Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 24

 

    అమ్మలంతా ఇంత ప్రేమని ప్రకటిస్తారో లేదో అతడికి తెలీదు కానీ తన తల్లి మాత్రం ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తిస్తుంది తనకు చెందిన ఏ విషయంలోఅయినా.....

 

    "ఈసారైనా నీకు ఉద్యోగం వస్తే.....దీనంగా చూసిన అమ్మ....మీ నాన్నగారికి ఇక ఏ దిగులు వుండదురా" అంది ప్రాధేయపడుతున్నట్టుగా.

 

    ధన్వి మనసు నిజంగా ద్రవించిన క్షణమది.

 

    
                                 *    *    *    *

 

    సాయంత్రం అయిదు గంటల సమయం.....

 

    జాగ్రదవస్థ నుంచి సుషుస్తికి జారాలనుకుంటున్న సూర్య కిరణాలు క్రమంగా కుంచించుకుపోతూ అంతదాకా స్పృశించిన ప్రకృతి వైపు దీనంగా చూసున్నా సమయాన.....

 

    సామ్రాజ్యం ఇంట అడుగుపెట్టింది మధూళీ.

 

    సాదరంగా ఆహ్వానించిన సామ్రాజ్యం ముందుగా అడిగింది 'ఈ వారం సీరియల్ కనిపించలేదే వీక్లీలో? అనుకోని కారణాలవల్ల ప్రచురించలేకపొతున్నామని ప్రకటించారు. "ఏమైందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అడిగింది.

 

    "యస్! నేనే స్రిప్టుని వెనక్కి తీసుకున్నాను" అంది మధూళీ. "ఒక వారం గడువుకావాలన్నాను."

 

    "ఎందుకని?"

 

    "రాసిందానితో సంతృప్తిపడక."

 

    "అదా.......లేకపోతే ?" సందిగ్ధంగా అడిగింది సామ్రాజ్యం. "ధన్వి విమర్శతో సబ్జెక్టుని మార్చాలనుకుంటున్నారా?"

 

    వెంటనే జవాబు చెప్పలేదు మధూళీ.

 

    నిజానికి సామ్రాజ్యం సిరిగ్గానే వుహించింది. అయితే స్క్రిప్టు  తిరిగి రాయాలనుకున్నది అందుక్కాదు.

 

    ముందు అనుకున్న కధా నాయకుడి పాత్రని పూర్తిగా మార్చాలనుకుంది, అది ధన్వి పరిచయం అయ్యాకనే. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఆమె తండ్రి ద్వారా ధన్వి గురించి మరింత తెలుసుకున్నాక.

 

    తను రాస్తున్నా 'నీరవం' సీరియల్ ధన్వి అనబడే వ్యక్తీ 'వరం' లా అనిపించి ఆమెను కదిలించాడో లేక నేటి యువతలో పేరుకుంటున్న అభద్రతాభావాన్ని చెరిపి వజ్రపుష్పాలు పూయించగల గ్రీష్మగితంలా అనిపించాడో ధన్వి పాత్రనే కధగా మలిచి రాయాలనుకుంది.

 

    ధన్వి ఆలోచనా సరళి అతడి వ్యక్తిత్వపు పునాదుల నుంచి మొలకెత్తిన అగ్ని నాలుకల కాసారమే అయితే అసలది నిజం కాగలిగితే అతడి జీవితాన్ని నవ్యశాసనంగా మలిచి సిరాతో శిల్పికరించాలనుంది. నివురు దుప్పటి కప్పుకున్న ధన్వి గురించి పదిమందికి రచన ద్వారా తెలియచేసి ప్రకృతి జడలో తురిమిన నందివర్ధనంలా తనూ అలంకరించాలని ఆరాటపడుతుంది.

 

    ఆలోచనలనుంచి తేరుకున్న మధూళీ అంది "మీరన్నది కొంత వరకూ నిజమని నేను అంగీకరిస్తున్నాను సామ్రాజ్యంగారూ! నాకు తెలిసిన ప్రపంచంలోని చాలా మంది యువకులు కడుపులో కాళ్ళు పెట్టుకుని నిద్రపోతున్న నిరాశావాదులు, భాషనీ కోల్పోయి శబ్దరహితంగా మారి చీకటిని వెలుగగా మార్చడం కన్నా అంధకారంలో వెలుగు భాషలతో బ్రతికితేచాలని సరిపెట్టుకునే వ్యక్తులు.....విరబూయాల్సిన వయసులో రాలిపోవడం గురించి ఆలోచిస్తూ కొంచెం తేనె దొరికితే చాలు రాజీపడుతూ బ్రతికేయవచ్చని భావించే ఈగల్లాంటి వాళ్ళు...."

 

    మధూళీ నేత్రాల్లోని మెరుపుల్ని చూస్తోంది సామ్రాజ్యం.

 

    నిన్న మొన్నెప్పుడో గడ్డిపరకలా అనిపించిన ధన్విని ఇప్పుడు సౌందర్య మహిరణ్యంలా వుహించుకుని మాట్లాడుతుంటే నివ్వెరపోయింది సామ్రాజ్యం.

 

    "అందుకే అసహనంగా అనిపించినా గానీ ధన్వి పాత్రని సహజంగా భావిస్తూ నవలని తిరగ రాస్తున్నాను. ఇంతవరకూ నేను ఆలోచించిన సామజిక స్పృహనే అంశాన్ని హీరో పాత్రలో మేళవించి ఒక ప్రయోగంలా పాఠకులకి అందించాలనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో ధన్విని ఇంకా పరిశిలించటానికి నిర్ణయించుకుని ఇలా వచ్చాను."

 

    ఆగింది మధూళీ. ఆ క్షణంలో ధన్వి గురించి డాడీ చెప్పంది జ్ఞప్తికి వచ్చినా సామ్రాజ్యంతో ఆ విషయం చర్చించాలనిపించలేదు.

 

    "అయన ఇంకా రాలేదే?"

 

    రోజుల తరబడి నిరీక్షిస్తున్నా దానిలా మధూళీ దిక్కులు చూస్తుంటే నవ్వుకుంది సామ్రాజ్యం.

 

    ఫర్వాలేదు.....

 

    పరిచయం తన ద్వారా జరిగినా కానీ మధూళీ యిలాంటి సంచలనానికి కారణమైన "ధన్విని మనసులోనే అభినందించిన సామ్రాజ్యం "బహుశా మీరడిగిన పజిల్ కి జవాబు దొరక్క కుస్తీలు పడుతున్నాడేమో" అంటూ అప్పటికే లోపలికి వస్తున్న ధన్విని చూస్తూ "అడుగో" అంది ఉద్విగ్నంగా.

 

    "గుడివినింగ్" పలకరించింది మధూళీ.

 

    తనూ విష్ చేస్తున్నట్టు తలపంకించిన ధన్వి మధూళీకి అభిముఖంగా కూర్చున్నాడు." ఆలోచించాను."

 

    ధన్వి గొంతులో సందిగ్ధం లేదు. తనపై తనకున్న నమ్మకం వినిపించింది అంతే.

 

    చాలా ఆసక్తిగా అనిపించిన పజిల్ కి ధన్వి ఏం చెబుతాడా అని సామ్రాజ్యం ఆలోచిస్తుంటే ఇచ్చిన ప్రశ్నకి మరోమారు మననం చేసుకుంటున్నట్టుగా అన్నాడు ధన్వి.

 

    ప్రాణాపాయ స్థితిలో వున్న ముగ్గురిలో ఒకరు గర్భవతిగా వున్న స్త్రీ, మరొకరు ప్రపంచంలో మరణాలే ఇక లేకుండా చేయగల శాస్త్రజ్ఞుడు, ఇంకొకరు అనాధగా చెత్తకుండిలో , దొరికి అమ్మకి ప్రాణసమానమైన అయిదేళ్ళ పిల్లాడు....నాకున్నది ముగ్గురిలో ఒకర్ని మాత్రమే బ్రతికించే అవకాశం...."

 

    హటాత్తుగా అక్కడ అర నిముషంపాటు నిశ్శబ్దం పేరుకుంది.

 

    జవాబు ఎక్కడనుంచి ప్రారంభించాలా అన్నట్టు కళ్ళు మూసుకున్నాడు." ముందు నా ఆలోచనల్ని విశ్లేషించి అప్పుడు నా అభిప్రాయం చెబుతాను."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS