-: అర్ధపతాక హస్తలక్షణ వినియోగము :-
సఏవార్ధ పతాకస్స్యాత్కనిష్టా వక్రితాయది !
భృగోరస్య జనిర్వర్ణః పీత ఈశౌహరీశ్వరౌ !
ఋషిర్భగుః క్షత్రజాతి ర్వినియోగోస్యకధ్యతే !!
తా: త్రిపతాక హస్తమందలి చిటికెన వ్రేలిని వంచిపట్టిన అర్ధపతాక హస్తమగును. ఈ హస్తము భృగువు వల్ల పుట్టినది. బంగారు వర్ణము కలది. శివకేశవులు అధిదేవతలు, భృగువు ఋషి, క్షత్రియ జాతి.
వినియోగములు :-
ఇద్దరనుటయు, చిగురుటాకు, ఫాలము, రంపము, పలక, ఒడ్డు, ధ్వజము, గోపురము, కొమ్ము, చాకు, అధరము, గోమేధిక రత్నము, బాణము, నదియొక్క ఉభయతీరములు, యుక్తి వీనియందు ఈ హస్తము చెల్లును. వినియోగించును.
-: కర్తరీముఖ హస్తలక్షణ వినియోగములు :-
తర్జనీ మధ్యమే తిర్యగ్వక్రితే కర్తరీముఖః !
హరదస్య జనిర్వర్ణో రుణశ్శ్రీశో ధిదేవతా !
నృజాతిశ్చాస్యపర్జన్య ఋషిః కృత్యంనిగద్యతే !!
తా: త్రిపతాక హస్తమందలి చూపుడువ్రేలు, నిడిమివ్రేలు వెలియగునట్లు త్రిప్పిపట్టిన కర్తరీముఖ హస్తమగును. ("త్రిపతాకాయాంవా అర్ధపతాకాయాంవా_తశ్మిన్నితీశేషః") అని వ్యాఖ్యానము. (అనగా కర్తరీముఖహస్తము. త్రిపాతక అర్ధపతాకల నుంచి గ్రహింపదగునని భావము. కనుక త్రిపతాకమునుండి కర్తరీముఖము గ్రహించుట ప్రసిద్ధమైనదియైనను నూతనహస్త సంపాదనార్ధము. అర్ధపతాకము నుండియు గ్రహింపబడినది. ముద్రిక యివ్వబడినది.) ఇది శివునివల్ల జన్మించినది, రక్తవర్ణము, అధిదేవత శ్రీమహావిష్ణువు. క్షత్రజాతి. పర్జన్యుడు ఋషి.
వినియోగములు :-
విపరాస్యము ,దాంపత్యవియోగము, ఆబోతు ,ఏకశయ్యా వియోగము (చెరివకవైపు పరుండుట), జింక, చమరీమృగము, కారెనుబోతు, మొసలి, మెరుపు, చక్రము, గోపురము, వృక్షములు, కపటము, మనోవికారము, వేగము, భయము, పర్వతము, దొంగిలించుట, శ్రీమహావిష్ణువు, ఖడ్గము, నాటకాభినయము, కిరీటము, పక్షులు, భీభత్సరసము, చదువుట వీనియందు వినియోగము.
-: మయూర హస్తలక్షణమ్ :-
శ్లో!! అస్మిన్న నామికాంగుష్టౌ ! శిష్టౌచాన్యే ప్రసారితాః !
మయూరహస్తః కధిత స్తస్య లక్షణముచ్యతే !!
తా: కర్తరీముఖ హస్తమందలి అనామికాంగుష్టములను చేర్చిపట్టి, ఇతర అంగుళులను చాచిపట్టినచో మయూరహస్తమగును.
వినియోగములు :-
నెమలి, ముఖము, తీగె, పక్షి, వమనము, ముంగురులు దిద్దుట, లలాటము, తిలకము, కన్నీటిని హరింపచేయుట, శాస్త్రవాదము, హారము, ఇంద్రనీలమణి, విద్యాధరకులము వీనియందు వినియోగించును. ఇది విష్ణువు వల్ల పుట్టినది. నీలమైన వర్ణముగలది. ఋషి శకుడు. ఇంద్రుడు అధిదేవత.
-: అర్ధచంద్ర హస్త లక్షణమ్ :-
శ్లో!! అర్ధచంద్ర కరస్సోయం పతాకేంగుష్టసారణాత్ !!
తా: పతాక హస్తమందలి అంగుష్టమును పొడవుగా చాచిపట్టిన అర్ధచంద్రమగును. చంద్రునివల్ల పుట్టినది. ఇది ధూమ్రవర్ణము, వైశ్యజాతి, ఈశ్వరుడు దైవము. అత్రిమహాముని ఋషి.
వినియోగములు :-
కృష్ణాష్టమి చంద్రుడు, మెడపట్టి త్రోయుట. భల్లాయుధము. దేవతాభిషేకము, భోజనపాత్ర, పుట్టుయందు, కటిప్రదేశము, చింతించుట, "నేను"యనుట, ధ్యానము, ప్రార్ధించుట, అంగస్పర్శ. ప్రాకృతజనుల నమస్కారములు, కంకణము, విస్మయము, కంఠము, అంకుశము, కనుబొమ్మలు, వెన్నెల_కాముకుడు, అవయవములను పిసుకుట, చెక్కిలి, నుదురు, వీపు, జగడము, చెవులు, తిరస్కారము, అరటిచెట్టు, అపరాధ నిరోధనము, పాదము ,గురుత్మంతుడు, సగము, మృగము, శత్రువు, కుండలములు, చంద్రకాంతము, పిరుదులు, జడ, చంకలు, మోకాలు, అంకురము (మొలక), సిగముడి, పరిశుభ్రము, అద్దము, ఏమి ? అను అర్ధము, చెంపదెబ్బ వీనియందు ఈ హస్తము వినియోగించును.
-: ఆరాళహస్త లక్షణము :-
శ్లో!! అరాళ స్తర్జనీ వక్రాప్రతాకే చేద్భవెత్కరః!
ఋషిః పితా స్యచాగస్త్యః ! శ్వేతవర్ణోపతిర్హరిః !!
జాతిర్మిశ్రాచ కధితా వివియోగోస్యకధ్యతే !!
తా: పతాక హస్తమందలి చూపుడు వ్రేలు వంచిపట్టినచో అరాళహస్తమగును. దీనికి తండ్రియు, ఋషియు _ అగస్త్యుడు. తెలుపు వర్ణము. విష్ణువు అధీదేవత.
వినియోగములు :-
విషము త్రాగుట, అమృతము త్రాగుట, ఉదకము త్రాగుట, శౌర్యము, సైన్యము, ప్రదక్షిణము, ప్రాంతనృత్యము, దేశీనాట్యము, వాసనచూచుట, యోగము లాలించుట, మౌనము, వంటచేయుతం ముఖమందలి చెమట తుడుచుట, ఆశీర్వచనము, కంకణము, త్రిపుండ్రము, సుడిగాలి, బొమముడి, ప్రతిబింబము, నడుము, చేయదగిన పని, ధైర్యము, మదము, సంతోషము, అందము,విటుడు, గట్టిమాట, తొందర, తాంబూలము, రుచులు, యుద్ధము, గడియారము (కలశం), భుజశక్తి, జుట్టుపట్టుకొనుట, అపోశనము, కూచిమారుడను నాయకుడు (శృంగార నాయకులలో ఒకరు), భూమి_చివరిభాగము, ఛండమారుతము, గాంభీర్యము మొదలగు వాటికి ఈ హస్తము వినియోగించును.
