Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 3

 

                           స్వేచ్చ కోసం జైలు

                                                           జొన్నలగడ్డ రామలక్ష్మీ.
    
    బ్యాంకులో రష్ గా ఉంది.
    సమయం పన్నెండు గంటలు.
    సుమారు పాతికేళ్ళ యువకుడు. బ్యాంకులో ప్రవేశించాడు. తిన్నగా క్యాషియర్ వద్దకు వెళ్ళాడు.
    క్యాషియర్ అతడి వంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "నన్ను గోపీనాద్ పంపాడు" అన్నాడు అతడు.
    "గోపీనాద్ ఎవరు?" అన్నాడు క్యాషియర్.
    "గోపీనాద్ ఎవరో తెలియదా?" ఆన్నాడు అతడు .
    "తెలియదు...."
    "అయితే మీ ఏజంటు గారి నడుగు...."
    "నువ్వెవరు ?"
    "ఏజంటు గారి నడుగు. ఆయనే చెబుతారు...."
    "ఇప్పుడు బిజీగా ఉన్నాను" అన్నాడు క్యాషియరు.
    "ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం."
    "ఏమవుతుంది ?"
    "బ్యాంకు పేలిపోతుంది....."
    క్యాషియర్ ఉలిక్కిపడి అతడి వంక చూశాడు.
    యువకుడు చాలా మాములుగా అమాయకంగా చూస్తున్నాడు.
    "ఎందుకు పేలిపోతుంది ?"
    "బ్యాంకులో బాంబుంది? సరిగ్గా ఇంకో పావు గంటలో పేలుతుందది ...." అన్నాడు యువకుడు తాపీగా.
    క్యాషియర్ అతడి వంక ఆశ్చర్యంగా చూసి -- "నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా ?" అన్నాడు.
    "తెలియవలసింది నాక్కాదు. నీకు. అర్జంటుగా ఏజంటు ను కలుసుకో. ఎంతో టైము లేదు. ఇంక పద్నాలుగు నిముషాలే టైముంది...." అన్నాడా యువకుడు.
    అతడు గట్టిగానే మాట్లాడుతున్నాడు. అందువల్ల కొన్ని మాటలు కష్టమర్స్ చెవుల కూడా పడ్డాయి.
    బ్యాంకు లో కలకలం రేగింది.
    బాంబు .....బాంబు ....
    అందరినోటా ఇదే మాట ....
    ఈలోగా ఏజెంట్ గారి బల్ల మీద ఫోన్ మ్రోగింది.
    "హలో !" అన్నాడాయన.
    "నేను -- గోపీనాద్ ని ...." అందవతలి గొంతు.
    "గోపీనాద్ అంటే ?"
    "నీ బ్యాంకి లో బాంబు పెట్టినవాడు...."
    "బాంబేమిటి?"
    "సరిగ్గా పదమూడు నిమిషాల్లో అది పేల్తుంది. పోలీసుల్ని పెలిచే టైము లేదు. అంతా త్వరగా బయటకు పొండి...."
    "పోకపోతే ?"
    "బ్యాంకి భవనపు శిధిలాల్లో మీ శరీరాలూ శిధిలమై పోతాయి...."
    "హలో-- ఎవర్నువ్వు ?"
    అవతల క్లిక్ మంది.
    సరిగ్గా అప్పుడే క్యాషియర్ అక్కడకు వచ్చి -- "సార్ గోపీనాద్ ఎవరో మీకు తెలుసా ?" అన్నాడు.
    "గోపీనాద్ అంటే బ్యాంకిలో బాంబు పెట్టిన వాడేనా ?"
    'అంటే మీకు తెలుసన్న మాట !"
    'అవును. నీకెలా తెలుసు?"
    "ఇంక పన్నెండు నిముషాలే టయముంది " - క్యాషియర్ కంగారుగా అన్నాడు.
    "బ్యాంకిలో నిజంగా బాంబుందంటావా ?" ఏజెంట్ అనుమానంగా అడిగాడు.
    "బ్యాంకి లో నిజంగా బాంబుందంటావా ?" ఏజంట్ అనుమానంగా అడిగాడు.
    'అది నిజంగా ఉంటే -- ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుంటే -- ఆ తర్వాత మనం మిగలం " అన్నాడు క్యాషియర్.
    "ఏం చేద్దాం?"
    "పోలీసులకు ఫోన్ చేసి అందర్నీ హెచ్చరించడం మంచిది.
