'సరే ...నాన్నారూ!'
తెల్లవారేసరికి రమణయ్య గారు పూర్తిగా కోలుకున్నారు. అమ్మాయిని నర్శింగ్ హోం కు పంపించి నేను రమణయ్య గారితో మాట్లాడాలని యింట్లోనే ఉండిపోయాను. ఇద్దరమూ కబుర్ల లో పడ్డాము.
'రమణయ్య గారూ...యిప్పుడు....మీ ఆరోగ్యం ఎలా ఉంది...?'
'కాస్త తేలికగానే ఉందండీ!'
'మరి! మీ రెండవ కుమారుడు ఏమయ్యాడు? ఏమైనా జాడ తెలిసిందా....?'
'లేదండీ! ఊరు ఒదిలి వెళ్ళిపోయి నట్లు మాత్రం తెలిసింది. వాడితో నాకేం పని? వాడి కారణంగా మేము ఊరు ...యిల్లు ఒదిలి వచ్చాం. గూడు వోడిచిన పక్షులలా తలా ఒకదారిన పోయాం.... మళ్ళీ కలుస్తామో ...లేదో?'
'విచార పడకండి....అంతా శుభంగానే జరుగుతుంది.... ఆ అబ్బాయి పేరేమిటి?'
'సూర్యం ...మీ నోటి వాక్యాన అలా జరుగుతే నాకిక కొరతేముంటుంది? నిజంగా మీరు నా పాలిట దేవుళ్ళండీ!
'అంతంత పెద్ద మాటలనకండి....'
అమ్మాయి వెళ్ళేటప్పుడు శివాన్ని వెంటనే పంపించవలసిందిగా చెప్పి పంపాను. మేము మాట్లాడుకుంటూ ఉండగా అతను వచ్చాడు.
'ఇలా రా శివం....కూర్చో' అన్నాను నేను.
ఎదురుగా కూర్చున్నాడు. రమణయ్య గారిని తదేకంగా ఒక్క క్షణం చూసి 'నాన్నారూ...! మీరా...నన్ను మన్నించండి . నేను మీకు చేసిన ద్రోహానికి నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది.' అని వారి కాళ్ళ పై బడ్డాడు శివం.
'ఎవరూ....? సూర్యమా? ఏమిట్రా ఈ వేషం? ఎవరా ఈ గెడ్డం వాడను కున్నాను? ఛ... వెధవ. నాకు ముందే తెలుసు; ఒకనాడు నీవు బికారివవుతావని....? అనుకున్నంతా అయింది...లే...నాకు ముఖం చూపించకు.' అసహ్యంతో తమ కాళ్ళను ప్రక్కకు జరుపుకున్నారు రమణయ్య గారు.
'చూడండి రమణయ్యగారూ! అంతా తప్పులు చేస్తారు. వాటిని తెలుసుకొని పశ్చాత్తాప పడిన తర్వాత మనం క్షమించడం ధర్మం....మీరు యితనిని క్షమించాలి. సూర్యం తన జీవిత పద్దతిని మార్చు కున్నాడు. మా నర్శింగ్ హోం లోనే రోగులకు సేవ చేస్తూ అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు... రోగులను ప్రాణ పదంగా చూసుకుంటున్నాడు. మీ అబ్బాయి సూర్యాన్ని యిప్పుడందరూ గౌరవిస్తున్నారు. మరి....! మీరు కూడా . అతనిని క్షమించాలి...అలా జరగడం న్యాయం....'
'అలాగే! మీ మాటలకు తిరుగుందా?'అన్నారు రమణయ్య గారు.
'చూడు శివం ...నీవు నీ పేరు మార్చుకోవడం లో యిదివరకు నాకు చెప్పిన కారణం కాక వేరే యింకేమైనా కారణం ఉందా....?'
'ఉందండీ! రాధ నా వల్లనే మోసపోయింది. ఇప్పుడు మన నర్శింగ్ హోం లోనే నర్సు గా పనిచేస్తూ ఉంది.' నేల చూపులు చూస్తూ అన్నాడు సూర్యం.
'అర్ధమైంది....? ఇంకేం....? రమణయ్య గారి కుమారులిద్దరూ కోడళ్ళ తో సహా దొరికిపోయారు. నిజంగా మీరు అదృష్ట వంతులండీ ...రమణయ్య గారూ!' అన్నాను నేను.
రాధ విషయం విన్నవారు 'ఏమిట్రా..? రాధ కూడా యిక్కడే ఉందా...? ఆమె నైనా క్షమాపణ కోరుకున్నావా...?
'లేదు...ముఖం చెల్లలేదు.'
'విశ్వం గారు--! మిమ్ములను ఎలా అభినందించాలో నాకర్ధం కావడం లేదు. నా యింట నుండి మాయమైన వారిద్దరికీ మీ యింట ఆశ్రయ మిచ్చారు. ఇది ఎన్ని జన్మల ఋణానుబంధమో....? మీకు నేనెంతో ఋణపడి ఉన్నాను.' అన్నారు రమణయ్య గారు ఆర్ద్రంగా.
ఆ విధంగా సంతోషంతో వారం రోజులు గడిపాము. రమణయ్య గారిని, సూర్యకాంతమ్మ గారిని, సూర్యాన్ని బలవంతం చేసి యింటి లోనే ఉంచుకున్నాను. రమణయ్య గారు కుమారుని విషయం తెలిసిన తర్వాత పూర్తిగా కోలుకున్నారు. రాధను శివాన్ని ఒకరితో మరొకరితో పరిచయం చేసి... వారినిద్దరికీ సంతోషాన్ని కలిగించాను.
నేను రమణయ్య గారు, యిద్దరమూ ఒకరోజు సాయంత్రం తోటలో కూర్చున్నాం. సార్ టెలిగ్రాం.....' పోస్ట్ మాన్ చేతి నుండి టెలిగ్రాం అందుకొని చదివి సంతోషంతో పొంగిపోయాను. రెండు రోజులలో ప్రసాద్ తిరిగి వస్తున్నాడు. ఈ సంగతి ఎదురుగా ఉన్న రమణయ్య గారికి చెప్పాను. మరు నిమిషంలో అందరికీ తెలిసిపోయింది. అమ్మాయి శశి ఆనందంతో పొంగిపోయింది. రమణయ్య గారి ఆనందం మళ్ళీ ఏ ప్రమాదాన్ని తెస్తుందో నని భయపడ్డాను. కాని అటువంటిదేమీ జరగలేదు.
రమణయ్య గారు సీతమ్మను ఎంతగానో పొగిడారు. ప్రసాద్ కు తల్లి లేని లోటు తీర్చినందుకు వారికీ ఆనందం కలిగింది.
రెండు రోజులు రెండు యుగాలుగా గడిచాయి మాకు. అమ్మాయి శశి హడావుడికి అంతు లేదు. ప్రసాద్ రూం శుభ్రం చేయించింది. ఇల్లంతా కడిగించి యింటి నిండా ముగ్గులు వేయించింది.
ఏరోడ్రోమ్ కు నేను, శశి , సూర్యం, రాధ వెళ్ళాము. రమణయ్య గారు, సూర్యకాంతం రానని పట్టుబట్టారు. ప్రసాద్ ని చూడడానికి ముఖం చెల్లదని అంత మందిలో తను నిభాయించుకోలేనని చెప్పారు వారు అదీ సమంజసమేనని తోచింది నాకు.
మిలటరీ దుస్తులలో....మిలటరీ డాక్టరు గా తిరిగి వచ్చిన ప్రసాద్ ను వెంటనే పోల్చుకోలేక పోయాము. పోల్చుకున్న తర్వాత సంతోషంతో పొంగిపోయాము. మిలటరీ శిక్షణ కారణంగా ప్రసాద్ కొంచెం ఒళ్ళు చేశాడు. ఏరో డ్రోం లో కుశల ప్రశ్నలు జరిగాయి. అతనికి పూల మాలలు వేసి కారులో యింటికి తీసుకు వచ్చాము. ఇంటికి రాగానే నాకు, సీతమ్మ కు పాదాలాంటి నమస్కారాలు చేశాడు ప్రసాద్. ఆ ఆనందంతో ఆశీర్వచనపు మాటలు తడబడ్డాయి.
'బాబూ! నీవు నమస్కారం చేయవలసిన వారు యింకా ఉన్నారు.' అన్నాను.
'ఎవరండీ....?' విస్మయంతో ప్రశ్నించాడు ప్రసాదు.
'నీ గది లోపలికి వెళ్ళి చూడు.' ఆ మాటలు వింటూనే అతని గది వైపు నడిచాడు. అతని వెనుకనే అందరమూ లోపలికి వెళ్ళాము.
'నాన్నగారా....! ఎప్పుడొచ్చారు? ఎలా తెలుసుకున్నారు...?' అంటూ మళ్ళీ 'నన్ను క్షమించరూ....నాన్నారూ....?' అని రమణయ్య పాదాల పై పడ్డాడు ప్రసాదు.
'బాబూ....! నాయనా....! చచ్చిన పామును యింకేందుకు చంపుతావురా? నీవు నిర్దోషివని తెలిసి ఉండి క్షమాపణ దేనికిరా కోరుతావు? క్షమించవలసినది నేను కాదు ...నీవు . నన్ను...నీ తల్లిని నీవు క్షమిస్తే గాని నేను జీవించలేను రా బాబూ!' అంటూ అతి దీనంగా కంట తడిపెడుతూ ప్రసాద్ ను కౌగలించుకొని వాపోయాడు రమణయ్య గారు.
'అదేమిటండి నాన్నారూ....అలా మాట్లాడకూడదు..తప్పు.' అని తండ్రిని పొదివి పట్టుకొని కుర్చీలో కూర్చుండ పెట్టాడు ప్రసాద్. సూర్యకాంతమ్మ గారికి కూడా ఆ విధంగానే సమాధానం చెప్పాడు ప్రసాద్; ఆమె కూడా క్షమాపణ కోరినప్పుడు ప్రసాద్ తన అనుభవాలను వివరించి చేప్పాడు. అందరమూ సంతోషంగా విన్నాము. చాలాకాలానికి రమణయ్య గారి కుటుంబమంతా ఒక్క దగ్గర చేరినందుకు వారు ఎంతగానో సంతోషించారు. శశి, రాధ యిద్దరూ అప్పుడే అక్కా, చెల్లీ అనుకోవడ మారంభించారు. ప్రసాద్ ను అంతా పొగడడం రమణయ్య గారికి ఆనంద భాష్పాలను తెప్పించింది. ఆరోజంతా సంతోషంగా గడిపాము.
* * * *
రేఖకు, ప్రసాద్ కు, రాధకు, సూర్యానికీ వివాహాలు జరిగాయి. రమణయ్య గారు రాఘవయ్య గారికి కాంట్రాక్టు యిచ్చి చక్కని యిల్లు కట్టించారు; హైదరాబాదులో. వారు ప్రసాద్ కు ఒక కారు కొన్నారు. నర్శింగ్ హోం బాధ్యత పిల్లల పై ఉంచాను నేను.
రమణయ్య గారు తమ మొక్కుబడి విషయం తెలియజేయగానే అందరమూ తిరుపతి వెళ్ళాము. చల్లని ఆ ఏడు కొండల వానికి అలివేలు మంగ తల్లికి ఎంతో వైభవంగా కల్యాణం జరిపించాము. రమణయ్య గారి మొక్కుబడి చెల్లింది.
నేను రమణయ్య గారు నూతన దంపతులను అక్కడ ఒదిలి యింటికి వచ్చేశాము. ప్రస్తుతం, నేను, రమణయ్య గారు కబుర్ల తో కాలక్షేపం చేస్తూ త్వరగా మనవాళ్ళ ను, మనవరాళ్ళ ను ఎత్తుకొని తిరిగే అదృష్టాన్ని కలిగించవలసిందిగా ఆ ఏడు కొండల వాడిని వేడుకోసాగాము.
(అయిపొయింది)
