12
ఇది జరిగిన వారం పది రోజులకు ఆఫీసరు పై ఆకాశరామన్న అర్జీ పై అధికారులకు చేరిందిట. ఎంక్వైరీ కూడా జరిగిందిట. డబ్బు విరివిగా ఖర్చు పెట్టిన ఆఫీసరు కొద్ది చివాట్లతో ఎలాగో బయట పడ్డాడుట. వాడిందులో ఏమీ ఎరగనప్పటికీ అన్నయ్యే తన గురించి పైకి రిపోర్టు యిచ్చి ఉంటాడని ఆఫీసరు అనుమానం. అందువలన నెల రెండు నెలల నుంచి మరీ కాల్చుకు తింటున్నాడట. ఎంతపని చేసినా తృప్తి పడకపోవడం , పని అయిపోయినా ఇంటికి వెళ్ళనీయక పోవడం, లీవు ఒక పట్టాన శాంక్షను చెయ్యక పోవడం , ఒకటేమిటి , ఎన్ని విధాల ఏడిపించాలో అన్ని విధాల ఏడిపించుకు తింటున్నాడట.
అయన ఆరోగ్యం ఇంత తొందర్లో ఇంతగా దెబ్బ తినడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం అనుకుంటా మంజూ! పనికి మించిన బలవర్ధక ఔషధం లేదనే వారాయన. ఇన్నాళ్ళయి పని చేస్తున్నా ఎప్పుడూ ఎవరి చేతా మాటపడి ఎరగరు. ప్రస్తుతం గట్టిగా జవాబు చెప్పనూ లేరు. ఆ విషయం ఆలోచించకుండా ఉండనూ లేరు. ఇలా కక్ష కడితే అవతలి వాళ్లకి కూడా ఏం కలిసొస్తుందో నాకు తెలీదు. నిరాశ అనేది ఆయనకు జీవితంలో ఎప్పుడూ లేదు గాని ఒక విధమైన నిస్పృహ అవరించిందేమోనని నాకు భయంగా ఉంది మంజూ! నీ పరీక్షలని ఇన్నాళ్ళు ఎలాగో అగగలిగెను.
పరీక్షల హడావుడిలో పడి ప్రాణపదమైన అనేక ముఖ్య విషయాలను విస్మరించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఆప్తుల అవసరాలను గమనించని, ఆపదలో అడ్డుకొని నా చదువుకు ఫలితమూ, సార్ధకమూ ఏముంది?
'మంజూ ! ఇవైనా నీతో చెప్పుకుంటే నా మనసు ఎంతో తేలికై పోయింది. అంతమాత్రాన ఈ సమస్య నిలుచున్న పళాన తీరిపోయిందని కాదు. మనిద్దరం కలిసి దీన్ని ఎలా సాధించడమో ఆలోచించవచ్చు. దాన్ని బట్టి నా బరువు సగం తీరిపోయినట్టే.'
వదిన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.
'మనం ఇలా కలుసుకున్నట్టు, నేను నీతో చెప్పినట్టూ పైకి రానియ్య కూడదు. నువ్వే అడిగినట్టు అడిగి ఆయనకి నచ్చచెప్పి ఎవరైనా పెద్ద డాక్టరు చేత పరీక్ష చేయించి అసలా రోగం ఏమిటో అదైనా పూర్తిగా తెలుసుకుని దానిని నివారణోపాయం ఏదో ఆలోచిస్తే గాని నేను నిలద్రోక్కుకోలేను మంజూ! నీనుంచి అదే కోరి నిన్ను అపుచేశాను. ఇంట్లో ఉన్న హోమోపటీ మాత్రలు మింగుతూ ఎన్నాళ్ళిలా రోగం కప్పెట్టు కుంటారు?"
వదిన క్రిందకి వెళ్ళిపోయింది. పరీక్షలు బాగా వ్రాసి అవి అయిపోయాయని గెంతులేస్తున్న నా మనస్సు ఒకసారి నిశ్చేష్ట అయిపొయింది.
పొద్దుట లేచి అన్నయ్యను పరీక్షగా చూశాను. అంతకుముందు రోజు అలసటా నిద్రా బడలికల వల్ల వాణ్ణి సరిగా గమనించనే లేదు. ఎంత మారిపోయాడని! ఆరు నెలల క్రిందట చూసిన మనిషికీ ఇప్పటి మనిషికి పోలికే లేదు. మానసికంగా బాగా కుంగి పోయినట్టూ, దైహికంగా అతి నీరసంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కళ్ళూ, బుగ్గలూ గుంటలు పడ్డాయి. మెడ మీది నరాలు ఉబ్బి భయంకారంగా ఉన్నాయి.
'అత్తా అత్తా కాశీలో ఏం వదిలి వచ్చావ్?' అన్నాడు ముకుందం. నా ధోరణి లో పడి వాణ్ణి సరిగా గమనించనే లేదు. నిక్కరు తాళ్ళ ఖాళీ ల్లోంచి వాడి తెల్లని సాగినట్టున్న శరీరం కనిపిస్తోంది. కొంచెం ఎదిగేడు. 'నువ్వు నా కూడా వచ్చేనేనా కాదురా, అక్కడ నిన్ను వదిలేసి వద్దును" అన్నాను. 'నిజం చెప్పాలంటే చదువు మీద భ్రాంతి పూర్తిగా అక్కడ వదిలేసి మరీ వచ్చానురా' అన్నాను మళ్ళీ.
'అదేమిటీ , చదువంటే అంత మొహం మొత్తిపోయిందిటే?' అనడిగాడు అన్నయ్య.
'అవును.... ఏవిధంగా ఎవరికీ ఉపయోగపడని చదువెందుకు? అది సరే , నువ్వివాళైనా ఆఫీసు కెళ్ళే సూచనలు కనిపించవేం?' 'ఇవాళ కూడా శలవేనా?'
'అవును, నువ్వు శలవు పెట్టిననన్నాళ్ళు ఆఫీసుకు శలవే. అర్ధం పర్ధం లేకుండా సోమవారం, మంగళవారం శలవంటే ఎవడు నమ్ముతాడు?'
'లేదే, నా ఒంట్లో కొంచెం బాగులేడూ, అందుకని శలవు పెట్టెను. వూరికే వేళాకోళాని కన్నాను, నిన్ను ఎడిపిద్దామని.'
నా కళ్ళు నీళ్ళతో నిండేయి.
'అదేమిటి?'
'నిన్ను ఎడిపిద్దామని' అన్నావుగా .....అదే యిది.....అదేగా నీ కోరికా?'
వాడు నా చుబుకం పట్టుకుని తనవైపు తిప్పి పైకేత్తేడు. నా కన్నీళ్లు యిక ఆగలేదు. కొంచెం సేపు అయాక అన్నాను.
'నువ్వు నిప్పులాంటి మనిషివని తెలుసు. నిజం తప్ప చెప్పవని తెలుసు. ఇన్ని అబద్దాలు ఎప్పుడు నేర్చుకున్నావ్? ఇదేలాంటి నీతిమార్గం అనుకున్నావ్? 'సంసారం గుట్టు రోగం రట్టు' అన్నారు. అలాంటిది భయంకరమైన వ్యాధిని లోలోపల కుళ్ళ బెట్టుకుని నువ్వేం సాధించదల్చుకున్నావ్?'
అన్నయ్య మొహంలో ఆందోళనా, విచారమూ కొట్టోచ్చినట్టు కనబడ్డాయి. కొంచెం కోపం, కూడా మిళితమైంది. అది తలుపు వైపు ప్రసరించింది. అక్కడ నిలబడింది వదిన! 'మంగళా, ఇది నీపనేనా?' అన్నట్టున్నాయి ఆ చూపులు.
'వదిన నాకేదో చెప్పిందనుకుంటే అది పూరిగా పొరబాటు. ఇలాంటి విషయాలు కళ్ళతో చూసి గ్రహించవచ్చు. నువ్వోకసారి అన్నట్టు మన రక్తంలోని వివేక శాతం తక్కువేం కాదు. నీ తెలివి తేటలు మనుషుల్ని ఏమీ లేనట్టు బుకాయించడానికి నా తెలివి తేటలు నిన్ను పట్టి యివ్వడానికి పనికి వచ్చాయి. ఇందులో మూడో వాళ్ళ ప్రసక్తి ఏం లేదు!'
ఏమనుకున్నాడో ఏమో అన్నయ్యేమీ మాటాడ లేదు.
'నూట రెండు డిగ్రీల జ్వరంతో నువ్వు ఆఫీసుకు వెళ్ళి పని చేసుకు రావడం నాకు గుర్తుంది. జ్వరం కూడా లెక్కచెయ్యక నీ ఫైల్సు నువ్వు పూర్తీ చేసుకోడం నాకు జ్ఞాపకముంది. ఎంత బాధో కాకపోతే ఎందుకిలా యింటిపట్టున ఉండిపోతావ్?'

'అబ్బబ్బబ్బా ' అని అరిచాడు అన్నయ్య చికాకుతో.
'కొద్దిగా , ఆయాసంగా ఉందనీ, మరేం లేదని ఎన్నిసార్లు చెప్పను? ఎందుకు మనుషుల్ని విసిగించి వేధిస్తారు? పోయేదానివి తిన్నగా పోక నిన్నెవడిక్కడ దిగమన్నాడు?' అని విసుక్కున్నాడు. నేనంత కన్న వూరుకోలేదు. నిశ్చయంగా దృడంగా చెప్పెను.
'దిగడమే కాదు, ఇక్కడ ఉండి పోదల్చుకున్నాను, కూడా. చిన్నపిల్ల అది ఇబ్బంది పడితే పడుతుంది. ఆయనకి కష్టంగా ఉంటె ఉంటుంది. ఏదైనా సరే నా కింతకన్న ముఖ్యంకాదు. నీ పట్టుదలేదో వదిలేదాకా నే నిక్కడ్నించి కదలను. తగిలేస్తావేమో తగిలెయ్యి చూస్తాను.'
'మంజూ, నన్నిలా కష్టపెట్టడం నా జబ్బు తగ్గించడం కాదు సుమా!'
'నువ్విలా కప్పి పెట్టడం కూడా నీ జబ్బు తగ్గించడం కాదు సుమా! నేనివాళే పెద్ద డాక్టర్ని పిల్చుకోస్తాను. నువ్వెందుకు పరీక్షించనియ్యవో చూస్తాను.
అన్నయ్య జవాబెమీ చెప్పకపోవడం నాకు మరింత దైర్యాన్నిచ్చింది. అవాళే డాక్టరు పరీక్ష చేయించాను. జానకిరామ్ గారని ఆ యింటికి అవతలి వీధిలో ఉంది అతని ఇల్లు. ఎం.బి.బి.ఎస్ ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నాడు. మా కందరికీ సంతుష్టి కలిగేలాగా చాలా నిదానంగానూ, వివరంగా నూ పరీక్షించాడు.
'ప్రస్తుతానికి భయమేమీ లేదు గాని వ్యాధేమో భయంకరమైనదే.'
'ఏం జబ్బు డాక్టరు గారూ?'
'బ్లడ్ ఫ్రేషరూ , హార్ట్ వీక్నేస్సూ ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం. 'హై పవర్ టెన్షన్ , హార్ట్ ఫయిల్యూర్' అనే రోగానికి దారి తీయవచ్చు. కంప్లికేషన్సు ఎక్కువగా ఇప్పుడెం లేవు. రోగం 'టర్నింగ్ పాయింట్' లో ఉంది. లభించే విశ్రాంతి మీదా, తీసుకునే ఆహారం మీదా ఆరోగ్యం ఆధారపడి ఉంది. తేలికయిన ఆహారమూ, ఉల్లాసం కలిగించే కబుర్లూ రోగం మళ్ళించ]డానికి తోడ్పడుతాయి. ఆ రక్తపు పోతూ తీవ్రత తగ్గించాలంటే ఆహారంలో పూర్తిగా ఉప్పు విసర్జించాలి. 'సర్పాపిల్' అనే మందు ఇలాంటి వాటికి బాగా పని చేస్తోంది. ఆ మాత్రలు తెప్పించి పూటకి నాలుగు చొప్పున ప్రస్తుతానికి ఇవ్వండి. కనీసం ఒక నెల రోజులయినా ఆఫీసుకు శలవు పెట్టమని చెప్పండి. అన్నిటి కన్న ముఖ్యం విశ్రాంతి చాలా అవసరం. ఆయన్ని చూస్తె ఏదో తీవ్రమైన ఆవేదనతోనూ, ఆందోళనతోనూ తీరుకున్నట్టు కనిపిస్తారు. ఆర్ధిక యిబ్బండులేమీ లేవు గదా?'
నేను త్రుళ్ళిపడ్డాను. ఈ విషయమై ఇంతవరకు ఆలోచించనే లేదు. అన్నిటినీమించి అన్నయ్య బాధపడుతున్నది డబ్బు లేకనే యేమో! నేనెంత గుడ్డి దాన్నై పోయాను! ఎంత ముఖ్యమైన ఎంత తక్కువ ప్రాముఖ్యత యిచ్చాను! ఆ విషయం తరువాత వదిన్ని నిలదీసి అడిగాను. ఎన్నిసార్లు అడిగినా ఆమె నుండి ఒకే రకం జవాబు వచ్చేది. 'ఈ సంసారం సంగతి నీకు తెలియనట్లు కొత్తగా అడుగుతావెం మంజూ! అతి సామాన్యమైన మధ్య తరగతి సంసారం యిది. పెద్ద పెద్ద ఆశలు లేవు. చెప్పలేని ఖర్చులూ లేవు. లేనిపోని కొర్కెలూ లేవు. తీర్చలేని అప్పులూ లేవు. ఒక నెలలో కాస్త అదనపు ఖర్చు అయితే ఒకటి, రెండు నెలలు యిబ్బంది పడి దాన్ని తీర్చుకోవచ్చు. ఏమంత పెద్ద సంసారమని , మేం చూస్తె నలుగురం -- ఇంతకీ ఈ గడ్డు రోజుల్లో మాపాటి సుఖిస్తున్నవారు మాత్రం ఎందరు గనుక!'
