Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 31

    "ఏంట్రా... అందరూ ప్లేట్ ఫిరాయించి అమ్మాయి తరపు వాళ్ళయిపోయారు!" ఆనంద్ గట్టిగా అన్నాడు. ఇంతలోకి అమ్మాయిల గ్రూప్ వచ్చేసింది.
    "ఏంట్రీ... అమ్మయీ, గ్రూపూ అంటున్నారు?" రేవతి అడిగింది.
    "నువ్విలా నన్ను మోసం చేస్తావనుకోలేదు!" ఆనంద్ సీరియస్ గా కళ్ళద్దాలు సర్దుకుంటూ చెప్పాడు.
    "నేనా....? వాట్ హ్యాపెండ్ ఆనంద్? వాట్ యు ఆర్ టాకింగ్?" రేవతి కంగారుపడింది.
    "నా ఫ్రెండ్సందర్నీ నీ తరపు పెళ్ళివాళ్ళుగా మార్చుకుని మారేజ్ ప్రపోజల్ తెస్తావా? ఇన్సల్ట్...!" అన్నాడు సీరియస్ గా.
    విషయం అర్థమై అందరూ హాయిగా నవ్వారు.
    "డోంట్ వర్రీ ఆనంద్! అమ్మాయి లందరం నీ పెళ్ళి తరపువాళ్ళం....ఓ.కే.!" జ్ఞాపిక అంది. "య్యా...." కామినీ, స్ఫూర్తి ఒప్పుకున్నారు.
    "ఔట్ యార్! అబ్బాయిలు మీరెంతమంది రేవతి తరపున్నా- అమ్మాయిలూ నా తరపున ఉంటే నాకింక బాడీగార్డులక్కర్లేదు!" ఆనంద్ ఆనందపడిపోయాడు.
    "అంటే...నేను నిన్ను ఫిజికల్లీ డామేజ్ చేస్తాననా!" రేవతికి అర్జంటుగా కోపమొచ్చింది.
    "ఏమో... ఎవరికీ తెలుసు? జీవితం అంటే ఒకర్కొకరు ఫ్రీగా ఎటాక్ చేసుకోవడానికి పబ్లిక్ లైసెన్స్! నువ్వు చాక్ లెట్ తేలేదనో, ఐస క్రీం తెలేదనో నన్ను మర్డర్ చేస్తే?!" అనుమానం బయటపెట్టాడు.
    అందరూ నవ్వారు హాయిగా! రేవతి కొద్దిగా టెన్షన్ ఫీలయ్యింది... మారేజ్ టాపిక్ వచ్చేసరికి!
    "హాఁ...జ్ఞాపికా! నీ బర్త్ డే రోజు మన ప్రోగ్రామ్ చెప్పెయ్యి అందరికీ! అందులో ఆనంద్, రేవతిల మారేజ్ డే కలిపి!" రేవంత్ జ్ఞాపికకు ఛాన్సిచ్చాడు.
    "ఏంలేదు! అందరూ శ్రద్దగా వినండి! ఇది ఈ సంవత్సరానికి మనం చేసుకునే లాస్ట్, గ్రేట్ అండ్ స్పెషల్ పార్టీ! ఆనంద్,  రేవతిలకు రిజిస్టర్ మారేజ్ చేస్తాం మనం! నా  బర్త్ డే పార్టీ  రేవంత్ ఇస్తారు. ఆరోజు  రేవంత్ మమ్మా రిజిస్టర్ మారేజ్ చేసుకుని, రేవంత్ ఫాదర్ తో సహా సర్ ప్రైజింగ్ గా పార్టీ  కొస్తుంది! అప్పటివరకూ మనకెవ్వరికీ రేవంత్కు కాబోయే డాడ్ ఎవరో తెలియదు. ఈవెన్ రేవంత్ కూడా! ఆ తర్వాత మా ఇద్దరి ప్రేమ గురించి రేవంత్ మమ్మాకు, డాడీకి చెప్పి  మా  మారేజ్ డేట్ అనౌన్స్ చెయ్యమని అడుగుతాం. అంటే.... ఫోర్ అకేషన్స్ అన్నమాట! ఒకటి- రేవతి. ఆనంద్ ల పెళ్ళి రెండు - రేవంత్ మమ్మ పెళ్ళి మూడు- నా బర్త్ డే, నాలుగు - మా ఎంగేజ్ మెంట్...ఓ.కే.! ఆర్ యు రెడీ టు సెలబ్రేట్ దీస్ ఫంక్షన్స్?!" గట్టిగా అడిగింది.
    "ఓ.కే! వుయ్ ఆర్ రెడీ...!" అన్ని గొంతులూ  ఆనందంగా బదులిచ్చాయి.
    "ఆ తర్వాత మనం ఎవరి దారుల్లో వాళ్ళం విడిపోతాం... జీవితంలోకి!" రేవంత్ బరువుగా అన్నాడు.
    "పోనీ... మళ్లీ యం.సి.ఎ. చేద్దామా?" రేవతికి దిగులేసి అంది.
    "వద్దు! ఎల్.కె.జి. నుండీ మొదలెడదాం!" స్ఫూర్తి ఇంకా బరువుగా అంది.
    "విడిపోవడం అందరికీ బరువుగా ఉంది కదూ!" కామిని గుర్తుచేసింది.
    ఎవ్వరూ మాట్లాడలా! మౌనంతో అంగీకరించారు. మౌనంలోనే బరువును మోశారు. కాసేపలాగే మౌనంగా ఉండి, దారులుగా వీడి గయ్యం చేరుకున్నారు.
                                      *    *    *
    అనుకున్నరోజు రానే వచ్చింది.
    రేవంత్ ఫంక్షన్ తన ఇంట్లోనే చేద్దామని పట్టుబట్టాడు. జ్ఞాపికకు కూడా అభ్యంతరం అనిపించలా! డాడీకి ఫోన్ చేసి ఇంటి అడ్రసు చెప్పింది.... బర్త్ డే పార్టీకి తను మొట్టమొదటిసారి పట్ట్టుపట్టి అడిగి ఇప్పించుకుంటున్న గిప్ట్ ను మళ్లీ గుర్తుచేసింది.
    మెత్తగా నవ్వి "నువ్వడిగాక లేకుండా ఉండగలనా హనీ!" అన్నారు.
    "మా డాడ్ ఇవ్వబోయే గిఫ్ట్ చరిత్రలో ఎవ్వరూ, ఎవ్వరికీ ఇవ్వలేదు తెలుసా? మీ డాడ్ కంటే నేనే గొప్ప!" తగాదాకి వచ్చాడు రేవంత్.
    "అందులోనూ- మీ డాడ్ నువ్వడిగాక ఇస్తున్నారు.  నేను మా మమ్మాకి తను అడక్కుండానే ఇస్తున్నాను. అంటే....గిప్టులివ్వడంలో మీ డాడ్ కంటే నేనే ఎక్స్ వర్ట్!" ప్రూవ్ చేసుకోవాలని చూశాడు- షామియానాలోకి అందరూ తళా ఒకటి ఊది అందిస్తున్న బెలూన్స్ షామియానాలో స్టూల్ మీద ఎక్కి కడుతూ!
    "మా డాడ్ ను పొగుడుతుంటే నీకు జెలస్ ఎందుకట?" ఊదీ ఊదీ బెలూన్ మధ్యలో ఆపేయడంతో- అదికాస్తా ఎగిరి రేవంత్ కాలిమీద పడింది. స్టూల్ మీదనుండి రేవంత్ తూలి పడబోయాడు.
    చటుక్కున పట్టుకుంది జ్ఞాపిక పడకుండా!
    ఆ పట్టుకోవడంలో పసిపిల్లాడ్ని తల్లి గుండెల కదుముకున్నట్టు రేవంత్ తల జ్ఞాపిక టీషర్ట్ బటన్స్ మీద వాలింది. వంగిన జ్ఞాపిక మొహాన్నీ, రేవంత్ మొహాన్నీ జ్ఞాపిక వదిలిన జుట్టు కమ్మేసింది. ఆ చీకట్లో జ్ఞాపిక పెదాలపై పెదాలను అద్దేశాడు రేవంత్ అల్లరిగా!
    ఒక్క నెట్టు నెట్టింది. కింద పడ్డాడు రేవంత్. పడి ఊరుకుంటేనా-
    "మీ డాడ్ నే కాదు! చీమను కూడా నా ముందు మెచ్చుకోకూడదంతే!" ఉక్రోషపడ్డాడు.
    "అయినా అదేంటే....స్టూల్ మీంచి పడకుండా పట్టుకుని,  పట్టుకున్నాక పడేస్తావ్? బాస్కెట్ బాల్ లాగా!" రేవతికి డౌటోచ్చింది.
    "పెళ్ళి రోజయినా కాస్త నోరు మూసుకునుంటావా? ఆనంద్ ఆనందంగా గడిపే చివరి రోజేది! రేపట్నుంచీ ఎలాగూ వెధవడౌట్లతో క్షణానికో మర్డర్ చేస్తావుగా- జీవితమంతా!" స్ఫూర్తి తిట్టింది రేవతిని.
    "నీకెందుకే? అదేదో లవ్ ఎక్స్ ప్రెషన్ లా అనిపించి నేనూ ఆనంద్ ను పైనుంచి పడమని, పడ్డాక పట్టుకుని, ఆ తరువాత పడేసి నేనూ లవ్ ఎక్స్ ప్రెస్ చేద్దామనుకున్నా! నా లవ్ ఫీలింగే పోగొట్టావ్ కదే!" చేతిలో ఉన్న బంతిపూల  దండ విసిరికొట్టింది! స్ఫూర్తి అందుకుని దాన్ని తోరణాలుగా కడుతున్న ఈష్ కు అందిస్తూ-
    "నీ లవ్ ఎక్స్ ప్రెషన్స్ సోడాబుడ్డీ కళ్ళద్దాలతో ఎక్స్ ప్రెస్ చేద్దువు! పని కానీ  ముందు- పట్టుచీర కట్టుకుందువు!" తొందరచేసింది.
    "అమ్మో....చీరా! నాకొద్దే! నేనది కట్టుకుంటే నడవలేను. నేను జీన్స్ లేదా సూట్  వేసుకుంటా! ఆనంద్ కు కట్టేయండి చీర! ప్లీజ్ ప్లీజ్...!" బ్రతిమాలింది- ఇంకో బంతి పూలదండ విసిరేస్తూ.
    "రేపు పిల్లల్ని కూడా ఆనంద్ కు  కనమనేలా ఉన్నావు. నోర్మూసుకుని పదా.... చీర కట్టాలి. నీకిపుడు టైమయింది!" తొందరచేసింది. కామిని.
    "అవునవును....టైమయింది!" అని అందరూ తొందరపడి పూర్తిచేసిన పనులన్నీ ఒకసారి తీరిగ్గా చూసుకున్నారు.
    "టెర్రస్ పైన షామియానా! ఒక పెద్ద టేబుల్ పైన "హ్యాపీ మారేజ్ డే' అని పూలతో ఎరేంజ్ మెంట్! పది పెద్దపెద్ద పూలదండలు, టేబుల్  చుట్టూ పెద్దపెద్ద దీపారధన కుందులు! ఇంకో టేబుల్ మీద పెద్దకేక్, దానిమీద  "హ్యాపీ బర్త్ డే జ్ఞాపికా!' అని క్రోవ్వోత్తులలో డిజైనింగ్, ఆ పక్కనే మరో టేబుల్ మీ "హ్యపీ ఎంగేజ్ మెంట్ డే టు యూ!' అని  ప్రమిదలతో డెకరేషన్! మరోవైపు డిన్నర్ కు ఆర్డర్ కు చేసి  తెప్పించిన వెరైటీస్ అన్నీ అందంగా అమర్చి, కిందకు వచ్చారందరూ!
    రెడీ అవ్వడానికి వెళ్తూ పోగ్రామ్ చెప్పాడు ఈష్  అందరికీ!
    "ముందు రేవంత్ మమ్మాని గుడికి పంపించే ఏర్పాటు! వాళ్ళు పెళ్ళిచేసుకుని వచ్చేలోపు మనమందరం రేవతీ, ఆనంద్ ల పెళ్ళి చేస్తాం  రిజిస్ట్రార్ ఆఫీసులో! ఆ తరువాత రేవంత్ మమ్మాడాడ్ ల ఆహ్వానం, అందరి జంటలూ పైకిరావడం! జ్ఞాపిక బర్త్ డే సెలబ్రేషన్ కేక్  కట్టింగ్! జ్ఞాపిక ఫాదర్ వచ్చాక రేవంత్ , జ్ఞాపికల ఎంగేజ్ మెంట్ రింగ్స్ మార్చుకోవడం..!"
    "ఆగండి! మా డాడీ బర్త్ డే గిప్టు?" మధ్యలో ఆపేసింది జ్ఞాపిక.
    "ఓ.కే.! జ్ఞాపికకు వాళ్ళ ఫాదర ఇచ్చే బర్త్ డే గిప్టు చూడడం! ఆ తరువాత అన్ని జంటలూ పూలదండలు మార్చుకోవడం! పూలదండల్తోనే డిన్నర్ చేయడం! అందరం జంటలుగా విడిపోవడం! ఇదంతా వి.సీ.ఆర్.లో రికార్డయి మన జీవితాంతం గుర్తుండేలా నమోదు చేసుకోవడం.... ఓ.కే!" గట్టిగా అన్నాడు.
    "ఓ.కే.!" అందరూ ఒప్పేసుకున్నారు.
    కిందకు దిగబోతున్న జ్ఞాపికను-
    "జ్ఞాపీ... ఇదేంటి ఇక్కడ పెట్టావ్?" రేవంత్ దబాయించాడు.
    "ఏదీ... ఎక్కడ?" తనూ దబాయిస్తూ అడిగి దగ్గరకొచ్చింది!
    అందరూ దిగి వెళ్లిపోయారు రెడీ అవ్వడానికి!
    మనక చీకటి! ఓకేఒక్క కొవ్వొత్తి వెలిగించాడు రేవంత్...హ్యాపీ ఎంగేజ్ మెంట్ డే! అనేది.
    దగ్గరికొచ్చి "ఏంటీ...ఏదో అన్నావ్?" అడిగింది చుట్టూ చూస్తూ.
    జ్ఞాపికాకు చేరువగా వచ్చి "మొద్దూ?" చెయ్యి చాస్తూ అడిగాడు.
    "ఏం... అంత సెంటిమెంట్?" మెత్తగా అడిగింది.
    "అందరూ కోడల్ని పెళ్ళికూతుర్ని చేస్తారు. మనింట్లో నువ్వు అత్తగార్ని పెళ్ళికూతుర్ని చెయ్యాలి! అందరూ కోడలికి హారతి పట్టి ఆహ్వానిస్తారు. నువ్వు అత్తగారికి హారతి పడతావు! అది నేను చూడాలి! జీవితంలో నా భార్య పొందబోయే ఉన్నతత్వాన్ని నేను కళ్ళారా చూడాలి! ఇలాటి బంగారుతల్లిని నాకిచ్చినందుకు మీ డాడ్ ని నేను కౌగిలించుకుని ధాంక్స్ చెప్పాలి....  సరేనా?!" అన్నాడు.
    "సరే! నీ ఇష్టం!" అంది  తలూపుతూ.
    "నేనేది  చెప్తే అది చేస్తావా?"
    -కాదనని తనను కళ్ళనిండా చూస్తూ అడిగాడు.
    "చెయ్యను! నువ్వే నేను చెయ్యని పనులేవీ చెప్పవంతే!" మృదువుగా అంది.
    ఆ చక్కని ఎక్ల్ ప్లనేషన్ ఎక్కడో ఎదలోయల్లో ప్రకంపనాలు లేపి, జ్ఞాపిక వైపు బలంగా తోసింది, తనను నిలువెల్లా పెనవేసుకుని విడవడిన వెంట్రుకలను పక్కకు జరిపి మేడమీద పెదవులానించి ఉండిపోయాడలాగే కాసేపు!
    జ్ఞాపిక కూడా కదలలా! కదలాలని అనిపించలా! రేవంత్ భుజంమీది జ్ఞాపిక కళ్ళలో 'హ్యాపీ ఎంగేజ్ మెంట్ డే' అని పంచరంగులు చిమ్ముతున్న కొవ్వొత్తి ప్రతిఫలించింది.
    "రేవంత్.... ఎప్పుడు- ఇంకా ఎప్పుడు మనం ఏకమవుతాం!" చెవిలో గుసగుసగా అడిగింది.
    "జస్ట్ ! టూ అవర్స్ లో! రెండే రెండుగంటలు! మన ఎంగేజ్ మెంట్ అయిపోతుంది. నువ్వు  నా దానివీ, నేను నీ వాడినీ అయిపోతాను" తనకు మాత్రమే వినిపించేలా చెప్పాడు.
    రెండుచేతుల్తో  రేవంత్ మొహాన్ని తీసుకుని తనివితీరా చూసింది! నుదురు, కళ్ళు, ముక్కు, చెక్కిళ్లు, అధరాలు, గడ్డం, మెడ, గుండె... ఇలా ప్రతి పార్టునూ పెదాలతో టచ్ చేస్తూ, తన ఇష్టాన్ని మౌనంగా తెలిపి గిరుక్కున తిరిగి వెళ్లిపోయింది.
    తన చేతిలోని జ్ఞాపిక చెయ్యి జారుతుంటే గుండె జారిపోతున్నట్లనిపించింది రేవంత్ కు!
    "మమ్మా... ఏంటలా కూర్చుండిపోయారు? టైమయింది లేవండీ!" అని తొందరచేసింది జ్ఞాపిక- హాసిని రూమ్ కెళ్లి.
    "ఏం.... ఇలా బాలేనా? ఇలా  చేసుకోకూడదా పెళ్ళి?! ఫర్వాలేదు లే!" అంది సింపుల్ గా. గులాబీరంగు చీర,  జాకెట్, చేతికి ఒకగాజు, మెడలో సన్న చైన్!
    "మీకు ఇలా ఫర్వాలేదేమో... నాకు ఫర్వా ఉంది. ఉండండి...చీర సెలక్ట్ చేస్తా!" అని బీరువా తీసి హడావిడిగా వెతికి వయొలెట్ కలర్  కంచి చీర తీసింది! దాని మీదకి గాజులు, తలలోకి పూలు రెడీచేసి-
    "డ్రస్ చేసుకోండి మమ్మా... ప్లీజ్- నాకోసం!" అంది- అవి చూపిస్తూ, చీర కట్టుకోవడంలో సాయానికి వస్తూ.
    "ఇప్పుడివన్నీ వేసుకుంటే అతనే మనుకుంటారు? ఈ వయసులో ఇవ్వన్నీ ఏవిటీ... అని!" అంది.
    "అవునూఁ... మమ్మా- అతనెలా ఉంటారు?" అడిగింది.
    "తెలీదు! నేను చూసి కూడా ఇరవై రెండేళ్లయ్యింది!" అంది.
    "అంటే... పెళ్ళనుకున్నాక కలుసుకాలేదా?"
    "లేదు. ఫోన్ లోనే మాట్లాడుకున్నాం!"
    "మరతను నచ్చకపోతేనో... చూశాక!"
    "అతను నచ్చీ, నన్ను మెచ్చీ, చేసుకుంటానని వచ్చిన వ్యక్తే! ఇక నచ్చకపోవడం ఏవుందీ! ఇప్పుడసలు నచ్చాల్సింది మనసు కానీ, శరీరం కాదుగా!"
    "అంటే....మాలాగే మీరు కూడా సస్పన్స్ లో ఉన్నారన్నమాట- ఎవరెలా మారారో తెలీకుండా!"
    "అవును!" మెత్తగా నవ్వింది.
    "జ్ఞాపికా... గెట్ రెడీ! మమ్మా కోసం కారు రెడీ!" అని బయటినుండి పిలిచాడు రేవంత్.
    "మమ్మా కూడా రెడీ!" అని తలుపు తీసి తనను భుజాల చుట్టూ చేతులేసి బయటకు తీసుకొచ్చింది- తల్లి కూతుర్ని తెచ్చినట్టు! పెళ్ళి అలంకరణలో, తలనిండా పూలతో, చేతినిండా గాజులతో, కొంగు చుట్టూ కప్పుకుని నిలబడ్డ అమ్మను చూసి చిత్తరువయిపోయాడు రేవంత్.
    'అమ్మా....నువ్వెంత అందమైన దానివమా!' అనుకున్నాడు మనసులో!
    కొడుకు అలా చూస్తుంటే బిడియపడింది హాసిని!
    దగ్గరికెళ్లి మమ్మాను పొదివి పట్టుకుని జ్ఞాపికా, తనూ చెరోవైపునా కదిలివచ్చి కారులో ఎక్కిస్తుంటే..ఇద్దర్నీ చెరోవైపు పట్టుకుని ఏడ్చేసిందా తల్లి! తన బ్రతుకు కోసం  తాపత్రయ పడుతున్న బిడ్డల బాధ్యతనూ, శ్రమనూ, ఆనందాన్నీ చూసుకుని గర్వంగా కళ్ళు చెమరుస్తుంటే..ఇద్దరూ భుజాలు తట్టారు.
    రేవంత్ నూ, జ్ఞాపికను నుదుటి మీద ముద్దుపెట్టి పారాణి కాలు కారులో మోపింది సుహాసిని- కొత్త తరపు విజయపు పచ్చిదనంలా! తల్లిదండ్రీ కూతుర్ని అత్తవారింటికి పంపుతున్నట్టు- కారులోంచి తల్లి తిరిగి తిరిగి చూస్తుంటే.... టాటా చెప్తూ అలానే నిలుచుండి పోయారిద్దరూ.
    కాసేపటికి తేరుకుని, 'గెట్ రెడీ! ఆనంద్ ను, రేవతినీ రిజిస్ట్రార్ ఆఫీసుకు తీసుకెళ్లాలి. టైమయింది!" తొందరచేశాడు రేవంత్.
    "ఓ.కే!" అని అక్కడే చున్నీ విసిరేసి, చుడీదార్ విప్పబోయి - చట్టుక్కున రేవంత్ ను చూసి, "అరె! నువ్వు అబ్బాయివి కదా! సారీ...!" అని రూమ్ లోకి పరుగెత్తింది జ్ఞాపిక.
    ఐదు నిముషాల్లో రెడీ అయ్యారిద్దరూ!
    ఫ్రెండ్సందరూ గోలగోలగా వచ్చేశారు.
    రేవతి చీర జారిపోతోందని గొడవపెడితే...పిన్నులు పెట్టినా  నిలవకపోతే, సాటిన్ రిబ్బన్ కట్టారు నడుకును- చీర జారకుండా!
    జ్ఞాపిక ఆ రిబ్బన్ చూసి పడీపడీ నవ్వుతూ- "ఇదేంతే పెళ్ళి కాకముందే బాలింతలా కట్టుకున్నావ్!" అడిగింది రేవతిని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS