"అలాంటి అశాంతికి లోను కాకూడదంటే.....సిన్హా నవ్వుతూ అడిగాడు. "కలలు కనడం మానేస్తే సరిపోతుందా?"
"నో సర్! కలలకి పుట్టిల్లయిన మనసులోకి చూసుకుంటే సమస్య పరిష్కరమౌతుంది."
బ్రతికిలేని నాన్న ప్రాణాలు పోయి యిప్పటికి ఎంత దూరం ప్రయాణం చేసి వుంటాడో అతనికి తెలిదు.
"యస్సర్" నిర్వేదంగా అన్నాడు ధన్వి.
"మనం మన జీవితంలో ఎక్కువ భాగం పరిసరాలని, ప్రపంచాన్ని చూడడంలో, చదవాలని ప్రయత్నించడంలో వృధా చేస్తాం తప్ప మనలోకి మనం చూసుకోవాలని ప్రయత్నించం. చాలా శోధించిన శాస్త్రజ్ఞానం చంద్రుడి మీద కాలు పెట్టేదాకా గ్రహాల ఉనికిని తెలుసుకునే దాకా ప్రయాణం చేసిన మాట నిజం కానీ మనలోని మనల్ని శోధించగలిగే చదువుని మనకి అందించలేకపోయింది. అందుకే నేను బ్రతకటానికి , నా వారిని బ్రతికించుకోటానికి నాలో అవసరమైన 'ఆశ' క్రమంగా 'దురాశ' గా రూపాంతరం చెంది స్వార్ధంగా మారి నా చుట్టూ వున్న సంఘాన్ని అవినీతిమయంచేస్తుంది.
ఋషులు వేద ఘోషని సమాధి చేసి వ్యక్తిగత విలువల కోసం సంఘాన్ని నేరస్థుల వలయంగా మార్చి రోజురోజుకి కుంచించుకుపోతుంది.
"ఈ దేశం మీద మీకేంత నమ్మకం" అన్నాడు ఓ మెంబరు ధన్విని చూస్తూ. అందులో వ్యంగ్యం లేదు. భాధ ధ్వనించింది. "నీ వయసు వాళ్ళలో కనిపించని సాంఘిక స్పృహ దేశం మీద భక్తీ మీలో వినిపించడం నాకు ఆశ్చర్యంగా వుంది. ఇన్ని అరాచకాలు చూస్తున్నా యింకా మీరు యీ దేశ పౌరుడైనందుకు అనందిస్తున్నారా?"
"అనందం మాత్రమే కాదు సర్! గర్విస్తున్నాను" ఉద్వేగంగా అన్నాడు ధన్వి. తనకి జన్మనిచ్చిన వ్యక్తీ రాలిపోయిన క్షణంలో తండ్రి బ్రతికుండగావైఫల్యాలను చూస్తూ గడిపిన లిప్తల్ని గుర్తుచేసుకుంటు ఎమోషనల్ గా అన్నాడు ధన్వి. "నేను మాట్లాడేది మీకు అతిశయోక్తిగా కనిపించినా, యీ దేశం మీద ప్రేమని ప్రకటించే కుహనా దేశ భక్తుల్లో నేనూ మీకు ఒకడిగా అనిపించినా అందుకు నేను భాదపడను. కానీ నా దేశాన్ని నేను ప్రేమించడం మాత్రమే కాదు. ప్రేమిస్తున్నానన్న భావాన్ని కూడా ప్రేమించడాన్ని నేను యిష్టపడతాను."
విప్పారితంగా చూస్తున్నాడు సిన్హా.
* * * *
"సనాతన ధర్మాలకు ప్రతిరూపంగా నిలిచిన నా దేశం అగ్నిపునీత సీత మాత్రమే కాదు, అనాగారికతని నాగరికతగా పొరబడే ఎన్నో దేశాలకి భిక్షగా భగవద్గీతని అందించి అక్కడ విలక్షణమైన సంస్కృతులు ఏర్పడటానికి కారణమైన పుణ్యభూమి, మనిషి ఉనికిని గౌరవించని ఎన్నో దేశాలకి తలమానికమై మతం కన్నా మానవత్వం గొప్పదనే వేద నీతిని అమలుచేస్తూ ఏ మతం వారికైనా అగ్రసింహాసనాన్ని అందించి గౌరవించగల అందరి మాతృభూమి యిది. విదేశీ దండయాత్రలు ఎన్ని జరిగినా శిధిలం కాని చేవతో అంచెలంచెలుగా ఎదుగుతోన్న నా దేశం ఎంత విలక్షణమైనదీ అంటే నేడు సాంకేతికంగా ఎదుగుతున్న ప్రపంచ దేశాలకి ఆర్యభట్ట వంటి ఖగోళ శాస్త్రజ్ఞుడ్ని ధన్వంతరి లాంటి ఆయుర్వేద శ్రేష్టని స్వేచ్చా వాయువుల కోసం ప్రాణాలు ఒగ్గిపోరాడడం నేర్పిన భగత్ సింగ్ ల, గాంధీ చరిత్రల్ని అందించింది.
వేదభూమిగా పేరుగాంచిన నా పవిత్ర భూమి ప్రపంచ విజేతనంటూ ఇక్కడ అడుగు పెట్టిన అలెగ్జాండర్ వంటి చక్రవర్తుల్ని ఓడించి, అభయం కోరినపుడు క్షమించి వదిలిపెట్టిన పురుషోత్తములున్న నేలగా ప్రశస్తి పొందింది."
"కాని అది గతం" అన్నాడు ఓ మెంబర్.
"వర్తమానం కూడా అదే అని నేను మాత్రమే కాదు, మీరూ అంగికరించేవారు సర్" ఆగేడు ధన్వి క్షణం పాటు. "కానీ వ్యక్తుల మూలంగా నా దేశ చరిత్ర కాలుష్యంతో నిండిపోయింది. వ్యక్తుల స్వార్ధంతో చరిత్ర పుటలు రక్తంతో తడిసి హిమాలయాలకి ఎదగాల్సిన స్థాయి నుంచి హరప్పా మొహంజొదారో శిధిలలోకి జారిపోతుంది."
సిన్హా అవకాశం తీసుకోబోయినా ధన్వి ఆగలేదు. "అంతమాత్రం చేత యిది తిరోగమనం కాదు సర్.....రేపటి సూర్యోదయందాకా అలుముకున్న అంధకారం. యువతలో జడత్వానికి, చైతన్యానికి మద్య ఏర్పడ్డ సంధికాలం. ఈ విరామం నిడివి ఓ ఏడాది కావచ్చు, ఓ దశాబ్దం కావచ్చు కానీ మళ్ళీ మనం స్వర్ణయుగంలో అడుగుపెడతాం. అంగళ్ళలో రతనాల అమ్మిన అలనాటి చరిత్రకి వారసులుగా నిన్నటి దోపిడీ యుగం తర్వాత అన్న వస్త్రాల ఏర్పాటు నుంచి అణ్వస్త్రాలనూ సాధించగలిగిన సమర్ధులైన వ్యక్తుల అండతో 'సారే జహాసే అచ్ఛా హిందూసితాహమారా' అన్న స్థాయికి చేరుకుంటాం."
"గుడ్" అభినందనగా కాదు అసాధారణమైన పారవశ్యంతో అన్నాడు సిన్హా. "ఆశావాదిగా అలాంటి భారతాన్ని ర్వరలోనే చూడగల అదృష్టాన్ని కోరుకుంటున్నాను మిస్టర్ ధన్వి!" ఉన్నట్టుండి టక్కున అడిగాడు "మీ ఫాదర్ ఏం చేస్తుంటారు?"
ఉద్విగ్నంగా చూశాడు ధన్వి.
క్షణాల అంపశయ్య మీద కూర్చుని మృత్యుఛాయల గుండె గొంతుపై నర్తిస్తున్న విషాద తంత్రుల్ని నాదాలుగా పేర్చి మాట్లాడుతుంటే ఎందుకు.....ఎందుకిలా ప్రశ్నించారాయన.
ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడంలో నా ఆలోచన ఒక్కటే మిస్టర్ ధన్వీ.....మీ వయసుని మించిన మీ ఆలోచనలకి, సంస్కారానికి కారణం మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రమే కాదు. మీలోని పరిణితికి ముఖ్యంగా మీ నాన్నగారు కారణమనిపించి అలా అడిగాను."
మనసు సంక్షుభిత సాగరమైందో లేక కనుకొలనుల్లో తడిగా మిగిలిన మృత్యుకావ్యంపై అక్షరాల బిందువులు జారిపడబోయి ఆగినందుకు ఆనందమే అనిపించిందో మరి తనలోనూ ఆలోచనా పరిణతికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కారణమైన తండ్రిని మననం చేసుకోకుండా వుండలేకపోయాడు.