    అప్పటికే బ్యాంకిలో పెద్ద హడావుడి. రష్ లో తొడ తొక్కిడి. బ్యాంకుద్యోగులు కూడా కంగారుగా బయటకు వస్తున్నారు.
    ఏజంటు సద్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ తనూ హడావుడి పడుతున్నాడు.
    పావుగంటలోగానే జనం బ్యాంకు లోంచి బయటకు వచ్చారు.
    బాంబు పేలితే రాతిముక్కలు వచ్చి తమకు తగుల్తాయన్న భయంతో చాలామంది బిల్డింగుకు దూరంగా కూడా వెళ్ళారు.
    కొందరు ధైర్యవంతులు దగ్గర్లోనే వున్నారు.
    గార్డు మరీ దగ్గర్లో వున్నాడు.
    బ్యాంకు కాళీగా ఉన్న సమయంలో లోపల కెవ్వరూ వెళ్ళకూడదని అతడి తాపత్రయం.
    పావుగంట గడిచింది.
    ఏమీ జరుగలేదు.
    మరో పావుగంట....
    అయినా ఏమీ జరుగలేదు.
    ఈలోగా పోలీసులు వచ్చారు. వారు కూడా లోపలకు వెళ్ళే ముందు మరో పావుగంట ఎదురు చూశారు.
    బాంబులను డిటెక్టు చేయడానికి ప్రత్యెక శిక్షణ పొందిన కుక్కలు కూడా వచ్చాయి.
    సుమారు గంటసేపు బ్యాంకు బిల్డింగును క్షుణ్ణంగా శోధించటం జరిగింది.
    "ఎవరో మిమ్మల్ని ఫూల్ చేశారు" అన్నాడు పోలీస్ ఇన్ స్పెక్టర్.
    "దేశం నిండా టెర్రరిస్టు లెన్నో ఘోరాలు చేస్తున్నారు. నిన్ననే కదా జనరల్ వైద్యా హత్య చేయబడ్డారు.  ఇలాంటి ఫోన్ కాల్స్ ని లైటుగా తీసుకుందుకు లేదు" అన్నాడేజంటుగారు.
    "మంచిపనే చేశారు. కానీ అసలు జరిగిందేమిటో వివారంగా చెప్పండి."
    అంతా లోపలకు వెళ్ళారు.
    కస్టమర్స్ ని క్లియర్ చేయడానికా రోజు ఎక్స్ ట్రాగా పనిచేయడానికి స్టాప్ నిర్ణయించుకుంది.
    ఇన్ స్పెక్టర్ ఏజంటు చెప్పింది విని "ఆ గోపీనాద్ ఎవరో ?" అన్నాడాశ్చర్యంగా.
    "నాకు తెలియదు కానీ ...అంటూ క్యాషియర్ని పిలిచాడు.
    కానీ అయన పిలిచేలోగా క్యాషియర్ వచ్చి "సారీ లక్షరూపాయలు క్యాష్ మిస్సయింది " అన్నాడు కంగారుగా.
    "జాగ్రత్తగా చూశావా?" అన్నాడు ఏజంటు గా ఉలిక్కిపడి.
    "చూశాను సార్....అవన్నీ వందరూపాయల నోట్లు. కొత్త కట్టలు.... అవి తప్ప మిగతా పాత వందరూపాయల నోట్ల కట్టలన్నీ ఉన్నాయి."
    ఇన్ స్పెక్టర్ కళ్ళు పెద్దవయ్యాయి.
    "బ్యాంకు తలుపులు మూయించండి. అందర్నీ శోచించాలి " అన్నాడు అతడు.
    "అంటే దొంగ ఇంకా ఇక్కడే ఉంటాడనా ?" అన్నాడు ఏజంటుగారు.
    "అవకాశముంది ?" అన్నాడినస్పెక్టరు.
    బ్యాంకు గేటు మూసేశారు. పోలీసులక్కడున్న ప్రతి ఒక్కరినీ శోధించడం జరిగింది. బ్యాంకు స్టాప్ ని కూడా వదిలిపెట్టలేదు.
    "మా స్టాఫ్ అంతా నిజాయితీ పరులు...." అన్నాడు ఏజంటుగారు.
    "ఇలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేసే అవకాశం కస్టమర్స్ కంటే స్టాఫ్ కే ఎక్కువగా ఉంటుంది--" అన్నాడినస్పెక్టర్.
    బ్యాంకు స్టాఫ్ లో ముగ్గురు, కస్టమర్స్ లో అయిదు మొత్తం ఎనమండుగు రాడవారున్నారు. ఇన స్పెక్టర్ వాళ్ళను చెక్ చేయించడాని కిద్దరాడపోలీసులను రప్పించాడు.
    ఎవరి దగ్గరా ఏమీ ఆధారం దొరకలేదు-- ఆ దొంగ తనానికి సంబంధించి .
    పోలీసులు వెళ్ళిపోయారు. ఇన స్పెక్టరుండిపోయాడు.
    కస్టమర్స్ అందరూ క్లియర్ యాత్ర అతడు -- "దొంగ చాలా తేలికగా తాననుకున్నది సాధించాడు. మీలో ఒకరి సహకారముండి ఉంటె తప్ప - ఇది సాధ్యపడదు. మిమ్మల్నింకా కొన్ని ప్రశ్నలడగాలి--" అన్నాడు.
    "మమ్మల్నా?" అన్నాడు ఏజెంటు గా రాశ్చర్యంగా.
    "అవును . అసలేం జరిగిందో మరోసారి వివరంగా చెప్పండి --" అన్నాడినస్పెక్టర్.
    చెప్పడానికిద్దరి దగ్గరే ఉంది. ప్రత్యెక విశేషం. బ్యాంక్     ఏజెంట్ గారు, క్యాషియర్. వాళ్ళు మరోసారి తమ అనుభవాలు చెప్పారు.
    మిగతా స్టాఫంతా ఒక్కరు కూడా దొంగతనం చూడలేదు.
    "ఈ వ్యవహారంలో కనీసం ఇద్దరున్నారు. ఒకడు గోపీనాద్ . రెండవవాడు బ్యాంకుకు వచ్చిన యువకుడు. వాళ్ళిద్దరూ కలిసి చాలా తెలివిగా పధకం వేశారు. ఒకడు మీకు ఫోన్ చేశాడు. రెండోవాడు వ్యాన్కు కు వచ్చి మీ క్యాషియర్ని కలుసుకున్నాడు. చెదర గొట్టి కలకలం సృష్టించాడు. లక్షరూపాయలు తేలికగా కాజేశారంటే -- మీ బ్యాంకుద్యోగస్తులలో ఒకరి సహకారముండి ఉండాలని నా అనుమానం. ఈ రోజు నుంచీ మీరు మీ ఉద్యోగులందర్నీ శ్రద్దగా గమనించండి. వారిలో అనుమానించదగ్గ మార్పేది ఉన్నా నాకు తెలియజేయండి -" అన్నాడు ఇన స్పెక్టరు.
    "బ్యాంకు ద్యోగమంటే పది లక్షల పెట్టు ఈ రోజుల్లో. లక్ష రూపాయల చోరీ కోసం ఇంత రిస్కు ఎవరూ తీసుకోరు. అందులోనూ ఆ డబ్బును కనీసం మరో ఇద్దరితో పంచుకోవాలి ....' అన్నాడు బ్యాంకు ఏజంటుగారు.
    "నా ఉద్దేశ్యం వేరు. కేవలం డబ్బుకి ఆశపడే ఈ పని చేసి ఉండకపోవచ్చు. మీ ఉద్యోగులకు పాతిక ముప్పై వేల కోసం దొంగతనం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు.... కానీ పదివేలకోసం ప్రాణాలు తీసేవాళ్ళెందరో ఉన్న ఈ రోజుల్లో లక్ష రూపాయల కోసం ఏమైనా చేయగలవారెందరో ఉంటాడు. అలాంటి వారు పధకం వేసి మీ ఉద్యోగుల్లో ఎవరి పిల్లల్నో, తలిదండ్రుల్నో , భార్యల్నో కిడ్నాప్ చేసి బెదిరించి ఉండవచ్చుగా --" అన్నాడు ఇన స్పెక్టరు.
    "అవును. నా కిది స్పురించలేదు-- " అన్నాడు ఏజెంట్ గారు.
    "ఇటీవల బ్యాంకు చోరీలు బాగా ఎక్కువైపోయాయి. నేనిది సవాలుగా తీసుకుంటున్నాను. మీతో సహా మీ ఉద్యోగులందరి మీదా నిఘా వేసి అసలు విషయం అరా తీస్తాను . కానీ ...." అన్నాడినస్పెక్టర్.
    "కానీ ....?" అన్నాడు ఏజంటు గారు.
    "నిజంగానే మీ బ్యాంకుద్యోగుల హస్తం ఈ చోరీలో లేకపోతె ఆ దొంగను పట్టుకోవడం చాలా కష్టం. వాడు చాలా తెలివైనవాడని లెక్క ...." అంటూ నిట్టుర్చాడినస్పెక్టర్.

                                   2
    "వారం రోజుల్నించి చూస్తున్నాను. పోలీసులతో పెద్ద న్యూసెన్సు గా ఉంది --" అన్నాడు క్యాషియర్ ఏజెంటు గారితో-
    "అవును. అంతా ఇబ్బంది పడుతున్నారు --" అంటూ ఏజెంటు గారు నిట్టూర్చాడు.
    ఆయన్నందరూ ఏజంటుగారనే అంటారు. నిజానికాయన బ్రాంచి మేనేజరు. తన ఉద్యోగులందర్నీ కన్నబిడ్డల్లా చూసుకుంటా డాయన. అయన వయసు నలభై అయిదుంటుంది.
    దొంగతనం జరిగిన నాటి నుండి ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులందరి మీదా పోలీసు నిఘా పెరిగింది. ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళినా, బయటి నుంచి కొత్తవారెవరు వచ్చినా వెంటనే పోలీసులు ప్రశ్నలు వేస్తున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS