Previous Page Next Page 
వసంతం పేజి 24


    లేక్స్ కి ఈరోజు వెళ్ళకపోతేనేం? అనుకున్నాడు.
    కాని, మనసులో తెరలవెనకాల దాగిన ఆశ తొంగిచూచింది-అతను ఎంత కాదన్నా ఆత్మవంచన చేసుకొనని నిజం .... శశిరేఖ అక్కడికి వొస్తుందనే ఆశ.
    రోడ్డు దాటి ట్రామ్ కోసం నిలబడ్డాడు. టాలీగంజ్ వెళ్ళే ట్రామ్ వొచ్చింది.
    అనుకోకుండానే ట్రాంలో కూర్చున్నాడు ముందర కాలిఘాట్ లో దిగి అక్కణ్ణించి బస్సులోనో టాక్సీలోనో లేక్స్ కి వెళ్ళవచ్చునని అనుకున్నాడు, కాని, టికెట్ టాలీ గంజ్ కి తీసుకున్నాడు.
    అతను కాలీఘాట్ లో దిగలేదు. అతనికన్న అతని ఆలోచనలకన్న. శక్తి వంతమైనదేదో అతన్ని టాలీగంజ్ తీసికెళ్ళింది.
    టెర్మినస్ లో దిగి మాధవరావు ఇంటికి నడిచాడు. ఈ రోజు అతనితో మాట్లాడ్డం. కొంత కాలం అతనితో గడపడం చాలా అవసరం అనిపించింది.
    కాని అతను వాళ్ళిల్లు చేరేసరికి తలుపుతాళం వేసి ఉంది. కిందపోర్షన్ లో ఉన్న ముసి లాయన ఏదో బెంగాలీలో చెప్పేడు. అతనికి అర్ధంగా లేదు.
    తిరిగి వొచ్చి టెర్మినస్ దగ్గర నిలబడ్డాడు. చెప్పుకోలేని విపరీతమైన నిరాశ అతన్ని ఆవరించింది. మాధవరావు ఈరోజు ఇంట్లో ఉండక పోవడంలో ఆశ్చర్యం ఏమీలేదు.... కాని, అదేదో అపశకునం లాగ కనిపించిందతనికి.
    అంతలో ఖాళీ టాక్సీ ఒకటి కనిపించింది. టైమ్ ఐదు దాటిపోయినా లెక్స్ చేరుకున్నాడు.     చాలాసేపు అక్కడ తిరిగాడు గమ్యం అంటూ లేకుండా....శశిరేఖ ఎక్కడా కనిపించలేదు.
    బెంచీలన్నీ మనుష్యులతో నిండిపోయాయి.
    చేతులు కలుపుకుని విలాసంగా తిరుగుతోన్న జంటలని చూసినప్పుడల్లా అతనికి మనస్సుకి తాళ్ళుకట్టి ఎవరో లాగుతోన్నట్టనిపించింది. ఆ లాగుతోన్నది వసంత కాదు. శశిరేఖ.
    నన్నెందుకు దూరం చేసుకున్నావు శశిరేఖ అనుకున్నాడు- గడ్డిలో కూర్చుని, కొంచెం దూరంగా కూర్చున్న ముసిలాయన ఎవరో అతని వంక చూసి చిరునవ్వు నవ్వాడు.    
    సిగ్గుపడ్డాడు గోపాలం- దూరం చేసినది తాను....ఆమె కాదు. వసంత కోసం...
    నేరస్తున్ని నేను- దెబ్బతిన్నది నువ్వు....శశి రేఖా, నన్ను క్షమించు అనుకున్నాడు.
    చాలాసేపు చుట్టూ చూస్తూ అతనక్కడే కూర్చున్నాడు. బాగా చీకటిపడిపోయింది. మనుష్యులు పలచబడిపోతున్నారు. కాని శశిరేఖ రాలేదు.
    నిరాశగా లేచాడు. కాని ఆ నిరాశ వెనకాల ఉన్న ప్రశ్న బయటికి వొచ్చింది..... ఆమె వొస్తే? ఏం చేసి ఉండును తాను?
    రోడ్డు మీదకి వొచ్చాడు.
    సాయంత్రం వసంత ఏమిటి చెప్పబోయింది తాను బయలుదేరుతూంటే?
    తన నిర్లక్ష్యంలో ఆమెకీ, తనకీ మధ్య ఉన్న సున్నితమైన అనుబంధాన్ని ఇంకా బలహీనంగా చేస్తున్నాడా తాను?
    బస్సులో కూర్చుని తన చుటుపక్కల ఉన్న మనుష్యులని గమనించేడు. అందరూ తమతమ ఆలోచనలో మునిగిపోయారు. వాళ్ళెవరికీ తన ఆలోచనలాటి బాధలులేవు. అదృష్టవంతులు వాళ్ళు. ఇళ్ళకి. అభిమానాల గేహాల్లోకి వెళ్ళి పోతారు బస్సుదిగి.
    తాను...    
    అతను ఇల్లు చేరేసరికి వసంత బయట కుర్చీలో కూర్చుని ట్రాన్సిష్టర్ సంగీతం వింటోంది. తనరాక ఆమె గమనించనేలేదు. కనీసం- గమనించిన విషయం తెలియనీలేదు.

                                                         *    *    *

                                       26

    క్రమంగా వసంతతో అతని జీవితం ఒక పంథాలో పడిపోయింది. నదీ ప్రవాహం ఏర్పరచిన దారిలాగ. ఆమె తననీ తానామెనీ కొంతదూరంలో ఉంచుకున్నారు. జీవితం కలగా పూలబాటగా కాకుండా వాస్తవంగా. గతుకులదారిగా అంగీకరించాడు గోపాలం. కలలన్నీ వొదిలి కళ్ళు తెరిచాక, వసంతలో తానాశించిన మాధుర్యాన్ని మరిచిపోయాక కొంత తేలిక పడ్డాడు గోపాలం. ఆదర్శాల బరువుని కిందకి దించాక. ఆశల తెరలు తొలగించి నిజంవేపు ధైర్యంగా ఒక్కసారి చూడగలిగే శక్తి అతనిలో ఇంకా కలగలేదు. కాని, అశక్తికోపం అతను ప్రయత్నించసాగాడు.
    వసంతకి చాలామంది స్నేహితులన్న విషయం అతన్ని ముందర ఎంతబాధ పెట్టినా, ఆ విషయం అనివార్యంగా తెలుసుకుని అంగీకరించేందుకు కొంతకాలం పట్టిది. ఆ నిజం దానికదే అతని నిత్యజీవితంలో ఎక్కువ బాధ పెట్టలేదు గోపాలాన్ని. కాని,  అప్పుడూ అప్పుడూ ఆనిజం వసంత తనకి ప్రత్యేకం ఎత్తి చూపడం అతనికి బాధ కలిగిస్తూనే ఉంది ఆమె అలాగ ఎందుకు చేస్తూందని అతనెంతో ఆలోచించలేదు.... ఆ నిజం గుచ్చుకున్న నిమిషాల్లో అతని మనస్సు ఇతర విషయాలలో, న్యాయంగానే, నిమగ్నం కాలేకపోయేది.
    కిందటివారం అలాగే...
    అతను నిద్రపోతూంటే సాయంత్రం నాలుగ్గంట్లకి లేపి, "సినిమాకి వొస్తావా?" అంది వసంత.
    "ఏ సినీమా?" అన్నాడు గోపాలం.
    "ఏదైతే వస్తావు?" అని అడిగింది వసంత.
    "నాకు ప్రత్యేకం సరదా ఏదీలేదు" అనా గోపాలం.
    "పోన్లే ప్రకాశ్ వస్తానన్నాడు...
    ఆమె వెళ్ళిపోయింది. గదిలోనించి.
    అతను మళ్ళీ నిద్రపోడానికి ప్రయత్నించేడు. కాని, నిద్రరాలేదు.
    ఒకటే పనిగా ఆలోచించాడు. ఈ విచిత్ర మైన ప్రవర్తనలో ఆమె ఉద్దేశం ఏమిటని. కేవలం తనతో ఆటకోసమే ఆమె అలాగ చేసిందా?
    ఎందుకని, తనతో ఆడుకోడం?
    ప్రకాశ్ సంగతి తనతో ప్రత్యేకం చెప్పడాని కేనా?
    ఎంత ఆలోచించినా అతనికి సమగ్రదగిన జవాబు ఏదీ రాలేదు.
    ఆమె వెడుతూ. "బయటికి వెడతావా?" అంది ఎదురుగా నిలబడి. అతను పుస్తకం ఏదో చదువుకుంటున్నాడు.
    "వెడితే వెడతాను-" అన్నాడు.
    "ఎక్కడికి?"
    "తిరగడానికి- ప్రత్యేకం అని ఏమీ లేదు."
    విచిత్రంగా చూసి, "మామూలుగా ఎక్కడికి వెడతావు?"అని మళ్ళీ అడిగింది వసంత.
    "ఎక్కడికీ లేదు - అలవాటుగా"
    చిరునవ్వు నవ్వి, వాచీ చూసి టాటా చెప్పి వసంత బయటికి వెళ్ళిపోయింది. చదువుతూన్న పుస్తకం మూసి చాలాసేపు ఆలోచించాడు. గోపాలం ఆమెనిగురించి... కాని. అతనికి ఏమీ బోధపడలేదు.
    ఈ వారంలో అతనికి మళ్ళీ శశిరేఖ మాటి మాటికీ జ్ఞాపకం వస్తూంది. ఆమెని గురించి ఆలోచించకూడదనీ, ఆమె జీవితంలో మళ్ళీ అడుగుపెట్టే హక్కు తనకి లేదనీ ఎన్నోసారు నచ్చజెప్పుకున్నా, కాలం గడిచినకొద్దీ ఆమె తనని జ్ఞాపకాల్లో మాటిమాటికీ పలకరించడం ఎక్కువ చెయ్యసాగింది.

                 
    ఇవేళ ఆఫీసులో చాలా గందరగోళంగా వుంది.
    ఫ్యాక్టరీనించి ఆరువందల మంది పనివాళ్ళు సమ్మెకి నోటిసిచ్చారు. ఉదయం ఆఫీసుకి వెళ్ళే సరికి బెగాలీలో ఎర్రటి పోస్టరు చూసి స్టెల్లాని అడిగేడు- ఏమిటని.
    "వర్కర్స్ యూనియన్ వాళ్ళు అంటించారు."
    "ఏమిటందులో?"
    ఆమె వెళ్ళి ఎవరిచేతనో భాషాంతరీకరణం చేయించి వచ్చి "ముందరి రెండు లైన్లు యజమానులకు గురించి..." అంది,
    "ఏమని?"
    "వాళ్ళు పనివాళ్ళ రకం తాగడం మానెయ్యాలని....వాళ్ళ అక్రమాలు నశించాలని..."
    "తరవాత?"
    "వాళ్ళ కనీసపు కోర్కెలు"
    "ఏమిటవి!"
    "బోనస్ నాలుగు నెలల జీతం ఇవ్వాలి-"
    "ఇంక?"
    "ఇల్లు ఇవ్వాలి-రేషన్స్ తక్కువ ధరలకి ఇవ్వాలి"
    "మరి!"    
    "సెలవురోజులు ఎక్కువ కావాలి."
    "అంతేనా?"
    "ఆఁ"
    "ఎప్పుడు చేస్తారు సమ్మె!?"
    "తేదీల;ఎదు- కనీసపు కోర్కెలు తీర్చకపోతే సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చారు"
    "ఈపని ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు?- రెండేళ్ళనించి ఫ్యాక్టరీ నడుస్తూందిగా?"
    "తెలీదు....ఏదో కారణం ఉంటుంది. తెలుసుకుని చెప్తాను" అంది స్టెల్లా.
    బేలన్స్ షీట్ జ్ఞాపకం వొచ్చింది గోపాలానికి. క్రిందటి సంవత్సరం నాలుగులక్షల రూపాయలు నష్టం వొచ్చింది కంపెనీకి.
    ఆ తరవాత కనీసం వందమంది పనివాళ్ళని తగ్గించాలనీ, ఎలాగైనా స్టీల్ ఇంపోర్ట్ లైసెన్సు సంపాదించాలనీ, కొత్తఫ్యాక్టరీ నిర్మాణం వాయిదా వెయ్యాలనీ నిర్ణయాలు జరిగాయి. అవి ఇంకా ఎవరికీ తెలీదు- వెంకటరామ్ ద్వారా తనకి తప్ప.
    "నష్టం ఎందుచేత?" అని అడిగేడు గోపాలం.
    "ఏముంది? బిల్లెట్స్ లేక ప్రొడక్షన్ లేదు. ఉన్న సగం ప్రొడక్షన్ కీ ఖర్చులు హెచ్చయాయి- కంట్రోలు ధరలకి అమ్మడాన్ని రాబడి హెచ్చలేదు" అన్నాడు వెంకట్రామ్.
    "మరి ఏం చేస్తారు?" అని అడిగితే చెప్పి, "బహుశా నేను ఇటుపైని కొంతకాలం ఇక్కడే ఉంటాను. ఇంకో సంవత్సరం ఇలాగ ఐతే దివాళా తీసినట్టే!" అన్నారాయన.
    కార్మికుల అలజడి చూసి గోపాలానికి కొంచెం భయంవేసింది. ఈ పరిస్థితుల్లో సమ్మెకూడా జరిగితే కంపెనీ నిజంగానే దివాళాతీస్తుంది;
    మధ్యాహ్నం కృష్ణన్ కనిపిస్తే, "గుర్రప్పందా లెలాగ ఉన్నాయి?" అని అడిగేడు గోపాలం.
    "నా బతుకులాగే ఉన్నాయి....ఇక్కడి వరస చూస్తే ఉద్యోగానికే ముప్పు వచ్చేలాగ వుంది!"    
    అన్నాడు కృష్ణన్.
    "ఏం?"
    "చూడలేదూ పోస్టర్లు? - ఈ పరిస్థితిలో స్ట్రైక్ కూడా జరిగితే రెండు నెలల్లో క్లోజ్... అసలే ఊపిరిలేదు!"    
    కంగారుగా చూశాడు గోపాలం.
    "నిజమే గోపాలం! - నీకు తెలీదా?"
    గోపాలం జవాబివ్వలేదు, కాని, ఆ క్షణం నించీ ఈ జీవితపు అశాశ్వత అతని మనసులో ఒక్కొక్కసారి మెదలసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS