Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 31

               
                                                      ఫలిత కేశం

    ప్రసాదరావు అద్దంముందు నిలుచున్నాడు. అతనికి తనని తాను తీరికగా చూసుకోవాలనిపించింది. అందులో ఏదో తృప్తివుంది. అహం ఉంది. అతనికి బాధ్యతలు ఎక్కువ. ఆ ఊళ్లో సమాజంలో అతను చెప్పుకోదగ్గ వ్యక్తి. ఒక మిల్లూ, పల్లెటూళ్లో భూములూ, రెండు మూడు మేడలూ అతనికి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా తెలివిగా నిర్వహించుకుంటూ మున్సిపల్ కౌన్సిలర్ గా, రోటరీ క్లబ్బు సభ్యునిగా, సంగీత సభ కార్యదర్శిగా యింకా ఎన్నో సంఘాలలో సభ్యునిగా తన బాధ్యతల్ని నెరవేర్చాలి. దినదినాభివృద్ధి అవుతున్న కీర్తితోపాటు తనమీదగల బరువూ వొత్తిడీ కూడా ఎక్కువ అవుతున్నాయి. వీటన్నింటిలోనూ ఒక మెలకువతో, ఒక తెలివితో తాను వ్యవహరించాలి. అదీగాక అతని అభిప్రాయాల్ని దృక్పథాన్ని నలుగురూ అంగీకరించేటట్లు చేయాలి. అతను అందరిలాంటివాడూ కాడు. అందరి విశ్వాసాలు అతనివి కావు. శాస్త్రీయమైన, సహేతుకమైన అతని దృక్పథం ముందు సమాజంలో చలామణి అయ్యే నమ్మకాలూ ఆదర్శాలూ అర్ధంలేనివిగా కనిపిస్తాయి.

    మంచి సౌష్టంతో ఉన్న అతని శరీరం అద్దంలో ప్రతిబింబించి అతనికి తృప్తి కలిగించింది. అతని ఆరోగ్యం మంచిది. అతనికో విధమైన గర్వంకూడా. అలాగ అద్దంలో చూసుకుంటూన్నంత సేపూ అతనిలో ఆత్మవిశ్వాసం ప్రబలం కాజొచ్చింది. తానెంతో అర్ధవంతంగా బతికాడు. ఇకముందు కూడా యిలాగే ప్రయోజనాన్ని పరమార్ధాన్నీ కలిపి జీవితాన్ని సార్ధకం చేసుకోగలడు. తనకి ఒక బాహ్యమైన రూపసౌందర్యమేకాదు, లోపల్లోపల ఒక అంతరంగికమైన వ్యక్తిత్వం కూడా ఉంది. తన వ్యక్తిత్వపు ముద్ర ఎన్నింటిమీదనో పడింది. ఈ పట్టణంలో అతని వ్యక్తిత్వం కలిసిపోయింది. ఈ పట్టణం అతని వ్యక్తిత్వంతో కలిసి పెరిగింది. తాను నిజంగా అదృష్టవంతుడు. ఎవరికోగాని యిటువంటి తృప్తి కలిగే అవకాశం వుండదు. ప్రసాదరావు మరోసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని నిదానించి చూసుకొన్నాడు. అతని మనస్సు చటుక్కున కలుక్కుమంది. అరె! నొసటిమీద ఒత్తుగా వంకర తిరిగిన జుట్టులో తెల్లని వెంట్రుక కనపడింది.

