అందరూ ఆలోచిస్తున్నారుగానీ జవాబు తట్టడంలేదు.
"ఎవరబ్బా" మేనేజర్ బయటకే అనేశాడు. ఆయన ముఖం సీరియస్ నెస్ లో ముంచి లేపినట్టుంది.
మహాలింగం ఆంజనేయులు చొక్కా పట్టుకుని కిందకు గుంజాడు.
"రేపు కూడా శకుంతలతో కాఫీ తాగడానికి వాడు వేసిన ప్లాన్ చూశారా? వేటగాడు ఎర చూపించి జంతువును లాగినట్టు వీడు కాఫీ పధకం వేసింది గమనించారా? వేటగాడి దగ్గర ఈటెలు వుండే వీడి దగ్గర మాటలు వుంటాయి. అంతే తేడా' మహాలింగం ఆంజనేయులు చెవిలో చెప్పాడు.
"ఓ.కే. ఎవరూ జవాబు చెప్పనట్లేనా?" వినయ్ గట్టిగా అడిగాడు.
అందరూ ఓడిపోయినట్లు పెదవి విరిచారు.
'ఆ గంధర్వ స్త్రీ పేరు మెనక. ఈ సాయంకాలం శకుంతలగారిని చూడగానే నాకు ఠక్కున గంధర్వ స్త్రీలా అనిపించింది. రంభ, ఊర్వశిని తలదన్నే అందం ఆమెదనిపించింది. వాళ్ళ చెల్లెలనిపించింది. పేరు రీత్యా అయితే మేనకకు కూతురవుతుంది. అదీ తమాషా?"
"ఓస్ ఇంతేనా" అన్నట్టు మేనేజర్ దీర్ఘంగా శ్వాస విడిచాడు.
శకుంతల కళ్ళలో గర్వం వుబుకుతోంది. ప్రియంవద, లక్ష్మి ఇబ్బందిగా అటూ ఇటూ కదిలారు.
"ఇప్పుడు మరొకటి-జోక్-నిజంగా జరిగిందిది."
"జోక్ అయితే నవ్వుతాము" మేనేజర్ జోక్ చేసినట్టు బిగ్గరగా నవ్వాడు.
"నవ్వడం కాదు. జోక్ ను విడమరిచి చెప్పాలి."
"ఓ.కే"
"ఇంతకీ నాకు శకుంతలగారు రేపు కాఫీ ఇప్పిస్తున్నారా?"
"ష్యూర్" అందామె.
'ఏమిటీ సిగ్గులేని ఆడది' అన్నట్లు చూశాడు మహాలింగం.
"మరిక జోక్ చెప్పు వినయ్" రాహుల్ అడిగాడు.
"ఈ జోక్ స్త్రీల ప్రిజిడిటీ మీద"
"ప్రిజిడిటీ అంటే?" లక్ష్మి అడిగింది.
"సెక్స్ పట్ల ప్రతిస్పందన లేకపోవడం."
"సరే. అయితే చెప్పు" జీవన్ తొందర చేశాడు.
"మరి పందెం అదీ నేనే చెబుతాను. మీరు గెలిస్తే ఇది బఫే డిన్నరైనా నేనే వడ్డిస్తాను. మీరు ఓడిపోతే శకుంతలగారు నాకు వడ్డించాలి" అని శకుంతల రియాక్షన్ కోసం ఆగాడు వినయ్!
పందానికి ఒప్పుకున్నట్టా? లేనట్టా అని మేనేజర్ కళ్ళతోనే ప్రశ్నించాడు ఆమెను.
నవ్వుతూ తలదించుకుంది ఆమె.
"మహాలింగానికి మండిపోతుంది." ఆమె వాడి పెళ్ళామా వండి వడ్డించడానికి. బాస్టర్డ్! కుటుంబ స్త్రీలతో ఎలా మాట్లాడాలో తెలీదు. స్త్రీల ప్రిజిడిటీ మీద జోక్ అట. అడ్డమైన పుస్తకాలు చదివి, నోటికొచ్చింది కూయడం." ఆ మాటల్లోని 'కారం' అంజనేయుల నషాళాన్ని తాకుతోంది.
ఆంజనేయుల చెవిలో గొణుగుతున్న మహాలింగాన్ని చూసి "సైలెన్స్" అన్నాడు మేనేజర్ కోపాన్ని నటిస్తూ.
"గ్రాఫెన్ బెర్గ్ అనే ఓ ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ వద్దకు ఓసారి ఒక వివాహిత స్త్రీ వచ్చింది. ఆమెకు ముఫ్ఫై ఏళ్ళు వుంటాయి. తకకంటే దాదాపు పదేళ్ళు పెద్దవాడైన వ్యక్తితో చాలాకాలం క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. కానీ ఎప్పుడూ ఆమె సంభోగంలో తృప్తిగానీ, ఆనందంగానీ ఫీల్ కాలేకపోయింది. ఇంత కాలానికి గ్రాఫెన్ బెర్గ్ క్లినిక్ కు వచ్చి తనగోడు వెళ్ళబోసుకుంది..."
"మరి పిల్లల్ని ఎలా కన్నది?" మధ్యలో ప్రశ్న.
"పిల్లల్ని కనడానికీ దానికీ సంబంధం ఏమిటి? అన్నం తిన్నా తిన్నట్లనిపించక పోవడం, వెనకటికి ఒకామె మగాడి నగ్న చిత్రాన్ని చూసి మగవాడు బట్టలిప్పినప్పుడు ఇలా వుంటాడా అందట. అప్పటికి ఆమెకు ఆరుమంది సంతానం. కాబట్టి ఆ ఆనందం ఏమిటో తెలీకుండానే చాలామంది అమ్మాయిలు అమ్మలు, అమ్మమ్మలు అయిపోతున్నారు" వినయ్ ఓ క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించాడు.
"ఆమెకు ఏ శరీర లోపమూ లేదు. మరెందుకు సెక్స్ లో సుఖం పొందలేకపోతోందో బెర్గ్ కు అంతుబట్టలేదు. చివరగా ఆయన ఓ ప్రశ్న అడిగాడు. 'ఇలా జరగడం భర్త దగ్గరేనా అని?' పాపం దీనికి ఆమె దగ్గర సమాధానం లేదు. తెలియదన్నట్టు తల అడ్డంగా వూపింది. మరోసారి తీరిగ్గా రమ్మని చెప్పి ఆమెను పంపించివేశాడు బెర్గ్. ఆమె వెళ్ళిపోయింది."
"ఇందులో ఏం వుంది?" జీవన్ తేల్చేయబోయాడు.
"కథ ఇంకా అయిపోందే. అలా వెళ్ళిపోయిన ఆమె ఆ రోజు అర్దరాత్రి బెర్గ్ కు ఫోన్ చేసింది. ఇంత రాత్రప్పుడు ఎవరా అనుకుంటూ ఆయన రిసీవర్ ఎత్తుకున్నాడు. "మీరు చెప్పింది కరెక్ట్ డాక్టర్. మీ అనుమానం నిజమే" అని చెప్పింది చాలా ఉత్సాహంగా. గొంతు గుర్తించాడు. ఆయన 'ఓ.కే' అంటూ చిరునవ్వు నవ్వి ఫోన్ పెట్టేశాడు." మాటలను ఆపి ఎవరి రియాక్షన్ ఎలా వుందోనని చూశాడు వినయ్.
"ఫోన్ లో అలా ఆమె ఎందుకు చెప్పిందో, అసలేం జరిగిందో చెప్పింది. ప్రతీ లైన్ కూ రెండు మార్కులు, డయాగ్రామ్ అవసరం లేదు" అని నవ్వాడు విజయ్.
అందరూ సీరియస్ గా ఆలోచిస్తున్నారు.
సర్వర్లు మరోసారి కాఫీ సర్వ్ చేసారు.
మేనేజర్ ఓ కప్పు అందుకుని "తెలియడం లేదయ్యా వినయ కుమారా" అన్నాడు. తను ఆ జోక్ ను విడమరిచి చెబితే కలిగే ప్రతిస్పందనలను గురించి ఆలోచిస్తున్నాడు ఆంజనేయులు. తను గంభీరంగా ఎనలైజ్ చేసి చెపుతుంటే శకుంతల మెచ్చుకోలుగా చూస్తుంది. ఓ క్షణంపాటు ఆమె కళ్ళలో పొంగే ఆరాధనా భావాన్ని తను పసిగడతాడు. ప్రియంవద తనవైపు అడ్మయిరింగ్ గా చూస్తుంది. లక్ష్మి అంతలోనే ఎంత ఎదిగిపోయాడమ్మా అంటూ బుగ్గలను నొక్కుకుంటుంది. వినయ్ ముఖం వాడిపోతుంది. తను హీరో అయిపోతాడు.... కానీ తన బుర్రకు అదేదో తట్టదు. బి.ఏ వరకూ చదివినా తను టెక్స్ట్ పుస్తకాలు కొనుక్కోలేక పోయాడు. అందుకే తను ఏ శాస్త్రంలోనూ నిష్ణాతుడు కాడు. సగం చినిగిపోయిన పుస్తకాలను ఎవరి దగ్గరో అరువు తీసుకుని తీరిక ఉన్నప్పుడు చదివి బొటాబొటిగా పాస్ అయ్యానని అనిపించాడు. ఇలాంటి తనకు అలాంటి విషయాల్లో నిగూఢత అర్ధమవుతుందా? కాదు.
ఆంజనేయులు బాధతో బరువెక్కిపోయాడు.
"మీ సిగరెట్ అయ్యేలోపు జవాబు చెప్పాలి."
మేనేజర్ ఆలోచనలోపడి సిగరెట్ పీలుస్తున్నాడు.
సిగరెట్ అయిపోయింది.
"మాకేమీ తట్టడంలేదు. మీరే చెప్పండి" ప్రియంవద అందరి వకాల్తా పుచ్చుకుని అంది.
శకుంతల తన పెద్ద కళ్ళను బండి చక్రాల్లా అటూ ఇటూ దొర్లిస్తోంది.
వినయ్ గొంతు సవరించుకున్నాడు.
"ఆమె అంతవరకు భర్తతోనే గడిపింది. అంతకాలం అందులోని తీయదనం ఏమిటో తెలియకపోయినా శాంతంగా బతుకును లాక్కొస్తోంది. ఇలా జరగడం భర్తతోనే నా అని డాక్టర్ అడిగినప్పుడు అందుకే ఆమె జవాబు చెప్పలేకపోయింది. విషయం తనకైనా తెలియాలి గదా అనుకుంది. ఆ రాత్రే తేల్చుకోవాలనుకుంది. అలాగే ప్రవర్తించింది. తను ప్రిజిడ్ కాదని, తన భర్తతోనే సుఖం పొందలేకపోయానన్న నిజం తెలిసిపోయింది. దీన్ని డాక్టర్ కి చెప్పాలన్న ఉత్సాహంతోనే అర్ధరాత్రయిందని చూడకుండా ఫోన్ చేసింది" అని ఆగి" బాయ్ ఫ్రండ్ తో గడుపుతూ డాక్టర్ కు, ఫోన్ చేసిందన్న మాట" అని ముగించాడు.
