కానీ తండ్రిపడే వేదనని ఆ తనయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. తన ధోరణిని అలాగే కొనసాగించాడు
"అందుచేత పిల్లలకు ఏ మాత్రం కీడుజరిగినా తల్లిదండ్రుల హృదయాలు విలవిలలాడిపోతాయ్... అలాగే పిల్లలకు ఏమాత్రం మంచిజరిగినా వారి ఆనందం ఆకాశపుటంచులు దాటుతుంది."
"హమ్మా..." ఈసారి చెంపలమీద గోళ్ళతో రక్కేసుకుంటూ బాధగా అన్నాడు నారాయణరావు.
అయినా సుబ్రమణ్యం తన ప్రవాహాన్ని ఆపలేదు.
"పిల్లల్లో మళ్ళీ ఆడపిల్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది తల్లిదండ్రులకు ఇ ఆ ఆడపిల్లలకు పెళ్ళయి అత్తారింటికెళ్ళిపోతే తల్లిదండ్రుల ఆలోచనలన్నీ ఆమె గురించే.... వాళ్ళ ఆత్మలు కూతురు ఇంటిచుట్టూనే ఎల్లప్పుడూ పరిభ్రమిస్తూనే ఉంటాయ్....
"ఓర్నాయనో..."
నారాయణరావు నేలమీదపది గిజగిజా తన్నుకుంటున్నాడు. భారత పరిస్థితిని చూసి కామాక్షమ్మ కంగారుపడిపోయింది.
"నువ్వింకాపరా బడుద్దాయ్... ఖళ్.... ఎంతో కాలానికి తిరిగి మనకి దక్కిన ఆయన్ను చంపేసేలా ఉన్నావ్.... ఖళ్.... ఖళ్..." అంది కామాక్షమ్మ విసుగ్గా.
"ఉండమ్మా.... ఇంక నేను చెప్పాల్సిన విషయానికి దగ్గరగా వచ్చేశా...." అన్నాడు సుబ్రమణ్యం ఉత్సాహంగా.
"అయినా మీరేంటి ఖళ్... పాపం మనబ్బాయ్ ఉత్సాహంగా ఏదో చెప్పాలని చూస్తూంటే అంత గింజుకుని చస్తున్నారు? ఖళ్ ఖళ్ ..." నేలమీద పొర్లుతున్న భర్తని మందలించింది కామాక్షమ్మ.
"సర్లే - నేనింక ముగించేస్తున్నా - అమ్మా... నాన్నా.... మరేమో అక్క కాలుజారింది..." సంతోషంగా అన్నాడు సుబ్రమణ్యం.
"అంటే ఖళ్.... నీ ఉద్దేశం ఖళ్, రాధ గర్భవతి అయిందనా? ఖళ్?" అడిగింది కామాక్షమ్మ.
"అవునమ్మా. చాలా చక్కగా గ్రహించావమ్మా.
"నేను చక్కగానే గ్రహించానుగానీ నువ్వ చెప్పడం చక్కగలేదు బాబూ. ఖళ్ ఖళ్.... పెళ్ళి కాని వాళ్లు నెలతప్పితే కాలు జారిందని అంటారు. పెళ్ళయినవాళ్ళు నెలతప్పితే గర్భవతి అయ్యిందని అంటారు. ఖళ్......."
"ఎంత చక్కగా వివరించావమ్మా, అలాగయితే అక్క గర్భవతి అయ్యిందామ్మా."
ఆనందభాష్పాలు రాలుస్తూ అన్నాడు సుబ్రమణ్యం.
ఆ వార్త వినగానే నేలమీద పొర్లుతున్న నారాయణరావు చటుక్కున లేచి నిలబడ్డాడు.
"ఆ....ఏమన్నావ్?..... నా చిట్టితల్లి నా బంగారం తల్లి.... నా పొన్నారికొండ నాగారాలపట్టి గర్భవతి అయ్యిందా?.... నన్నింతసేపూ ఏడిపించి చావగొట్టినా చివరికి ఎంత మంచి వార్త చెప్పావ్ బాబూ." అంటూ ఆనందభాష్పాలు రాల్చాడు నారాయణరావు.
అది చూసి కామాక్షమ్మ నాలుక కరుచుకుంది.
"హత్తెరి.... వార్తవిన్న వెంటనే ఆనందభాష్పాలు నేను రాల్చాలి కదా?.... మర్చిపోయానే" అనుకుని ఆమె కూడా జలజలా ఆనందభాష్పాలు రాల్చింది.
"ఇంతకీ నీకీ వార్త ఎవరు చెప్పారు బాబూ?...." చొక్కా ఎత్తి ఆనందభాష్పాలు తుడుచుకుంటూ అడిగాడు నారాయణరావు.
"ఇప్పుడే రోడ్డుమీద అలా కుంటకుంటూ వెళ్తుంటే గూడెం మనిషొకడు కనిపించాడు.... వాడిని అక్కా బావ ఎలా వున్నారని అడిగితే బాగున్నారని చెప్పి ఈ వార్త చెప్పాడు..." అన్నాడు సుబ్రమణ్యం.
"ఇంతకీ ఖళ్ - ఈ విషయం ఖళ్ ఖళ్ గోపీ వాళ్ళింట్లో తెలుసో తెలీదో? ఖళ్...." అంది కామాక్షమ్మ.
"ఈ విషయం నేను వాళ్ళకి కూడా చెప్పొస్తా..." చంకల క్రింది కర్రలను నేలకేసి టకటకా కొడ్తూ అన్నాడు సుబ్రమణ్యం.
"నువ్వు కుంటుకుంటూ వాళ్ళింటికి ఎప్పటికి వెళ్తావ్ లే. నేనే వెళ్ళి చెప్పొస్తా" అన్నాడు నారాయణరావు.
* * *
గోపి రాయుడ్ని తన్నిన తర్వాత ఇంటికొచ్చాడు.
ఇంట్లో వాతావరణం గంభీరంగా వుంది. రాధ, సరస్వతి, గోపీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. మోనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉన్నారు.
గోపి అనాలోచితంగా రాధ వంక చూసి తృళ్ళిపడ్డాడు.
రాధ ఇంకా చిరిగిన లంగా, బాడీతోనే ఉంది.
"ఏం? ఇంకా ఆ చిరుగుల్తో ఉన్నావ్? ఈ గెటప్ నీకు బాగా నచ్చిందా?" అన్నాడు పళ్ళునూర్తూ
"లేదండీ. ఆ పాపిష్టివాడు తాకిన ఈ ఒంటికి అసలు ఏ విధమైన అలంకారమూ, తయారూ అక్కరలేదండి" అంటూ బేర్ మంది రాధ.
నువ్వు అక్కరలేదనుకోవచ్చుగానీ - మేం అలా అనుకోడం లేదు కద రాధా? మేం నిన్ను ఈ విధంగా చూడలేక చస్తున్నాం రాధా. ప్లీజ్ రాధా" బ్రతిమిలాడుతూ అన్నాడు గోపి.
"హేవండీ - నా వల్ల కాదండీ. బేర్ ర్."
"తప్పమ్మా. అలా అనకూడదు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివమ్మా. నువ్విట్టా బాడీతో, చిరిగిన లంగాతో ఉండకూడదమ్మా. నువ్వు నిండుగా చీర కట్టుకుని నుదట పెద్ద కుంకుమ బొట్టుతో లక్ష్మి కళ ఉట్టిపడుతూ ఇంట్లో సీతలా గునగునా తిరగాలమ్మా" అంది సరస్వతి బాధతో, జీరపోయిన గొంతుతో.
"హత్తయ్యా - ఉహు - ఉహు నా వల్ల కాదత్తయ్యా. నన్నిలాగే ఉండనియ్ అత్తయ్యా - ఉహు - ఉహు"కుమిలిపోయింది రాధ.
గోపి రాధ భుజంమీద చెయ్యేసి నిమిరాడు.
"తప్పదు రాధా తప్పదు. నిన్ను ఇలా నేను చూడలేను రాధా. చూడలేను. నువ్వు చీర కట్టక తప్పదు. నీ కోసం కాదు రాధా నా కోసం! మా అందరికోసం. మనం మనకోసం జీవించుకూడదు రాధ. ఇతర్లకోసం జీవించాలి! అదే త్యాగం అనిపించుకుంటుంది రాధా. అదే జీవితపరమార్ధం అనిపించుకుంటుంది."
రాధ లేడికళ్ళతో బెదురుచూపులు చూసింది.
పులినోట చిక్కిన దుప్పిలా గోపివంక చూసింది రాధ.
"హేవండీ! ఇంకా ఏంటీ ప్లీజ్! నేను చీర కట్టుకుంటా. కట్టుకుంటానన్నాగా?" అనేసి లేచి గబగబా లోపలికి పరుగెత్తింది.
ఒక నిముషంలో రాధ మళ్ళీ బయటకు వచ్చింది.
రాధ ఇప్పుడు పెద్ద జరేఅ అంచున్న పట్టుచీరలో ఉంది.
"హమ్మా రాధా?" ఆనందంగా అంది సరస్వతి."నువ్వెంత త్యాగశీలివమ్మా!"
"హమ్మా రాధా!" గోపీకూడా ఆనందంగా అన్నాడు. అంతలోనే తన పొరబాటు గ్రహించి నాలుక కొరుక్కుని "హమ్మా రాధా కాదు. ఒట్టిరాధా" అనేసి రెండు చేతులూ బార్లా చాపి పరవశంగా "ఒట్టి రాధా" అన్నాడు.
రాధ ఒక్కసారి కప్పలా గెంతి అతని చేతుల్లో వాలిపోయింది.
ఇంతలో వాళ్ళ ఇంట్లోకి బిలబిలమంటూ పరంధామయ్య కుటుంబం, నారాయణరావు కుటుంబం వచ్చేశారు.
23
ఒక్కసారిగా అందరూ గోలగోలగా లోపలికి రాగానే గోపికి రాధకి కంగారు పుట్టింది.
ఆ తర్వాత గోపి, రాధ ఆనందంగా నవ్వారు.
మళ్ళీ అంతలోనే తమ పరిస్థితి గుర్తుకువచ్చి విచారంగా మొహం పెట్టారు.
"హమ్మా రాధా ఖళ్-" కామాక్షమ్మ రాధని గట్టిగా కౌగిలించుకుంది.
"కేర్ ర్-" మంది రాధ.
"ఏమ్మా ఖళ్ - ఏమైందమ్మా ఖళ్?"
"నువ్వు నా పీక నొక్కేస్తున్నావమ్మా. కేర్ ర్."
కామాక్షమ్మ రాధని వదిలిపెట్టి చటుక్కున వంగి రాధ పొట్టని అప్యాయంగా నిమిరింది.
కామాక్షమ్మ చర్యకి రాధకి దుఃఖం వచ్చి "బేర్ ర్" అంది.
"నీ పీక వదిలి పెట్టేశాను కదమ్మా ఖళ్? ఎందుకు బేర్ అంటున్నావు ఖళ్?" అంది కామాక్షమ్మ రాధ పొట్టని ఇంకా నిముర్తూనే.
రాధ తల్లి ప్రశ్నకు జవాబు చెప్పకుండా "హమ్మా బేర్ ర్..." అంది.
ఇంతలో అన్నపూర్ణ కూడా గబుక్కున ముందుకు వచ్చి మోకాళ్ళమీద రాధ దగ్గర కూర్చుంది... తను కూడా రాధ పొట్ట నిమరాలని.
కానీ కామాక్షమ్మ అందుకు అవకాశం ఇవ్వకుండా అన్నపూర్ణకి అడ్డు తగల్తూ అంది. "ఉండవమ్మా. నా కూతురి పొట్ట తనివితీరా నన్ను నిమరనీయకుండా నువ్వు అడ్డు పడ్తావేంటీ?"
ఆ దృశ్యం చూసి సరస్వతి ఘొల్లుమంది.
కామాక్షమ్మ సరస్వతివంక చిరాగ్గా చూసింది.
