నా హృదయం దేవేసినట్లయింది.
'ఈమధ్య నాలుగైదు రోజుల క్రిందట ఒకనాడు రాత్రి ఏదో చప్పుడై నట్టయి గబక్కుని నిద్ర నుండి లేచాను. అయన పక్క గదిలో కూచున్నారు. మెడ మీద ఉబ్బిన నరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుండె యింత ఎత్తున లేచి పడుతోంది. శ్వాస అందనట్లు అయన పడుతున్న ఆ బాధ నా కళ్ళతో నేను చూడలేక పోయాను. నా ప్రాణాలు పైనే పోయాయి. 'మరేం లేదు, కొంచెం ఆయాసంగా ఉంది అంతే ' అన్నట్టు సంజ్జ చేశారు. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యడమో నాకేం పాలు పోలేదు. పక్కింటి నిర్మలా వాళ్ళ నాన్నగారిని పిలుద్దామని లేచాను. అయన వద్దనీ తనకేం పరవాలేదని సూచించారు , మాటాడే స్థితిలో కూడా లేరు.
కొంతసేపటికి ఆ ఉదృతం తగ్గింది. 'కొంచెం ఏదైనా వేడి వేడిది తాగుతారా?' అన్నాను.వద్దన్నారు. లోపలి కేదైనా పుచ్చుకుంటే ఆయాసం ఎక్కువవుతుందన్నారు.
అయన పడక్కుర్చీలో కూచున్నారు. నేను అయన పాదాల దగ్గిర కూచున్నాను. నా తల మీద చెయ్యి వేసి నిమిరేరు. ఆ స్పర్శతో మరి నా కన్నీళ్లు ఆగలేదు.
'ఏడవకు. ఏ పరిస్థితుల్లో అయినా ఎవర్నయినా ఏడవవద్దని పదేపదే చెప్పేవాణ్ణి నేను. నువ్వు ఏడుస్తే నా మనస్సు ద్రవిస్తుంది. అలా జరుగుతే నాకు మళ్ళీ ఆయాసం ఎక్కువవుతుంది' అన్నారు. పమిట చెంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాను.
కొంతసేపటికి అయన నిద్రపోయారు. అయన పాదాల దగ్గిర నేనూ పడుకున్నాను. నాకు నిద్రపట్టలేదు. విషాదకరమైన అనేక ఆలోచనలు నాకే మాత్రము విశ్రాంతి లేకుండా చేశాయి. ఆనందకరమైన అనేక జ్ఞాపకాలు నన్ను అపహాస్యం చేశాయి.
ఒకరోజు ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి అయన ఇంటికి వచ్చి యిలాగే పడక్కుర్చీలో కూచున్నారు. నేను గడప పక్క కూచుని చేతలో బియ్యం పోసుకుని రాళ్ళేరుతున్నాను.
'అవకాశం యిచ్చినా అర్ధం చేసుకోరు మీ ఆడవాళ్ళు. అలసి వచ్చిన మొగుడికి కాస్త కాళ్ళు పట్టి పుణ్యం గడించుకోరాదు?' అని కుడి కాలు ముందుకి చాపి , ;పధ్నాలుగు లోకాలు తిరిగినా దొరకదే, యిలాంటి పాదం!' అన్నారు. నేను నవ్వుతూ చేత పక్కకి పెట్టి కాళ్ళు పడదామని ఎడం చెయ్యి జాపితే కాలు వెనక్కి తీసేసుకుని నా చేతిని చేత్తో పట్టుకుని అరచేతిని ముద్దెట్టుకుంటూ 'పది కాలాల పాటు తపస్సు చేసినా దొరకదే యిలాంటి హస్త పద్మం!' అన్నారు. నా పాణిగ్రహణం చెయ్యడానికి ఆయనేం చేశారో నాకు తెలీదు. అయన పాదాన్ని పూజించడానికి మాత్రం నేను బంగారు పువ్వుల పూజ చేసి వుంటాను. నిష్టూరమైన సరే నిర్మూలమైన సరే నీతిపధం విడువని పాదం అది. ఆయనతో చేతిలో చెయ్యి వేసి కత్తి మీద సాము లాంటి ఆ జీవితంలో అడుగులో అడుగు వెయ్యడానికి అన్ని విధాలా అడుగున ఉన్న దాన్ని నేనంతటి దాన్ని!'
వదిన వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆడుతూ పాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ , గాలికేగిరే చీర చెరగు లాంటి , తేలిపోయే నీటి నురుగు లాంటి ఈమె జీవితం ఏమైపోతోంది?
'వదినా , నువ్వు చెబుతున్నది నాకేం అర్ధం కాలేదు. అన్నయ్య కేమయింది, ఇప్పుడెలా ఉంది? నాతొ చెప్పకుండా ఎందుకుంచారు? నేనోక్కర్తిని బతికున్నానని మరచిపోయారా?'
'లేదు మంజూ. అది జ్ఞాపకం ఉంచుకున్నారు గనుకనే అది నీతో చెప్పకుండా ఉంచడం జరిగింది. ఈ ఆయాసం రెండు మూడు నలలై ఆయన్ని పీడిస్తున్నా అందుకే నీకు చెప్పకపోవడం జరిగింది. కాని ఏ విధంగానూ ఆయనతో నేను సరిపోలను. ఆయనకున్న ఒర్మీ ధైర్యమూ నాకు లేవు. అందుకే నిన్ను ఆపేశాను. ఇక నీకు చెప్పకుండా ఎలా ఉంచను?'
వదిన చెప్పడం ప్రారంభించింది.
వదిన్ని చెప్పనియ్యకుండా నేనే నిలదీసి అడిగాను.
ఇలా లోలోపల రోగాన్ని పెంచుకుంటున్న మాత్రాన అన్నయ్య మనకు చేసే ఉపకారం మాత్రం ఏముంది? ఈమాత్రం లోకజ్ఞానం వాడికి నశించిందా? ఇలాటి త్యాగాల వల్ల ఎవర్నీ ఏవిధంగానూ ఉద్దరించలేమని వాడికి తెలియక పోయిందా? ఉండు, ఇప్పుడే అడుగుతాను.' వదిన నా చెయ్యి పట్టుకుని కూచో పెట్టింది.
` "ఏమైనా ఉంటె నన్నే అడుగు - ఆయన్ని కాదు'
'అవును , నిన్ను కూడా అడగాలి. ఈ విషయాలు ముందుగా నువ్వేనా నాతొ ఎందుకు చెప్పేవు కావు?' వాడి లేకపోతె లేకపోయింది, నీకైనా ....' వదిన తనలో అనుకున్నట్టు అంది.
'బాధలూ, కష్టాలూ వచ్చినప్పుడు రెండవ ప్రాణితో చెప్పకుండా సహించడం ఆయనకే చెల్లింది. చిన్నారికి, జబ్బుగా ఉందని నీకు తెలియబరిచింది నేనే. ఇప్పుడు అయన ఒంట్లో బాగులేదని నీ ప్రయాణం ఆపించేసి చెప్పుకుంటున్నది నేనే. అంతటి ఓర్పు సామాన్యురాలైన నాకెక్కడ వస్తుంది! చిత్రమేమిటంటే ఎంత ఎక్కువ బాధపడితే అన్ని సార్లు నిన్ను తలుచుకొనే వారూ - 'ఏమండీ , మీ చెల్లిని పిలిపించమన్నారా?' అని ఎన్నిసార్లు అడగనియ్యి తల అడ్డంగా ఆడించే వారు. 'మానకు ఆప్తులయిన వారు మరేవరున్నారని? ఈ విషయం తెలిసిన తరువాత చెప్పలేదని ఆమె మనసు ఎంత నొప్పెడుతుందో ఆలోచించారా?' అంటే కోపంగా చూసేవారు. ఒకరోజు ఏమైతే అయిందని నీకు ఉత్తరం రాద్దామని కూచున్నాను.
'మన కాపురం వేరు దాని కాపురం వేరు అన్న మాట మరచిపోయావా? అతదసలె కళాకళ మనిషి. ఇంతకూ అడివచ్చి ఏం చేస్తుంది? రోగాన్ని చేత్తో తీసేస్తుందా? దాన్ని పిలిచి ఎందుకు యిబ్బంది పెట్టడం?' అని చాలా గట్టిగా కేకలేశారు. ఆ మాట నేను చివరి దాకా నిలబెట్టుకోలేక పోయాను. పరీక్షకు వెడుతున్నావనీ కష్టపడి చదువుతున్నావనీ ఎలాగో ఇన్నాళ్ళు భరించాను. నువ్వు వస్తున్నావని తెలిసి ఇక నిగ్రహించుకోలేక పోయాను.'
వదినను కౌగలించుకుని అలాగే కొన్ని నిముషాల పాటు ఉండిపోయాడు.
'చిన్నారి పొయిందగ్గర్నుంచీ వారి మనసు బాగా దెబ్బతింది. నేనింకా మొండిదాన్ని. దాని అయుష్షు కూడా పోసుకుని దెయ్యంలా తిరుగుతున్నాను. అయన మాత్రం ఇంకా కోలుకోలేదు. పైగా ఉద్యోగం కూడా...' అనేసి నాలిక కరుచుకుంది.
'ఏమిటి ఉద్యోగం కూడా?' ఆతృతగా అడిగెను.
'వద్దు వద్దు దయచేసి నన్నింకేమీ అడక్కు. ఇంకా చెప్తే అయన నన్ను జన్మలో క్షమించరు.'
నేనన్ని విధాల అడిగినా వదిన యింకేమీ మాట్లాడలేదు. పైగా గుడ్ల నీరు గ్రక్కుకుంటూ అంది.
'ఎందుకు పెట్టేరు నాకీ పేరు? అనన్యమైన సహనమూ అనంతమైన ఆత్మవిశ్వాసమూ గల ఆ గౌరీ దేవి ఎక్కడ, నేనెక్కడ!" వదిన పేరు అలివేలు మంగ అని నాకు తెలుసు. అది అన్నయ్య మంగళ అని మర్చినట్టూ తెలుసు. అది అందమైన పేరనే వరకూ నాకు తెలుసు. అందులో అంతరార్ధం వదిన ఇప్పుడు చెబుతే తెలిసింది.
భాగవతంలో ని అష్టమస్కంధంలోని క్షీర సాగర మధన సందర్భంలోనిది యిది. అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తే హాలాహలం పుట్టుకొచ్చి లోకాల నన్నింటినీ కాల్చి వేస్తుంటే దేవత లందరూ శివుడి కాళ్ళ మీద పడ్డారుట. ఆ గరళం మింగడానికి సిద్దపడి శివుడు "ఏం విషం మింగమంటానా?' అని అడుగుతే జంకూ బొంకూ లేకుండా అలాగే అందిట పార్వతి, ఆవిడ కెంత ధీమానో! ఆ సందర్భంలో పోతన రాసిన పద్యం తెలుగు బాష ఉన్నన్నాళ్ళూ ఉండ తగినది.
'మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిది గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళ సూత్రంబు నెంత మదినమ్మినదో!'
కష్టమూ క్లిష్టమూ అయిన సత్ర్పధంలో భర్తకు తలలో నాలుకలా ఉండడమే గాక ప్రోత్సహించి పంపే భార్యకు ఎంత గుండె నిబ్బరం ఉండాలో! వదిన అ నిశిరాత్రి వేళ వణుకుతున్న కంఠంతో పరదీనమైన స్వరంతో చదువుతుంటే నా కళ్ళలో జలపాతాలే స్రవించాయి, నా హృదయంలో కడలులే పొంగేయి. 'ఇంతకీ అన్నయ్య ఉద్యోగం విషయంలో ఏం జరిగింది?... ఆ మాట సగం చెప్పి ఊరుకున్నావు దేనికి? ఇంతవరకూ చెప్పి యింకా సంశయిస్తావు దేనికి? నన్ను దారిలో అడ్డగించి నా సహాయం కోరింది ఇందుకేనా? ఏం మాట్లాడావ్?'
వదిన మాట్లాడలేదు, అలా నిశ్చయంగా కూచుంది.
'ఉద్యోగం కూడా ఊడింది కాబోలు ....అంతకన్న ఏముంది! అన్ని విషయాలు అన్నయ్యనే అడుగుతాను. ఇంతకన్నా చెడిపోయేది ఏముంది?' వదిన మళ్ళీ నన్ను చెయ్యి పట్టుకు కూచో పెట్టింది.
'అన్నిటితో పాటు అయన మనశ్శాంతి చెడడానికి ఈ మధ్య ఉద్యోగంలో వచ్చిన ఒడుదుడుగులు కూడా కారణమయ్యాయి మంజూ.'
అన్నయ్య వాళ్ళ కొత్త ఆఫీసరు లంచ గోండితనం ఆ మధ్య బాగా ఎక్కువై పోయిందిట. ఏదో ఒక లైసెన్సు మంజూరు చేయించే విషయంలో అతడు రెండు వేలు పైగా పుచ్చుకున్నాడని వాళ్ళ ఆఫీసులో అట్టుడికినట్టుడికి పోయిందిట ఆమధ్య. ఆరోజుల్లో వాళ్ళ అఫీసరుతో సహా ఒకనాడు అన్నయ్య కాగితాలూ అవీ పట్టుకుని వాళ్ళింటి కి వెళ్ళ వలసి వచ్చింది. అతగాడు మాటల సందర్భంలో అన్నాడట.
'ఎందుకోయ్ నేనేదో తినేశానని అందరూ అడిపోసుకుంటున్నారటా? ఫలానా వాడు లంచం తిన్నాడని పిటీషన్ పెట్టుకుందామని నువ్వెడితే అది చేరవలసిన స్థానానికి త్వరగా చేరడానికి గుమస్తా గాడికి లంచం యివ్వవలసిన రోజులు గదా యివి! దానికంత కడుపుబ్బరం ఎందుకూ, ఎవరి చాన్సు వాడిదనుకోక! నేనొక్కడ్నే చేస్తే అది పాపం అనుకోవచ్చు. అది సర్వసాధారణం గదా!'
'సారీ సార్ మీతో నేను ఏకీభవించలేను' ఆఫీసరు ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూశాడు. 'తమరు' తో ప్రారంభించి 'చిత్తం' తో ముగించే 'ఏమిటీ, ఏమిటి నువ్వంటున్నది?'
'అందరూ అవినీతి పరులే ఉంటారను కొడం ఆధారం లేని ఆరోపణ. మాట వరసకి పదేళ్ళ - నుంచి పని చేస్తున్నాను. నేను కాణీ పుచ్చుకోలేదు'
'నువ్వు పుచ్చుకోలేదంటే నేను పుచ్చుకుంటున్నానని పరోక్షంగా చెప్పడమా?'
'అలా ఎక్కడుంది? అయినా అది మీ స్వవిషయం. ఆ మంచి చెడ్డలు మీవే.'
'ప్రసాద రావ్ , ఏదో తెలివిగా మాట్లాడుతున్నాననుకొని ఎవరితో మాటాడుతున్నావో మరచి పోయావనుకుంటాను.'
'ఇంకా అంత దుస్థితికి దిగజారలేదు. ఈ విషయాన్ని మొదట ఎత్తింది మీరే. పైగా లంచగోండితనాన్ని సమర్ధిస్తారు దేనికి?' ఆఫీసరు ఇల్లెగిరి పోయేటట్టు నవ్వి అన్నాడట.
'నిత్యం జరుగుతున్న విషయాల్ని నీతులని పేరు పెట్టి దూషించడం దేనికోయ్? బంట్రోతు గాణ్ణి రూపాయి పెట్టి ఏమైనా తెమ్మంటే కనీసం అణా అయినా కమీషన్ కొట్టందే రాడే అదీ లంచమే నంటావా?'
'తప్పకుండా . కాని కడుపుకాలి చేసిన వాడి తప్పు పనికి క్షమించడానికి అవకాశమేనా ఉంది. కారూ, బంగళాలు వేలకి వేలు జీతాలూ ఉండి సర్వ సౌఖ్యాలూ అనుభవిస్తూ కక్కుర్తీ పడే నీచుల పాపానికిక నిష్కృతి మాత్రం లేదు!' ఈ మాటలు వింటున్న ఆఫీసరు ఒళ్ళు భగ్గున మండి పోయింది. కళ్ళు చింత నిప్పు లయాయి.
'చాలించు నీ ఉపన్యాసం. ఇంతటి బుద్ది మంతుడివనుకోలేదు -- ఆ ఫైల్సు యిలా తగలేసి నీదారిని నువ్వు వెళ్ళొచ్చు' అన్నయ్య గబగబా వచ్చేశాడు. తొందర పడ్డానేమోనని మొదట కొంచెం విచారించినా 'మనసులో ఉన్న మంచి మాటను పైకి కక్కినందుకు విచారించడం కూడా దేనికి, సంతోషించక!' అని సరిపెట్టుకున్నాడట.
