Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 31

 

              అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది!

                                                                     వసుంధర

    అతను తమాషాగా ఈల వేశాడు.
    ముందు నడుస్తున్న అందమైన అమ్మాయి వెనక్కి తిరిగింది. వెనక్కు తిరిగిన ఆమె ముఖం నిండా కోపం ఉంది.
    ఈల వేసిన అబ్బాయి ఆకాశంలోకి చూస్తున్నాడు.
    అమ్మాయి కొంచెం కోపంగా "ఏయ్ మిస్టర్!" అని పిలిచింది.
    అబ్బాయి ఉలికిపాటు నటించి ముందడుగు వేసి, అమ్మాయిని సమీపించి, "నా పేరు సుబ్బారావు" అన్నాడు.
    "మీ పేరుతొ నాకేం పని?" అందామె.
    "మరి పిలిచారెందుకు?" అన్నాడతను.
    "నన్నుద్దేశించి ఈలేందుకు వేశారు?"
    "సరిగానే ఊహించాను. నేను నిజంగా మిమ్మల్నుద్దేశించే ఈల వేశాను. అందులో తప్పేమైనా ఉందా?"
    "ఉందొ, లేదో మీకు తెలుసును కాబట్టే నేను వెనక్కు తిరగ్గానే ఆకాశం కేసి చూడ్డం మొదలెట్టారు"
    "నేను చేసింది తప్పని గ్రహిస్తే చేసినట్లేందుకు ఒప్పుకుంటాను? ఇంకా ఆకాశం కేసి చూడ్డమంటారా! మీ అందం చూసే సరికి కళ్ళు చెదిరి పోయాయి  మరి ఎటు చూడాలో తెలియక...."
    ఆమె ముఖం కొద్దిగా ఎర్రబడింది. మాట కూడా కాస్త మెత్తబడింది. "పరాయి ఆడదాన్ని అలా ఈల వేసి పిలవచ్చ్హా?" అంది నెమ్మదిగా.
    "ఎలా పిలవాలో చెప్పండి?" అన్నాడతను.
    ఆమెకు నవ్వు వచ్చింది.
    "ఆ నవ్వే నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. ఇందాకా మీరు నవ్వడం చూసి పిచ్చి వాడినై మీ వెంట పడ్డాను. ఆ నవ్వు మీ అందమైన ముఖానికి అలంకారంగా ఉంది. ఇది మీకు తెలుసుననుకుంటాను. అందుకే...."
    "కాదు. నగలు ధరించే తాహతు నాకు లేదు"
    "నేను ఒప్పుకోను" అని ఇలా రోడ్డు మీద ఆగిపోవడం బాగుండదు పదండి. నడుస్తూ మాట్లాడుకుందాం!" అన్నాడతను.
    అతని చనువు కామె ఆశ్చర్యపోయింది. దేబ్బలాడాలనే ఉద్దేశ్యంతో అతన్ని పలకరించింది . కానీ పరిచయం కొత్త దారులు తొక్కుతోంది. ఆమె అప్రయత్నంగానే అతనితో నడచింది. కానీ ఏ మూలో ఆమెలో ఇంకా కోపం లేకపోలేదు. "మీరు ఈల వేయడం నాకు నచ్చలేదు. ఎవడైనా మీ చెల్లెలు వెంటపడి అలా ఈల వేస్తె మీరేం చేస్తారు చెప్పండి?" అందామె.
    "తెలియదు. అన్నా చెల్లెళ్ళ అనుబంధాలూ, అనుభూతులూ ఎలాగుంటాయో నాకు తెలియదు" అతని ముఖంలో విచారం కనిపించింది. "నాకే బంధాలూ తెలియవు. ఎవ్వరూ లేరు నాకు" అన్నాడు.
    "ఈజిట్?' అందామె ఆశ్చర్యంగా.
    "అవును. ఈ విశాల ప్రపంచంలో నేను ఏకాకిని" అన్నాడతను.
    ఆమెలో కొద్దిగా సానుభూతి చోటు చేసుకుంది. కానీ అంతలోనే అతని ఈల ఆమె చెవిలో మ్రోగింది. "బహుశా అందుకే ఇందాకా అంత అసహ్యంగా ప్రవర్తించావనుకుంటాను" అందామె కసిగా.
    "మీకు నామీద చాలా కోపం వచ్చినట్లుంది. నా స్నేహితుల్లో నాకు చాలా మర్యాదస్తుడన్న పేరుంది. నేనెన్నడూ ఆడపిల్లల వెంటపడ్డ వాణ్ణి కాదు. కానీ మీ అందం చూసి నేను వేర్రివాడినై పోయాను. వెర్రిగా ఈల వేశాను"
    ఆమె మాట్లాడలేదు.
    "మేడమ్! మీ పేరు చెప్పరూ?" అన్నాడతను.
    "చెప్పను"
    "ఒకే. చెప్పకండి. కానీ నేను తెలుసుకో గలను రేపు సాయంత్రం మీరు పార్కుకి రండి . అక్కడ మీ పేరే కాదు, ఇంకా ఇంటరెస్టింగ్ విషయాలు చెబుతాను...."
    ఆమె కోపంగా అతని వంక చూసి "నేను రాను. అయినా మీతో మాట్లాడవలసిన అవసరం నాకేముంది?" అంది.
    "అది తెలుసుకుందుకే గాంధీ పార్కుకి రండి!" అన్నాడతను.

    
                           *    *    *    *

    "చాలా థాంక్స్ మిస్ సుజాతా! మీరు వస్తారా అని అనుమాన పడ్డాను. కానీ వచ్చేశారు నామీద మీకు కొంచమైనా గౌరవముందన్న మాట!"
    ఆమె ఆశ్చర్యంగా అతని వంక చూసి "ఎలా తెలుసుకున్నారు నా పేరు!' అంది.
    "వెరీ సింపుల్! మీరు పని చేస్తున్న ఆఫీసులో ఎంక్వయిరీ చేశాను" సుబ్బారావు నవ్వి, "ఈ దీనుడి కోరిక మన్నించి ఇంతవరకూ వచ్చారు. మరి కొంతదూరం రాగలరా?" అన్నాడు.
    "కొంత అంటే ఎంత?"
    "చాలా మంచి ప్రశ్న అడిగారు . మీరు నాప్రక్క నుంటే ఎంత దూరమైనా కొంత దూరమే అవుతుంది." అతనేదో అనబోతుండగా ఆమె కోపంగా :మిస్టర్ మరి నేను వెళ్తున్నాను" అంది.
    "నేను మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తుంటే వెడతానంటారేమిటి? సుజాతా?" అతను బాధగా అన్నాడు.
    ఆమె అతని మాటలు వింది. అయినా వెళ్ళిపోయింది.

                                   2
    హరినారాయణ ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ "ఏమిటీ నువ్వు మా అమ్మాయిని కట్నం అక్కర లేకుండా పెళ్ళి చేసుకుంటావా?' అన్నాడు. అయన జీవితకాలంలో ఇంతకూ మించిన ఆశ్చర్యకరమైన సంఘటన మరేదీ జరిగినట్లు లేదు.
    "అవునండి. పదేళ్ళ నుంచి ఒంటరి బ్రతుకు నడుపుతున్నాను. జీవితం చప్పగా నిస్సారంగా ఉంటోంది. పెళ్ళి చేసుకోవాలని ఏడాది నుంచి అనుకుంటున్నాను. కానీ నాబోటి ఏకాకి మనిషికి పిల్ల నేవరిస్తారు? అదలా గుంచితే నా మటుక్కు నాకు పెళ్ళి చేసుకుని సుఖ పడాలని వుంది. అందుకని కాస్త సంప్రదాయమైన కుటుంబంలోంచి వచ్చిన పిల్లను చేసుకోవాలనుకుంటున్నాను. కాబోయే భార్య అందమైనది కావాలని ఏ మగాడైనా అనుకుంటాడు గదా అందువల్ల నా ఈ కోరికలకూ నేనున్న పరిస్థితులకూ పొసగడం లేదు. ఇన్నాళ్ళ కు నా అదృష్టం కొద్ది సుజాత నా కళ్ళ బడింది. ఆమె లేకపోతె నా జీవితం వ్యర్ధ మనిపిస్తోంది."
    సుబ్బారావు మాట్లాడుతున్నంత సేపు హరినారాయణగారు తీక్షణంగా అతని వంకే చూస్తున్నారు. అతని మాటల్లోని నిజాన్ని, సిన్సియారిటీ ని అంచనా చేయాడానికి ప్రయత్నిస్తున్నారాయన. అయన చూపులకు సుబ్బారావు నమ్మదగ్గ వాడిలాగే కనిపించాడు.
    సుబ్బారావు గురించి మరి కొన్ని వివరాలు రాబట్టేడాయన. వాటిలో యానకు అందిన సమాచారం ప్రకారం సుబ్బారావు , హరినారాయణ గారి కులానికి చెందిన వాడే! తర్వాత సుబ్బారావు పనిచేస్తున్న ఆఫీసు చిరునామా నోట్ చేసుకున్నాడాయన.
    ప్రస్తుతం సుబ్బారావు, సత్యనారాయణ అనే అతనితో కలిసి ఉంటున్నాడు. రెండు వారాల క్రితమే సత్యనారాయణ తల్లి కూడా వచ్చింది. సత్యనారాయణకూ పెళ్ళి కాలేదు. అతను సుబ్బారావు లాగే కట్నం తీసుకోకుండా వివాహం చేసుకోవాలనుకుంటున్నాడట. మిత్రులిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు.
    సుబ్బారావు వెళ్ళిపోయేక అయన భార్య సూర్యావతితో ఈ విషయం గురించి చర్చించాడు.
    హరినారాయణగారి కింకా బోలెడు సర్విసుంది. కానీ ఆ సర్వీసులో నువ్వు సంపాదించబోయేది ఏంతో ఉండదు. అని ప్రతి నేలా ఒకసారి వచ్చే జీతం గుర్తు తెస్తుంటుంది. అయన వయస్సు నలభై రెండు. అయన కూతురు సుజాత వయస్సు పద్దెనిమిది. ఆర్నెల్ల క్రితమే ఆమె ఉద్యోగంలో చేరింది.
    సుజాత తర్వాత హరినారాయణగారికి మరి ఇద్దరు మాత్రమే పిల్లలున్నారు. పదిహేనేళ్ళ మహాలక్ష్మీ, పదకొండేళ్ళ ఆదినారాయణరావు.
    పెద్ద కూతురు సుజాత అంటే అయన కెంతో ప్రేమ. ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలని ఉండాయనకు. కానీ మంచి సంబంధాలకూ తూగేటంత డబ్బు అయన దగ్గర లేదు. అయితే సుజాత చాలా అందంగా ఉంటుంది. ఆ అందమే అమెకేదైనా మంచి సంబంధాన్ని తీసుకు రాదా, అని అయన ఆశపడుతుండేవాడు. ఆ ఆశ నిజమయే ఘడియలు ఇప్పుడోచ్చాయి.
    భార్యతో చర్చించాక సుబ్బారావు గురించి మరి కొన్ని ఆరాలు తీసి అన్నీ సక్రమంగా ఉంటె ఒక వారం రోజుల్లో ముహూర్తం పెట్టేసేయాలన్న నిర్ణయాని కొచ్చేశాడాయన.
    సుబ్బారావు రావడమూ, వెళ్లడమూ తలిదండ్రుల చర్చలూ ఇవన్నీ సుజాతలో కొత్త ఆశలు రేకెత్తించాయి. సుబ్బారావు నో రోడ్డు సైడు రోమియో గా ఆమె మొదట్లో భావించింది. కానీ ఇప్పుడతనిలా తిన్నగా తన తండ్రి వద్దకే రావడంతో అతని మీద గౌరవ భావం కలిగిందామెకు.

                                    3
    ఒక మారుమూల సందులో ఉన్నదా ఆఫీసు హరినారాయణగారొకసారి తన చేతులో ఉన్న కాగితంలో పేరూ, ఆ ఆఫీసు ముందున్న బోర్డు మీది పేరూ సరి పోయాయో లేదో నని చూశారు.
    "యునైటెడ్ బిజినెస్ ఇన్ ఫర్ మేషన్ బ్యూరో"
    పేరు సరిపోయింది. ఆ ఆఫీసు గురించి అక్కడున్న రిసెప్షనిస్ట్ ని అడిగి కొంత సమాచారం సేకరించాడాయన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS