ఇనపనాడాలు కొట్టినబూట్ల శబ్దం వినబడింది.
కిష్ణయ్య డాక్టరుని వెంటబెట్టుకుని వచ్చాడు. లేచికూర్చుని ఉన్న అహల్యనిచూడగానే అతనికి మిడిగుడ్లు పడ్డాయి.
"పొద్దుననగావెళ్ళి ఇప్పుడా రావడం కిష్ణయ్యా?" అంది అహల్య ఆమె పెదిమలమీద నవ్వు. కళ్ళలోకోపం, గొంతులో నిష్టూరం.
"మంచి డాక్టరుకోసం వెదికితే ఏదీ ఒక్కడూ దొరికితేనా! చివరికి ఈయన దొరికాడు. ఈయన నాకు బాగా తెలుసు మంచి హస్తవాసి!" అన్నాడు కిష్ణయ్య భుజాలు తడుముకుంటున్నట్లు.
"మీ పోలీసోళ్ళకు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చేడాక్టరూ, పోస్ట్ మార్టమ్ చేసే డాక్టరా ఈయన?" అని "ఒద్దులే కిష్ణయ్య! నాకు తగ్గినట్టే! ఈ గాయం మానడానికి మాత్రం కొంతకాలం పడుతుంది. కానీ మనసుకి తగిలిన గాయం మానే ప్రసక్తేలేదనుకో." అంది.
"యాంటీ టెటానస్ ఇంజక్షన్ తీసుకుంటే మంచిది" అన్నాడు డాక్టర్ గాయంవైపు చూస్తూ.
"అవసరంలేదు" అంది అహల్య క్లుప్తంగా.
చిన్నబుచ్చుకుని" అయితే నేను వెళ్ళివస్తాను కిష్ణయ్య" అంటూ వెళ్ళిపోయాడు డాక్టరు.
వెండిగ్లాసుతో పాలు తెచ్చిందిరంగేలీ. అవి తను తాగలేదు అహల్య.
"సృజనని ఇక్కడికి తీసుకురండి" అంది.
కిష్ణయ్య వెళ్ళి సంకెళ్ళతాళంతీసి సృజనని అహల్య ముందు హాజరు పరిచాడు.
ఒక్కసారి సృజన కళ్ళలో ఆర్ద్రంగా చూసింది అహల్య.
"ఇట్రా!"
భయంగా దగ్గరికి వచ్చి పొద్దుటినుంచి ఒరుసుకుపోయి ఉన్న చేతులవైపు చూసుకుంది సృజన.
"ఇదిత్రాగు" అంది.
కదల్లేదు సృజన.
"తాగు" గద్దించింది అహల్య.
భయపడి, గ్లాసు అందుకుని ఒక్క గుక్కలో తాగేసింది సృజన.
"ఇక్కడకూర్చో!" అంది అహల్య అర్ధసింహాసనం ఆఫర్ చేస్తున్నట్లు తన ప్రక్కన చోటుచూపిస్తూ.
హత్యానేరం తనమీద పడుతుందేమోనన్న భయం తొలిగి రిలీఫ్ తో ఉన్న సృజన, అహల్య ఏం చెప్పినా చేసేస్థితిలో ఉంది. ముడుచుకుని అహల్య ప్రక్కన కూర్చుంది తను.
సృజన భుజంమీద చెయ్యివేసి మరింత దగ్గరగా లాక్కుంది అహల్య తర్వాత మధుమతీ, భవానీలవైపు తిరిగింది.
"వీళ్ళకు అత్యాశ పుట్టింది! అందరికంటే ఎక్కువ అయిపోవాలనే తప్పుడు ఆలోచన వచ్చింది. అయినా వీళ్ళని కొట్టనూతిట్టనూ! కానీ...." అని డ్రమెటిక్ ఆగి అందరివైపూ చూసింది. "కానీ.....ఇవాళ్టినుంచి రెండురోజులపాటు.....ఈ ఇంటికొచ్చే పాసెంజర్సు అందరినీ వీళ్ళిద్దరే భరిస్తారు. తక్కినవాళ్ళందరికీ ఈ రెండ్రోజూలూ శెలవు ఎవరి ఇష్టంవచ్చినట్లువాళ్ళు గడపవచ్చు. అందరి గిరాకీలు వీళ్ళిద్దరే చూసుకుంటారు. మొనగత్తెలుకదా!" అంది.
ఆ మాటలు వినగానే పెద్దపెట్టున శోకాలు పెడుతూ పరుగెత్తుకువచ్చి అహల్య పాదాలమీదపడిపోయారు మధుమతీ, భవానీ.
తాము అనుభవించబోయేది ఎంతటి నరకమోవాళ్ళకి తెలుసు.
ఆ ఇంటికి రోజుకు యాభై అరవై మంది పాసింజెర్లు వచ్చి పోతుంటారు.
ఒక్కొక్క అమ్మాయి అయిదారు మందిని భరించడమే దుర్భరంగా ఉంటుంది.
అలాంటిది---
ఒక్కక్కళ్ళూ పాతిక ముఫ్ఫయ్ మందిని!
అలా రెండ్రోజులపాటు!
"అక్కా! వద్దక్కా! నీకు దణ్ణం పెడ్తామక్కా! వద్దక్కా!" అన్నారు మధుమతీ, భవానీ వెర్రిభయంతో.
వినిపించుకోలేదు అహల్య.
రంగేలీతోచెప్పింది "క్లాస్ పాసెంజర్లు వద్దు. మోటు ముండాకొడుకుల్నందరినీ పిలిపించండి. వాళ్ళదగ్గర డబ్బులున్నా లేకపోయినా ఫర్వాలేదు. రెండ్రోజులపాటు ఇక్కడ సంతర్పణ అనుకోరాదూ!"
"అహల్యక్కా! అహల్యక్కా!" అన్నారు మధుమతీ, భవానీ పెద్దగా శోకాలు పెడుతూ.
అహల్య చెలించలేదు.
ఎప్పుడొచ్చాడోగానీ అక్కడా ఉన్న ఉస్మాన్ వాళ్ళిద్దరినీ చెరో చేత్తో పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు.
కిష్ణయ్యవైపు తిరిగింది అహల్య.
"కిష్ణయ్య! పారిపోయిన చిన్నారావూ, ఆ పిల్ల కామాక్షి ఇరవై నాలుగ్గంటలు తిరిగేసరికి ఇక్కడ ఉండాలి. ఎట్లా గిట్లా అని అడక్కు! అది జరిగి తీరాల్సిందే! తెలిసిందా?"
"ఆసంగతి నాకు తెలీదా! నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్నా?" అన్నాడు కిష్ణయ్య.
తలపంకించి సృజన మొహంలోకి చూసింది అహల్య.
"అమ్మాయ్! నువ్వు ఇవాళ చేసినసాయం ఎప్పుడూ గుర్తుంచుకుంటాను"వెంటనే తలఎత్తి ఆశగా చూసింది సృజన. "అయితే నన్నువదిలెయ్యవా ప్లీజ్?"
తల అడ్డంగా ఊపింది అహల్య. "అదిమాత్రం జరగదు! ఇంకేం కావాలన్నా అడుగు! పట్టు పరికిణీ కుట్టించనా?"
"మా అమ్మ నాకోసం ఏడుస్తూ ఉంటుంది. సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికి రాగానే నన్నుచూడకపోతే మానాన్నగారు నిలవలేరు. నేను లేకపోతే మా తమ్ముడికీ చెల్లెలికి ఏం తోచదు, నాకు ఇక్కడేం బాగా లేదు. ఎంతో భయంగా ఉంది. నన్ను వదిలి పెట్టెయ్యండి. నేను వెళ్ళిపోతాను. ప్లీజ్! ప్లీజ్! ప్లీజ్! అంది సృజన.
"నీకేం కూర ఇష్టం పాపా! చేపలవేపుడు, రొయ్యలపులుసు, ఉలవచారూ....."
"నేనువెళ్ళిపోతాను ప్లీజ్!"
"పోనీకాడ్ బరీస్ చాక్లెట్లు ఇష్టమేనా? పెద్దపెద్దవి?"
"నేను వెళ్ళిపోతాను"
ఒకకన్నీటిచుక్క సృజన కనురెప్పల కిందనుంచి జారి ఆమె మృదువైన బుగ్గమీద నిలిచింది.
"నేను వెళ్ళిపోతాను. నన్ను పంపించెయ్యవా?"
నిట్టూర్చింది అహల్య. "నీకెట్లా చెప్పను పాపా! ఈ కొంపల్లోకి వచ్చేదారే ఉంటుందిగాని తిరిగి వెనక్కి వెళ్ళేదారి ఉండదు. ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్ధంకాదు. ఇంకెప్పుడూ ఈ సంగతి అడక్కు. అడిగినా లాభం ఉండదు" అంది.
అది వినగానే పట్టరాని దుఃఖం వచ్చింది సృజనకి.
అంటే యాభయ్యేళ్ళో, అరవయ్యేళ్ళో, వందేళ్ళో----
బ్రతికినన్నిరోజులూ ఇక్కడే బ్రతకలా తను? వేరే మార్గం లేనట్లేనా?
