శరభయ్య ఊహించిన కంటే అద్బుతంగా ఉండడం వల్ల ఆ హోటల్ అతనికి కాస్త భయాన్నే కలిగించింది. కానీ శరభయ్య భయం అర్ధం లేనిది, అర్ధం లేని విలువలకు అర్ధం లేని ఖర్చులు చేయడం ఇష్టం లేని మధ్య తరగతి మనిషి. అతను తప్పితే హోటల్ ప్రాంగణం లో అడుగు పెడితే అక్కడి వాడు ఇతన్ని అనుమానించేలా ఉండడతను.
కొంతసేపు ఆ ప్రాంగణం లో తిరిగేక శరభయ్య కు ధైర్యం వచ్చింది. అసలక్కడ ఎవ్వరూ అతని గురించి పట్టించుకోలేదు. ఏమీ అడగలేదు. అక్కడికి వచ్చిన చాలామంది శరభయ్యలాగానే వున్నారు. క్రమంగా శరభయ్య ధైర్యం పెరిగింది. అతనోసారి టైము చూసుకుని -- "నాకు మంచి ధైర్యం రావడానికిక్కడికి వచ్చేక నలభై అయిదు నిమిషాలు పట్టింది. నోట్ చేసుకోవలసిన పాయింటే --" అనుకున్నాడు.
ఈ నలభై అయిదు నిమిషాల్లో నూ శరభయ్య ఉత్తినే కూర్చోలేదు. హోటల్ గురించి చాలా తెలుసుకున్నాడు. హోటల్లో ఎక్కణ్ణించి యెక్కడికి వెళ్ళాలో చూసుకున్నాడు.
తొమ్మిది కావడానికింక సరిగ్గా పావుగంట మాత్రమే ఉంది.
తనిప్పుడెం చేయాలి?
నలభై యారో నంబరు గదికి సరిగ్గా తొమ్మిది గంటలకే వెళ్ళాలా లేక కాస్త ముందుగా వెళ్ళవచ్చా?" ఆమె టైము గురించి అంత ఖచ్చితంగా రాసింది? తొమ్మిది గంటలు అని రాయడంలో అమె ఉద్దేశ్యం ఏమిటి?
ఏమైనప్పటికీ శరభయ్య తొమ్మిది వరకూ ఆగి అప్పుడు ఆ గదికి వెళ్ళాడు.
గదిలో కి వెళ్ళడానికి అతన్నేవ్వరూ అడ్డగించలేదు. గడియ తీయగానే గది తలుపు తెరుచుకుంది కూడా. శరభయ్య గదిలో ప్రవేశించి ఆత్రుతగా అటూ ఇటూ చూశాడు.
అది నిజంగా యెంతో అందమైన గది. శరభయ్య తీరుబడిగా అ గది సౌందర్యాన్ని తిలకించే వాడె సోఫాలోని సుజాతను చూడకపోతే.
సుజాత అతన్ని చూస్తూనే చటుక్కున లేచి నిలబడింది -- "తలుపు బోల్టు వేయండి --" అంది.
శరభయ్య తలుపు బోల్టు వేసి ఆమెను సమీపించాడు.
'చాలా థాంక్స్ మిస్టర్ శరభయ్య! నా గురించి మీరు చాలా ధైర్యం చేశారు..." అందామె. హడావుడిగా -- "కానీ మీతో మాట్లాడ్డానికి నాకెంతో వ్యవధి లేదు. వెంటనే మనమిద్దరం బట్టలు మార్చుకోవాలి...."
"అంటే?' అన్నాడు శరభయ్య అర్ధం కాక.
'అంటే ఏముంది -- మీ బట్టలు నాకు. నా బట్టలు మీకు..."
శరభయ్య ఒకసారి ఆమె బట్టల్నీ తన బట్టల్నీ మార్చి మార్చి చూసి ఇబ్బందిగా ముఖం పెట్టి -- "నాకు చీర కట్టుకోవడం రాదు. అయినా నేనెందుకు చీర కట్టుకోవాలి?' అన్నాడు.
"చెప్పే వ్యవధి కానీ, ఎక్కువగా మాట్లాడే అవకాశం కానీ నాకు లేదు. ఒక ఆడపిల్లను రక్షించడానికి మీరీ మాత్రంసాయం చేయలేరా? మిస్టర్ శరభయ్యా!" అందామె.
ఆమె కళ్ళలోని విషాదాన్ని, ధైన్యాన్నీ చూసి కరిగిపోయాడు శరభయ్య. పెద్దగా ఆలోచించకుండానే -- సరే!" అన్నాడు . అతని నోటి మాట ఇంకా వెలువడకుండానే సుజాత తను కట్టుకున్న చీర విప్పి పారేసింది. శరభయ్య అదోలా గైపోయి --"ఇక్కడేనా బట్టలు మార్చుకోవడం?' అన్నాడు.
'అవునూ ఇక్కడే -- అంతకు మించిన దారేముంది?" అందామె.
"బాత్రూం లోకి వెళ్ళి ...."
"మిస్టర్ శరభయ్య -- నా హడావుడి నీ కర్ధం కాదు. "నీ వంటి ఉత్తముడి కళ్ళబడితేనే మలినమై పొతే నా శరీరం ఎందుకూ పనికిరాదని కింద లెక్క. ప్లీజ్ -- అర్జంటుగా నేను బట్టలు మార్చుకుని ఈ గది లోంచి బయట పడాలి. మీరు కళ్ళు మూసుకోవాలని అంక్ష కూడా పెట్టను నేను...." అంటూ ఆమె ఒక్కొక్కటిగా తన బట్టలు విప్పేస్తోంది.
శరభయ్య ఆమె వంక చూసి చటుక్కున చొక్కా విప్పి ఆమె మీదకు విసిరాడు. ఆడపిల్ల అంత చొరవగా తీయడం చూసి అతను కంగారు పడి తన బట్టలు తొందరగా ఆమెకు అందజేశాడు.
క్షణాల మీద సుజాత అబ్బాయిలా తయారైంది -- "మీ పాంటు నాకు సరిగ్గా సరిపోయింది. చిక్కా కాస్త పొడగైంది కానీ ఫరవాలేదు. మీరు నాకంటే ఎంతో పొడుగు లేకపోవడం నాకు లాబించింది. మీరు త్వరగా చీర కట్టుకోండి. లేకపోతే ప్రమాదంలో పడిపోతారు...."
ఏమిటో అర్ధంకాకపోయినా మంత్రం ముగ్దుడిలా ఆమె చెప్పినట్లు చేశాడు శరభయ్య. అతడు చీర కట్టుకుందుకు ఆమె సాయం చేసింది. అతను చీర కట్టుకున్నాక "అచ్చు ఆడపిల్లలాగున్నారు--"అందామె.
ఆమె తనకు అంత దగ్గరగా రావడమూ తడమడమూ ఏదోలా అనిపించింది శరభయ్య కు. అతనేదో లోకాల్లో వున్నాడు.
"మిస్టర్ శరభయ్యా! ,మీరు మీ ముఖం కనిపించకండి. ముఖం మీదకి మేలి ముసుగు లాక్కోండి . ఇకమీదట పూర్తిగా మీ బుర్రకు పదును పెట్టి ఇక్కడ నుంచి తప్పించుకోండి. మీరిప్పుడున్నది త్రివేణి హోటలు నలభై ఆరో నంబరు గది కాదు. మృత్యు మందిరం . వెళ్ళిపోతున్నాను. మీసాయంతో నా ప్రాణాలు రక్షించు కొంటున్నాను. వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను మన్నించండి. మనం మళ్ళీ కలవగలమని ఆశిస్తున్నాను....'అంటూ సుజాత గడియ తీసుకుని గబగబా గదిలోంచి బైటకు వెళ్ళిపోయింది.
శరభయ్యకు అంతా విచిత్రంగా వుంది. ఇప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. తన వేషం చూసుకుంటే అతనికి చాలా సిగ్గుగా ఉంది. ఈ వేషం తను సుజాత కోసం వేశాడు. ఏమనుకుందో సుజాత తన గురించి .... ఏమనుకున్నప్పటికీ తన గురించి ఆమె మనసులో సదభిప్రాయముండి వుండాలి. లేకుంటే ఎంత ప్రాణ పాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆడది పరాయి మగాడి ముందు బట్టలు మార్చుకోదు.
ఆదృశ్యం గుర్తుకు రాగానే శరభయ్య శరీరం ఒక్క క్షణం వేడెక్కి వెంటనే చల్లారిపోయింది. పాపం, ఆడపిల్ల ఎంత కష్టంలో వుండకపోతే అలా ప్రవర్తిస్తుంది!" అనుకున్నాడతడు.
ఇప్పుడు తనేం చేయాలి?
శరభయ్యకు విషయం అర్ధమైంది. సుజాత తన శత్రువుకు దూరంగా పారిపోవాలను కుంటోంది. అందుకామెకు కొంత సమయం కావాలి. ఇప్పుడామె శత్రువులు గదిలో ప్రవేశించి తానెవరో తెలుసుకో గలిగితే బహుశా ఆమె దొరికిపోయినా దొరికిపోవచ్చు. ఏమాత్రం వీలున్నా ఆమె శత్రువులకు తనే సుజాత అన్న భ్రమలో ఎక్కువసేపు ఉంచాలి.
అది తన వల్ల అవుతుందా?
ఒకవేళ రమేష్ వస్తే వెంటనే తనను గుర్తు పట్టడూ? ఏమో-- ఏం జరుగుతుందో వేచి చూడాలి!"
ఒక ఆడపిల్లను రక్షిస్తున్నానన్న తృప్తి లో శరభయ్య కు ముందేం జరుగుతుందో అన్న భయం అట్టే వేయలేదు. అతనిలో కుతూహలమే ఎక్కువగా ఉంది. సహజంగా శరభయ్య భయస్తుడు కాడు.
4
సుజాత వెళ్ళిన పదిహేను నిముషాలకు గది గుమ్మం దగ్గర ఏదో అలికిదయింది.
శరభయ్య వెంటనే మంచం మీద పడుకుని గదిలోని దీపం అర్పేశాడు.
మరుక్షణం లోనే "సుజాతా!" అన్న పిలుపు వినిపించడతనికి. ఆ కంఠం గుర్తు పట్టాడతను. గుండెలు గుభిల్లుమన్నాయి. రమేష్ తనను కనుక్కోవడాని కెంతసేపు పట్టింది.
"సుజాత -- గదిలోనే ఉన్నావా?' మళ్ళీ రమష్ కంఠం వినిపించింది.
శరభయ్య ముడుచుకుని మంచంమీద పడుకున్నాడు. ఏ క్షణంలో గదిలో దీపం వేలుగుతుందోనని అతనికి భయంగా ఉంది. ముఖం మీదకు ముసుగు లాక్కున్నాడు. పాదాలను చీర లోపలకు లాక్కున్నాడు.
రమేష్ మంచం దగ్గరగా వచ్చి -- "సుజాత !అన్నాడు.
"ఊ" అన్నాడు శరభయ్య.
"నీ గొంతు నొప్పి ఇంకా తగ్గలేదా!' అన్నాడు రమేష్.
"ఊ ఊ "అన్నాడు తగ్గలేదన్నట్టుగా శరభయ్య. సుజాత తనను తన స్థానం లో ప్రవేశ పెట్టాలని ముందే అనుకుని గొంతు నొప్పిని సృష్టించి ఉంటుందని శరభయ్య ఉహించాడు.
"అయితే మాట్లాడకుండా పడుకో-- ఓ గంట తర్వాత సావిత్రి వస్తుంది. ఆమె చెప్పినట్లు విను. అనవసరంగా అల్లరి మాత్రం చేయకు..." అన్నాడు రమేష్ .
"ఊ" అన్నాడు శరభయ్య.
రమేష్ కళ్ళు ఇప్పుడు చీకట్లోకి చూడగల్గుతున్నాయి. అతను గోడ దగ్గరకు కెళ్ళి స్విచ్ వేశాడు. గదిలో దీపం వెలిగింది.
స్విచ్ చప్పుడు వింటూనే వీపును గుమ్మం వైపు తిప్పి పడుకున్నాడు శరభయ్య.
రమేష్ మంచం మీద పడుకున్న శరభయ్య ను పరీక్ష గా చూసి -- "తలుపు బైట వేస్తున్నాను. పారిపోవాలని ప్రయత్నించకు. దీపం తీసేసి వెళ్ళనా -- " అన్నాడు .
"ఊ" అన్నాడు శరభయ్య!
రమేష్ వెళ్ళిపోయాడు -- దీపం ఆర్పేసి.
జరిగిందంతా విచిత్రంగా వుంది శరభయ్య కు.
అసలీ గొడవంతా ఏమిటి? రమేష్ సుజాత వెనక ఎందుకు పడ్డాడు? అతనామే గురించి ఆశించే దేమిటి? రాబోతున్న ఈ సావిత్రి ఎవరు? ఆమె వస్తే సుజాత అల్లరి చేస్తుందని ఎందుకనుకోవాలి?
అన్ని ప్రశ్నలకూ కాలం తప్ప ఇంకెవరూ జవాబు చెప్పలేరు. శరభయ్య రేడియం దయాల్ వాచీ వంకే చూస్తూ ఆలోచిస్తున్నాడు. టైము సరిగ్గా పదయ్యే సరికి తలుపు దగ్గర మళ్ళీ చప్పుడైంది.
కొద్ది క్షణాల్లో లైట్లు వెలిగింది గదిలో!
శరభయ్య జాగ్రత్తగా పడుకున్నాడు. మెత్తని పాదాల సవ్వడి మంచం వరకూ వచ్చి ఆగిపోయింది. అప్పుడే చిన్న నిట్టుర్పు కూడా శరభయ్య కు వినబడింది -- "పచ్చటి ఛాయా -- ఈ రంగే నాకుంటే ఎంత బాగుండేది?" అని ఆమె మళ్ళీ నిట్టూర్చింది.
ఆమె సావిత్రి అయుండాలని అనుకున్నాడు శరభయ్య.
"సుజాతగారూ! మీ సౌందర్యం గురించి విన్నాను. కానీ చూసే భాగ్యం ఇంతవరకూ కలగలేదు. ఒక్కసారి మిమ్మల్ని చూడనివ్వండి ...." అందామె.
శరభయ్య ధైర్యం చిక్కబెట్టుకుని లేచి కూర్చుని మెలి ముసుగు మీదకు లాక్కున్నాడు.
"నా పేరు సావిత్రి -- " అందామె శరభయ్యను పరీక్షగా చూస్తూ.
"ఊ" అన్నాడు శరభయ్య.
