Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 25


    అందరూ కేరింతలు కొట్టారు.
    లిఫ్ట్ నుంచి స్టయిల్ గా నడుస్తూ వచ్చాడు వినయ్. అందర్నీ ఒక్కో భంగిమలో విష్ చేశాడు. శకుంతల దగ్గరికి వెళ్ళి అందరికీ వినపడేటట్టు "పలకరింపులతో పాటు మీకీ చిన్న కనుక" అని బొకేను అందజేశాడు. ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన రకరకాల పూలు అందంగా వున్నాయి.
    "దీన్ని మీకివ్వడంలో రెండు అర్ధాలున్నాయి. ఇక నుంచి మీరు మా మధ్య ఉంటారన్న ఆనందానికి చిహ్నంగా ఈ పుష్పగుచ్చాన్ని ఇవ్వడం ఒక అర్ధం. మీలాంటి అందమైన ఆడపిల్ల వంటరిగా ఉండకూడదని, చక్కని తోడు సంపాదించుకోవాలని అన్ని పూలనూ కట్టిన దీన్ని మీకివ్వడంలో వున్న రెండో అర్ధం మగతోడు లేని స్త్రీ విడిపోయిన పుష్పగుచ్చం లాంటిదాని సిసైల్ చెప్పడాన్ని మీకు గుర్తుచేయడం ఇందులోని పరమార్ధం."
    నవ్వుతూనే మాట్లాడగలగటం వినయ్ ఆర్ట్.
    ఆంజనేయులు అతన్నే చూస్తుండిపోయాడు. మాట్లాడడం అంత సులభమా? అంత చక్కగా స్వీట్ గా అమ్మయనే జంకు లేకుండా అలా మాట్లాడటం సాధ్యమా!
    "థాంక్స్ ఎలాట్" అంది శకుంతల.
    "వెల్ కమ్" శకుంతలతో అని "మీకోసం, మనకోసం ఈ పార్టీని ఏర్పాటు చేసిన అభినయ్ కు కంగ్రాజులేషన్స్" అన్నాడు వినయ్.
    అంతలో ఇద్దరు సర్వర్లు కాఫీ తెచ్చారు.
    "ముందు కాఫీలు ఆ తరువాత బఫే డిన్నర్ చెప్పాడు రాహుల్ తలో కప్పు అందిస్తూ.
    "బఫే డిన్నరంటే?" ఆంజనేయులు అడిగాడు మహాలింగాన్ని.
    "కావలసినంత మనమే వడ్డించుకుని మెక్కడం" కసిగా జవాబుచెప్పాడు మహాలింగం.
    అంతలో మేనేజర్ హరనాధరావు వచ్చాడు.
    పలకరింపులయ్యాక అందరూ రవుండ్ గా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు.
    కాఫీ తాగి సిగరెట్ వెలిగించాడు మేనేజర్.
    "సార్! మీరెన్ని సిగరెట్లు కాలుస్తారు రోజుకి?" అని అడిగాడు వినయ్. అందరూ మేనేజర్ వంక చూశారు.
    ఆయన కాసేపు ఆలోచించి "రెండు ప్యాకెట్లు" అని చెప్పాడు.
    "అంటే మీరు రోజుకి పది అడుగుల పొడవున్న సిగరెట్లు కాలుస్తారన్నమాట." అన్నాడు వినయ్ మేనేజర్ ముందున్న కింగ్ సైజ్ సిగరెట్ ప్యాకెట్ ను చేతుల్లోకి తీసుకుంటూ.
    "మై గాడ్! అంత పొడవున్న సిగరెట్టూ తాగుతానా?" ఆశ్చర్యపోయాడు ఆయన.
    "అవును సార్, రోజుకు రెండు ప్యాకెట్లు చొప్పున రోజుకు పది అడుగులు. సంవత్సరానికి మైలుకో మూడో వంతు పొడవున్న సిగరెట్లు కొలుస్తారన్నమాట."
    "మీరెప్పుడైనా సిగరెట్లను కిందపరిచి కొలిచారా?" మహాలింగం అడిగాడు వినయ్ ని. అతని ఉద్దేశ్యం వినయ్ తప్పులేక్క చెబుతున్నాడని.
    "నేను కొలవలేదు. కాని లెక్కగట్టినవాళ్ళు రాస్తే చదివాను."    
    శకుంతల చాలా ఇంట్రెస్టింగ్ గా వినయ్ ను చూస్తోంది. దీనిని కనిపెట్టిన ఆంజనేయులకు వినయ్ మీద ఈర్ష్యలాంటి భావన కలిగింది.
    "సార్ ఈ లెక్క విన్నాకైనా మీరు సిగరెట్లు మానెయ్యండి సార్" లక్ష్మి అర్దింపుగా అడిగింది మేనేజర్ ను.
    "నాకూ మానెయ్యాలని వుందమ్మా. కానీ వీలు కావడంలేదు. వినయ్ చెప్పిన లెక్కప్రకారం అయితే నేనిప్పటివరకు పందొమ్మిది మైళ్ళ పొడవున్న సిగరెట్లు కాల్చాను. నా ఇరవై ఏట ప్రారంభించాను సిగరెట్లు తాగడం. ఇప్పుడు నా వయసు నలభై అయిదు" పొగ ఎగదట్టడంతో మేనేజర్ కు పొలమారింది.
    "సార్! కాస్తంత రిలాక్స్ కండి."
    "ఏం రిలాక్సయ్యా బాబూ నీలెక్క తల తిప్పింది."
    అందరూ ఒక్కసారిగా నవ్వారు.
    మరో మారు కాఫీలు వచ్చాయి.
    మహాలింగం ఓ గుక్కలో కాఫీ తాగేసి, కప్పు కింద పెట్టాడు.
    "అప్పుడే తాగేశారా?" ఆశ్చర్యపోయాడు మేనేజర్.
    మహాలింగం ఎప్పుడూ అంతే ఏ పనైనా క్షణంలో ముగించేస్తాడు. ఎవరో తఃనాను వెనక నుంచి తరుముకొస్తున్నట్టు తొందర తొందరగా చేస్తాడు. సిగరెట్ కూడా అంతే. ఏదో కుతిగా నాలుగు పఫ్ లు లాగి కింద పడేస్తారు.
    "అలా తాగడం, అలా చేయడం ప్రస్టేషన్ లక్షణాలు మహాలింగంగారు ప్రస్తుతం ఏ సంక్షోభంలో వున్నారో" అని నవ్వుతూ చూశాడు వినయ్ అతని వంక.
    "సంక్షోభాలూ, సంతోషాలూ ఏమీ వుండవు మాలాంటి వాళ్ళకు. అవన్నీ మీలాగా పెట్టి పుట్టినోళ్ళకి" ఉడుక్కున్నాడు మహాలింగం.
    ప్రతి చిన్న విషయాన్నీ చక్కగా విశ్లేషిస్తున్న వినయ్ ను మెచ్చుకోలుగా చూస్తోంది శకుంతల. దీన్ని గమనించాడు ఆంజనేయులు.
    తనూ వినయ్ లా మాట్లాడగలిగితే-? సైకాలజీ, ఫిలాసఫీని రంగరించి ఎదుటివాళ్ళు అచ్చెరువుతో బిగుసుకు పోయేలా మాట్లాడితే-? అప్పుడు శకుంతల కళ్ళు తన చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. తన చుట్టూ వున్న ఇంతమందికి తను కేంద్ర బిందువై పోతాడు. అందరూ తనను అడ్మయిరింగ్ గా చూస్తారు. లోల్లోపల ఈర్ష్యపడతారు.
    కలల్లో తేలిపోతున్నాడు ఆంజనేయులు.
    యాడ్లర్ మాటల్లో చెప్పాలంటే ప్రతి మనిషీ అందరికన్నా సుపీయర్ గా వుండాలని కోరుకుంటాడు. ఇందులో మూడురకాల మనుషులుంటారు. ఎప్పుడూ వూహల్లో తేలిపోతూ, ఆ కలల్లో తనను గొప్పవాడుగా చిత్రీకరించమంటూ సంతృప్తి పడుతుంటారు. ఇది డీజనరేషన్ కోవకు వస్తుంది. మరో రకం జీనియస్ లు. వీళ్ళూ ఆయా రంగాల్లో కష్టపడి పేరు ప్రఖ్యతహులు సంపాదించి నిజమైన సుప్రమిసీని సాధిస్తారు. ఇక మూరోరకం మనుషులు న్యూరసిస్ లు వీళ్ళు గొప్ప వాళ్ళు కావాలని ప్రయత్నిస్తూ విఫలమోతూ వుంటారు. ఈ క్రమంలో రకరకాల రుగ్మతలకు గురౌతారు.
    ప్రస్తుతం ఆంజనేయులు తన కళ్ళ ముందు ఊహాజనిత ప్రపంచాన్ని ఆవిష్కరించుకుంటున్నాడు. అందులో అతను నియంత.
    "వినయ్? కాలక్షేపానికి ఏదైనా చెప్పు" మేనేజర్ మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు ఆంజనేయులు.
    తన కథ అందరికీ తెలుసు గనుక తనను ఎవరూ కబుర్లు చెప్పమని అడగరు. వినయ్ ఏం చెబుతాడోనని చూస్తున్నాడు.
    "ఇప్పుడు నేనో పొడుపు కథ చెబుతాను. అదీ శకుంతలగారి మీద మీలో ఎవరైనా సమాధానం చెబితే రేపు సాయంకాలం వాళ్ళకు ఇదే హోటల్ లో నేను కాఫీ ఇప్పిస్తాను. ఎవరూ జవాబు చెప్పలేదనుకోండి రేపిక్కడ శకుంతలగారు నాకు కాఫీ ఇప్పించాలి" వినయ్ ఇలా అనడంతో ఆ పొడుపుకథ ఏమైవుంటుందా అన్న ఉత్సుకత బయల్దేరింది.
    శకుంతలగారిని చూస్తూనే నాకు ఓ గంధర్వ స్త్రీ గుర్తుకొచ్చింది. బంధుత్వం వరసనుంచి చూస్తే ఆమె ఈమెకు అమ్మవుతుంది. అందం వరస నుంచి చూస్తే అక్కవుతుంది. ఆమెవరో చెప్పండి" అందరి వంకా చూసి కుర్చీలో వెనక్కి వాలాడు వినయ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS