యుద్ధం ప్రకటించనంత పనిచేశారు మాధవరావూ, ఇందిరా కూడాను. పైకి మర్యాద కోసం మాట్లాడుతున్నా ఒకటో నంబరు శత్రువులుగా ఒకరి నొకరు పరిగనించుకున్నారు . అయినా సభ్యత పేరిట వాసన్ , మంజులతో కలిసి ఇద్దరూ ఆదివారం రాత్రి అసెంబ్లీ హల్లో "ఆఫ్టర్ ద సాల్" నాటకం చూడక తప్పలేదు మొదట వాసన్ పక్కన మంజుల, తరవాత మాధవరావు, ఆ పక్కన ఇందిరా కూర్చున్నారు. అలా కూర్చోడమే దుర్భర మనిపించింది ఇందిరకు. నాటకంలో లీనమయి పోదామంటే , అబ్బే అదేం అంత అద్భుతంగా లేదు. అసలు అక్కణ్ణించి ఎప్పుడు పోదామా అనిపిస్తోందామేకు. మాధవరావు మాత్రం సాధ్యమైనంత ఉదాసీనంగా కూర్చున్నాడు. అయితే మంజుల అసలు ఊరుకో లేదు. ఏదో మాట్లాడుతూనే ఉంది నాటాకాన్ని గురించి. మొదటి రెండంకాల తరవాత పది నిమిషాల విశ్రాంతి ఇచ్చారు. అందరూ ఆరు బయటికి వెళ్లి కోకాకోలాలు తాగుతున్నారు. నాటకం గురించి మంజులా, వాసన్ తెగ చర్చిస్తున్నారు. మాధవరావు మాత్రం ఆలోచనలో పడ్డట్టు కనబడుతున్నాడు. ఇందిర చేతిలోని కోకాకోలా మీద ఏకాగ్రత నిల్పింది. "హై ఇందూ, హౌడీ" అన్న మాటలతో బాటు వీపు మీద దెబ్బ పడ్డంతో ఉలిక్కిపడి చేతిలోని సీసా కింద పడేసినంత పని చేసింది ఇందిర. వచ్చింది రేణుకామాధుర్. ఒక్కత్తే రాలేదు -- తనతో ఒక పొడుగాటి పంజాబీ యువకుణ్ణి తీసుకు వచ్చింది .
"మల్హోత్రా అంటూ చెబుతానే......." రేణుక నిపుణంగా కన్నుకొట్టి నవ్వింది. వెంటనే అర్ధమయింది ఇందిర కు అతనెవరో......అతను రేణుకు కాబోయే భర్త!
అతను ఇందిర వంక ప్రశంసా పూర్వకంగా చూస్తూ ":రేణు అస్తమానం చెబుతూ ఉంటుంది మీ గురించి. ఇవాళ మీ పరిచయ భాగ్యమయింది." అన్నాడు చక్కని ఇంగ్లీషులో.
తనతో ఉన్నవాళ్ళ ని వీరికి పరిచయం చేయక తప్పలేదు ఇందిరకు. ఇంతలో నాటకం మొదలవుతుందన్న సూచనగా ఒక గంట మోగింది. నాటకం అది వాస్తవిక శైలలో ఉండటం వల్ల జనం అంతగా రాలేదు. అందువల్ల తమ పక్కనే ఖాళీ ఉందనీ, ఇందిర వస్తే బాగుండుననీ రేణు అంది. "వెళ్లి " వెళ్ళడం , అని ఇందిర తటపటాయించింది, ఆ తడబాటును మల్హోత్రా అపార్ధం చేసుకున్నాడు. ఎదురుగా మౌనంగా నుంచుని సిగరెట్టూ కాలుస్తున్న మాధవరావు వంక తిరిగి , "మీ రానుమతిస్తే ఇందిర ను మా జాగాలోకి తీసుకేడతాం" అన్నాడు నవ్వుతూ.
"నిరభ్యంతరంగా టక్కున జవాబిచ్చాడు మాధవరావు ఇందిర వంక చూడనైనా చూడకుండా.
"థాంక్స్" అంది ఇందిర హేళనగా.
మంజుల, వాసన్ అర్ధం కానట్టు చూస్తుండగానే రేణుతో కలిసి వెళ్ళిపోయింది ఇందిర , తిరిగి హాల్లోకి. మొత్తానికి నాటకం తొందరగా అయిపోయిందని పించింది. నాటకం పూర్తీ అయ్యేసరికి , మల్హోత్రా స్నేహితుడయి పోయాడు. తెగ వాగుతున్నఇద్దర్నీ చూసి రేణు చాలా సంతోషించింది. గేటు దగ్గరికి వచ్చి ఇందిరని మంజుల వాళ్ళ కప్పచెప్పారు.
"మీనుంచీ లాక్కున్నాం. మీరు కోపగించ కూడదు" అన్నాడతను.
మాధవరావు కనుబొమలు ముడి పడ్డాయి. "ఏమంత బాగుందనీ?' అని విసుక్కున్నాడు మనసులో.
డ్రైవ్ చేస్తున్న మాధవరావు పక్కన మంజుల కూర్చుంది. వెనకాల వాసన్ తో కలిసి కూర్చున్న ఇందిర నాటకం గురించి తన అభిప్రాయం చెప్పింది. మిల్లర్ నాటకం లో ప్రత్యేకత గురించీ, అందులోనూ "ఆప్టర్ ద ఫాల్" ;లో మార్లిన్ మన్రో పాత్ర చిత్రీకరణ గురించీ వాసన్ కి బోధపరిచింది. అంతా వింటూ మౌనంగా కూర్చున్నాడు మాధవరావు. ఇంటి దగ్గిర వీళ్ళని దింపి వెళ్ళిపోతున్న మాధవరావు ను ఎందుకో ఏడీపించాలని పించింది ఇందిరకు.
అనాలోచితంగా అంది "అంత మౌనం వహించారే మీరు? మధ్యలో చోటు మార్చానని కోపం గానీ, వచ్చిందా?"
"ఏమిటా మాటల తీరు!" అని ఆశ్చర్యంతో నూ, చిరాకు తోనూ ఆమె వంక చూశాడతను. అతను జవాబిచ్చే లోపలే వాసన్ అన్నాడు. "రాదూ, మాచేత అంత బతిమాలించుకుంటిరీ -- ఇంకెవరి తోనో పోయి కూర్చుంటే యెట్లా? ఏమి న్యాయమండీ ఇది?"
"గుడ్ నైట్ మంజులా" అని కేకేసి కారు స్టార్టు చేశాడు మాధవరావు. అతను తనని లక్ష్య పెట్టదలచు కాలేదని గుర్తించింది ఇందిర. నిర్లక్ష్యంగా తల ఎగరేసి, లోపలికి నడిచింది మంజులతో. 'ఇందిర రాక్షసి' అనుకున్నాడు ఆ రాత్రి మాధవరావు.
* * * *
అజ్ మల్ ఖాను రోడ్డు దగ్గిర బస్సెక్కితే , ఇందిర రెడ్ ఫోర్టు దాకా తప్పనిసరిగా నిలుచునే ప్రయాణం చేస్తుంది. సాధారణంగా రెడ్ ఫోర్టు దగ్గిర కూర్చునే జాగా దొరుకుతుంది. ఈ వ్యవహారం అలవాటయినందున ఆమె బస్సెక్క గానే ఒక చువ్వ పట్టుకుని నుంచోడం తప్ప చుట్టూ చూడ్డం కూడా మానేసింది. కానీ ఆ రోజు తన వంకే ఎవరో పరిశీలనగా చూస్తున్నట్టనిపించి తల తిప్పి చుట్టూ చూసింది. తనకంటే మూరేడేత్తున్న తలలోంచి నవ్వుతున్న కళ్ళు!'
"హల్లో జోగీ" అంది ఇందిర సంభ్రామాస్చార్యాలతో .
అతనూ హడావిడిగా ప్రశ్నలడగడం మొదలెట్టాడు. యూనివర్సిటీ లో అతనామే కు ఒక్క సంవత్సరం సీనియర్. అతడింజనీరింగ్ విద్యార్ధి అయినా చక్కని వక్త అవడంతో , వక్రుత్వపు పోటీల్లో కలుస్తూ ఉండేది ఇందిర మొదట్లో. అతనికి సాహిత్యంలో ఉన్న అభిరుచీ, భాషలు నేర్చుకోవడం లో ఉన్న అమితాసక్తీ ఇందిరకతన్ని మరింత సన్నిహితుడ్ని చేశాయి. తెలుగు శుభ్రంగా , ధారాళంగా మాట్లాడ గలిగేవాడు. పంజాబీ లో జరిగే రచనా వ్యాసంగం గురించి ఎప్పటి కప్పుడు చెబుతుండేవాడు. ఇంట్లో వాళ్ళు క్కూడా ఇతడి పంజాబీ చొరవ నచ్చిందేమో తమలో కలిపెసుకున్నారి'తన్ని. పరీక్షలయి పోయాక జోగీందర్ అరోరా చండీఘర్ వెళ్ళిపోయాడు. కొంతకాలం పాటు ఓపిగ్గా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది ఇందిర. ఆ తరవాతా అవి కూడా ఆగిపోయాయి. ఇంక ఇదే కలవడం.
"ఈ చెత్త బస్సులో నుంచుని ఎలా మాట్లాడుకోగలం? వచ్చేస్టాపు లో దిగుదాం. ఒక గంట లేటుగా పోతావా ఆఫీసు కి" అన్నాడు జోగి ఇంగ్లీషు లో.
"ఏం తెలుగు మర్చిపోయారా లేక ఈ మధ్య బడాసాహెబ్ వయ్యావా?" అని నవ్వింది ఇందిర. "ఉహూ నాకు మొదటి గంట క్లాసుంది వదలడానికి వీల్లేదు జోగీ"
"మరెలా? ఇంతకీ నీ ఎడ్రస్ ఏమిటి?' తన చేతిలోని లెదర్ కేసూ, ఇందిర చేతులోంచి లాక్కున్న పుస్తకాల కాట్టా ఒక చేతి మీద బాలన్సు చేసి, నిపుణం గా జేబులోంచి పెన్ను, పాకెట్ డైరీ తీసి ఎడ్రసు రాసుకున్నాడు.
"ఇవాళ సాయంత్రం ఫోను చేస్తాను. ఎక్కడో ఒక చోట కలుద్దాం. బోలెడు మాట్లాడాలి నీతో తెలుసా ఇందిరా?' అన్నాడు.
రెడ్ ఫోర్టు రాగానే ఖాళీ అయిన సీట్లో ఇద్దరూ సర్దుకు కూర్చున్నారు.
"ఫరవాలేదు తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు " అభినందించింది ఇందిర.
"ఏవిటనుకున్నావ్? ఐదేళ్ళు గడిపాను ఆంధ్రలో మరిచి పోయావా?"
"సరే కాని ఇక్కడికి ఎప్పుడు వచ్చావ్ చండీఘర్ నించీ?"
"దగ్గిర దగ్గిర ఒక సంవత్సర మయింది."
"చిత్రం! మనం ఇంతవరకూ తతస్తపడనే లేదు" ఆశ్చర్య పోయింది.
"నేను సాధారణంగా బస్సెక్కాను. నా దగ్గిర ఒక లాంబ్రెట్ట ఉంది. దాని క్లేచ్ వూడిపోయి కొంచెం పేచీ పెట్టిందివాళ" అన్నాడతను.
అన్సారీ రోడ్డు వచ్చింది. జోగీ దిగవలసిందక్కడే. "బై బై ఇందూ. సాయంత్రం ఫోను చేస్తాను." అంటూ బస్సు దిగాడు. కనుమరుగయ్యే వరకూ అతన్నే చూస్తూ కూర్చుంది ఇందిర. అన్నదమ్ముల్లేని ఆమెకు అన్న లాగ, తోడుగా దొరికాడితను. ఏదన్నా లేట్ షో సినిమాకి వెళ్ళాలన్నా, యూనివర్సిటీ లో సంస్కృతిక కార్యక్రమాల తరవాత ఇల్లు చేరాలన్నా జోగిందరే జత. మొదట్లో వాళ్ళ స్నేహాన్ని చూసి కొందరు గుసగుస లాడినా , తరవాత తరవాత అలవాటు పడి వీళ్ళిద్దరూ కేవలం స్నేహితులన్న విషయాన్ని గమనించారు. ఆమెకు రెడీ మెడ్ బందుత్వాలంటే గిట్టదు. అందువల్లనే ఆమె ఎప్పుడూ జోగిందర్ ను 'భయ్యా' అని పిలవలేదు. అది తెలిసే, ఆమెని విసిగించడాని కతనప్పుడప్పుడు 'బెహనీ' అంటూ ఉండేవాడు. అతనికో తమ్ముడూ, చెల్లెలూ ఉన్నారు. పెద్ద జమీందారులు కాకపోయినా బాగా కలవాళ్ళు. తండ్రి ప్రభుత్వపు ఇంజనీరింగు శాఖలో పనిచేస్తూ ఉండేవాడు. ఇప్పుడితనేం చేస్తున్నాడు? ఏ ఆఫీసులో ఉద్యోగం? పెళ్లి గట్రా చేసుకున్నాడా? అని జవాబు తెలియని ప్రశ్నలు వేసుకుంది ఇందిర.
