3
చివరి కామె ఒక నిర్ణయానికి వచ్చింది. "బాబుగారు చాలా ఉన్నవారే! ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. కాని ఎందుకో పెద్ద వారి మీద అలిగి వచ్చేశారు. ఫలానా పిల్లనే తప్ప పెళ్ళాడనన్నారో, లేక, పరదేశం పోతానన్నారో-- పెద్దవారు ఒప్పుకోలేదు. ఈయన గారు "జై పరమేశ్వరా!' అంటూ ఇల్లు వదిలేశారు. పెద్దలు వీరి మాట ఒప్పుకున్నట్లు ఉత్తరం రాగానే వెళ్ళిపోతారు. అప్పుడు వారి ఊరు తను కూడా వెళితే? తన ఊహకు తనకే నవ్వు వచ్చిందామెకు. వెళితే ఏం? నమ్ముకున్నవాడు కాస్తా నట్టేట ముంచి పోయే!
"కస్తూరీ!' ఊహల్లోంచి మేలుకుందామె.
"ఏం బాబూ?"
"ఏమిటి ఆలోచన?"
తన గత స్మృతి లో ఆమె మనసు వికలమైన క్షణాన అతను పలకరించాడు. వెంటనే ఏమీ మాట్లాడలేక పోయింది. కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి లేచి పోయింది.
అతను ఆశ్చర్య పడ్డాడు. కస్తూరి హృదయంలో ఏదో బాధ ఉంది.
ఆమె మళ్ళీ గదిలోకి వచ్చింది.
"నాకెవరూ దిక్కు లేరు, బాబూ! మీరు వెళ్ళేటప్పుడు నన్ను మీతో తీసుకు పోరూ?"
గిరిధారి రవీంద్రుని 'పోస్టాఫీసు ' కధలో రత్న తలపుకి వచ్చింది. అంత చిన్న పిల్లనే ఆ పోస్టు మాస్టరు వెంట తీసుకెళ్ల లేకపోయాడు. తను కస్తూరి ని వెంట తీసుకు వెళ్ళగలడా? అయినా అతను ఎక్కడికి వెళతాడు? తన కెవరున్నారు?
"అదేమిటి? నీవు ఇల్లూ, వాకిలీ , భర్తా, పిల్లలూ -- అందర్నీ వదిలి నాతొ వస్తావా?" అన్నాడు.
ఆమె నిట్టూర్చి , "అంతా ఉంటె దిక్కులేదని ఎందుకంటాను?" అంటూ ఎదురు ప్రశ్న వేసింది.
"నీకు ఎవరూ లేరా?"
"లేరు!"
"నీ భర్త ఏమయ్యాడు?"
"నన్ను వదిలి వెళ్ళాడు."
"ఎందుకు?"
"ఎందుకని చెప్పను! ఇద్దరం బాగుంటే లోకం చూడలేక పోయింది. వాళ్ళ వాళ్ళందరి'నీ కాదని నన్ను కట్టుకున్నాడు. కులపోళ్ళు 'ఎలి' పెట్టారు. కూలీ నాలీ కూడా దొరకలేదు. ఈ పట్నం చేరాం. అయినా అ ఊరి వాళ్ళందరూ ఇక్కడి కోస్తారు. నా ఒంటి మీది నగలమ్ముకుని ఎంతో పొదుపులాగా గడుపుతూ చౌకగా వస్తే ఒక రిక్షా అయినా కొనాలని చూస్తున్నాం. ఊళ్ళో వాళ్ళంతా వాడిని గేలి చేశారు. "ఆడదాని నగలమ్ముతావట్రా! అవి అయిపోయాక దాన్ని అమ్ముతావా?" అంటూ మనసు మీద తగిలే మాట లన్నారు. వాడు ఇంటికొచ్చి మూడు రోజులు అన్నం తినలేదు. "ఎక్కడికైనా పోయి డబ్బు సంపాదించుకు వస్తా' నన్నాడు. 'నేనూ వెంట వస్తా అన్నాను' 'నాకే గతి లేదు. నీవెందుకు? మెడకు డోలు' అన్నాడు. నేనేడిస్తే మళ్ళీ వచ్చి తీసుకు పోతానన్నాడు. అయినా 'ససేమిరా!' అన్నాను. చివరికి ఒకానాటి అర్ధరాత్రి నేను నిద్రలో ఉండగా చెప్పకుండా వెళ్ళిపోయాడు. లోకం కళ్ళు చల్లబడ్డాయి.
కస్తూరి ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
"ఊరుకో , ఏడవకు!"
"అంతటితో ఆగారా! పెద్ద మనుషులనుకున్నవాళ్ళే నన్ను లొంగ దీసుకోవాలని చూశారు. వలలు పన్నారు. ఎన్నెన్నో ఆశలు చూపించారు. "ఛీ! ఆడజన్మ మహా పాపిష్టిది బాబూ! నేనెవరికీ లొంగలేదు. ఎవరు నన్ను చేరవచ్చినా అమ్మోరిలా లేచాను. దానితో నేనే నా మొగుణ్ణి వెళ్ళగొట్టాననీ, నా నడత మంచిది కాదనే వాడు వెళ్ళి పోయాడనీ పుకార్లు లేవదీశారు."
'అతనిప్పుడెక్కడున్నట్టు?"
"ఏమో? ఎక్కడో సన్యాసుల్లో కలిశాడో!' నిర్లిప్తంగా అన్నదామె.
"సైన్యంలో చేరాడేమో? అందులో చేరితే బాగా డబ్బిస్తారుటగా! ఏదైతే నేం? తను బతికుండే నన్నిలా దిక్కులేని పక్షిని చేశాడు."
"బాధపడకు! రోజులు మంచివి కానప్పుడు అంతా అలాగే ఎదురు తిరుగుతుంది."
"నన్ను నడిపించవలసిన వాడు, నాలో తనకు నచ్చనిదేది ఉన్నా నాలుగు తన్ని దారికి తేవలసిన వాడు -- నన్ను గాలికి వదిలి వెళ్ళాడు."
ఆ మాట అతని కెక్కడో తగిలింది.
"నన్ను మీతో తీసుకు పొండి!"
"నీ భర్త -- నీకోసం వచ్చి వెదికితే?"
"నేను మీ దగ్గరున్నానని కొందరికి చెప్పి వెళితే సరి. ఎవరి కేం పట్టింది గాని అపర్ణమ్మగారికి నేనంటే ఇష్టం."
"ఆమె ఎవరు?"
"ఉన్నారు లెండి! మీలాగే పుస్తకాల పురుగు. నేను అప్పుడప్పుడూ మీ పుస్తకాలు పట్టుకెళ్ళి ఇస్తుంటాను కూడా."
"సరే! అలా చెయ్యవచ్చు కానీ, నేనెప్పటికీ మా ఊరు వెళ్ళకుండా ఇక్కడే ఉంటా?' అన్న అతని మాటలకు కస్తూరి ముఖాన గంటు పెట్టుకుంది.
'అంతేగాని, 'అలాగే , కస్తూరి!' అని ఒక్క మాట అనరు."
"మాట ఇస్తే -- మళ్ళీ తప్పుకునే వీలుంటుందా?"
"ఎందుకు ఉండదు? అందరు పెళ్ళి పెద్దల ముందు పెమాణాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారే! మా వోడు నన్నొదిలి పెట్టి పోలేదా? ఆ పెళ్ళిల్లె ఇట్టా పెటాకులై పోతున్నప్పుడు ఊరికే మాటవరసకు ఇచ్చే మాట లేపాటివి బాబూ!"
మళ్ళీ ఒక చురక తగిలినట్లని పించింది గిరిధారికి.
"సరేలే!' అంటూ ఏదో పని పురమాయించి ఆమెను పంపేశాడు.
* * * *
అయ్యగారు తీసుకెళతానని మాటవరస కైనా అనలేదు. ఎక్కడున్నాడో తెలియని కొడుకుని తలిదండ్రులకు చూపిన గౌరవాన్ని ఆమె రకరకాలుగా ఊహించుకుంది. తననెంతో మెచ్చుకుంటారు. పేరుకు పనిమనిషి అయినా ఒక మంచి కుటుంబపు ఆత్మీయత సంపాదించగలుగుతుంది తను. ఊహలో మెరిసిన ఆధిక్యం కోపం పరితపించిందామె హృదయం. ఉబికిన కన్నీటిలో నుంచి రోషం తన్నుకొచ్చింది. అందులో నుంచి మరొక భావం. తను దిక్కులేనిది. తను నెలంతా చాకిరీ చేయటం, ఆయనగారు ఇంత అని ప్రతిఫలం ఇవ్వటం. అంతకు మించి తమ మధ్య ఏం సంబంధం ఉంది? ఉందనుకున్నా అది భ్రాంతి. 'నేను పనిమనిషిని! పనిమనిషిని!' అని ఒకటికి రెండు సార్లు గట్టిగా అనుకుంది. కాని వెంటనే తన కధ విన్నప్పుడు అతని ముఖంలో వెలిసిన బాధ, కళ్ళలోని కరుణా దృష్టి తలపుకు వచ్చాయి. 'కాదు, ఆయనగారికి నాపై జాలి , దయ, సానుభూతి అన్నీ ఉన్నాయి.' అని మనసు ఓదార్చింది.
4
సుమారు పాతికేళ్ళ వయసులో నిండు యవ్వనం లో ఉన్న కస్తూరిని చూసినప్పుడల్లా గిరిధారి మనసు ఎలాగో అయ్యేది. అయితే ఈ వేదన సానుభూతి భరితమైంది. ఇందులో కల్మషానికి తావు లేదు. ఉన్నట్టుండి ఒకనాతని లా అడిగేశాడు.
"కస్తూరి! నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోరాదూ? మీ కులంలో మారు మనువు తప్పు కాదను కుంటాను."
కస్తూరి విస్తుపోయి వెంటనే తేరుకుని నవ్వింది.
"బలే బాగా చెప్పారయ్యగారూ! ఒకవేళ చేసుకున్నానే అనుకోండి! అప్పుడు పాత మొగుడు తిరిగొస్తే ఇద్దర్నీ నేనేం చేసుకోను!'అంటూ ఫక్కున నవ్వింది మళ్ళీ.
"అతను తిరిగి వస్తాడనే- నీ పూర్తీ నమ్మకమా?"
గంబీరంగా అతనడిగిన ప్రశ్నకు -- "వస్తాడు" అని నిశ్చలంగా జవాబిచ్చిందామె. "వస్తాడయ్యా!అసలు నేను బ్రతుకుతున్నది ఏ నమ్మకంతో అనుకున్నారు? లేకపోతె దేవుడెందుకు ముడి పెడతాడసలు!" అంటూ ఎదురు ప్రశ్నలు వేసింది.
"పొద్దుపోక అప్పుడప్పు డిలాంటి పిచ్చి పనులు చేస్తుంటాడు."
'అలా అనకండి! దేవుడేది చేసినా మన మంచికే- ముందు అర్ధం కాక తన్నుకు లాడతాం."
"మంచా పాడా! చూడు, నువ్విట్టాగే ఎదురు చూస్తూ ముసలిదాని వౌతావు. ఆ తరవాత అతను వచ్చెం? రాకేం?" ఆమె నవ్వుతుంటే కన్నీళ్లు తిరిగాయి. ఎండా వానా లాంటి ఆ కలయికను ముగ్ధుడై చూశాడతను. అసలు తనకెందుకీ పట్టుదల? ఎక్కడున్నాడో తెలియని కస్తూరి భర్త పట్ల ఆమె మనసులో ఒక నిరసన భావం ఉందయింపజేస్తే తనకు ఒరిగేదేమిటి? తన మనస్తత్వం తన మాట వినకుండా వికృతమౌతున్నదనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
"అలా అనకండి, అయ్యగారూ! నేనింకాస్సేపటికి చస్తాననగానైనా వాడొచ్చి "నిన్నుసురు పెట్టానే, కస్తూరి , నా మీద కోపం ఉంచుకోకే' అంటే చాలదూ? వాడి ఒళ్ళో తల పెట్టి , వాడి చూపులో నిలిపిన నా చూపులో నుంచి ప్రాణాలు పొతే అంతకన్నా ఏం కావాలి నాకు? ఆడదాని సంగతి మీకేం తెలుసు!"అంటూనే ఉద్వేగంతో, ఆ అదృష్టం పట్టినంత భ్రాంతి తో ఉక్కిరిబిక్కిరి కాసాగిందామె.
గిరిధారి ఆశ్చర్యపోయాడు. 'అయితే నీకు ఇల్లూ, వాకిలీ , భర్తా, పిల్లలూ- వీళ్ళతో సుఖపడాలని లేదా' అనడిగాడు.
"ఎందుకు ఉండదు? నే నాడదాన్ని కాదూ?"
"మరి ఆ కోరికలు తీర్చుకోవూ?"
"మన చేతిలో ఏముంది? అంతా దేవుడి దయ. ప్రాప్తం ఎంతవరకో అంతవరకే దక్కేది. పుట్టెడు రాశిలో పోర్లాడినా ఎంతవరకో అంతే అంటుతుంది."
"మనం మేం చెయ్యక్కర్లేదా?"
"మన మేం చేసినా అలా చెయ్యాల్సి ఉందని దేవుడి పుస్తకంలో అయన ముందే రాసి పెడతాడు."
"నీదొక చాదస్తం! ఈసరికి నీ భర్త మరొకరి ని కట్టుకుని ఉంటాడు."
"అది జరగదు."
"అతని పేరూ, అడ్రస్సూ ఉన్నా బాగుండేది."
"పేరు రాములు. ఇప్పుడు రామారావు అయి ఉంటాడు. రా..... మా....రా....వు!" సాగదీస్తూ అంది.
"నీ నమ్మకం ఏమిటి?"
"దళంలో చేరాడనే -- ఒక నాటికి నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తాడని."
"నీ నమ్మకమే తపస్సుగా ఫలించాలి, కస్తూరి! అంతకన్నా నీ కోసం నేను ఏమీ చెయ్యలేను" అని తనలోనే అనుకుంటూ నిట్టూర్చాడు గిరిధారి.
* * * *
గిరిధారి రాక పూర్వం సంగతి -- ఒకనాడు కస్తూరి అపర్ణ దగ్గరి కెళ్ళింది. అంతస్తులు తేడా అయినా కస్తూరీ, అపర్ణా మంచి స్నేహితురాళ్ళు. రోజులో కొంత భాగం కస్తూరికి అపర్ణ దగ్గరే గడిచేది. ఆమె ఏదో చదివి వినిపిస్తూ ఉండేది. ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు.
"మీరూ రోజూ చదివే పుస్తకాలేమీటమ్మాయి గారూ?"
"పత్రికలూ, నవలలూ."
"వాటిల్లో ఏముంటాయి.?"
"కధలూ, బొమ్మలూ, ఇంకా సినిమాలూ , రాజకీయాలు -- అన్నీ ఉంటాయి."
'అవన్నీ చదివితే మీకేమిటి లాభం?"
అపర్ణ నవ్వి , "లాభమేముంది? ఏదో కాలక్షేపానికి అంది.
"అంతే నన్న మాట!"
"కస్తూరీ , నీవు రాయటం, చదవటం నేర్చుకో రాదే?"
"ఎందుకు?"
అపర్ణ ఒక్క దీర్ఘమైన నిట్టుర్పు వదిలింది.
"చూశారా, అమ్మాయి గారూ! ఇంత చదివిన మీరు నాకే జవాబు చెప్పలేక పోయారు. మీ కన్నా నేనే తెలివి కలదాన్ని."
'అవును. నీలో చాలా తెలివి ఉంది. అందుకే చదువుకోమంటున్నాను."
"ఇదేమి టమ్మాయిగారూ? బొమ్మ భలే బాగుందే! రంగుల్లో."
"అదెంత గొప్ప చిత్రమో! ఎన్ని దేశాల వాళ్ళు మెచ్చుకున్నారో, చదువు వచ్చినట్లయితే తెలిసేది. ఇంకెన్నో విషయాలు తెలుస్తాయి."
"నాకేం తెలవక్కర్లేదు. మీరు చదువుకున్నారుగా! మీకు తెలిసిందంతా నాకు చెప్పండి! మీరు చదువుకుని తెలుసుకున్నదంతా నాకు చదవకుండానే తెలుస్తుంది."
"ఒసినీ..... బుర్రంటే నీదేనే! అది సరే గాని నేను చెప్పినట్లు వినకపోతే నా మీద ఒట్టు."
"ఒట్టు గట్టు చేసి తంగేడు చెట్టుకు దారమేశా."
"ఒట్టు వేసింది నేను. ఆ మాట నేనంటేనే అది రద్దు అవుతుంది. అవునులే -- నేనేమైతే నీకేం?"
'అలాగైతే ఓకే మాట. మీరు చదివేది నాకినపడేటట్టు చదవండి! నాకు నచ్చితే మీరు చెప్పినట్టు వింటాను."
అందుకు ఒప్పుకుంది అపర్ణ.
ఆ రోజు నుంచీ కస్తూరి రోజూ వచ్చి అపర్ణ చదివే కధలూ , విశేషాలు వింటూ ఉండేది. అవి ఆకర్షించాయామెను. చివరకు చదువు కోవటానికి సమ్మతించింది. చదువు మొదలైందే గాని, కస్తూరి ఎక్కువగా అపర్ణ చదివే కధలు వినేది. అయినా ఈ గురుశిష్య సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు.
.jpg)
గిరిధారి వచ్చిన మరునాడు మధ్యాహ్నం కస్తూరి వచ్చి, "అమ్మాయి గారూ! నా కింక చదువుకునే తీరిక లేదు. నాకు ఉద్యోగం దొరికింది" అన్నది.
"ఉద్యోగమా? ఏముద్యోగమే!"
"ఒక కొత్త బాబుగారు వచ్చారు. ఆయనగారి దగ్గర."
"ఎవరాయన? ఏం ఉద్యోగం?"
"గిరిధారి గారట. ఇంట్లో అలిగి వచ్చినట్టున్నారు. మీలాగే పుస్తకాలుంటే చాలు. ఎన్ని పుస్తకాలో! గది నిండా పెంట. మిగిలిందంతా తరవాత చెబుతాను."
"మొత్తం మీద చదువు నీ ఒంటికి పడలేదు. అందుకని ఈ ఉద్యోగం చూసుకున్నావు. అవునా?" అని నిలేసింది అపర్ణ.
"ఆవు అమ్మాయిగారూ! ఈ చదువు తప్ప మిగిలిన పనులన్నీ నాకెంతో సుఖంగా ఉన్నాయి." అని తెగేసి చెప్పి, "మీకూ మీ చదువుకూ ఒక దండం" అంటూ వెనక్కు తిరిగింది కస్తూరి.
