గడియారపు గుండెలు
రాఘవయ్యకీ సిరీ సంపదా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అతను ఆ సిరిని ఉపయోగించే విధానం అందరినీ ఆకర్షించింది.
శర్మ వేసిన బొమ్మలు, 'రాజు' రాసిన పద్యాలూ, గోపాలం స్థాపించిన సంఘ సంస్కార సమితీ, ఆ వూళ్ళోవున్న పిక్చరు పేలస్ - అన్నిటికన్నా , అతని సౌందర్య తృష్ణని వ్యక్తపరిచే 'లలిత' మీద వలపూ -ఇవన్నీ రాఘవయ్య ప్రేమించేవాడు అందుకే అతణ్ణి 'అపర భోజుడు' అన్నారు.
అయితే , అతనిలో వుండే ఒకే ఒక లోపాన్ని గూర్చి అతనికి తెలియజెప్పాలని నిశ్చయించారు నలుగురూ.
వారు వెళ్ళి రాఘవయ్యతో అన్నారు. "నువ్వు చేసే పనుల్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి. సరీగ్గా టైమ్ కుదరటంలేదు. అదీగాక, ఇటువంటి చక్కటి గదిలో ఆ గోడ అంతా ఖాళీగా, పూర్వ సువాసిని లలాటంలా ఉండటం ఏమీ బాగాలేదు. మనకి నిత్యకృత్యాల్లో ఉపయోగపడేది, నీ గదికి అందం తీసుకువచ్చి, అమితమైన కాలాన్ని, తన గుండెలో ఇముడ్చుకోగలిగినటువంటిదీ, ఎప్పుడూ టిక్కు టిక్కు మని ధ్వనిస్తూ, ఏకాంతబాధ పోగొట్టేదీ ఐన గడియారం నువ్వు వెంటనే కొనాలి "అని.
సరి. పెద్ద గడియారం వారం రోజుల్లో గది గోడమీద పెళ్ళి కూతురులాగ తయారై కూర్చుంది.
2
మొదట్లో ఆ గడియారం ఆ గొడకు ఎంత అందం తెచ్చిందో పరీక్షించాడు. తర్వాత ఆ గడియారాన్ని ఎవరు ఇంత అందంగా చేశారా అనుకున్నాడు. తిరిగి, ఆ గడియార మహత్యం ఆలోచించాడు. హఠాత్తుగా ఒకరోజున గడియారాన్ని తను అమోఘంగా ప్రేమిస్తోన్నట్లు తెలుసుకున్నాడు.
మొదటిరోజుల్లో స్నేహితులతో ఇలా అనేవాడు.
"ఒరేయ్ ఈ వేళ తొమ్మిదింటి వరకూ తోటలో తిరిగి, పది గంటలకి భోంచేసెయ్యాలిరా!" కాకపోతే ఇప్పుడు "ఏడయిందా, ఎనిమిదింటి వరకూ ఈ పుస్తకాన్నిచదవాలిరా!" అనేవాడు.
తోటలో లలితను కల్సుకొని, "లలితా! నువ్వు నాకు దేవతవు. నిన్ను నేను ప్రేమించాను. నువ్వు మరొహవర్ణానికి చెందినా సరే, పెళ్ళాడి తీర్తాను. నిర్మలమైన ప్రేమకి ప్రపంచంలో ఏమీ అడ్డులేదు!" అని....
తర్వాత -
మిత్రులతో వెన్నెల్లో విహారంచేసి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. పదిగంటలైంది. ఇంకా తను భోజనమే చెయ్యలేదు. తాను చాలా అశ్రద్ధగా వుంటోన్నట్టు తెల్సుకున్నాడు. మరుసటిరోజున మిత్రులతో "ఒరేయ్, ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళిపోవాలిరా! లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది" అని చెప్పి అలాగే చేశాడు.
ఉదయం ఆలస్యంగా లేస్తే "అరెరే! ఎంత బద్దకం అలవాటైంది. ఏడుగంటలు దాటిందే" అని విచారించేవాడు. ఆ గడియారాన్ని చూసుకుంటూ, అది లేకమునుపు తనెంత స్వేచ్ఛగా, వెర్రి వెధవలాగా తిరిగిందీ తల్చుకుని, విచారించేవాడు. "కాలం అమూల్యం.- Time is precious" అని రోజుకు ఐదుసార్లేనా అనుకునేవాడు.
"రాజు" ఒకరోజున వచ్చి తను రాసిన పద్యాలు చదివి వినిపించబోయాడు. రెండు మూడు విని రాఘవయ్య ఇలా అన్నాడు. "రాజూ, భోజనం వేళయిందిరా! తరువాత చదువుదుగానిలే!" అని. అదీగాక అతని కవిత్వంలో దోషాలు పట్టడం మొదలెట్టాడు.
"లలితా మన పెళ్ళికి ఇంకా యేడాది ఆలస్యం వుంది. అంతవరకూ దూరదూరంగా ఎందుకు ఇలా బాధపడటం. నా మాట నమ్ము, నా హృదయం నువ్వెరగవ్" అని ఆమెతో....సౌఖ్యం అనుభవించాడు కొన్నాళ్ళయినాక.
ఉదయం ఆరు గంటలకల్లా లేవటం, మిత్రులతోనూ, పుస్తకాలతోనూ కాలక్షేపం చేయటం. రాత్రి ఎనిమిదింటికి అతని కొక ఆలోచన తట్టింది. ఈ పధ్నాలుగు గంటల్లో ఎంత ఖర్చు చేశామా అని, ఆలోచించి చూశాడు. పది రూపాయలు నాలుగణాలన్నర లెక్కతేలింది. అతని గుండె ఆగిపోవటానికి సిద్దమైంది. పధ్నాలుగు గంటల్లో అజామత్ ఐపోతుందనుకొన్నాడు. మరునాటి నుంచి చిఠా - ఎకౌంటు తయారుచేశాడు. క్రమంగా రోజు రోజుకూ రెండు రూపాయల ఖర్చు తగ్గనారభించింది. గ్రామఫోను రికార్డులు కొనటమూ, సినిమాకి అమితంగా వెళ్ళటమూ మానేశాడు.
"నా పద్యాలు అచ్చు వేయిస్తానన్నావు గదురా, నీకే కృతి ఇస్తాను" అన్నాడు రాజు.
