Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 23


    
    'ఏం లేదు బాబూ!' అంటూ నూతిలోంచి పలికినట్లు సన్నగా పలికాడు. చేతితో సైగచేశాడు తనకేం పర్వాలేదన్నట్లుగా.
    అలా కొద్దిక్షణాలు నిశ్శబ్దం. విఠల్ ఆయన బాధచూచి వణికిపోయాడు. శివరాంప్రసాద్ కాసేపటికి తేరుకొన్నాడు. 'మీ నాయనమ్మ సీతాదేవి నన్ను గురించి ఏమయినా చెప్పిందా?' అని భయం భయంగా అడిగాడు.
    "ఆమేం చెప్పలేదు బాబాయిగారూ! మిమ్మల్ని కలుసుకోమని మాత్రం  చెప్పింది మిమ్మల్ని చూసిరమ్మని మరీ మరీ చెప్పింది. మీ కోసం పులిహోర, పకోడీలు స్వయంగా చేసి పంపించింది, మీకు ఇంగువ పులిహోరన్నా, ఉల్లిపాయ పకోడీలన్నా ఇష్టమటగా!"అంటూ చిరునవ్వు నవ్వుతూ బాబాయ్ కేసి చూశాడు విఠల్.
     "అలాగా! అలాగా!" అంటూ కొండంత సత్తువ తెచ్చుకొని లేవబోయాడు సంతోషబలంతో.
     విఠల్ ఆయన్ను పట్టుకొని కూర్చోబెట్టాడు. దూరాన్నుంచి ఇదంతా చూస్తున్న పోతురాజును పిలిచి, ఇందాక తాను తెచ్చిన టిఫిన్ క్యారియర్ తెమ్మన్నాడు విఠల్? నిముషాల్లో పోతురాజు ఆ టిఫిన్ క్యారియర్ తెచ్చి ఇచ్చాడు. దాహంగొన్న పిల్లనాడిలా ఎగబడి టిఫిన్ క్యారియర్ లాక్కున్నాడు శివరాంప్రసాద్. "ఏదేదీ నన్ను చూడనీ" అంటూ.
     పోతురాజు ప్లేటు తెచ్చాడు వాడొచ్చేటప్పటికే టిఫిన్ క్యారియర్ ఖాళీచేశాడు శివరాంప్రసాద్.
     "ఎన్నాళ్ళకు తిన్నాను! ఎన్నాళ్లకు తిన్నాను! సీతాదేవి వండిన పులిహోర. పకోడీలు తిని పాతికేళ్లయింది. ఈ పాతికేళ్ళనుంచి ఆకలితోనే వున్నాను విఠల్. ఈ పాతికేళ్ల ఆకలి ఈ టిఫిన్ తో తీరిపోయింది విఠల్!" అంటీ సంతోష పడ్డాడు చెయ్యి తుడుచుకుంటూ.
     ఆయన సంతోషమేమిటో విఠల్ కు అర్దంకాలేదు. పాతికేళ్ల క్రితం మా ఫ్యామిలీ ప్రెండయి వుంటాడనీ, అంత ఆత్మీయంగా వుండి వుంటారనీ అనుకున్నాడు విఠల్.
     'అయ్యో నా మతి మండ! గెస్టు తెచ్చినవి తిన్నానే కాని గెస్టుకి టీ అన్నా ఇవ్వలేదు!" అని బాధపడుతూ పోతురాజును పిల్చాడు శివరాంప్రసాద్. గెస్ట్ కి టీ, బిస్కట్లు తెచ్చివ్వమని వాణ్ణి కసురుకున్నాడు. ఆ హుషారులో శివరాంప్రసాద్ గార్డెన్ చైర్ లోంచి లేచి సిగరెట్ ముట్టించుకొని, ఉల్లాసంగా సిగరెట్ కాలుస్తూ అటూ ఇటూ పచార్లు చేసాడు ఏవేవో ఆలోచించుకుంటూ.
     ఇంతలో టీ, బిస్కట్లు తెచ్చాడు నౌకరు. విఠలూ అంత మక్కువగానే తీసుకొన్నాడు. క్షణాల్లో తాగేశాడు.
      "ఇదిగో సిగరెట్ కాల్చుకో!" అంటూ టీ త్రాగటం ముగించిన విఠల్ కి ఇవ్వబోయాడు శివరాంప్రసాద్.
     'నో సార్, ఐ వోఁట్ స్మోక్!"
    "ఐ సీ. దెన్ వెల్ అండ్ గుడ్! నీ వయసులో మీనాన్న తెగ కాల్చేవాడు! నేనెంత వద్దన్నా వింటేనా వాడు! సరే అయిందేదో అయిపోయింది!" ఈ మాటలు చెబుతూనే అక్కడికక్కడే పచార్లుచేశాడు శివరాంప్రసాదు. మనసులో వున్న దూకుడంతా నడకలో చూపెట్టాడు.
     "విఠల్! నీకో రహస్యం చెప్పేదీ? మీ నాన్నేకాదు, మీ నాయనమ్మకూడా బీడీ త్రాగేది!ఆమెకు గ్యాస్టిక్ ట్రబుల్ వుండేది! డాక్టర్ ఆమెకు బీడీ త్రాగమని సలహా ఇచ్చాడు!రోజుకు రెండు మూడు బీడీలు తప్పక త్రాగేది.
     ఇంతలో నౌకరువచ్చి ప్లేట్లు, టిఫిన్ క్యారియర్ తీసికెళ్లాడు.
     'రా? అలా షికారుకు పోదాం రా!" అంటూ శివరాంప్రసాద్ ముందుకుసాగాడు హ్యాండ్ స్టిక్ ఒకటి తీసుకొని విఠల్ ఆయనతో జంటగా నడిచాడు. ఆ తోటలోనే ఓ సమాధి దగ్గరకు వెళ్లి ఆగిపోయాడు శివరాంప్రసాద్.  ఆ సమాధి చుట్టూ గులాబీతోట. ఆ సమాధిని చేత్తో స్పర్శిస్తూ 'ఇది నా భార్య సమాధి! ఈమెకు గులాబీలంటే ఇష్టం! అందుకనే ఆమె సమాధిచుట్టూ ఈ తోట వేశాను. ఆమె చచ్చిపోయి యిరవై ఏళ్లయింది! పాతికేళ్ల క్రితం, ఆమెను పెండ్లి చేసుకోక ముందు మీ ఫ్యామిలీతో వుండేవాణ్ణి! ఆమె తోనూ అయిదేళ్ళే వున్నాను! అంతలో ఈమె చనిపోయింది. తిరిగి మళ్లీనేను మీ ఫ్యామిలీలోకి రాలేకపోయాను. అలా ఒంటరివాణ్ణయిపోయాను! నేనిక్కడి కొచ్చినప్పుడు, నువ్వు చెబితే నమ్మవేమో పదణాలంటే -పదణాలు జేబులో వుంది!  ఇవ్వాళంటావా? పదిలక్షల ఆసామినయ్యాను! ఇదంతా ఈమె ఆస్తే!' తన కధ చెబుతూ బాధగా నీలాకాశంకేసి చూశాడు శివరాంప్రసాద్.
     ఆ బాధను శ్రద్దగావిన్నాడు విఠల్.' ఆమంటే మీరంత ఇదిగా వుండబట్టే ఈనాడిలా బాధపడుతున్నారు' సానుభూతి పలికాడు విఠల్.
     'అంతే బాబూ! అంతే! అయినా ఆమెమీద నాకు వున్న మక్కువంతా ఆమెతో అయిదేళ్లు వుండేటప్పటికి విరిగిపోయిన పాలలా ముక్కలు ముక్కలయి పోయింది. ఆమెకు తాను మహా ఆస్తిపరురాలినని గర్వ ముండేది! నన్నొక బానిసగా చూసేది! నాకొక రకంగా బుద్దే చెప్పింది. ఆమె డబ్బును చూసి ఆమెను ప్రేమించాను! మీ కుటుంబంతో వున్నంతకాలం కరువుల్తో బాధపడ్డాను. కరువుల్తో విసుగెత్తిపోయిన నా మనసు సుఖసౌఖ్యాలను కోరింది! నన్నుతెచ్చి ఇక్కడ పడేసింది? రెండు చేతులా ఖర్చుపెట్టాను. భోగ భాగ్యాలు కరువుతీరా అనుభవించాను! కానీ ఏం లాభం! మనశ్సాంతి లేకుండాపోయింది! ఆమె నన్ను నానాటికి వెట్టి చాకిరీ  బానిసగా చూసింది. అది భరించలేక తిరిగి మీ  కుటుంబంలోకి వెళ్దామనుకొన్నాను! అంతకంటే ఆత్మీయులు నా కెక్కడా కన్పించలేదు! అయినా తిరిగి వెళ్లడానికి సాహసించలేకపోయాను! మీ నాయనమ్మకు నేనంటే పంచప్రాణాలు! అలాంటి
    'ఈ వయసులో మీకో తోడువుంటం మంచిదనుకుంటాను!' మీ కెవరూ బంధువుల్లేరా బాబాయిగారూ?' ఆయన బాధకు జాలిపడి అడిగాడు విఠల్.
     'ఏం చెప్పేది బాబూ? ఎక్కడి వాళ్లక్కడపోయారు! ఇలా ఒంటరిగా వుండటమే నా కలవాటయిపోయింది!' అంటూ ఆకాశంవేపుకు చూశాడు శివరాంప్రసాద్. సూర్యుడు అస్తమించాడు. మబ్బులు వుదయించాయి. వాటికి గాలి  తోడయింది.
     'వర్షం వొచ్చేటట్టుగా వుంది! రూం కెళ్దాంరా! అంటూ హ్యాండ్ స్టిక్ తో నడుస్తూ బయల్దేరాడు శివరాం ప్రసాద్. చెయ్యీ, ఒళ్ళూ వొణికాయి.
     చూట్టానికి ధృఢంగానే వున్నారే! అలా వొణికిపోతున్నారేం బాబాయిగారూ! అడుగడుక్కి ఆయాసపడ్తున్నారు!' అడిగాడు విఠల్.
     'మంచి తిండి తినడంతో  ఈ ఒంటికేం బాగానేవుంది! కానీ మనసే రోగిష్టిదయిపోయింది!' సమాధానం చెప్పాడు శివరాంప్రసాద్, విఠల్ ప్రశ్నకు.
     'ఇంతకూ నీ సంగతులడగనే లేదు! ఎంతసేపూ నా సొద చెప్పుకుంటూ వచ్చాను! ఏం చదువుతున్నావు బాబూ?'
    'ఇంటర్ పాసయ్యాను. ఇక చదవాలనుకోవడంలేదు!'
    'అదేమిటి? అప్పుడే చదువు  మానివెయ్యటమా? మానేసి ఏం చేస్తావ్?' నడుస్తున్నవాడల్లా నిలబడి అడిగాడు శివరాంప్రసాద్.
     'ఇక ఏదయినా ఉద్యోగం చూసుకోవాలి. ఇంత వరకూ మా నాయనమ్మ మిషనుకుట్టి చదువు చెప్పించింది. ఇప్పుడామెకు చూపుకూడా తగ్గిపోయింది. కుట్టుపని మానేసింది! ఆరోగ్యం సరిగాలేదు మంచం పట్టింది.'
    'ఏమిటీ? సీతాదేవి మంచంపట్టిందా?చూపు కనపడ్డం లేదా?' అంటూ బాధపడ్డాడు శివరాంప్రసాద్. పోనీ కళ్లకు జోడు వేయించుకోక పోయిందా? మళ్లీ అడిగాడు శివరాంప్రసాద్.
     'నా కాలేజీ ఫీజులే కడ్తుందా?ఆమె కళ్లకు జోడే వేయించుకుంటుందా? ఆమె కుట్టు సంపాదన నా కాలేజీ ఫీజులకే చాలలేదు! పైగా నన్నింకా బి.యస్సీ చదవమంటోంది. చదువు మానటానికి వీల్లేదంటుంది!'
    "అవునవును! నువ్వు చదువుమానటానికి వీల్లేదు ఆమె! కాకపోతే నేను నీకు చదువు చెప్పిస్తాను! ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకూ చదువుకో?'
    'అదికాదు బాబాయ్! మీరు చదివిస్తారు సరే! నేను చదువుకొంటాను సరే! మరి ఆమెను ఎవరు పోషిస్తారు? ఆమెను పోశించాల్సిన బాధ్యత నాకు లేదూ?' అందుకే చదువు మానేసి, ఉద్యోగం చేసి ఆమెను పోషిస్తా నంటున్నాను!'
    'దటీజ్ కరెక్ట్?' అంటూ ఏదో ఆలోచించాడు శివరాంప్రసాద్.
     'మీ నాయనమ్మ మాత్రం ఎవరని? నేననేది ఏమిటంటే - నేనూ మీ తాతలాంటివాడ్నే. నేనూ మీ తాత అనుకో! అలాంటపుడు మీ నాయనమ్మ బాధ్యత నాకు లేకుండా పోతుందా? ఔనంటావా?కాదంటావా? టెల్ మీ బాయ్!' అంటూ భుజంమీద చెయ్యివేసి నిలబెట్టి అడిగాడు శివరాంప్రసాద్.
     విఠల్ బదులు చెప్పలేదు. ఆయన చెయ్యి పట్టుకొని నెమ్మదిగా మెట్లెక్కించి ఆయన్ని రూంలోకి తీసుకొచ్చాడు. సోఫాలో కూర్చున్నారు. అంతసేపూ ఇద్దరూ మౌనం వహించారు. శివరాంప్రసాద్ ఏవేవో తల్చుకొని లోలోన బాధపడ్డాడు.
     'ఏదో కాంప్లెక్స్ తో బాధపడ్తున్నావ్ బాబాయ్! అదేమిటో చెప్పు బాబాయ్?' చేతులు పట్టుకున్నాడు విఠల్.
     'నువ్వు తెలుసుకొని మాత్రం ఏం చేస్తావు బాబూ!' అంతా అయిపోయింది! తప్పంతా నాది!  చేతులారా చేసుకున్నాను! చేసిందానికి సిగ్గుపడుతున్నాను!' అంటూ బాధపడ్డాడు. ఆ బాధతో నే లేచి అలమరానుంచి ఆ వణుకుతున్న చేతుల్తోనే స్కాచ్ బాటిల్ తెచ్చుకున్నాడు. తానొక గ్లాసులో పోసుకొని త్రాగుతూ మరో గ్లాసు విఠల్ కందించాడు.
     'నో సార్! నోసార్!' అంటూ ఆ గ్లాసును క్రింద పెట్టేశాడు విఠల్.
    'వెరీ గుడ్! త్రాగటం తప్పే! నీకు చెప్పకపోవడం ఏమిటి? నేను బాటిల్సుకు బాటిల్సు త్రాగేస్తున్నాను! ఎందుకు తాగుతున్నానో తెలియదు! ఆమె గుర్తొచ్చినప్పుడల్లా మరీ త్రాగుతున్నాను! సీసాలకు సీసాలు గుట్టలు పడిపోతున్నాయి!'
    'ఆమంటే ఎవరు బాబాయ్! మీ మిస్సెస్సా?' అని జంకుతూ అడిగాడు విఠల్.
     ఆ త్రాగిన మైకంలో 'నో నో' అనేశాడు. ఆ మరుక్షణమే తెలివిలోకి వచ్చి "యస్! యస్' అన్నాడు శివరాం ప్రసాద్.
     "ఇందాక ... అలా అన్నారేం బాబాయ్! ఆమేదో మిమ్మల్ని బానిసగా చూసేదని... బాధపెట్టేదనీ!"
    "ఆ గొడవంతా ఇప్పుడెందుకులే! ఇంకా ఏమయినా కబుర్లు చెప్పు.... ఎన్నాళ్లుంటావిక్కడ?
    "ఎన్నాళ్లోనా? రేపు వెళ్లిపోతాను!"
    "రేపే! పదిరోజుల్దాకా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు!" ఆర్డర్ వేసినట్లుగా మాట్లాడాడు శివరాంప్రసాద్.
    "నేనిక్కడ పదిరోజులుంటే అక్కడ ఆమె.....
    "బాబాయ్ రానివ్వడంలేదని రేపే మీ నాయనమ్మకు ఉత్తరం రాసెయ్! ఆమె ఏమీ అనదులే!" పైగా ఇక్కడే వుండిపొమ్మని రాస్తుంది కూడాను! ఏమనుకొంటున్నావో?" పకా పకా నవ్వాడు శివరాంప్రసాద్
     ఆ నవ్వు బలంతో లేచి గాడ్రేజ్ బీరువా దగ్గర కెళ్లాడు. ఏవో డాక్యుమెంట్సు తెచ్చి విఠల్ చేతికిచ్చాడు.
     "ఇవేంటి బాబాయ్! అని ఆయన కళ్లల్లోకి చూస్తూ అడిగాడు వయనమ్మ కివ్వు? ఆమె పేర రాసిన వీలునామా ఇది!"
    ఆ మాట విని ఆశ్చర్యపోయాడు విఠల్. అతని కేమీ అర్దం కాలేదు.
     "మీ నాన్న పేరు కూడా రాయొచ్చనుకో! ఆయనో పెద్ద త్రాగుబోతు! జూదగాడు!పైగా ఆయనిప్పుడు లేడు" అంటూ ముగించాడు శివరాంప్రసాద్.
     "అయినా ఇదంతా ఏమిటి?" తిరిగి ప్రశ్నించాడు విఠల్.
     అదంతా నీకు తెలియదు! "మీ నాయనమ్మ నా ఫస్ట్ వైఫ్!  ఈ ఆస్తి కోసం కక్కుర్తిపడి ఆమె నొదిలేసి వచ్చేశాను! ఆస్తే దక్కిందిగానీ ఆ ప్రేమ, ఆ మనశ్శాంతి ఎంత పెట్టి కొనుక్కుందామన్నా నాకు ఇక్కడ దొరకలేదు! ఆమెక నేనంత అన్యాయం చేసినా ఆమె పల్లెత్తు మాటన్లేదు. ఏ దారిద్ర్యానికి భయపడిపోయి యిటు పరుగెత్తుకొచ్చానో, ఇవ్వాళ తిరిగి ఆ దారిద్రాన్నే అనుభవించాలని అన్పిస్తోంది. మనస్సు తపిస్తోంది!నిజంగా ఆమెకు నేను చేసిన అన్యాయం క్షమించరానిది. అయినా ఆమెనన్ను క్షమిస్తూంది. అంత ఉత్తములురాలు" అంటూ భోరున ఏడ్చి సోఫామీద పడిపోయాడు.


     బయట వర్షం కురుస్తోంది. ఉండుండి మెరుస్తోంది. అది ఇప్పుడు  వెలిసేటట్టులేదు!ఈయన ఇప్పుడు ఏడుపు మానేటట్టు లేడు. విఠల్ అలాగే ఆయన్నంటిపెట్టుకొని కూర్చున్నాడు. అతని కళ్లు ఉండుండి ఝడివాన కురిశాయి.

    
                                          *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS