'రావోయ్' మేష్టారు లోపలికి ఆహ్వానించారు.
'ఇవాళ మా గాయత్రికి పెళ్ళి చూపులు, నువ్వూరాసాయంత్రం" మేష్టారు అంటుంటే గాయత్రి గుమ్మంలోంచి రామంకేసి తొంగి చూసింది.
'ఇంత చిన్నపిల్లకి ఇప్పుడే పెళ్ళికి తొందరేమిటి మేష్టారూ నెమ్మదిగా అన్నాడు రామం కాఫీ చప్పరిస్తూ.
'చూడగానే కుదిరిపోతాయా. ఇలా చూసుకుంటూ వెడితే ఎప్పుడు కుదురుతుందో, ఎక్కడ కుదురుతుందో - అంతా ఆ భగవంతుని దయ' మేష్టారు అక్కడ షెల్పులో వున్న పుస్తకాలు సద్దుకున్నాడు. రామానికి అక్కడ వుండ బుద్దివేయలేదు. ఇంతకీ అదృష్టం ఎలా వుందో - ఎవరేం చెప్తారూ అని మనసులో అనుకుంటూ ఇంట్లోకొచ్చేసాడు రామం ఆ రాత్రే ఊరెళ్ళిపోయాడు. ఆ తర్వాత గాయత్రి పెళ్ళెప్పుడు అని తల్లికి రాసాడు ఉత్తరం. సంబంధం కుదరలేదు - పిల్లనల్లగా వుందని వద్దన్నారుట తల్లి సమాధానం రాసింది. 'హమ్మయ్య' ఊపిరి పీల్చుకున్నాడు రామం.
చదువు అయిపోయాక రామం ఉద్యోగంలో చేరాడు. ఊళ్ళో తల్లి వ్యవసాయం పనులు చేసుకుంటోంది బాగానే కృష్ణమూర్తిగారు ఇల్లు ఖాళీచేసి కూతురింటికి వెళ్ళి పోయాడు. రామం జీవితంలో శారద ప్రవేశించటం, నిష్క్రమించటం కూడా కొద్ది ఏళ్ళలోనే జరిగిపోయింది.
ఇన్నేళ్ళకి రామానికి గాయత్రి గుర్తొచ్చింది. పిల్ల నల్లగా వున్నా ఫరవాలేదని ఎవరైనా గాయత్రిని పెళ్ళి చేసుకున్నారో, లేదో - ఇంకా తల్లి అయి, నుదుట ఇంతకుంకుమ బొట్టు పెట్టుకుని ముత్తైదువలా మెరిసి పోతూ వుండి వుంటుంది - రామం గాయత్రిని గురించి తలచుకుంటుంటే, ఆనాడు భుజం మీద గిచ్చిన గిచ్చు ఇంకా మచ్చలా అలాగే వున్నది జ్ఞాపక మొచ్చింది రామానికి - షర్టు పైకి తీసి భుజం చూసుకున్నాడు చిన్నమచ్చ గీతలా అలానే ఉంది. జీవితం ఎన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలతో అల్లుకుని ఉంటుందో.
గాయత్రిని, భర్తని చూసిరావాలి. గాయత్రి పిల్లలతో ఆదుకోవాలి - రామం మనసు ఊరివైపు మళ్ళింది - పైగా ఇప్పుడు పంటల టైము - తల్లి ఒక్కర్తీ అన్ని పనులు చూసుకోటం కష్టం - కూలినవాళ్ళు మాట వినరు - పైగా ఇంటికి ధాన్యం చేరవేయటం - దాన్ని అమ్మించటం - ఇలాటివన్నీ అమ్మకే అప్పగించేసాడుతను ఒక్కర్తీ ఎంత ఇబ్బంది పడుతోందో రామం పదిహేనురోజులు ఉద్యోగానికి సెలవు పెట్టాడు.
ఆ రాత్రి రామం ఊరువెడుతూ వెంకట్రామయ్యకి చెప్పాలనుకున్నాడు. కానీ ఇంట్లో దీపం వెలగటంలేదు - వీధి గుమ్మానికి తాళం వుంది - తండ్రి కూతురు గుడికి వెళ్ళివుంటారు బహుశా అనుకుంటూ రామం గేటు దగ్గరగా వేసి పదిహేను రోజుల వరకు రాను - పాలు పోయద్దని చెప్పండి చిన్న కాగితంపైన రాసి తాళం కప్పకి గొళ్ళానికివున్న స్థలంలో పడిపోకుండా తోసిపెట్టాడు. రామం చిన్న సూట్ కేసుతో బయలుదేరాడు.
* * *
10
'అదేమిటీ అలా మాటయినా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసావా బావ. అంతా వాడి మాయలో పడిపోయింది. ఇక దానికి అయ్యవద్దు, అన్నవద్దు - మా అక్కయ్య దీని బెంగతోనేకదూ ఈలోకం వదిలి వెళ్ళిపోయిందీ - దీర్ఘంతీస్తూ అలవాటుగా కళ్ళొత్తుకుంది రాజమ్మ పిన్ని. మంచంమీదపడుకుని సీలింగ్ ఫాన్ వంక చూస్తున్నాడు రాజారావు ఉన్నదాంతో తృప్తిగా బతుకుతున్న తన పెద్ద కూతురు రాజ్యం, అత్తింటి ఆరళ్ళు పడుతున్నా కాపురం నిలపెట్టుకున్న చిన్న కూతురు సీతమ్మ ఏదో విధంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. తనకి బెంగలేదు - ఎంతో అందం, ఎంతో మంచి తనం వున్న తన చిన్నారి విజయ ఈలోకంలో బతకలేక తనదారి తను చూసుకుని, తనకి గర్భశోక మిగిల్చింది. తన పిల్లలందరిలో తెలివైంది, చదువుకున్నదీ అయిన శారద జీవితాన్ని చక్కదిద్దుకోలేక పోయింది. ఏది తనకి కావాలో, ఏది అక్కర్లేదో గ్రహించలేక, కొత్త భావాల పరంపరలో కొట్టుకుపోతూ, ఈదలేక, మునగాలేక సతమతమవుతోంది అందరికీ పెద్ద సమస్యగా తయారయింది ఇప్పుడెలాగ రామాన్ని పెళ్ళి చేసుకొనేప్పుడు ఎవరినీ సంప్రదించకుండా చేసుకుంది - మూడేళ్ళు తిరక్కుండా విడాకులంది - సరే మరి మళ్ళీ ఇదేమిటీ, రాజారావు తలతిరుగుతోన్నట్టనిపించింది - ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు.
'పెద్దాడూ' రాజారావు మంచంమీదే పడుకుని పిలిచాడు. చదువుతోన్న పేపరు పక్కన పడేసి గదిలో కొచ్చాడు వేంకటేశు. నాన్నగారూ మీరు మరీ వర్రీ అయిపోకండి. అదేం చిన్నదీ కాదు - తెలివి తక్కువదీకాదు అన్నాడు.
'ముందు చూపులేనిదిరా - అది ఒరి మూర్ఖురాలు - దాని చదువు దండగ, పొట్టకూటి కోసం చేసే వుద్యోగానికి అక్కడే ఎందుకు - ఇక్కడే ఏదో చేయచ్చు - అయినా నాకు మాత్రం తోడెవరూ - అదీ నేను ఉంటాం"-
వేంకటేశు నవ్వాడు, 'ఇప్పుడు విషయం అదికాదు - ఇష్టంలేని మనిషితో జీవించలేనని విడాకులు తీసుకోటం ఈ మధ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. కొట్టినా, తిట్టినా పడివుంటే రోజులు పోయాయి - ఒక్కమాట కూడా అనకుండా జాగ్రత్తగా గాజుపాత్రలా భార్యని చూసుకుంటేనే కాపురాలు నిలుస్తున్నాయి."-
"ఇంకానయం - మీ అమ్మని నేను కోపమొచ్చి కొట్టిన రోజులు లేవా - పోనీ మీ అమ్మ సత్తెకాలపుది - నీ చెల్లెలు సీతమ్మ అత్తింట్లోవుంటూ, ఏదో బతకటం లేదా అయినా శారదకి చదువు వంకని చాలా స్వేచ్చ యిచ్చేసాములే - అది మన తప్పే - ముసలాయన లేచి కూచున్నాడు.
'మరి ఇప్పుడేమంటారు' వేంకటేశు ఆ గదిలో అటు ఇటు తిరుగుతూ అన్నాడు.
'రాత్రి అనుకున్నాంగా మనిద్దరం కలసి అక్కడికి వెళ్ళి, అసలు విషయమేమిటో దాంతో మాట్లాడాలి. విడాకుల వ్యవహారంలో రాజీకుదుర్చుకొనేలా చేస్తే ధన్యులమే - దానికి రామం కన్నమంచివాడు దొరుకుతాడా -
'ఏమిటో-మీరనేది నాకేం అర్ధంకావటంలేదు. దాని అభిప్రాయాలు వేరు - సరే ఎప్పుడు వెడదాం' -
"ఒరేయ్ వెంకూ, నేనూ వస్తామీతో. పంతులుగారూ భార్య ఇల్లు చూసుకుంటారు - నేను హైదరాబాదు ఎప్పుడూ చూడలేదురా - ఇప్పుడయితే ఆ రాజభవనాలు కూడా చూడనిస్తారుగా - నవాబుల వస్త్రాలు, పాత్రలు, కుర్చీలు, మంచాలు. ఇలాంటివన్నీ కూడా అందరికీ చూపిస్తున్నారటగా - బావా, నేనూ వస్తా రాత్రికి బయలుదేరదాం" - రాజమ్మకి చాలా హుషారుగా వుంది హైదరాబాదు వెళ్ళాలంటే - తను బతికి వున్నందుకు అక్కయ్య మనశ్శాంతికలిగేలా ఆపిల్ల వ్యవహారం ఒకదారికి వచ్చేలా చెయ్యాలి తను అది తన బాధ్యత రాత్రి అక్కయ్య కల్లో కనిపించింది కూడాను - రాజమ్మ ప్రయాణానికి తయారవటం ప్రారంభించింది.
రాజారావుకి కూడా రాజమ్మరావటం ఇష్టమే. ఎందుకంటే పెద్ద తనంలో తనని కాస్త కనిపెట్టుకు చూస్తోంది. టైముకి ఇంత అన్నం మెత్తగా వండిపెడుతుంది. కాళ్ళునొప్పులు పెడితే కాళ్ళునొక్కుతుంది తలనొప్పి పుడితే అమృతాంజనం రాస్తుంది. ఏదో తోడుగా వుండే రాజమ్మ తనకి ప్రయాణంలో చాల అవసరం అని రాజారావుకి బాగా తెలుసు.
తమతో రాజమ్మ పిన్ని రావటం ఏ మాత్రమూ ఇష్టంలేదు. వేంకటేశుకి పైగా రాజమ్మ పిన్ని అంటే శారదకి చాలా కోపం అనవసరమైన విషయాలు మాట్లాడుతుంది ఎప్పుడూ అని 'నాన్నగారూ. మనిద్దరం వెడితే" చాల నెమ్మదిగా అన్నాడు. 'పిన్ని రావలసిందే - నాకు ఇంత అన్నంవండిపెట్టి నాకు సేవచేయటానికి దాన్ని తీసుకెడుతున్నాం - పిన్ని రాకపోతే నేను రాను 'ముసలాయన కోపగించుకున్నాడు. వేంకటేశు మాట్లాడకుండా ఊరుకున్నాడు "పిన్నీ, అక్కడికొచ్చాక నువ్వు శారద విషయం అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకూడదు - ఇరుగుపొరుగుల ఇళ్ళకి పెత్తనాలకెళ్ళకూడదు - అలా ఉంటానంటే తీసుకెడతాను - వేంకటేశు భోజనం చేస్తూ తండ్రి లేనపుడు అన్నాడు నెమ్మదిగా.
