Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 2


    "ఎవరు బాబూ ఆయన?"
    "పేరెందుకులెండి చెప్పడం - ఆయన పేరెవరికీ చెప్పకూడదని మా ఒప్పందం" అన్నాడు గోపాల్.
    "అయితే అదెలా టెస్టు చేశావు?" అన్నాడు శేషగిరి.
    "ఆ టెస్టు చేయడానికే మీ సాయం కావాలండి!"
    "సాయమా?" అన్నాడు శేషగిరి ఆశ్చర్యంగా.
    "అదేనండి -- మీ యింట్లో టీవీ ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. నేను వీసీఆర్ తెచ్చి మీ యింట్లో ప్లే చేస్తాను" అన్నాడు గోపాల్.
    "మాది బ్లాక్ అండ్ వైట్ టీవీ" అన్నాడు శేషగిరి కాస్త మొహమాటంగా.
    "టెస్టింగుకు పనికొస్తుందని నేను కూడా తెచ్చిన సినిమా కూడా బ్లాక్ అండ్ వైటే?" అన్నాడు గోపాల్.
    "ఏ పిక్చరేమిటి బాబూ అది?" అన్నాడు శేషగిరి స్నేహితుడొకాయన కుతూహలంగా.
    "మాయా బజార్!" అన్నాడు గోపాల్.
    "మాయాబజారా?" అక్కడున్న వారందరూ ఉలిక్కిపడ్డారు.
    శేషగిరి కూడా కుతూహలంగా - "మాయాబజార్ సినిమా వీడియో ప్రింటుగా రిలీజ్ చేశారేమిటి?" అన్నాడు.
    "నిర్మాతలు చేసినట్లు లేదు. కానీ కాసెట్ దొరుకుతోంది. ప్రింటు బాగుందండి రాజమండ్రిలో చూశాను."
    "ఇలా కాసెట్లు చూడ్డం నేరం కాదూ?" అన్నాడు శేషగిరి.
    "నేరమేమిటండీ! ఆంధ్రాలో రిలీజయిన ప్రతి తెలుగు సినిమా కాసెట్ నేనిక్కడ వీడియో పార్లర్సులో చూస్తూనే ఉన్నాను. ఎవరూ పట్టించుకోవడంలేదు."
    "మీ యింట్లో మాయాబజారు సినిమా వేసుకుందామండి. మీరు సినిమా చూసినట్లూ ఉంటుంది. నా వీసీఆర్ టెస్టింగూ అయిపోతుంది" అన్నాడు గోపాల్.
    శేషగిరి ఆలోచనలో పడ్డాడు.
    "కావాలంటే మీరు మీ స్నేహితులక్కూడా కబురు పెట్టుకోండి...."
    శేషగిరి స్నేహితులు వెంటనే "ఒప్పుకోండీ-మేమూ మా వాళ్ళను తీసుకుని వస్తాం" అని "ఎన్నింటికి వేస్తావేమిటి నాయినా సినిమా!" అనడిగారు గోపాల్ని.
    "ఏడింటికి మొదలు పెడితే పదింటికయిపోతుంది! నేను కోరమాండల్ సులభంగా అందుకోగలుగుతాను."
    "మరి నీ భోజనం?" అన్నాడు శేషగిరి.
    "శనివారం నేను ఫలహారం కూడా చేయను. పానీయము కూడా తాగను - మంచినీళ్ళు తప్ప...." అన్నాడు గోపాల్.
    శేషగిరి మనసు తేలిక పడింది. భోజనం కోసం గోపాల్ తనింటికి వస్తున్నాడని అనుమానించినందు కాయిన నొచ్చుకున్నాడు కూడా.
    "సినిమా కోసం ఈ ఇల్లే ఎందుకెన్నుకున్నావు?" అన్నాడు శేషగిరి స్నేహితుడొకడు.
    "ఇలా వెడుతూంటే తెలుగు మాటలు వినిపించాయి. ఇంటిమీద యాంటెన్నా కనబడింది. ప్రయత్నిద్దామని వచ్చాను. మీ కిబ్బంది కలిగించినందుకు మన్నించాలి" అన్నాడు గోపాల్.
    "ఊరికే సినిమా చూపిస్తూంటే ఇబ్బందేముంది? అందులోనూ తెలుగుసినిమా-అదీ మాయాబజార్!" అన్నాడు శేషగిరి స్నేహితుడు.
    "అయితే నేను సెలవు తీసుకుంటానండి. మళ్ళీ ఏడింటికల్లా వచ్చేయాలిగా-"అన్నాడతడు.
    "ఎక్కడుంటున్నావు బాబూ!" అన్నాడు శేషగిరి ఆప్యాయంగా.
    "హోటల్ అనార్కలీలోనండి-వెళ్ళి వీసీఆర్ తీసుకుని ఏడుకు కాస్త ముందే వచ్చేస్తానండి..." అని వెళ్ళిపోయాడు గోపాల్.
    "ఏడంటే ఇంక గంటన్నరే టైముంది! మరి మేమూ వెళ్ళి ఇంట్లో వాళ్ళక్కబురు చెప్పి తీసుకుని రావద్దూ?" అంటూ లేచాడు శేషగిరి స్నేహితులు.
    శేషగిరి స్నేహితులను పంపించి గేటువేసి లోపలకు వెళ్ళాడు.
    శేషగిరి భార్య, కొడుకు, కోడలు, కూతురు - అక్కడ కూర్చుని పేకాడుకొంటున్నారు.
    "వంటయిందా?" అన్నాడు శేషగిరి.
    "ఏం-ఈ రోజప్పుడే ఆకలిగా ఉందామీకు?" అంది శేషగిరి భార్య పేకముక్కల మీంచి దృష్టి మరల్చకుండా.
    "ఆకలికాదు-సినిమా ఉంది-"
    "సినిమా ఏమిటి?" అంది శేషగిరి కూతురు. ఆమె కూడా పేకముక్కల మీంచి దృష్టి మరల్చలేదు.
    "మాయాబజార్-వీసీఆర్లో-మనింట్లో!" అన్నాడు శేషగిరి.
    ఒక్కసారి అక్కడున్న నలుగురి చేతుల్లోంచీ పేకముక్కలు జారిపడ్డాయి.
    "ఏమిటి మీరంటున్నది?" అంది శేషగిరి భార్య.
    శేషగిరి వారందరికీ జరిగిందంతా వివరించి చెప్పాడు.
    "చాలా తమాషాగా ఉందే-" అంది శేషగిరికోడలు.
    "ఇందులో ఏదో మోసముంది!" అన్నాడు శేషగిరి కొడుకు.
    ఏమిటంటావ్?" అన్నాడు శేషగిరి.
    "నాన్నా-మోసంగురించి అన్నయ్యా నువ్వు చర్చిస్తూండండి.ఈలోగా నేనూ, అమ్మా, వదినా వంట పని పూర్తిచేసుకుని వస్తాం-" అంటూ లేచింది శేషగిరి కూతురు.
    "మాయాబజార్ సినిమా చూసి చాలా కాలమయింది. మొదట్నించీ చూడాలి-" అనుకుంటూ లోపలకు నడిచింది శేషగిరి భార్య. మిగతా ఆడవాళ్ళిద్దరూ ఆమె ననుసరించారు.
    "ఏమిట్రా-ఇందులో మోస మేముంటుంది?" అన్నాడు శేషగిరి.
    "ఏమో-ఏముంటుందో నేనూ చెప్పలేను. వినగానే అలాగనిపించిందంతే-" అన్నాడు శేషగిరి కొడుకు.
    "ఆ కుర్రాడు చాలా బుద్దిమంతుడిలాగానూ, మర్యాద స్థుడిలాగానూ ఉన్నాడు. ఇందులో మోసముండే అవకాశం లేదు. ఇలా వంకపెట్టి వచ్చి మనిల్లు దోచుకుని వెళ్ళిపోడానికి-మనదేమైనా భాగ్యవంతుల కొంపా ఏమన్నానా?" అన్నాడు శేషగిరి.
    "కానీ మనతోపాటు-మరో నాలుగు కుటుంబాలు కూడా సినిమా చూడ్డాని కొస్తాయి గదా" అన్నాడు శేషగిరి.
    "అయితే ఆ నలుగురిళ్ళలోనూ దొంగతనాలు జరుగుతాయంటావా?" అన్నాడు శేషగిరి.
    "ఏమో-ఆ నలుగురూ ఎప్పుడూ యిళ్ళకు తాళాలు పెట్టుకుని బైటకు వెళ్ళలేదా? ఈ చుట్టుపక్కల దొంగతనాలు జరగడం వినలేదు నేను...." అన్నాడు శేషగిరి కొడుకు.
    "ఏమిటో-అన్నీ నువ్వే అంటావు-నీ ఉద్దేశ్య మేమిటో నాకు తెలియడం లేదు-" అన్నాడు శేషగిరి.
    శేషగిరి కొడుకు కొద్ది క్షణాలాలోచించి-"నా కొకటనిపిస్తోంది..." అన్నాడు.
    "చెప్పు"
    "ఆ గోపాల్ మీకన్నీ అబద్దాలు చెప్పాడు. అతడు వీసీఆర్ కొన్నాడనుకొను.....అమ్మే ప్రయత్నంలో ఉన్నాడు...."
    "ఎందుకలాగనుకుంటున్నావు?"
    "అతడు చెప్పినకథంతా అనుమానాస్పదంగా ఉంది. టెస్టు చేయకుండా ఎవరూ వీసీఆర్ కొనరు.....అందులోనూ ఇతడు పదమూడు వేలకు కొన్నానంటున్నాడు. అదేం తక్కువ మొత్తంకాదు...."
    "అయితే?"
    "నా అనుమానం ప్రకారం మీరు చెప్పిన గోపాల్ దగ్గరకీ వీసీఆర్ సక్రమమైన పద్ధతిలో రాలేదు. దాన్నతడు స్మగ్లింగ్ చేస్తూనైనా ఉండాలి. లేదా దొంగతనం చేసి ఉండాలి...."
    "అయితే మనింట్లో సినిమా వేయడమెందుకు?"
    "ఎందుకేమిటి? ప్రచారానికి...."
    "అంటే?"
    "ఇంకా అర్ధంకాలేదా నాన్నా! కూడా మాయాబజార్ సినిమా తెచ్చాడు. వీసీఆర్ ఫ్రీగా మనింట్లో సినిమా వేస్తున్నాడు. అంటే-అతడు తన వీసీఆర్నే ప్రదర్శిస్తున్నాడు. పరోక్షంగా మన నాకర్షించాలని చూస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS