Previous Page Next Page 
వసంతం పేజి 23


    అతని పరీక్ష లయేదాకా వసంత అతన్ని కాని, అతని ఆలోచనల్ని కాని ఎక్కువ బాధ పెట్టలేదు.
    అప్పుడూ అప్పుడూ అతనికి అనిపించేది- ఆమెకీ, తనకీ మధ్య ఉండాల్సిన ఏదో సున్నిత మైన సంబంధం తెగిపోయిందనీ అన్నింట్లో ఏదో శూన్యత ఆక్రమించినట్టు ఉండేది అతనికి.
    అతని దృష్టి అంతా పరీక్షమీద ఉంది- తనకదే జీవిత లక్ష్యం...

                                 
    ఎందుకు ఈ డిగ్రీ?
    ఒకనాడు అర్ధరాత్రి తాను చదవడంచూసి, అడిగింది వసంత తన గదిలోకి వొచ్చి.
    అలిసిపోయిన కళ్ళతో, కేస్ లా సెక్షను మెదులుతూన్న ఆలోచనలతో అతనేదో జవాబు ఇచ్చేడు. ఏమిటో మళ్ళీ అతనికే జ్ఞాపకం లేదు.
    "ఇంకా పెద్ద ఉద్యోగం చేస్తావా?" అంది వసంత.
    "ఉద్యోగం మాటవేరు..." అన్నాడు గోపాలం.
    "ఇంకా చాలా డబ్బు వొస్తుంది-" అంది వసంత.
    అతనికి అర్ధం కాలేదు.
    "నిద్ర రాలేదా?" అన్నాడు.
    "లేదు" అంది.
    "ఒక స్లీపింగ్ పిల్ వేసుకో"
    ఆమె కిటికీలోనించి బయట ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయింది. అతను తన చదువులో మునిగిపోయి ఎంతసేపలాగ నిలబడిందో గమనించలేదు.
    అతను పడుకునేసరికి వసంత ఇంకా రాలేదు.
    
                                  *    *    *

    అతను చివరి పరీక్ష రాసినరోజున ఎంతో తేలికపడ్డాడు. మూడేళ్ళక్రిందట యూనివర్శిటీ పరీక్షలై పోయిన రోజున ఎలాటి రిలీఫ్ కలిగిందో ఆనాడూ అలాగే.
    ఈవినింగ్ కాలేజీలో పరిచయం అయిన ఇంకొక లా స్టూడెంటుతో చౌరంగీ వొచ్చి నీరా హోటల్ కి కాఫీ తాగడానికి వెళ్ళేడు.
    అతను ఎక్కడో కంపెనీలో పనిచేస్తున్నాడు-చిన్న ఉద్యోగం.
    "ప్యాసైతే ఏం చేస్తాడు?" అన్నాడు గోపాలం.
    "తెలీదు....చూడాలి.... అన్నాడు అతను.
    పేపర్లని గురించీ. ఆరోజు వేరే సెంటర్లు లో జరిగిన అల్లర్లని గురించీ చాలాసేపు అతనితో మాట్లాడి బయటికి వొచ్చేసరికి ఆర్కేడ్ లో మాధవరావూ అతను ప్రాణప్రదంగా చెయ్యి పట్టుకుని తీసుకొస్తూన్న శాంతా కనిపించారు.
    ఈరోజు వాళ్ళని చూడగానే చాలా సంతోషం కలిగింది గోపాలానికి,
    "ఎక్కడికి వెడుతున్నారు?" అన్నాడు కుశల ప్రశ్నలయాక.
    "తిరగడానికి.... ఇది సామాన్యుడి స్వర్గం ఈ మహానగరంలో..."
    అతనూ వాళ్ళతో కొంచెంసేపు తిరిగి మైదాన్ లో వాళ్ళని వొదిలి ఇంటికి కాలినడకనే బయలుదేరేడు,
    అతను వెళ్ళేసరికి ఆమె గుమ్మం దాటుతోంది.
    "ఎక్కడికి?" అన్నాడు.
    "క్లబ్బుకి" అంది వసంత. అతనేదో అనబోయాడు - ఆమె వినేందుకు నిలబడలేదు దిగి వెళ్ళిపోయింది.
    ఇంత ఆలోచనలేని మనిషి అని అనుకున్నాడు.
    ఆ క్షణంలో శాంత అంటే మాధవరావు ప్రాణం లాగ ఎందుకు చూసుకుంటాడో అతనికి తెలిసి వొచ్చింది... మాధవరావుని శాంత ఎందుకు తన సర్వస్వంగా చూసుకుంటుందో అతనాలోచించలేదు.

                                    25

    ఆ రాత్రి తొమ్మిది దాటేక వొచ్చింది వసంత.
    అతను వొచ్చిన దగ్గరినించి ఇంట్లోనే కూర్చున్నాడు. కొంతసేపు పుస్తకం చదువుతూ గడిపేడు. కొంతసేపు రోడ్డువంక చూస్తూ కాలం వెళ్ళబుచ్చాడు. రేడియో పెట్టేడు, ఆపి రికార్డులు పెట్టేడు. బరువుగా, ఎండుగా గడిచాయి గంటలు యుగాలు-    
    ఎనిమిదిన్నర అయాక అతని కనిపించింది. ఎందుకు ఎదురు చూడడం? అని కాని, ఎదురు చూడక ఏం చెయ్యడం అనే ప్రశ్న ఈ ప్రశ్నని రద్దుచేసింది.
    అర్ధం లేకుండా సాగుతోందనిపించింది జీవితం- ఉదయంలేవడం, పేపరు, బ్రేక్ ఫాస్టు, ఆఫీసు, లంచ్, ఆఫీసు, ఇల్లు, టీ. నిద్ర- మళ్ళా...

                        
    వాటి మధ్య వసంత ఎక్కడ?
    ఆమె తన నించి దూరం ఐపోతోంది. దగ్గరగా వొచ్చినట్టే వొచ్చి దూరంగా వెళ్ళిపోతూంది.
    ఎంచేత?
    ఏం చేశాడు తాను? తన అంతరాంతరాళాలలో ఆమె మీద మమత హెచ్చవుతూందికాని. తగ్గడం లేదు. ఆమె తన ప్రవర్తనతో అతని భావాలని రాపిడి చేసిన కొద్దీ ఆమె దూరంగా పోతోందనే బెంగ తన మమతని ఎక్కువ చేసింది. ఆమె ఏనాడో చెయ్యకూడని పనిచేసి జీవితాంతమూ బాధపడుతుంది.....ఇంతకుముందు చేసిన పొరపాతుని ఆమె క్షమించుకోగలిగింది. బాధ్యత లేని ఒంటరితనం, అజ్ఞానంలో ఉద్రేకం చేయించే దుడుకుదనం......కాని....
    ఈనాడు ఆ వసంత పూర్తిగామారిపోయింది ఆనందాన్ని. అనుభవాన్నీ సజీవంగా వెతకడం మానేసింది వసంత....కాని దానిలో నిర్లిప్తత క్షణక్షణం మారిపోయే మనస్తత్వం వచ్చేశాయి. ఆమెలో ఈరోజు ఆమె ప్రేమమూర్తి. తన మెడచుట్టూ చేతులువేసి తేలిగ్గానవ్వి ఎక్కడకో ఉన్నత లోకాలకి తీసుకుపోయే తియ్యటి గులాబిలాటి అమ్మాయి, మరునాడే ఆమె ఇవన్నీ మరిచిపోయి, ఉపేక్షలో హృదయమే లేని ముల్లు లాగ ఐపోతుంది.
    ఎంచేత? ఏమిటి జరిగింది. ఈ ఇరవై నెలల కాలంలో చిన్నచిన్న సంఘటనలు వాటికవే సర్దుకుపోయాయి....కాని ఈ చిన్న చిన్న విషయాల పువ్వుల వెనక ఏదో సూత్రం వాటన్నిటిని మాలగా, ఆమె జ్ఞాపకాల మాలగాచేసి తనని బంధించి ఆమెకి దూరంగా చేస్తూ.
    ఆ సూత్రం ఏమిటి?
    వసంత రాగానే అతన్ని గమనించలేదు-అతను నక్షత్రాల కింద చీకట్లో కూర్చున్నాడు.            బట్టలు మార్చుకుని ఆమె డిన్నర్ కోసం చూస్తూ రికార్డులు గ్రామ్ లో పెట్టింది. పదార్ధలన్నీ టేబిల్ మీద పెట్టి వాడు వొచ్చి, "రండి బాబూ అని పిలిచేసరికి అతను ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేక పోయాడు. తనలోని మగతనం ఈ పరిస్థితిని నిరసించి, నిశ్శబ్దంగా జ్వలిస్తోంది.... కాని, ఏదో ఓటమిలాటి ఆ వ్యక్త భావన చన్నీళ్ళ ధారలాగా ఆ వేడిని తగ్గిస్తోంది.... కాని, ఏదో ఓటమిలాటి ఆ వ్యక్త భావన చన్నీళ్ళ ధారలాగా ఆ వేడిని తగ్గిస్తోంది. బొగ్గుల్లాటి జ్ఞాపకలని వెనక వొదిలిపెడుతూ.
    అతను వెళ్ళి నిశ్శబ్దంగా టేబిల్ ముందు కూర్చున్నాడు. వసంత వొచ్చి కూర్చుంటూ. "ఇక్కడే ఉన్నావా? ....... బయటికి వెళ్ళేవను కున్నాను" అంది.
    "లేదు" అన్నాడు పొడిగా.
    "ఏం చేసేపు సాయంత్రం?"
    "చదివాను..."
    "మంచిపని చేసేవు- ఇవేళ రమ్మీ ఆడేం - ఇరవై రూపాయిలు తీసుకున్నారు ముఖర్జీ వాళ్ళూ"
    నవ్వింది వసంత.
    భోజనం అయాక అతను ఆమె చూడకుండానే మెట్లుదిగి తిరగడానికి వెళ్ళిపోయాడు. పదకొండు దాకా మైదాన్ లో కూర్చుని చౌరంగీ దాకా వెళ్ళి మళ్ళీ ఇంటిదారి పట్టేడు, గ్రాండ్ హోటల్ ఆర్కేడ్ లో చాలామంది బస్ కోసం నిలబడ్డారు. బహుశా ఏదో సినిమా ఐపోయి ఉంటుంది.
    వెయ్యి ఆలోచనల్లో అతను పరిశీలించకుండానే వాళ్ళని తప్పించుకుని నడుస్తున్నాడు. అప్పుడే బస్ వచ్చింది- అందరూ త్వరత్వరగా తోసుకుని ఎక్కుతున్నారు.
    అనుకోకుండా అతను బస్సులోకి చూశాడు.
    ఆమె కూర్చుని బయటికి చూస్తోంది లోపల్నించి.
    నిమిషం అతనలాగే నిలబడిపోయాడు.
    ఎన్ని విధాల తనకి తాను నచ్చచెప్పుకున్నా ఈసారి తన కళ్ళు నిజమే చెప్తున్నాయని అతనికి తెలుసును.
    శశిరేఖ తేరిపారి చూస్తూంది తనవేపు.
    సచేతనుడయేసరికి వెళ్ళిపోతోంది బస్సు. నల్లటి, చిక్కటి డీసల్ పొగ ఉక్కిరి బిక్కిరి చేసింది. అతను సర్దుకునేసరికి చాలా దూరం వెళ్ళిపోయింది బస్సు.
    తొందర తొందరగా నడిచి ఇంటికి చేరుకున్నాడు. వెళ్ళేసరికి వసంత చదువుతోంది. అతన్ని చూసి, "ఏమిటి సంగతి.?- అలాగ ఉన్నావేం.?" అంది.
    "ఏమీలేదు-" అన్నాడు గోపాలం.
    "ఏదో ఉంది- నీ ముఖం చూస్తే తెలుస్తూంది"
    అతనేమీ జవాబివ్వలేదు- ఏ జవాబూ లేక.
    తనూ ఒక పుస్తకం తీసుకొని చదవడం ప్రారంభించేడు. కాని, మనస్సు నిలవడం లేదు, మాటిమాటికీ శశిరేఖ జ్ఞాపకం వొస్తూంది.
    ఆమె ఎక్కడ వుంది? ఏం చేస్తూంది?
    ఈ రోజు - ఈ రాత్రి తనని గురించి ఏమనుకుంటుంది? తన హృదయంలో కలిగిన ఊ సంచలనం, ఆమె హృదయంలో కూడా కలుగుతుందా? ఆమెకి ఈ రాత్రి నిధ్దరపడుతుందా?
    తనని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆమె ఏమనుకుంటుంది? వసంత కోపం ఆమెని మరచిపోయినందుకు కోపగించుకుంటుందా? తన మీద అందుకని అసహ్యించుకుంటుందా? బాధ పడుకుండా, ఆ రోజులు జ్ఞాపకం వొచ్చి?
    ఈ ముళ్ళ పరువు కోసమని, ఆమెనీ ఆమె ఆప్యాయతనీ పోగొట్టుకున్నాడు తాను-
    హఠాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ గదిలో, ఆ ఇంట్లో తన స్వంతం ఏమీలేదు? పేరుకి వసంత తప్పిస్తే. తన ప్రక్కనే ఉన్న వసంత ఎంతో దూరంగా ఉంది.
    అందరూ అంతటా తనని వెలివేశారనిపించింది అతనికి.
    చాలాసేపు అర్ధం తెలీని ఆలోచనలతన్ని పీడిస్తూనే ఉన్నాయి- దీపం తీసేసి నిద్రపోవ డానికి ప్రయత్నించాడు. చాలా సేపటి తరవాత నిద్రపట్టింది.
    నిద్దరలో విచిత్రమైన కల. ఎక్కడో చెట్ల మధ్యన తనూ శశిరేఖ దొంగాట ఆడుతున్నారు-హఠాత్తుగా ఆమె మాయం ఐపోయింది. అతను వెతుకుతూనే ఉన్నాడు చాలాసేపు. చివరికి ఏదో ఇల్లు కనిపించి అక్కడ ఆమె కోసం వెతకసాగాడు. ఏదో గుమ్మం ముందర నిలబడి కాల్ బెల్ నొక్క సాగాడు. చప్పుడు వినిపిస్తోంది. కాని ఇల్లు త్వరత్వరగా మాయం ఐపోసాగింది.
    తెలివి వొచ్చేసరికి టెలిఫోన్ రొద చేస్తుంది. ఎనిమిది గంటలు దాటిపోయింది. ఒక్క ఉదుటున లేచేసరికి అతనికి జ్ఞాపకం వొచ్చింది ఆ రోజు సెలవని.
    ఆమె టెలిఫోన్ లో ఎవరితోటో అతి సన్నగా మాట్లాడుతోంది మధ్యమధ్య నవ్వుతూ.

                                *    *    *   

    సాయంత్రం నాలుగవకుండానే బయలుదేరేడు గోపాలం.
    "ఎక్కడకి?" అంది వసంత.
    "అలాగ తిరిగి వొస్తాను-"
    "ఎటు."
    పరీక్షగా ఆమెని చూశాడు గోపాలం. విచిత్రంగా అడుగుతోంది వసంత. ఈమధ్య ఆమె తనని ఆ ప్రశ్న వెయ్యలేదు ఎక్కడికి వెళ్ళినా.'    
    "లేక్స్ కి."
    చిరునవ్వుతో. "ఆలస్యంగా వొస్తావా?" అని అడిగింది వసంత.
    "అనుకోకు. ఎనిమిదింటికి వొస్తాను"
    "కారు పట్టుకెడతావా?"
    "వొద్దు. టాక్సీలో వెడతాను"
    ఆమె ఏదో చెప్పబోయింది. వినకుండా బయటికి నడిచేడు గోపాలం. రోడ్డుమీదకి రాగానే ఆ నిష్క్రమణం ఏదో గమనీయమైన విజయం లాగ అనిపించింది అతనికి.
    ఎక్కడా టాక్సీ కనపడలేదు. బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాడు. కనీసం బస్ దొరుకుతుందని.
    చాలాసేపు ఎదురుచూచినా ఎక్కడం కుదర లేదు- అన్ని బస్సులూ కిక్కిరిసి ఉన్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS