"నోరు మూసుకు కూచుంటాను నాయనా. ఏదో పెద్దదాన్ని పిల్ల కళ్ళముందు పెరిగింది. అది ఇబ్బందులు పడుతుంటే అలా చూస్తూ ఊరుకోలేక - అయినా అక్కయ్యలేక పోబట్టి రాజమ్మ పాత ధోరణిలోకి వెడుతోందని కనిపెట్టాడు వేంకటేశు. గబగబాభోంచేసి లేచాడు.
అంత సందడిలోనూ శారదకిష్టమని జంతికలు చేసింది రాజమ్మ నిమ్మకాయ, ఊరమిరపకాయలు జాగ్రత్తగా సద్దింది.
చిన్నపిల్లలు ఊరు ప్రయాణానికి సరదాపడుతున్నట్టున్న రాజమ్మ పిన్నిని చూస్తే నవ్వొచ్చింది వేంకటేశుకి.
బస్సు ఎక్కేవరకూ రాజమ్మకి లోపల భయంగానే వుంది తనను వేంకటేశు రావద్దంటాడేమోనని.
వేంకటేశు బస్సులో కిటికీ సీటు దగ్గరకూచున్నాడు. అతని మనసంతా శారద పైనేవుంది - ఈ దినేష్ ఎవరయినా మర్యాదస్థునిలా పెద్దమనిషిలా కనిపించాడు, ఊళ్ళో అందరికీ పైగా పల్లెటూరి వాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు చెప్పి, డబ్బు పెంచుకునే మార్గాన్ని ఉపదేశించాడు - తనకు అర్ధమయినంతవరకు శారద విషయంలో కూడా చాలా మర్యాదనే ప్రవర్తిస్తున్నాడు - అసలు ఈ ప్రయాణంలో అర్ధమేముంది - ముగ్గురం కలసి వెళ్ళి చేసేదేముంది? ఒకవేళ నిజంగా శారదకి దినేష్ కి ఏ రకమైన సంబంధమున్నా తనేం చేయగలడు ?-
దినేష్ చూడ్డానికి భార్యా పిల్లలువున్న గృహస్థులాగే అనిపిస్తాడు కానీ, కుర్రవాడిలా లేడు శారదతో స్నేహమున్నంత మాత్రాన అపార్ధం చేసుకోవచ్చా - అసలు ఈ గొడవంతటికీ కారణం రాజమ్మ పిన్ని - ఏదో చేప్పుడు మాటలు విని నాన్నమనసు పాడుచేసింది - వేంకటేశు ఎదురు సీట్లోవున్న పిన్నికేసి చూశాడు - అరటి పండుతిని తొక్కకిటికీలోంచి విసురుతోంది.
రాజారావుకి నిద్రరావటంలేదు. దినేష్ పిల్లని మోసం చేస్తూన్నాడేమో రామంతో కాపురం చేయడానికి కారణం ఇతనేనేమో - ఏదయినా అక్కడికెళ్ళగానే శారదను పిలిచి ఏగుడిలోకో తీసుకెళ్ళి మాట్లాడించాలనీ, ఇక్కడ ఉద్యోగం మాన్పించి తనతో తీసుకెళ్లాలని మనసులో గట్టిగా అనుకున్నాడు రాజారావు - బస్సులో అంతా నిద్ర పోతున్నారు - అక్కడ నిద్రపోనివారు ఇద్దరే - రాజారావు, వేంకటేశు రాజమ్మపిన్ని నిద్రలో గురకపెడుతోంది - బస్సులో చంటివాడు గొల్లున ఏడుస్తున్నాడు మొత్తుతోంది తల్లి 'ఇటివ్వండి - నేను ఆడిస్తాను' వేంకటేశు ఆ పిల్లాడిని ఒళ్ళోకి తీసుకుని నెమ్మదిగా పాటపాడుతోంటే నిద్రపోయాడు పసివాడు బస్సుపరిగెత్తింది.
* * *
బస్సు ప్రయాణంతో అలసిపోయిన రాజారావు, రాజమ్మపిన్ని, వేంకటేశు, ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి నడుంవాలుద్దామా అని చూస్తున్నారు. ఆటో వీధి గుమ్మంలో ఆగగానే మేడమీద వాళ్ళంతా తొంగిచూసారు.
ఆటో ఆగ్గానే దిగటానికి కొంచం కష్టపడాల్సి వచ్చింది రాజారావు బస్సులో అంతసేపు కూచుని మళ్ళీ ఆటోలో కూర్చునేసరికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువయినట్టు అనిపించాయి. రాజమ్మ పిన్ని రెండు సంచులు రెండుచేతులతో పట్టుకుని గేటుతీసింది. గేటుకి ఎదురుగా వున్న తలుపుకి తాళం వేలాడుతోంది - ఇదేనా మన పిల్లవాటా అంది రాజమ్మ
'ఆ - ఇదే'
'మరితాళం' - రాజమ్మ ఖంగారుపడుతోంది. రాజారావు మొఖాన నెత్తురు చుక్కలేదు. రెండు రోజులకి బయలుదేరిన పిల్లలు ఇంకా ఇల్లు చేరకపోతే ఎలా ఎలా రాజమ్మ, రాజారావు ఆమెట్లమీద కూచున్నారు. వచ్చి ఏ బజారుకో వెళ్ళి వుంటుంది. వస్తుందిలే అంటూ వేంకటేశూ మెట్లమీద చతికిల పడ్డాడు. ఒళ్ళు నొప్పులు, ఆకలి, నీరసం - రాజమ్మ చీరకొంగు పరచుకుని మెట్లమీదేపడుకుంది రెండుగంటలయింది.
'పైవాళ్ళని అడిగిరా ఊర్లోవుందా లేదా అని' రాజారావు సందులో వున్న బావి దగ్గర బకెట్ లో కాసిని నీళ్లుంటే మొఖం కడుక్కున్నాడు వేంకటేశు మేడమీదకెళ్ళాడు.
'మొన్ననే వస్తుందనుకున్నాం. నాన్నగారిని చూసి వస్తానని చెప్పింది నాకు ఇంటావిడమాటలతో ఖంగారు ఎక్కువైంది వేంకటేశుకి "ఊర్నించే రాలేదా - అదేమిటి ఎక్కడికెళ్ళినట్టు - దినేష్ శారదని వెంటబెట్టుకుని మరేవూరైనావెళ్ళాడా - ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఆయన గుండె ఇక్కడే ఇప్పుడే ఆగిపోతుంది ఏం చేయాలీ - 'వేంకేటేశు ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు.
'లోపలకి రా నాయనా మీకేమవుతుంది' అంది ఇంటావిడ సుబ్బలక్ష్మి 'మా చెల్లెలండి' అన్నాడు.
చెల్లెలా తాళం కూడా మాకుమయ్యిలేదు. మీ అమ్మగారు, నాన్నగారు కూడా వచ్చినట్టున్నారు. లోపలకొచ్చి కూచోమను - వస్తుంది- ఏ రాత్రికో వస్తుందేమో - అంది సుబ్బలక్ష్మి. ఆ మాట అన్నాక ఆవిడకి గుర్తొచ్చింది శారద వాళ్ళనాన్నని చూస్తాననేగా చెప్పింది మరి - అంటే తనతో అలా చెప్పి వాడితో ఎక్కడికోపోయిందన్న మాట - లేచిపోయిందేమో - ఏమో !!
వేంకటేశుకి ఏమీ అర్ధంకాలేదు పరిస్థితి - శారద పద్దతి ఏమీ తెలియటం లేదు. ఇంటి నుంచి బయలు దేరి ఇంకా హైదరాబాదు చేరకపోవటమేమిటి - ఒకవేళ కారుకి యాక్సిడెంట్ ఏదైనా అయివుండచ్చా - కానీ దినేష్ బాగా డ్రైవింగ్ వచ్చిన వాడే. ఏ ఊరెళ్ళినా కార్లో నేవెడతానని చెప్పాడు - నిజంగానే రాజమ్మ పిన్నీ అన్నట్టుగా వాడితో స్నేహం ఏ రకమైనదో - మనదే పొరబాటు - ఒక్కర్తినీ ఉద్యోగం చేస్తూ ఇక్కడ వుంటానంటే సరే అనడం - ఎప్పుడయితే రామంతో విడిపోయిందో అప్పుడే నరసాపురం తీసుకొచ్చేయాల్సింది - వేంకటేశుకి ఏం చేయాలో పాలుపోటం లేదు.
ఆమెట్లమీద అలా ఎంతసేపు కూచుంటారు! - రాజమ్మకి బయటకెళ్ళాలనిపించింది - ఆధునికమైన ఈ ఇళ్ళల్లో అన్నీ లోపలేగా! రాజమ్మ మేడమీదకెళ్ళి వాళ్ళ బాత్ రూమ్ వాడుకుందామనుకునే లోపల, వేంకటేశు కిందికొచ్చాడు.
'మనం తిరిగి వెళ్ళిపోవటం మంచిది' అన్నాడు తండ్రితో.
'అంటే - అది ఊరినించిరానేలేదుట - ఎప్పుడొస్తుందోమరి - తాళంచెవులు లేవు - తిండి. నీళ్ళులేకుండా ఇక్కడ ఎలా పడివుంటామ్ - పైగా దాని పద్దతులుమనకేం తెలిసేట్టు లేవు - ఈ పరిస్థితుల్లో మనంచేయగలిగిందీ ఏమీ లేదు -
అన్నాడు చాలా చిరాగ్గా
రాజారావుకి గుండె ఆగినంతపనైంది "ఊరినించే రాలేదా, ఊరినించి బయలుదేరారుగా ఎక్కడికెళ్ళుంటారు - ఒకవేళ ఏదయినా కారు ప్రమాదానికి గురి అయిందా. ఛీ, అలాకాదు. అబ్బాయితో కలసి మరే ప్రాంతమయినా దగ్గరలో చూద్దాం అని వెళ్ళిందేమో, ఏమో - పెద్దబ్బాయి చెప్పినట్టు వెళ్ళిపోవటమే తిరిగి - ఎప్పుడొస్తుందో, తెలియకుండా ఇక్కడెన్ని రోజులనివుంటాము చాలా నీరసంగా వుంది.