     అతనికి చిరాకు కలిగింది. ఆశ్చర్యం కలిగింది. భయంవేసింది. ఇంతవరకూ ఉన్న మనస్స్వాస్థ్యం చెడిపోయినట్టయింది. ఎక్కడిదీ తెల్లవెంట్రుక? ఎప్పుడు ఎలా వచ్చింది? అభేద్యమనుకొన్న యీ కోటగోడకి పగులు ఎలా ఏర్పడింది. ప్రసాదరావు మొహంలో రంగులు మారాయి. అతనికి చీకట్లో వొంటరిగా నడుస్తూంటే ఎవరో శత్రువులు చుట్టుముట్టినట్లనిపించింది. అతను సరదాగా మంచుమీద స్కేటింగ్ చేస్తుంటే చటుక్కున అంచు విరిగి అగాధమైన లోయలోకి జారిపోతున్నట్టు అనిపించింది. తన నిస్సహాయత తనకి తెలియవచ్చింది. ఈ తెల్లవెంట్రుక యిక నల్లబడదు. అతను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పరిష్కరించాడు. కాని యిది తన చేతిలోలేదు. ఏదో బలవత్తరమైన శక్తి అతన్ని ఆక్రమిస్తోంది. ఓడిస్తోంది. శ్రీమంతుడైన ప్రసాదరావు, హేతువాది అయిన ప్రసాదరావు, ఆష్టిమిస్టు అయిన ప్రసాదరావు, గౌరవమూ ప్రతిష్ఠాగల ప్రసాదరావు, సిసలైన వ్యక్తిత్వం గల ప్రసాదరావు తెల్లబోయి కంగారుపడి అద్దంముందు వెర్రిగా నిలుచునిపోయాడు.

    అవును, తనకి ముప్పైతొమ్మిది సంవత్సరాలు గడచి నలభయవ ఏడు వచ్చింది. ఈ మధ్య ఒళ్ళంతా బరువుగా ఉంటున్నట్టూ, నొప్పులు పెడుతూన్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తోంది. ఆఫీసులోగాని సభలలోకాని అలసట కలుగుతోంది. మధ్యమధ్య ఏదో దిగులు ఆవరిస్తోంది. తనకి వయసు పైబడుతోంది. తాను వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. తన జీవన సూర్యుడు అస్తమయ శిఖరంవైపు ఒరుగుతున్నాడు. ఇలా అనుకొంటూంటే అతని వొళ్ళు వొణికింది. అతన్ని ఎవరో దగా చేస్తున్నట్టు అనిపించింది. అతనికి ఏడవాలనిపించింది. ఇన్ని ఆశలూ ఆదర్శాలూ కట్టుదిట్టాలూ చేసుకున్నా ప్రకృతి ధర్మం ముందు మానవుడు ఎంత అల్పుడూ, నీరసుడూ అయిపోతాడో తెలిసిపోయింది. మరి ఎందుకు యీ జీవితమనే నాటకం!

    అతనికి తన ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందో అనుమానం కలిగింది. డాక్టరుచేత ఒకసారి Check up చేయించుకోవాలి. బహుశా తనకు రక్తపు పోటు ఎక్కువయి ఉండొచ్చు. ఊపిరితిత్తులు బలహీనమైపోవచ్చును. మధు మూత్ర రోగం వచ్చి ఉండవచ్చును - రేపే వెళ్ళి డాక్టరుకి చూపించుకోవాలి. భోజనంలో కారం పులుపూ తగ్గించాలి. తగినంత విశ్రాంతి కావాలి. ఇన్ని సంఘాలలో సభ్యత్వాలు వదులుకోవాలి. అరె! ఏమైపోతున్నాడు తను. ముసలివాడు, రోగి, బలహీనుడు, భయస్తుడు - ప్రసాదరావు అనే అఖండ జీవనది పాయలు పాయలై నిర్ణయాపూరితమైన కాలపు యిసుక పర్రలలో పడి యింకిపోతుందా?

    ఇంతలో అతని గదితలుపు తెరుచుకొంది. కామేశ్వరి చేతిలో మరచెంబుతో నవ్వుతూ వచ్చింది. "ఏఁవిటి అలాగ అద్దంలో చూచుకొని మురిసిపోతున్నారు" అంది దగ్గరిగా వచ్చి. ప్రసాదరావు ఆమెను నిదానించి చూశాడు. నల్లగా వొత్తుగా వొంపులుగా ఉన్న ఆమె జుట్టు ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఆరోగ్యంగా ప్రౌఢంగా అందంగా ఉన్న ఆమె పసిమిఛాయను మరింత అందగింపజేస్తూ నీల మేఘంలా ఉంది. వెనకాల చుట్టుకొన్న సిగలోని తెల్లపువ్వుల తాలూకు పరిమళం పరువమైన యౌవనపు బరువునీ మత్తునీ సూచిస్తోంది. ఆమె జుట్టులో ఎక్కడా తెల్లవెంట్రుక లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS