Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 3


    "మనమెందు కాకర్షించబడతాం?" అన్నాడు శేషగిరి.
    "పదమూడు వేల రూపాయలు ఖరీదైన వస్తువు చవగ్గా ఏడెనిమిది వేలకు వస్తే మనమే కాదు-ఎవరైనా ఆకర్షించబడతారు!"
    "అంటే అతడు మనకది ఏడెనిమిది వేల కమ్ముతాడంటావా?" అన్నాడు శేషగిరి అనుమానంగా.
    "వ్యవహారం చూస్తే నా కలాగే అనిపిస్తోంది....."
    "అమ్మితే కొనేద్దాంరా...." అన్నాడు శేషగిరి.
    శేషగిరి కొడుకు నవ్వి-"ఇదంతా ఊహ మాత్రమే! వాస్తవంకాదు...." అన్నాడు.
    శేషగిరి రవంత నిరుత్సాహపడి-"చవగ్గా వచ్చే పక్షంలో మనమూ వీసీఆర్ కొందామనుకుంటున్నట్లు అతడికెలా సూచించాలిరా!" అన్నాడు.
    "మనం సూచించడ మెందుకూ? అమ్మాలనుకుంటే అతడే మనకేదో సూచన ఇస్తాడు" అన్నాడు శేషగిరి కొడుకు.
    "సూచిస్తే మాత్రం మనం తప్పక కొందాం" అని "రాత్రికి రాత్రే ఊరెళ్ళిపోతున్నా నన్నాడు.....డబ్బు వెంటనే ఇవ్వాలో ఏమిటో....?" అన్నాడు శేషగిరి.
    "అవసరమైతే ఆఫీసు డబ్బు - ఇంట్లో ఏడు వేలుంది రేపు బ్యాంక్ లో టీటీఆర్ మీద లోన్ తీసి ఆ డబ్బు సర్దేయొచ్చు...." అన్నాడు శేషగిరి కొడుకు.
    "ఏడు వేల కత డొప్పుకోకపోతే?"
    "దొంగసరుకుకదా - ఎంతకయినా ఒప్పుకుంటాడు. మనకు మన దగ్గిరున్న ఏడు వేలూ చాలు...." అన్నాడు శేషగిరి కొడుకు.
    "ఏమో అంతా నీ యిష్టం......ఇంట్లో వీసీఆరుంటే సుఖంగా తెలుగు సినిమాలు చూడొచ్చు....." అన్నాడు శేషగిరి.
    "ఏం సుఖంలెండి-తెలుగు సినిమాలు చూడ్డం ఓ శాపమని అంతా అనుకుంటూంటే...." అన్నాడు శేషగిరి కొడుకు.
    "అది మీ తరం కాధరా - నీ చిన్నప్పటిదాకా ప్రతితెలుగు సినిమా ఓ కళాఖండం అనిపించుకునేది...." అన్నాడు శేషగిరి.
    "పాత సినిమాలు మనూళ్ళో దొరకటం - అంత సులభమేం కాదు...." అని - "అన్నట్లు మనం వీసీఆర్ కొంటే అదెలాంటి కండిషన్ లో వుందో తెలుసుకుందుకు సినిమా చూస్తే సరిపోదు. మా స్నేహితుణ్ణి పిలవనా?" అన్నాడు శేషగిరి కొడుకు.
    "ఎవరినీ మిశ్రానా? అతడు చాలా గట్టివాడని విన్నాను. కానీ తెలుగు సినిమా చూడ్డం అతడికి పనిష్మెంటుకదూ?"
    "కాదు. ఖరగ్ పూర్ లో చదువుకునే రోజుల్లో అకక్డ తెలుగు మిత్రులతో కలిసి అతడు మాయాబజార్ సినిమా చూశాట్ట. ఎప్పుడో ముప్పయ్ ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అంటే అతడు నమ్మలేనన్నాడు. ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనుందని అతడు నాతో చాలాసార్లన్నాడు. కాబట్టి అతడు వీసీఆరే కాదు.....తెలుగు సినిమా చూడ్డానిక్కూడా వస్తాడు...."
    "సరే అయితే - అతగాడు ఓకే అన్నాడంటే వీసీఆర్.............
    
                                       2

    అనుకున్న ప్రకారం సరిగ్గా ఏడింటికి సినిమా మొదలయింది. వీసీఆర్ టీవీకి కలిపి పలికించడానికి గోపాల్ ఒక మెకానిక్ ని కూడా తీసుకొచ్చాడు. తన పని అయిపోగానే మెకానిక్ వెళ్ళిపోయాడు.
    అందరూ ఉత్సాహంగా సినిమా చూస్తున్నారు.
    సినిమా మొదలయిన కాసేపటికి మిశ్రా వచ్చాడు. వస్తూనే అతడు సినిమా చూడసాగాడు.
    చూస్తున్నంతసేపూ ఎవరికీ టైము తెలియలేదు.
    మూడు గంటలకు పైగా ఉన్న ఆ సినిమా మూడు క్షణాల్లో అయిపోయినట్లుంది.
    సినిమా అయిపోయినా చాలామంది ఆ పరవశం నుంచి తేరుకోలేదు.
    "వీసీఆర్ బాగుంది - ఎక్కడా ట్రబులివ్వలేదు...." అంటూ గోపాల్ని మెచ్చుకున్నాడు శేషగిరి.
    "వీసీఆర్ లో ఏముందండీ - మీ టీవీ రిసెప్ షన్ చాలా బాగుంది. బ్లాకండ్ వైటైనా కలర్ కంటే బాగుంది" అన్నాడు గోపాల్.
    "ఇతడు నా స్నేహితుడు మిశ్రా - మీ కోసం తీసుకొచ్చాను. వీసీఆర్ కండిషనెలాగుందో చెప్పగలడు. ఎలక్ట్రానిక్ ఎక్స్ పర్ట్...." అన్నాడు శేషగిరి కొడుకు.
    "చాలా థాంక్స్" అన్నాడు గోపాల్.
    మిశ్రా వీసీఆర్ ని చూస్తూంటే గోపాల్ శేషగిరి దగ్గిరగా వెళ్ళాడు.
    అప్పటికే సమయం పదింపావు దాటడంవల్ల శేషగిరి స్నేహితుల కుటుంబాలు వెళ్ళిపోయాయి.
    "వీసీఆరెంతో బాగుంది. అయినా నాకు సంతోషంగాలేదు...." అన్నాడు గోపాల్.
    "ఏమైంది?" అన్నాడు శేషగిరి.
    "ట్రెయిన్ లో చెకింగ్సవుతున్నాయట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారేమోనని భయంగా వుంది...." అన్నాడు గోపాల్.
    "అయితేనేం - పేపర్సన్నీ సక్రమంగా ఉన్నాయిగా!"
    "ఉన్నాయండి.....కానీ నేను పొరపాటున టికెట్ నా పేరునే కొన్నాను. వీసీఆరేమో నా పేరున లేదు. మరెవరి పేరునో ఉంది కదా! ఊళ్ళో ఊళ్ళో అయితే ఫరవాలేదు! తెచ్చుకొన్నామని చెప్పొచ్చు. రూలు ప్రకారం - కస్టమ్స్ క్లియరెన్సున్నా వీసీఆర్ అమ్మడానికి లేదు. ఎవరు కొనుక్కొన్నారో వారే ఉంచుకోవాలి. కాబట్టి ట్రయిన్ లో హరాస్ మెంటుంటుంది...."
    "అయితే ఏం చేస్తావ్?"
    "ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొనేముందీ విషయం తెలిస్తే బాగుండేది నాకు...." అన్నాడు గోపాల్.
    "పోనీ - మా కమ్మేస్తావా!" అన్నాడు శేషగిరి.
    గోపాల్ ఆశ్చర్యపోయినట్టు ముఖం పెట్టాడు. అసలది తన ఆలోచనలోనే లేదన్నాడు. కానీ ఒక విధంగా అదే మంచిదేమోననిపిస్తోందన్నాడు.
    చివరికి "ఏమిస్తారు?" అన్నాడు.
    "ఏం కావాలో నువ్వు చెప్పాలి!" అన్నాడు శేషగిరి.
    ఈలోగా మిశ్రా వచ్చి - "వీసీఆర్ ఎక్సలెంట్ కండిషన్లో వుంది - నే నిక సెలవు తీసుకొంటాను" అని చెప్పివెళ్ళిపోయాడు.
    "చూశారా వీ సి ఆర్ మంచి కండిషన్ లో కూడా ఉంది" అన్నాడు గోపాల్.
    "ఉందనుకో - కానీ మేము వ్యాపారస్థులం కాదు. అన్నిటికీ జీతాల మీద ఆధారం. కలర్ టీవీ కొనుక్కుందుకే యింకా తటపటాయిస్తున్నాం. కలర్ టీవీ లేకుండా వీసీఆర్ దండగే కదా! ఇప్పుడిది కొంటే రేపదీ కొనాలి" అన్నాడు శేషగిరి తన లౌక్యన్నంతా ప్రదర్శిస్తూ.
    "నేను పదమూడు వేలకు కొన్నాను. నాకు లాభం అవసరం లేదు...." అన్నాడు గోపాల్.
    "అంటే కొన్న ధరకే అమ్ముతానంటావు!" అన్నాడు శేషగిరి.
    "కొన్న ధర పదమూడు కాదండి. పదిహేను నా దగ్గిర పేపర్సు కూడా ఉన్నాయి" అన్నాడు గోపాల్.
    "ఒకసారి నేనా పేపర్సు చూడొచ్చా?" అన్నాడు శేషగిరి.
    "అమ్ముదామని అనుకోలేదు కదా - పేపర్స్ హోటల్లో ఉన్నాయి...."
    "మా నాన్నంటున్నది - ఓనరు కొన్న ధర కాదు......మీరు కొన్న ధర...." అన్నాడు శేషగిరి కొడుకు.
    "నేనూ ఈ రోజే కొన్నాను గదా! ఇందులో కన్షెషనేమిస్తాను? అంతగా కావాలంటే మాయాబజార్ కాసెట్ మీ దగ్గిర వదిలిపెట్టగలను....." అన్నాడు గోపాల్.
    "పదమూడు వేలయితే మేముకొనలేం...." అన్నాడు శేషగిరి.
    "ఎంతకు కొనగలరు?"
    "ఏడువేలు...." అన్నాడు శేషగిరి కొడుకు.
    శేషగిరి కొడుకువంక గుర్రుగా చూశాడు. అప్పుడే ఏడువేలనేసినందుకు!
    "వద్దులెండి-ఇంతకంటే కస్టమ్స్ చెకింగు విషయంలో రిస్కు తీసుకోవడమే మంచిది...." అన్నాడు గోపాల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS