Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 30


    "ఐటూ..." అతను ముందుకి ఒంగి నా నుదుటిమీద ముద్దు పెట్టుకుని అన్నాడు. "ఐ లవ్ దిస్ నేచర్... ఐ లవ్ ఎవ్రీ బ్యూటీఫుల్ ఆబ్జెక్ట్! ఇంక వెనక్కి పోదామా? లేక ఇంకా ముందుకు పోదామా?"
    
    "మేరేజ్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి?" డైరెక్ట్ గా అడిగేశాను. అలా నేను అడగాల్సిన పరిస్థితి వస్తుందని ఆ ముందురోజు కూడా అనుకోలేదు. అదే విధంటే!
    
    అతను నా భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరగా తీసుకున్నాడు. "మాధవీ.....ఎగ్జిబిషన్ కి వెళ్ళి కనిపించిన మొదటి షాపులో టెంప్టు అయి ఒక చీర కొంటావే అనుకో....ఇంకో షాపులో ఇంకా నచ్చిన చీర కనిపిస్తుంది. అప్పుడు అక్కడ కొనకుంటే బావుండేదని విచారిస్తావు. అలా జరగకుండా వుండాలంటే....మొత్తం షాపుల్నీ ఒకసారి తిరిగి బాగా నచ్చిన చీర కొనుక్కోవడం అలా కొన్నేళ్ళు ఆగాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి."
    
    "అలా వెయిట్ లిస్ట్ లో నా నెంబరెంత?" సూటిగా చూస్తూ అడిగాను.
    
    అతను కాసేపు మౌనంగా వుండి "ఊహూ! అసలు ఎవరితో ఈ పెళ్ళి ప్రసక్తి తీసుకురాను. ఇంతదాకా రావడం...నీతోనే అనుకుంటా" అన్నాడు.
    
    ఆ నిమిషంలో నాకు ఓపిక లేనట్లు అనిపించింది. అతను అంత అపురూపంగా కనిపించాడు.
    
    "నా సంగతి సరే! మీరెన్ని సంవత్సరాలు ఆగాలనుకుంటున్నారూ?" అన్నాను.
    
    అతను చాలా పజిల్డ్ గా చూసాడు. జేబులో చేతులు పెట్టుకుని ఆకాశంవైపు చూసాడు.
    
    కాసేపటికి తల దించుకుని "ఈ వివాహబంధం అనే బంధం నాకు ఇష్టంలేదు మాధవీ. స్నేహితులని ఎప్పుడు కలుసుకున్నా సంతోషంగా వుంటుంది. అదే భార్యాభర్తలవగానే ఒకరి ఇష్టాలు ఒకరికోసం త్యాగం చేసుకుంటూ....ఒకరికి ఒకరు భయపడుతూ నియంత్రించుకుంటూ...ఇట్ ఎ హెల్!" అన్నాడు.
    
    "ఒకవేళ మీ అభిప్రాయాన్ని మార్చుకుంటే నాకు తెలియపర్చండి" నాకు ఎంతో దుఃఖం వచ్చింది.
    
    "యా...ష్యూర్" అతను నాకు దగ్గరగా వచ్చి "కళ్ళు తుడుచుకుంటే ఒక మాటచెప్తా" అన్నాడు.
    
    నేను కళ్ళు తుడుచుకున్నాను.
    
    అతను నా నడుంని రెండు చేతుల్తో పట్టుకుని దగ్గరకి తీసుకుని "యూ ఆర్ ది మోస్ట్ టెంప్టింగ్ వన్....ఐ హేవ్ ఎవర్ సీన్! నిన్ను చూస్తూ నన్ను నేనే నియంత్రించుకోవడం కష్టం.....కాదు.....అసాధ్యం....వెళ్ళిపోదాం....ప్లీజ్" అన్నాడు.
    
    నాకు ఆ మాటలు టేప్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. ఇవే మాటలు ఇంకెవడన్నా అని వుంటే వెంటనే పళ్ళు రాలగొట్టి వుండేదాన్ని.
    
    "కమాన్....నువ్వు నీ నిర్ణయం మార్చుకున్నా.....నేను నా నిర్ణయం మార్చుకున్నా వెంటనే తెలియబరుచుకోవాలి....సరేనా! ప్రామిస్" అన్నాడు.
    
    "ప్రామిస్" అన్నాను.
    
    ఇద్దరం తిరిగి వచ్చేస్తుంటే వెన్నెల వెలవెలబోయి చూసింది. చందమామ చిన్నపోయి మబ్బులమాటున దాక్కున్నాడు. చుక్కలన్నీ చిక్కిపోయినట్లు కళ కోల్పోయాయి.
    
    మేం వెళ్ళిందీ, వచ్చిందీ కూడా అక్కడెవరూ పట్టించుకునే స్థితిలోలేరు. అంతా గోల....గొడవ....వీడియో వాళ్ళ మెరుపులు....సన్నాయి వాళ్ళ అరుపులూ!
    
    అతను ఆ రాత్రే ఎవరో జీప్ లో వెళుతుంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడుట. శ్రీను చేతికి తన సెల్ నెంబరూ ఎడ్రెసూ వున్న కార్డు ఇచ్చి పంపించాడు. నా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడట!
    
    నాకు చెప్పకుండా వెళ్ళినందుకు ఎంతో ఏడుపొచ్చింది. కానీ చెప్పి వెళ్ళినా అంతే బాధ కలిగేది. అలా జరిగింది మా పరిచయం" అంటూ ముగించింది మాధవి.
    
    "మరి ఊరికొచ్చాకా ఫోన్ చెయ్యలేదూ" ఆత్రంగా అడిగాను.
    
    "ఊహూ! నేను ఫోన్ చేస్తే అతని ప్రపోజల్ కి ఒప్పుకున్నట్లుగా భావిస్తాడు. అతను చేస్తే నా ప్రపోజల్ కి సుముఖంగా వున్నట్లు, దానికోసం వెయిట్ చేస్తున్నాను" అంది.
    
    ప్రదీప్ నాకు తెలుసు అని చెప్దామా అనిపించింది. నేను దానివైపు తిరిగేసరికే అది కిటికీలోంచి బయటకి చూస్తూ "ప్రతిరోజూ ప్రొద్దుట లేవగానే అతని ఫోన్ ఈ వేళైనా రావాలి అనుకుంటూ లేస్తాను. ఆ ఆశ నాకు కొత్త ఊపిరి పోస్తోంది" అంది.
    
    అది ఎంత డీప్ గా అతన్ని ప్రేమిస్తోందో అర్ధమయ్యాక కూడా నాకు అతనితో వున్న పరిచయం, అతని ప్రవర్తనా చెప్పడం అమానుషం అనిపించింది. అతను మాధవిని కలిసే ముందే నాతో పరిచయం జరిగింది. ఆరోజు.....అతనితో ఒక ఆడపిల్ల అతని ఇంట్లో వుందని తెలిశాకా నాకు కలిగిన ఈర్ష్య ఎంతటి బాధని రేపిందో నాకింకా పచ్చిగా వుంది. అటువంటి బాధ మాధవికి కలగడం నేను భరించలేను. మాధవి నాప్రాణం.
    
    కానీ నాకు ఏ మూలో సన్నగా బాధగానే వుంది. ఎందుకో అర్ధంకావడంలేదు. నేనూ అతన్ని ప్రేమించానా? గొంతంతా ఎండిపోయినట్లూ ఎక్కడా చుక్క నీరు కూడా దొరకనట్లు ఒకటే దాహం ఏమిటీ తృష్ణ? తీరే మార్గం ఏదీ?
    
    నేను మాధవి దగ్గరనించి ఇంటికొచ్చేసరికి టేబుల్ మీద ఓ శుభలేఖ కనిపించింది. శుభలేక మీద పునీతా వెడ్స్ రాకేష్ అని వుంది. నేను తీసుకుని లోపల చూశాను. అహల్యా, రఘురామ్ ల కుమార్తె పునీత పెళ్ళి కార్డు అని అర్ధమయింది.
    
    పెళ్ళికి ఇంకా వారం టైం వుందని తెలిసింది డేట్ చూశాకా.
    
    అనసూయతో వెళ్ళాలి అనుకున్నాను.
    
    వంటమనిషి కాఫీ తీసుకొచ్చింది.
    
    "నే వెళ్ళాకా అయ్యగారు ఏమన్నారూ?" అన్నాను.
    
    "మీరెళ్ళినప్పటి నుండీ అసలు ఇంటికే రాలేదమ్మా' అంది.
    
    'అమ్మయ్యా' అనుకున్నాను. నేను స్నానం చేసి వచ్చి ప్రయాణం బడలిక తీర్చుకుందామని బెడ్ మీద వాలాను.
    
    నిద్రపడుతుండగా ఎవరో ఆపకుండా బజర్ నొక్కుతున్న ధ్వని. విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీశాను.
    
    ఎదురుగా ఒక యాభైఏళ్ళ మనిషి నిలబడి వున్నాడు. అతను ఫుల్ సూట్ లో వున్నాడు. అతని మీదుగా చూస్తే గేట్ ముందు పార్క్ చేసిన మెర్సిడిస్ కారు కనిపించింది. ఆయన హుందాగా దర్పంగా వున్నాడు.
    
    నేను ఆశ్చర్యంగా చూస్తూ "ఎస్..." అన్నాను.
    
    "మీ పేరు సుమతా?" అడిగాడాయన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS