Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 3

 

    "మీకు  గొంతు నొప్పి అని రమేష్ బాబు చెప్పాడు. అందిసావిత్రి.
    మేలి ముసుగు లోంచి పరీక్షించి చూశాడు శరభయ్య.
    పాతికేళ్ళు ఉంటాయి. మనిషి చామన ఛాయా కంటే తక్కువే రంగులో! ముఖం కళగా ఉంది. శరీరం తీర్చి దిద్దినట్లుంది. తను అడదనుకుంటుందో ఏమో పైట సరిగ్గా సర్దుకోలేదు.
    "ఒక విధంగా మీ గొంతు నొప్పి వీరేశ్వర్రావుగారికి వరం కావచ్చు--" అంటూ మళ్ళీ నిట్టూర్చింది సావిత్రి.
    ఈ వీరేశ్వర్రావేవడు? సుజాత కు గొంతు నొప్పి అయితే వాడికేం లాభం? అంటే వాడి ప్రవర్తన సుజాత అరుపులకు దారి తీస్తుందన్న మాట! అంటే వాడు సుజాతను ఏం చేస్తాడు?
    శరభయ్య కు కొద్దిగా భయం వేసింది. విషయం తెలుసుకోవడానికి తన గొంతు ఎంతో కొంత విప్పితే తప్ప లాభం లేదనిపించింది శరభయ్యకు. ఎంతో కష్టపడి గొంతు పెగాల్చాడతడు --"ఈ వీరేశ్వర్రావెవడు -- నన్నేం చేస్తాడు?" అన్నాడతను. అన్నాక తనకే ఆశ్చర్యం వేసింది. అడ కంఠాన్ని చాలా బాగా అనుకరించాడు శరభయ్య.
    "రూపానికి తగ్గ అందమైన కంఠం!" అంది సావిత్రి మెచ్చుకుంటూ.
    "నా ప్రశ్నకు జవాబివ్వలేదు -" అన్నాడు శరభయ్య. ఈసారి మరి కాస్త ధైర్యంగా. తన అనుకరణ కంఠన్ని ఒక స్త్రీ మెచ్చుకోవడం అతనికి ధైర్యాన్ని పెంచింది.
    "నేను చెప్పేదేముంది -- ఇంకో  అరగంటలో ఆయనే వస్తారు గదా! ' అంది సావిత్రి.
    "చెప్పు సావిత్రి --" అన్నాడు శరభయ్య.
    "చెప్పడాని కేముందండీ -- తననుకున్నది మీ చేత ఒప్పిస్తాడు...." అంది సావిత్రి.
    "మనిషి చాలా బలంగా ఉంటాడా?" అన్నాడు శరభయ్య. జరగబోయేది అతనికి చూచాయగా స్పురించింది. వీరేశ్వర్రావు సుజాత మీద మోజు పడితే రమేష్ ఆమెను అతనికి ఏర్పాటు చేస్తున్నాడు.
    సావిత్రి నవ్వి -- "నీకు బలంగానే ఉంటాడు ..." అంది.
    "నువ్వెందుకొచ్చావిక్కడికి!" అన్నాడు శరభయ్య.
    "వీరేశ్వర్రావు గురించి చెబుదామని ...." అంది సావిత్రి.
    "చెప్పు...."
    "వీరేశ్వర్రావు చాలా ప్రమాదకరమైన మనిషి. ఆయన్నేదిరించడం ప్రాణాలతో చేలగాటమే అవుతుంది. అవసరమైతే అయన ఖూనీ కూడా వెనుదీయడు. ఇంత వరకూ అయన రెండు ఖూనీలు చేశాడు...."
    శరభయ్య ఉలిక్కిపడ్డాడు.
    "ఖునీలు చేశాడా , ఎందుకు?"
    "తన్ను మోసం చేసినా, తన మాట కాదన్నా అయన సహించలేడు--" అంది సావిత్రి.
    శరభయ్య ఆలోచిస్తున్నాడు. తను అడదనుకుని వీరేశ్వర్రావు ఇక్కడికి వస్తున్నాడు. బహుశా తన్ను బలవంతం చేస్తాడు. అసలు విషయం తెలిస్తే ఏం చేస్తాడు?
    అసలే ఖూనీలు చేసే మనిషి -- తన్ను క్షమిస్తాడా ?
    మళ్ళీ అడిగాడతను సావిత్రిని -- 'అయన చాలా బలంగా ఉంటాడా?"
    "నాకాయన కోపం గురించే కానీ, బలం గురించి తెలియదు. కోపంలో మనిషి రక్తం తాగగల సమర్దుడాయన సుజాత గారూ -- నా మాట వినండి!  వీరేశ్వర్రావు గారు చెప్పినట్లు వినండి. అయన ఏమంటే దానికి ఒప్పేసుకోండి. ఇది మీకు చెప్పాలనే వచ్చాను...."
    "ఈ విషయం చెప్పడానికి ప్రత్యేకంగా ఓ అడ మనిషిని పంపాలా?"
    "వీరేశ్వర్రావు గారికి ఓపిక తక్కువ. అయన వస్తూనే తన మనసులోని మాట చెప్పస్తాడు. దానికి మీరు ఎదురు చెబితే అయన నడుం కున్న బెల్టు విప్పి మరోసారి చెబుతాడు. ఆ తర్వాత అవుననే దాకా మీకు దెబ్బలే -- ఈ విషయం ముందుగానే మీకు తెలియబరిస్తే మీకు దెబ్బలు తప్పుతాయి గదా అని --" అంది సావిత్రి.
    "నాకు దెబ్బలు తప్పించాల్సిన అవసరం నీకేముంది"
    'గోవిందరావు గారికి మీ వంటి మీద దెబ్బ పడడం ఇష్టం లేదు. అందుకే నన్ను పంపారు..."
    "గోవిందరావేవడు?" అన్నాడు శరభయ్య ఆశ్చర్యంగా.
    "పార్వతికి మామయ్య...." అంది సావిత్రి.
    "పార్వతి ఎవరు?" అన్నాడు శరభయ్య యింకా తెల్లబోతూ.
    "సుజాతగారూ -- దయుంచి పార్వతి యెవరు అని వీరేశ్వర్రావు గారిని మాత్రం అడక్కండి. అయన పూర్తీ సహనం కోల్పోతారు ...." అంది సావిత్రి.
    "ఆయన్న్నడగడం లేదు, నిన్నేగా అడుగుతున్నాను" అన్నాడు శరభయ్య?
    "పార్వతీ ఎవరో తెలియకుండానే ఇక్కడి కొచ్చారని నమ్మమంటారు...." అని నవ్వి ఊరుకుంది సావిత్రీ. పార్వతి ఎవరో తెలుసుకోవడం అనుమానాల్ని కలిగిస్తుందని గ్రహించి ఊరుకొన్నాడు తను కూడా శరభయ్య. అతని మనసిప్పుడు వీరేశ్వర్రావు గురించి యెదురు చూస్తోంది.
    "వీరేశ్వర్రావు త్వరగా వస్తే బాగుండును. నాకీ హోటల్ గదిలో బోర్ కొడుతోంది --" అన్నాడు శరభయ్య.
    వెంటనే సావిత్రి టైము చూసుకొని -- 'ఇంక వీరేశ్వర్రావు రావడాని కైదు నిముషాల కంటే వ్యవధి లేదు. ఆయనోచ్చేసరికి నేనిక్కడుంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. మరి నే వెడతాను...." అని శరభయ్య జవాబు గురించి కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది.

                                     5
    సరిగ్గా అయిదు నిముషాల్లో గదిలోకి ఒక మనిషి వచ్చాడు.
    అతన్ని చూసి శరభయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆ మనిషి తననుకున్నట్లు లేడు.
    ఎత్తు అయిదడుగుల రెండంగుళాలు ఉంటుందేమో! మనిషి బక్కపలచగా ఉన్నాడు. గళ్ళ లుంగీ లోపల పువ్వుల షర్టు టక్ చేసి పైన పటాకా బెల్టు కట్టాడు. ముఖం చిన్నదైనా మీసాలు, మాత్రం గుబురుగా వున్నాయి. మనిషిని చూస్తె నవ్వోస్తుందేమో తప్ప భయం ఏమాత్రం కలుగదు. అతన్ని చూడగానే శరభయ్య కు చాలా ధైర్యం వచ్చింది.
    అతను శరభయ్య ను సమీపించి --"నన్ను వీరేశ్వర్రావంటారు. నువ్వేనా సుజాతవు --" అన్నాడు.
    "ఊ" అన్నాడు శరభయ్య. వీరేశ్వర్రావు మనిషలాగున్నాడు కానీ కంఠం కర్ణకఠోరంగా భయం పుట్టించేదిగా వుంది.
    "నేను నీతో మాట్లాడబోయే ముందుగా నా గురించి చెప్పుకోవాలి-- 'అని ఒక్క క్షణం ఆగి -- "ఎంతటి పెంకె ఘటాన్నైనా నేననుకున్న పనికి క్షణాల మీద ఒప్పించగల సామర్ధ్యం వుంది నాకు. ధర్మరాజు దుర్యోధనుడి దగ్గరకు రాయభారానికి కృష్ణుడికి బదులు నన్ను పంపించి ఉంటె యుద్ధం లేకుండా అర్ధరాజ్యం సంపాదించి పెట్టి ఉండేవాడ్ని. అది నా కధ -- " అన్నాడు వీరేశ్వర్రావు.
    "ఊ" అన్నాడు శరభయ్య.
    "నేనిప్పుడు వేసుకున్న డ్రస్సు స్పెషల్ గా నీకోసం వేశాను. నడుముకున్న బెల్టు విప్పానంటే, అది నా చేతి లోంచి గాలిలోకి లేచిందంటే మళ్ళీ ఎప్పుడు అపుతానో తెలియదు. అది నేనాపుతాను తప్పితే ఇంకెవ్వరూ ఆపలేరు. అలా రెండు ఖూనీలు కూడా చేశాను...." అన్నాడు వీరేశ్వర్రావు.
    'ఊ" అన్నాడు శరభయ్య.
    "కాబట్టి ఇప్పుడు చెప్పు. పార్వతికి నాట్యం నేర్పుతావా?" అన్నాడు వీరేశ్వర్రావు.
    శరభయ్యకు ఏమనాలో తెలియలేదు. పార్వతికి నాట్యం నేర్పడమేమిటో అర్ధం కాలేదు.
    "ఊ?" అన్నాడు శరభయ్య ప్రశ్నార్ధకంగా.
    "పార్వతికి నాట్యం నేర్పుతావా?"
    "నాట్యం నేర్పడానికి నాకు రావాలి గదా !" అన్నాడు శరభయ్య.
    "నువ్వు నాట్యం లో ఆరితేరిన దానివనే గదా నిన్ను తీసుకొస్తా!" అన్నాడు వీరేశ్వార్రావు.
    "సరే - అయితే నేర్పుతాను ...." అన్నాడు శరభయ్య. చాలా తొందరగా రెచ్చిపోయే స్వభావం గల వీరేశ్వర్రావు తో ఎక్కువసేపు మాట్లాడడం మంచిది కాదనుకున్నాడు శరభయ్య. తర్వాత ఆ పార్వతిని కలుసుకుంటే ఆడపిల్ల గదా - వ్యవహరించడం తేలిక.... అనుకున్నాడతను.
    వీరేశ్వర్రావు అట్టహాసం చేశాడు. ఆ నవ్వు భయం కరంగా వుంది. ఆ మనిషి గురించి తన్ను సావిత్రి ముందరగానే హెచ్చరించడం మంచిదే అయింది. లేకపోతె తను భంగపడి ఉండేవాడు.
    అయితే ఈ పార్వతి యెవరు'? ఆమెకు నాట్యం నేర్పడానికి సుజాతే ఎందుక్కావలస్సోచ్చింది? దానికైనా ఇంత హడావుడి ఎందుకు చేయాల్సొచ్చింది?
    "టైము పడుతుందేమోననుకున్నాడు. చాలా త్వరగా లోంగిపోయావు. ఇక్కడే ఉండు. క్షణాల మీద కారు సిద్దం చేయించి వస్తాను...." అంటూ బైటకు వెళ్ళాడు వీరేశ్వర్రావు. గది బైట గడియ వేసిన శబ్దం కూడా వినబడింది శరభయ్య కు.
    శరభయ్య మంచం మీంచి లేచి గొంతు సవరించుకొన్నాడు. అద్దం ముందుకు నడిచాడు. అద్దం లోని ప్రతిబింబం చూసుకొంటే అతనికి నవ్వు వచ్చింది. తను అచ్చం ఆడపిల్లలా ఉండడమే కాదు, చాలా బాగున్నాడు కూడా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS