Previous Page Next Page 
అన్వేషి పేజి 2

 

    
                                         2


    ఆంధ్రదేశంలో అదొక జిల్లా ముఖ్య పట్టణం. రకరకాల వ్యాపారులూ, ధనికులూ , మేడలూ , ఫ్యాక్టరీ లూ , సినిమా హాళ్ళూ -- వీటితో పాటు వ్యవసాయం భారీ ఎత్తున , చిన్న ఎత్తున చేస్తున్న భూస్వాములు కూడా ఉన్నారా పట్నంలో.
    ఒక మారుమూల పేటలో, ఊరికి చివరగా ఒక మేడ క్రింద అంటా గోడౌను. పైన రెండు నివాసపు గదులుగా పనికి వచ్చేవి ఉన్నాయి. ఆ గదులకు వెనకా ముందు వరండా కూడా ఉంది. ముందు వరండా లో అయిదారు కొయ్య కుర్చీలు , ఒక బల్ల ఉన్నాయి. వెనకా వరండా.  అందే వంటగది, అదే స్నాన శాల.
    రెండు గదుల్లో చిన్న దానిలో ఒక మంచమూ పెట్టెలూ, బట్టల స్టాండు వగైరా ఉన్నాయి. పెద్ద గదిలో ఒక బల్లా, దాని చుట్టూ నాలుగు కుర్చీలు ఉన్నాయి. గోడలకు పకృతి చిత్రాల కాలెండర్లు ఉన్నాయి. ఒకవైపు గోడ కానుకుని ఒక మేజా బల్లా, దాని ముందర ఒక కుర్చీ, మరొక పక్క స్టూలు ఉన్నాయి. మేజా మీద ఒక పెద్ద పుస్తకాల రాక్ ఉంది. అది రెండుంతంతేలతో ఉండి అంతో ఇంతో పనితనం కనిపిస్తుంది. దానిలో అంతలాపు పుస్తకాలు మొదలు ఇంత చిన్న పుస్తకాల వరకు ఉన్నాయి. వాటి వెన్ను మీది పేర్ల వల్ల తెలుగు, హిందీ, ఇంగ్లీషు - మూడు భాషలతో వాటి యజమానికి అభిరుచీ, పరిజ్ఞానమూ ఉన్నాయని పిస్తుంది. ఆ రాక్ కు పై తంతే పై రాధా కృష్ణుల మట్టి విగ్రహం ఒకటి, రంగులు వేసింది కాస్త పెద్దదే ఉంది. ఆ విగ్రహానికి కుడి వైపు ఒక యు,పి. మట్టి పూల కుండీ, ఎడమ వైపు ఒక ఊదువత్తుల స్టాండు ఉన్నాయి.

 

                            *    *    *    *


    "ధర్మయుగ్' పత్రిక లో మధ్య పేజీలలో కనిపించిన రవీంద్రుని చిత్రం అతన్నెంతగానో ఆకర్షించింది. ఫ్రేమ్ కట్టించి టేబుల్ మీద ఉన్న పుస్తకాల రాక్ కు పైగా అలంకరించాడు. అంతకు ముందు అక్కడున్న శరత్ ఫోటో ను కాస్త జరపవలసి వచ్చింది. అయితేనేం? ఈ ఇద్దరు రచయితలూ తన చిన్నపాటి లైబ్రరీ షెల్ఫ్ ను సింహాసనం లా ఆక్రమించడం వల్ల ఆ గదికి మాత్రమే కాదు, తన మనస్సుకి ఒక నూతనోల్లాసం ఉదయిన్చినట్టు భావించాడతను.
    "పువ్వులు తెచ్చాను బాబుగారూ!' అంది కస్తూరి.
    గిరిధారి ఆమె తెచ్చిన మెట్ట తామర పువ్వులను అందుకుని షెల్ప్ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ లో అమర్చాడు. ఆ పువ్వులు ఫోటో ల క్రింది అంచులను తాకుతున్నాయి. అప్రయత్నంగా అతని చేతులు హృదయాన్ని సమీపించి అంజలి ఘటించాయి.
    "వారెవరు, బాబూ?" అమాయకంగా ప్రశ్నించింది కస్తూరి.
    అతను ఆమె వంక చూసి నవ్వి, "నువ్వింకా ఇక్కడే ఉన్నావా" అని అడుగుతూ కాస్త సిగ్గుపడ్డాడు. మరో మాట అతని నోటి నుంచి రాకముందే ఆమె వెళ్ళిపోయిందక్కడి నుంచి. ఆమె వెళ్ళిన వేపే చూస్తూ 'కస్తూరి తమాషా మనిషి' అనుకున్నాడు.
    మళ్ళీ రవీంద్రుని చిత్రం చూశాడు.

 

                            
    శాంతినికేతన్. సాయంకాలం . మహా వృక్షాల శిఖరగ్రాలను చేదించుకుని వచ్చే సాయం సూర్యకిరణాలు తివాసీ మీది రకరకాల డిజైనులలా పచ్చిక పై పడి చలిస్తున్నాయి. చెట్ల నుంచి రాలిన పువ్వులు దృశ్యానికి మరికొంత దోహదం చేస్తున్నాయి. ఆ పక్కనే పడక కుర్చీలో రవీంద్రుడు చదువుతున్న పుస్తకాన్ని అలాగే ఒడిలో పెట్టుకుని పచ్చిక పై పిట్టలు చేసే అల్లరిని పరికిస్తున్నాడు. శాంతగంబీరమైన అయన రూపం కూడా దృశ్యంలో దృశ్యంలా భాసిల్లుతుంది.
    "ఓహో, విశ్వ కవీ!' అనుకుంటూ తన్మయం చెందాడు గిరిధారి.


    
                              *    *    *    *


    పక్షుల కిలకిలా రావాలే మేలుకొలుపులు. మత్తుగా ఒత్తిగిలి పడుకునే ప్రాగ్దిశగా ప్రకృతి గర్భాన్ని చీల్చుకుని వచ్చే బాలభానుడి అందాలు కిటికీ లో నుంచి చూడవచ్చు. ఆ లేత బంగారు కిరణాలు అంతకంతకూ వేడినీ, వాడినీ పెంచుకుని సమస్త జీవకోటికీ ప్రసాదించే చైతన్యలహరిని తను కూడా అనుభవం లోకి తెచ్చుకుంటూ ఒక రకమైన పులకరింతతో ఒళ్ళు విరుచుకుంటాడు. ఆ తరువాత తను కొత్తగా నిర్మించిన చిన్న పాటి రూఫ్ గార్డెన్ లో కొత్త పువ్వులెం పూశాయో, ఏయే కొత్త మొగ్గలు రేపటి కోసం తొంగి చూస్తున్నాయో పరిశీలిస్తాడు.

 

                      
    ఇంతగా తనను అలరించే ఆ గది తన కోసమే ఖాళీగా ఎదురుచూస్తూ ఉండడానికి కారణం ఉంది. అది ఊరికి చివరగా ఉంది. అన్ని అఫీసులకూ దూరమే! ఏ బ్రహ్మచారి ఉద్యోగస్తులనూ ఆకర్షించ లేకపోయింది. సంసారులు, ముఖ్యంగా గృహిణులు మేడ మీద వాటా అనగానే ఉలిక్కిప్ పడతారు. వీరు, మిగిలిన సామాగ్రి పైకి చేరవేయటం కష్టం. అదలా ఉంచి ప్రతి అవసరానికీ క్రిందికి దిగి రావాలి. అటూ ఇటూ గాని పట్నాలలో ఉండే ఇబ్బందులు అనేకం.
    ప్రకృతి ని అనుకుని ఉన్న ఆ గది తనకు దొరకటం అదృష్టం.
    అతను నిరుద్యోగి. ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడో ఎవరికి తెలియదు. తెలిసిందల్లా గిరిధారి అన్న పేరు. మంచివాడు అని ఈ స్వల్ప కాలంలోనే సంపాదించుకున్న పేరు.
    అతని స్వభావానుగుణంగా , నోట్లో మాట బయటికి రాకుండా పనిచేసి వెళ్ళే పనిమనిషి కస్తూరి దొరకటం ఒక విచిత్రం!
    ఆమె ఉదయమే వస్తుంది. కిటికీ దగ్గరకు వచ్చి పిలుస్తుంది. అప్పటికే మెలుకువ వచ్చి ప్రభాతశోభను ఆస్వాదించే అతను లేచి వెళ్ళి తలుపు తీస్తాడు. ఆమె అతను చిందర వందర చేసిన పుస్తకాలన్నీ ఒక క్రమంలో సర్దుతుంది. బల్ల మీదా, గదిలోనూ అస్తవ్యస్తంగా ఉన్న వస్తువులన్నీ తనకు తోచినట్టు స్థాన ప్రతిష్ట చేస్తుంది. గుడ్డ కుంచె తీసుకుని ఫోటోలు, కుర్చీలు మొదలైన వాటి మీది దుమ్ము దులుపుతుంది. నేల చిమ్మి తడి గుడ్డతో తుడుస్తుంది. కూజాలోని పాత నీరు పూల మొక్కలకు పోసి దాన్ని కొత్త నీటితో నింపుతుంది. వచ్చేటప్పుడే కావలసిన పాలూ, కూరలు తెస్తుంది.
    గిరిధారి ముఖం కడుక్కుని వచ్చేసరికి వేడీ టీ తయారుగా ఉంటుంది. స్నానం చేసి వచ్చేసరికి కుక్కర్ లో వంట సిద్దంగా ఉంటుంది. కావలసినవన్నీ సిద్దం!
    లాంతరు శుభ్రంగా తుడిచి తిరిగి కిరోసినాయిల్ నింపటం తో కస్తూరి కంతగా పని మిగలదు. ప్రతి లక్ష్మీ వారం గది కడిగి గుమ్మాలకూ పసుపూ, కుంకుమా పెడుతుంది.
    అమాయకుడిలా కనిపించే అయ్యగారంటే కస్తూరి కి చాలా అభిమానం. అయితే అయన ఇక్కడి కెందు కొచ్చాడో , అయన సంగతు లేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఏనాడూ చూపలేదు.
    వచ్చినప్పుడే సామాను దింపుతున్న రిక్షా అతనితో గిరిధారి అన్నాడు - "నీ ఎరికలోఎవరన్నా పనిమనిషి ఉంటె చూడవోయ్" అని.అప్పుడామే ఆ దారినే పోతున్నది. "నేను చేస్తానయ్య గారూ" అని అంది. "రేపటి నుంచి రా" అన్నాడు. అంతే! జీతమెంతని తనడగలేదు: ఆయన  చెప్పనూ లేదు.
    రిక్షా అతను సామాను క్రిందనే మెట్ల మీద పెట్టాడు. పైకి రానన్నాడు. గిరిధారి తనే మోయడానికి సిద్దపడ్డాడు. కస్తూరి అతన్ని ఆపి రిక్షా అతన్ని దబాయించింది. సామాను పైకి మోపిందాకా డబ్బు ఇవ్వనివ్వ లేదు.
    "మొత్తానికి అసాధ్యురాలివి, అమ్మీ" అని అతను మెచ్చుకుంటే సిగ్గుపడి, "నాపేరు కస్తూరి , బాబూ!" అంది.
    గది ఏమీ బాగా లేదు. ఆమె చుట్టూ చూసింది. దుమ్ము ధూళి తో నిండి ఉంది నేల. నాలుగు మూలలా బూజులూ.
    "ఎలా ఉంటారిందులో-- ఉండండి. చీపురు తెస్తాను." అంటూ వెళ్ళింది. అరగంట లో గది తీరు మారిపోయింది. శుభ్రంగా ఉంది.
    "ఏ సామానులూ లేవు మరి! రెండు బకెట్లు, రాతిండి వైనా రెండు చెంబులు, నీళ్ళు కాగబెట్టు కడానికి కుండ, ఒక సిమెంటు పొయ్యి, చాపా, కూజా , గ్లాసులూ"
    "చాలు చాలు. ఇవన్నీ తెచ్చి పెడితే నేనేక్కడుండాలి?"
    "నే చెప్పిన వాటిలో ఈ గదిలో ఉండేదేమీ లేదు. ఒక్క ఒక్క మంచి నీళ్ళ కూజా గ్లాసులూ తప్ప."
    "ఒక మేజా, మంచమూ , కొన్ని కుర్చీలు కూడా కావాలి. నీకు తెలిసిన వంద్రంగి ఎవడైనా ఉన్నాడా!"
    "ఎందుకు-- చేసినవే దొరుకుతాయి ఊళ్ళో. కొనుక్కోండి! అది సరే గాని ఈ గది ఇక్కడుందని మీ కెవరు చెప్పారు?"
    "బస్సు స్టాండు లోనే ఎక్కడైనా గది ఉందా అని వాకబు చేశాను. సామానులు కంట్రోలరు గదిలో పెట్టాను. వారినీ వీరినీ అడిగాను. ఇందుందని తెలిసింది. ఆ దగ్గరలోనే ఇంటాయన దుకాణం అని చూపించారెవరో. అద్దె కుదుర్చుకుని ఏకంగా రెండు నెలల అడ్వాన్సు కూడా ఇచ్చి వచ్చేశాను. వచ్చిన రిక్షాను ఆయనే మాట్లాడాడు."
    "అద్దె ఎంత?"
    అతను చెప్పిన సంఖ్య విని ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
    "మోసపోయారు బాబూ, మోసపోయారు. ఈ ఊరి చివర దయ్యాల కొంపకు అంత కిరాయా?"
    "పోనీద్దు !" అని తేల్చేశాడతను.
    ఆమె పోనివ్వలేదు. ఇంటావిడను కలుసుకుని అయ్యగారి మంచి తనాన్ని మేతకతనాన్ని వర్ణించి చెప్పి రెండు నెలల అడ్వాన్సు మూడు నెలలకు సరిపడా మర్పించింది.
    "నేనేం చెయ్యను, కస్తూరీ! అయన బెరమడతారనుకుని కొంత ఎక్కువ చెప్పిన మాట నిజమే! మారు మాట్లాడకుండా చటుక్కున రెండు నెలల అడ్వాన్సు అంటూ ఇచ్చాడు. తీసుకున్నాను. డబ్బు చేదా?" అన్నాడు ఇంటాయన. ఈ సంఘటనే అతనివ్వకుండానే ఆమె అతని బాధ్యత వహించటానికి తోలి మెట్టు.
    "నీకు నా పట్ల ఇంత శ్రద్ద ఎందుకు, కస్తూరీ?"
    "శ్రద్ధ ఏముంది? మీతో చెప్పించుకోకుండా నా పనేదో నేను చేసుకుంటున్నాను."
    "అదికాదు. నీవు చేసే ప్రతి పనీ ఎంతో పొందికగా తల్లో, చెల్లెలో చేసినట్లుంటుంది."
    "కాని తల్లీ,చెల్లెలూ చేసిన పనికి జీతం తీసుకోరు."
    "ఆ మాట కొస్తే -- " అంటూ ఆగిపోయాడతను. ఎలా పూర్తీ చెయ్యాలో తోచలేదో, లేదా మరీ అతి అవుతుందనుకున్నాడో?
    కస్తూరి కి అతని ముఖంలో ఏదో శాంతి, మంచితనం గోచరించేవి. అతని మాటలు ఆమె హృదయాన్ని తాకేవి. అతని సంగతులు విని తెలుసుకోవాలనిపించేది. కాని, అడగలేక పోయేది. అతని ముఖం చూసి గానీ, అలవాట్ల ను గమనించి గాని ఏమీ గ్రహించలేక పోయింది. ఒక్కోనాటి ఉదయం అతని జ్యోతుల్లాంటి ఎర్రని కళ్ళు చూసి బాధపడేది. శుభ్రంగా ఏ చక్కనమ్మ నో చూసి పెళ్ళాడకూడదూ? అనుకునేది. ఊరికే ఎప్పుడూ పుస్తకాలు, వాటిల్లో ఏముందో? లేకుంటే అదేదో పట్టుకుని నాలుగు దిక్కులా కలియ చూడటం, అదేమిటని అడిగితె ఒకమారు ఆమెకు చూపించాడు. అందులో నుంచి చూస్తె దూరాన ఉన్న చెట్లూ, గుట్టలూ కళ్ళ ఎదురుగా ఉన్నట్టే కనిపించాయి. ఇటువంటివె అయన దగ్గర మరికొన్ని ఉన్నాయి. చిన్న రేడియో, కెమెరానా అదేమిటో! చిన్న పిల్లాడిలా అవి ఉంటె చాలు. మరే కోరికా లేనట్లుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS