Previous Page Next Page 
అర్పణ పేజి 24


    "దుష్ట జన నిగ్రహంబును,
    శిష్ట జనానుగ్రాహంబు సేయుట కొరకై
    అష్టమ గర్బమున గుణో
    త్క్రుష్టుడు దేవకికి విష్ణుదేవుడు పుట్టెన్." చదువుతూ నవ్వింది సుభద్ర ----
    "విష్ణుడుదితుడైన వెనుక ణా దేవకీ
    భద్ర మూర్తి యగు సుభద్ర గనియె."
    "చూశారా! కృష్ణుడి తో పాటు నన్నుద్దరించడాని కని మీరు కూడా అలాగే పుట్టి ఉంటారు."    
    సుభద్ర ఎప్పుడూ లేనిది విపరీతంగా నవ్వి, "పెంకి పిల్లవి" అనేసి లేచింది, పనులు చేసుకోవడానికి.
    రెండు మూడు క్షణాల్లో ఇద్దరూ సాధారణ ప్రసంగాలలో లీనమయ్యారు.
    అతి సహజ ధోరణి లోనే ఉండి పార్వతి చెప్పిన వృత్తాంతం లాంటి విషయం వినగానే నివ్వెర పోయింది సుభద్ర. ముఖంలో అవేగంతో పాటు, సిగ్గుపదినట్లు -- ఆ వయసులో కూడా -- తన కంటే చాలా చిన్నదైన ఒక అమ్మాయి వైపు ఆమె కళ్ళు సూటిగా చూడలేక పోయాయి.
    పుల్లమ్మ గారు అన్న మాటలు చెబుతూ, "మీలాంటి సహ్రుదయులను అర్ధం చేసుకోకుండా అల్లా ఎందుకు ప్రచారం చేస్తుందో ఆవిడ?" అన్నది పార్వతి.
    తర్వాత ఆ అమ్మాయీ సుభద్ర ముఖ వర్ణాలను గమనిస్తూనే ఉండటం వల్ల ఉపశమనంగా "అయినా పుల్లమ్మ గారి మాట తోసి వచ్చినందుకు మీవంటి స్నేహితులు దొరికారు. నాది అదృష్ట మేనండి!" అంది.
    ఆ అమ్మాయి ముఖం చూడకుండా పనులేవో చేసుకుంటున్న సుభద్ర తెచ్చి పెట్టుకున్న నవ్వుతో, "ఏమో? ణా గురించి తెలిసిన తర్వాత నీకు కూడా నేనంటే అయిష్ట మౌతుందేమో , పార్వతీ?' అన్నది. అలా అని పార్వతి వైపు చూచింది ఆవిడ.
    "రా! అదేమిటి? మీరంటే ణా కెంత ఇష్టమో మీకు తెలియదు. "నేల మీద కూర్చున్న పార్వతి చూపుడు వేలితో కనిపించని గీతలు గీస్తూ అంది.
    "ణా కధ వింటావా పార్వతీ?' అంది సుభద్ర చేతులు తుడుచుకుంటూ.
    "మీకు కష్టమైతే ఎందుకు?" అంది పార్వతి నేల చూపులు చూస్తూ -- లోపల వినాలనే కుతూహలం హద్దులు మీరుతున్నా.
    సుభద్ర నవ్వింది. "అంతమట్టుకే కష్టపెట్టు కోవలసిన అవసరం ఉండదు లే, ణా చరిత్ర లో. అక్కడ కూర్చుందాము , రా'!' అంది ఆమె.
    అప్పుడే వీధిలో ఆడుకొని వచ్చిన పాప చేతిలో లడ్డు ఉంచి రాజు దగ్గరికి పొమ్మంది సుభద్ర.
    అది కొంతసేపు గునిసి వెళ్ళాక అటు చూస్తూ  "ఇప్పటి పిల్లలు ఇలాటి కధలు విన్నా, ఫరవాలేదులే. వింటేనే మంచిదేమో -- అయోమయపు తెరల్లో ఉండి మానసికానందాన్ని నాశనం చేసుకోకుండా" అంది.
    "నేనొక డాక్టరు గారి అమ్మాయిని పార్వతి! సనాతన భావాలు సడలీ సడలనీ రోజులైనా నాన్నగారు నాకు కావలసినంత స్వేచ్చ ఇచ్చారు. ఏదో చదువుకునేదాన్ని. పద్దెనిమిదేళ్ళు వచ్చాయి. చదువు ఒక భాగం పూర్తయింది. మా ఊరి స్కూల్లో సంస్క్ర్సృత భాషకు గౌరవం ఉండటాన ధారాళంగా వచ్చాయి సంస్కృత గ్రంధాలు . అవసరానికి పనికొచ్చేటంత ఆంగ్ల భాష వచ్చింది.
    "మానవ జీవితంలో మార్పు లెంత చిత్ర విచిత్ర మైనవో -- దేహం మ అంతర్యాల వైచిత్ర్యం కూడా అంతటిది. ఇతరులకు అనుగుణంగా నిలవ లేనప్పుడూ , వారి హిత భాషణ లతో అవసరం తీరి పోయినట్ల నిపించి నప్పుడూ ఈ శరీరం , మనస్సు వేర్వేరు రూపాలు ధరిస్తాయి. మనస్సు ఒప్పుకోమన్నదాన్ని శరీరం భగ్గున మండి మరీ ప్రతిఘటిస్తుంది. శరీరం ఆజ్ఞాపించిన దాన్ని విననట్లే దాటుకుంటుంది మనసు. లోలోపల రెండు అతసాగ్ని లో అలమటిస్తుంటాయి. దేహానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతి శూన్యం.
    "ఇదంతా ఎందుకంటె -- పద్దెనిమిదేళ్ళ నాలో మార్పు వచ్చింది. ఒక వ్యక్తీ కి సర్వం అర్పణ చేసేయ్యాలన్న తీవ్ర పరిస్థితిలో కొట్టుమిట్టాడి పోయాను. అతనిలో పరిచయాన్ని , ప్రేమను గురించి ఇంకెప్పుడైనా చెప్పుకోవచ్చు. అతను బి.ఎల్. చదివి , ఒక లాయరు గారి దగ్గర అప్రెంటిస్ గా ఉండేవాడు అప్పట్లో. ముఖ్యంగా చెప్పవలసింది -- అతను శేఖాంతరుడు. అదే మా ఇద్దరి వైవాహిక బంధానికి అడ్డు పడింది. మా ఉద్దేశాలు సిగ్గు వదిలి చెప్పుకున్నా, ఇరు పక్షాల వాళ్ళు ప్రతిహతం చెయ్యలేని వాగ్భాణాలతో బాధించారు. అసలైనది లోకమంతా చీకటిగా కనిపించే టట్లు చేసింది నాన్నగారి త్రునీకారమే. ఫలితంగా మా ఇద్దరికీ మా కుటుంబాల మీదనే అసహ్యం కలిగింది. అతని సూచన ప్రకారం ఇద్దరం కలిసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాము. అదే కధ!" అన్నది సుభద్ర ముగించి.
    "అదా?' అన్నది పార్వతి.
    "పుల్లమ్మ గారికి మేము లేచి వచ్చిన వాళ్ళ మనే కబురు గాలిలో తేలి వచ్చి తెలిసినా ఆశ్చర్యం లేదు. అంతేకాదు -- ఈ ప్రాంతాల వాళ్లకి నామీద ఇంకెన్నో దురభిప్రాయాలున్నాయి. ఎన్ని దుష్ప్రధలు వ్యాపించినా నన్ను బాధ పెట్టలేదు కానీ, పార్వతీ........" ఆగిపోయిందామె , చెప్పబోయే వాక్యం అర్ధంతంగా ఉంచి.
    "ఏమయిందండీ?" అంది పార్వతి.
    సుభద్ర గొంతు సర్దుకుంది. "రావటమైతే వచ్చేశాను కానీ, పార్వతి , తర్వాత కొన్నాళ్ళ కు-- హృదయం యధాస్థితికి వచ్చిన తర్వాత -- ణా ఉద్దేశ నిర్దేశాలు ప్రమేయం లేకుండానే మనసు అనుకోని విధంగా ఆవేదన పడటం ప్రారంభించింది. ఎవ్వరూ ఎవ్వరి తల్లి తండ్రుల పట్లా చెయ్యలేని అపరాధం నేను ణా తల్లి తండ్రుల విషయంలో చేశాను-- అనే వేదన కొన్ని సంవత్సరాలు పట్టి పీడించింది. ఇప్పటి కైనా ణా జీవితంలో ఏదైనా బాధ ఉన్నదంటే అదొక్కటే!"
    పార్వతి సుభద్ర కన్నుల్లో నీరు ఊహించుకొని చూచింది అటు. కానీ కన్నీరు కనిపించలేదు. ఆర్ద్రంగా ఉన్నాయేమో బహుశః? ఒక నిమిషం వరకు శూన్యం లోకి చూస్తూ ఆమె కళ్ళు పరిసరాలను పరికించ లేదు.
    "అయితే మీరు ఆదర్శ వంతులు!" అంది పార్వతి చిరునవ్వు నవ్వి.
    "ఒక ఆనందాన్ని పొందాలంటే మరొక ఆనందాన్ని విడుచు కోవాలి కాబోలండీ!" అన్నది మళ్ళీ ఆమె హృదయావేదన పోగొట్టే ఉద్దేశంతో.
    "అంతేనమ్మా!" అంది సుభద్ర ఒక నిట్టుర్పు విడిచి.
    "వెళ్లొస్తాను, అత్తయ్య గారూ! ఇంకా వంట చెయ్యాలి. ఇంట్లో పనులు చూస్తుంటే నా ఉద్యోగాని కోక సలాం పెట్టి ఊరుకోవాలని పిస్తోంది." లేచి ఒళ్ళు విరుచుకుంటూ అంది పార్వతి.
    "వంటమనిషి ని పెట్టుకోవమ్మా! నీ వంటి ఉద్యోగినుల కు అదే సదుపాయంగా ఉంటుంది." అంది సుభద్ర.
    పార్వతి ఏదో అనబోయి ఊరుకుంది మొదట.
    "పనివాళ్ళు చేసేవి పనికి రాని పనులే, అత్తయ్యా! వృధా ఖర్చులు చేసి, ఇల్లు పాడు చేస్తారు." అన్నది జాగ్రత్త కలిగిన గృహిణిని అభినయిస్తూ.
    "అవునమ్మా! నువ్వన్నది నిజమే, నౌఖర్లు కావాలని గింజు కోవడమే కానీ, వాళ్ళుంటే మనసుకి ప్రశాంతతే ఉండదు. ఎప్పుడూ వాళ్ళను వెంబడిస్తూ ఉండాలి."
    "సుభద్ర గారు ప్రతి విషయంలో నాతొ ఏకీభవిస్తారు-- ఎందుకో!" అనుకుని నవ్వుకుంది పార్వతి. ఇంటికి బయలుదేరుతూ.
    "ఈ మధ్య ఎలాగైతే నేం, చమత్కారంగా మాట్లాడుతున్నాను' అనుకుంది మరొకసారి, పుట్ పాత్ మీద నడుస్తూ.
    "హలో, పార్వతీ!"
    చప్పున తలెత్తి చూసింది, మరిచిన మగగొంతు కావటాన ఆశ్చర్య భంగిమతో సహా.
    సరైన ఒడ్డూ, పొడుగుతో ఉన్న ఒక వ్యక్తీ తన ఎదట కనిపించాడు. నవ్వుతూ పార్వతి కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడతను.
    పార్వతికి గుర్తు వచ్చింది. శేఖరం అతను. ఇంటర్లో తనవెంటే ఎప్పుడూ తిరుగుతూ, ఇంటికి కూడా వస్తుండే శేఖరం . ఇప్పుడు వెంటనే పోల్చుకోలేక పోవడానికి కారణం -- అతను మునుపటి కంటే నిండుగాను , బందోబస్తు గాను కనిపించడమే. అప్పుడు బల్ల పలచగా, చప్పున చూసే వారికి దేబి మొగం తో కనిపించేవాడు. ఇప్పుడు మనిషి చురుకుగాను, ఒళ్ళు గాను అగుపిస్తున్నాడు.
    "నువ్వా , శేఖరం?' అంది.
    "బాగున్నావా?" అతని ప్రశ్న.
    "ఏదో నీ దయ వల్ల ఇలా౦--"
    "రాజెం చేస్తున్నాడు? ఏమిటి సంగతి?"
    "టీచర్ ." పార్వతి పేలవంగా అన్నది.
    శేఖరం కుతూహలంగా , "ఇలా చేశాడెం?" అన్నాడు, అంతా విని.
    "అతని కదొక రకమైన తిక్క" అంది సరైన సమాధానం చెప్పాలన్న ఉత్సాహం లేని పార్వతి.
    "మీ ఇద్దరి మధ్య ఏదో పొరపొచ్చాలున్నాయట? కధలున్నాయట?" శేఖరం పార్వతి ని పరీక్షగా చూస్తూనే అడిగాడు.
    పార్వతి బయట పడలేదు. "ఎవరు చెప్పారు?" అంది.
    "ఎలానో తెలిసిందిలే!"
    పార్వతి మాట తప్పిస్తూ , "ణా సంగతి కేం గానీ, నువ్వేం చేస్తున్నట్లు?' అన్నది.
    "మననలా అడగకు. ఎక్కడ పడితే అక్కడ మన సమర్ధత నిరూపించుకుని మెప్పించగలం అందరినీ. మీ ఆయనలా నేనూ చవట ననుకున్నావేమిటి?" అని నవ్వేశాడు.
    పార్వతికి అతని భావం లో ఏదో అహం కనిపించింది. కానీ అదెందుకో తెలుసుకోలేక పోయింది అప్పటికి.
    "నేను వెళ్తాను , పారూ! నువ్వు చాలా మారావు. ఎంత చలాకీ గా ఉండేదానివి! ఇలా తయారయావేం?"
    "మనుషులు మారకుండా ఉంటారా? నువ్వు మారలేదూ?"
    "నేను కూడా మారనంటావా?"
    పార్వతి నవ్వింది. "నిజం చెబితే కోపం రాదు కదా! దుక్కలా అయ్యావు. " బుగ్గలు పూరించి అభినయించే లోగా , "ఊ........" అంటూ నవ్వేశాడు శేఖరం.
    "వెళ్టానిక! నీ అడ్రస్ ఇవ్వు-- నేను రావాలకుంటే........."    
    "అక్కడికి నేనెప్పుడో రావద్దని అన్నట్లు! అడ్రెస్ ఎంతో దూరం లేదు. అదిగో, ఎత్తు ప్రహరీ వెనక మేడ మా ఇల్లు. వస్తావా?"
    "అర్జంటుగా ఒక చోటికి వెళ్ళాలి ఇప్పుడు. మళ్ళీ వారం రోజుల వరకు రానేమో! వచ్చాక వెంటనే మీ ఇంటికి వస్తాలే-- కాఫీ తాగి మరీ."
    "ఏం ? నువ్వు కాఫీ తాగకుండా వస్తే మేం చేయించి ఇవ్వలేమనా, నీ అభిప్రాయం? నేనూ ఉద్యోగం చేస్తున్నా నబ్బాయ్, ఏమనుకున్నావో!" అంది పార్వతి నవ్వుతాలుకు.
    "కాదని ఎవరన్నారమ్మాయ్? గొప్పలు చెప్పుకుంటావు బాగా!"
    "నువ్వా, నేనా?"
    అలా సంభాషణతో పాటుగా శేఖరం ముందుకు సాగాడు. పార్వతి తిన్నగా ఇంటికి వచ్చి , వంటింట్లో దీపం వెలిగించింది.
    పొయ్యి మీద ఏదో పెట్టి కూర్చోగానే సుభద్ర గారి కృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు ఆమెకు. నవ్వుకొని, "కృష్ణయ్య చేతిలో వేణువు ను నేనే, రాధమ్మ సిగలోని పువ్వ్వునూ నేనే' అని పాడుకుంది చిన్న పిల్లలా.
    "ఉహూ! నేనూ బాగా పాడుతున్నానే!' అనుకుంది, గిన్నె లో నుంచి బయల్వేడలుతున్న ఆవిరి లోకి తదేకంగాచూస్తూ .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS