నేను కోరినవానిని వ్రాసి నా కెంతో తోడుపడిరి' అని వ్రాసిరి. వారి కేయే విషయములు కావలసి యుండునో వానిని నేనే తెలిసి, లిస్టు వ్రాసి, సంస్కరింప వలసిన చేర్చ వలసిన విధానములు, పద్యములు వ్రాసి పంపఁ గా ఆ విషయము నిట్లా స్మరించుట? సంస్మరణమున ఫలాని ఫలాని పద్యములను, గ్రంధములను వ్రాసి పంపవలసినది గా వారుకోరగా నస్మదాదులము వ్రాసి పంపినట్టు లర్ధమగును. నే నన్న వాస్త వార్ధమును దేవచ్చును. ఇంతే కాక తమకు చిరమిత్రు లయిన శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారిని గూడఁ జేనకిరి ప్రబంధ రత్నావాళిని గూర్చి యకారణముగా వారి కవుల చరిత్ర పీఠిక లోనే మరల నన్నును జెనకిరి. వాని నెల్ల వివరించుట రోఁత నేను జాబుల నిటీవల నేను చింపివేయబోగా తాము జాగ్రత్తగా నంచుకొందుమని నా మిత్రులు గయికొనిరి.
ఇంత యెందుకు వ్రాసితి ననఁ గా నాకు వాజ్మయ రంగమున క్రీడా వినోద మనుభవింపవలెనని కొండంతకోరిక చెలరేగుచున్నను, ఆదినుండి కూడ దాని కభ్యంతరములు,ప్రతి షేధములు తఱచుగా నడ్డు దగులుచు నిరుత్సాహము గొల్పుచున్న వాణి తెల్పుటకు. ఆ నాళ్ళలో ప్రతివాదో త్సాహము నాలో కొంత దూకులాడుచునే యుండెడిది. అయిన నేమి? స్వర్ణ కారుఁడు సువర్ణ జతములను గరఁగించుటకై తనముందు నిప్పులకుంపటిని నడుమ నంగారములు చేర్చి, దాని పై కుండమూకుటిని నెలకొల్పి, కుంపటినిండ నుముక నించి యుంచుకొనును. వలసినప్పు డంగారముల గొట్టముతో నూఁ ది యగ్ని ప్రజ్వలనము కలిగించుకొనును. ఆ యగ్ని కుండమూకుటి మూఁతకు లోబడి యే మండ నిచ్చును గాని పైకి ఉముకలోని కెగఁ బ్రాకనియ్యడు. అదినలువైపుల నుముకలోనికి వ్యాపింపజోచ్చినప్పుడు చుట్టును నీరు వోసి చల్లార్చును. ఆదినుండి నా స్థితి యించు మించుగా నట్లే సాగినది. బ్రదకు సాగిం చుకొనుటకు వాజ్మయసేవ సాధనముగా నా కేర్పడినది గాన, అందులో అరకుడుపు సాగునట్లు పని చేయుట కే నా యంతర్యామి నన్ను మెసల నిచ్చినది గాని యంత కెక్కువగా సాధించుటకు గాని నకు౮ చోటియ్యకే పోయెను.
